వర్షం

మేఘాల నుండి భూమిపై నీటి బిందువుల రూపంలో కురిసే అవపాతం
(అతివృష్టి నుండి దారిమార్పు చెందింది)

వర్షం లేదా వాన (ఆంగ్లం: Rain) ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

సుదూర ప్రాంతంలో కురుస్తున్న వర్షం

ఒక నిర్ణీత కాలంలో సగటు వర్షపాతం కన్న అధికంగా నమోదు అయిన దానికి అతివృష్టి అని అలాకాకుండా తక్కువ వర్షపాతం నమోదు ఐతే అనావృష్టి (Drought) అని భావిస్తారు.

రోడ్డు మీద వర్షం కురుస్తోంది

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో వర్షం అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.[1] వర్షము అనగా సంవత్సరము అనే అర్ధం కూడా ఉంది. వర్షాలు పడని పరిస్థితిని వర్షాభావము అంటారు. ప్రతి సంవత్సరం వర్షలు పడే కాలాన్ని వానాకాలము, వర్షకాలము లేదా వర్షాకాలము అంటారు. వర్షణము అనగా వాన కురియడము లేదా నీళ్లు చిలకరించడము. వర్షధరుడు or వర్షవరుడు అనగా ఖొజ్జావాడు. వర్షాభువు అనగా వర్షాకాలంలో జన్మించేది : కప్ప. వర్షాశనము అనగా సంవత్సరమున కొకసారి జీవనార్థముగానిచ్చు సొమ్ము. వర్షించు అనగా వాన కురియు అని అర్ధం. వర్షీయసి అనగా ఏండ్లు చెల్లినది, ముసలిది అనియు వర్షీయుడు అనగా ముసలివాడు అని అర్ధం. వర్షోపలము అనగా వడగల్లు.

ప్రకృతిలో వర్షం

మార్చు

జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి.

సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం, అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.

అవపాత పరిమాణము ప్రకారం, వర్షాన్ని ఈ క్రింది విధాలుగా వర్గీకరిస్తారు:[2]

  • అతి తేలికపాటి వర్షం— అవపాతము గంటకు 1 మి.మీ కంటే తక్కువ ఉంటే
  • తేలికపాటి వర్షం — అవపాతము గంటకు 1 మి.మీ కంటే నుండి 1 మి.మీ మధ్యన ఉంటే
  • ఒక మోస్తరు వర్షం— అవపాతము గంటకు 2 మి.మీ కంటే నుండి 5 మి.మీ మధ్యన ఉంటే
  • భారీ వర్షం — అవపాతము గంటకు 5 మి.మీ కంటే నుండి 10 మి.మీ మధ్యన ఉంటే
  • అతి భారీ వర్షం— అవపాతము గంటకు 10 మి.మీ కంటే నుండి 20 మి.మీ మధ్యన ఉంటే
  • కుండపోత వర్షం (అత్యంత భారీ వర్షం) — అవపాతము గంటకు 20 మి.మీ కంటే ఎక్కువ ఉంటే

వర్షపాతము సంభవించే విధానాన్ని బట్టి వర్షాన్ని ఈ క్రింది విధాలుగా వర్గీకరిస్తారు:

  • పర్వతీయ వర్షపాతం లేదా నిమ్నోన్నత వర్షపాతం
  • సంవహన వర్షపాతం,
  • చక్రవాత వర్షపాతం

పర్వతీయ వర్షపాతం (నిమ్నోన్నత వర్షపాతం)

మార్చు

సముద్రాలు, భూభాగములు సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కటంలో గల భేదాల మూలంగానూ, నిరంతరము వీచే ప్రపంచ పవనాల మూలంగా కూడా సముద్రాల ఉపరితలం నుండి భూభాగం మీదికి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇలాంటి పవన మార్గానికి అడ్డంగా ఎత్తైన కొండగానీ, పర్వతంగానీ, వాలు ఎక్కువ ఉండే పీఠభూమి అంచుగానీ అడ్డు తగిలినపుడు తేమతో కూడిన గాలి ఎత్తుగా ఉండే అడ్డంకి దాటడానికి పైకి లేస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్ది వాయు పీడనం తగ్గటం వలన వ్యాకోచిస్తుంది. వాయు నియమాల ప్రకారం వ్యాకోచించే గాలి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. తత్ఫలితముగా దాని యొక్క సాపేక్ష ఆర్ద్రత పెరిగి, గాలిలోని నీటి ఆవిరి, నీటి బిందువులుగా ధ్రవీభవనం చెంది మేఘాలు ఉత్పన్నమవుతాయి. ధ్రువీభవన స్థాయి (పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి ధ్రవీభవనం సంభవించే ఎత్తును ద్రవీభవన స్థాయి అంటారు) ని చేరుకొనే వరకు సాపేక్ష ఆర్ద్రత క్రమంగా మరింత పెరిగి, గాలిని సంతృప్తం చేస్తుంది. మేఘాలు తేలుతూ ఉండటానికి బరువైనపుడు వర్షపాతం సంభవిస్తుంది. ఈ ప్రక్రియ అడ్డంకిగా నిలచిన భూస్వరూపం యొక్క పవానాభిముఖ పార్శ్వములో భారీ వర్షాన్నిస్తుంది. భూస్వరూపం యొక్క ఆవలివైపున ఆర్ద్రత కోల్పోయి పొడిగా ఉన్న పవనం, క్రిందికి దిగుతూ సంకోచించి మరింత వెచ్చగా మారుతుంది. పవానాభిముఖ పార్శ్వములో గాలిలోని తేమనంతా వర్షంగా కోల్పోయి పొడిగా ఉండటం వలన ఈ ప్రాంతములో వర్షపాతము సంభవించదు. ఆ కారణముచే, ఈ ప్రాంతాన్నివర్షచ్ఛాయా ప్రాంతం అంటారు.

