వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 35వ వారం
వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.
జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి. సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం మరియు అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.
అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాల ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగము వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.
ఇంకా....పూర్తివ్యాసం: పాతవి