పర్వతీయ వర్షపాతానికి హిందూ మహాసముద్రం నుండి ప్రారంభమయ్యే ఋతుపవనాలు ఒక మంచి ఉదాహరణ. భారత దేశములో కలిగే వర్షపాతములో 80% వర్షం ఈ కోవకు చెందినదే.

సంవహన వర్షపాతం

మార్చు

సంవహన వర్షపాతం ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు హెచ్చుగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలలో సంభవిస్తుంది. ఎత్తుకు వెళ్లేకొద్ది, వాయు పీడనం తగ్గటం వలన గాలి వ్యాకోచిస్తుంది. దాని వలన గాలి యొక్క ఉష్ణోగ్రత తగ్గి (వాయు నియమాల ప్రకారం), సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. తత్ఫలితంగా నీటి ఆవిరి, బిందువులుగా ద్రవీభవించి పేరుకుపోతున్న అస్థిరమైన క్యుమ్యులోనింబస్ మేఘాలు యేర్పడతాయి. ఇవి బరువెక్కి వర్షాన్నిస్తాయి. సంవహన వర్షపాతంలో కుంభవృష్టిని గానీ వడగండ్ల వాన గానీ సంభవిస్తుంది.

పెద్ద ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈ సంవహన వర్షపాతం సాధారణంగా మధ్యాహ్న లేదా సాయంకాల సమయాలలో సంభవిస్తుంది. ఇటువంటి వర్షపాతము సాధారణంగా టైఫూన్లు, థందర్ స్ట్రామ్స్ లో కనిపిస్తుంది.

బెంగాల్ ప్రాంతములో సంభవించే కాళ్ బైశాకీ వర్షాలు సంవహాన వర్షపాతానికి ఒక చక్కని ఉదాహరణ.

చక్రవాత వర్షపాతం

మార్చు

ఒక చక్రవాతం గానీ అల్పపీడనంగానీ ఒక ప్రదేశం మీదుగా పయనించినపుడు ఈ రకపు వర్షపాతం సంభవిస్తుంది. చక్రవాతాలలో రెండు రకాలు: ఉష్ణమండల చక్రవాతాలు, సమశీతోష్ణ మండల చక్రవాతాలు.

ఉష్ణమండల చక్రవాతాలు భూమి ఉపరితలంపై ఏర్పడు అల్పపీడన ప్రాంతాలలో ఏర్పడతాయి. ఈ అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపులా గల అధిక పీడన ప్రాంతాల నుండి వర్తులాకారంలో గాలులు వీస్తూ ఈ ప్రక్రియలో భాగంగా పైకి నెట్టబడతాయి. పైకిలేచిన గాలినుంచీ భారీ వర్షపాతం సంభవిస్తుంది. సమశీతోష్ణ మండలంలో శీతల వాయురాశి, కవోష్ణ వాయురాశి ఢీకొన్నప్పుడు చక్రవాతాలు సంభవిస్తాయి. సాంద్రత ఎక్కువగా ఉండే చల్లని గాలికంటే సాంద్రత తక్కువగా ఉండే వెచ్చని గాలి తేలికగా ఉండటం వలన అది పైకి నెట్టబడి వర్షపాతాన్ని కలుగజేస్తుంది.

ధర్మాలు

మార్చు

పడుతున్న వర్షపు బిందువులను కార్టూన్లలలో, చిత్రాలలో "కన్నీటి చుక్క"లాగా క్రిందవైపు గుండ్రముగా, పై భాగమున కురుచగా చిత్రీకరిస్తారు కానీ ఈ చిత్రీకరణ సరైనది కాదు. కేవలము కొన్ని మూలాల నుండి పడే నీటి బిందువులు మాత్రమే ఉద్భవించే సమయంలో కన్నీటి ఆకారంలో ఉంటాయి. చిన్న వర్షపు చుక్కలు వృత్తాకారంగా ఉంటాయి. పెద్ద చుక్కలు క్రింది భాగములో చదునుగా, ఆఉంటాయి. అత్యంత పెద్ద బిందువులు పారాచూట్ ఆకారంలో ఉంటాయి.[3] వర్షపు బిందువుల యొక్క ఆకారాన్ని 1898లో ఫిలిప్ లెనార్డ్ అధ్యయనం చేశాడు. ఈయన చిన్న వర్షపు బిందువులు (2 మి.మీ కంటే తక్కువ వ్యాసం ఉన్నవి) దాదాపు వృత్తాకారంలో ఉన్నవని కనుగొన్నాడు. పరిమాణము పెరిగే కొద్ది (5 మి.మీ వ్యాసం వరకు) మరింత డోనట్ ఆకారంలో తయారవుతాయి. 5 మి.మీ కంటే పెద్ద బిందువులు అస్థిరమై ముక్కలవుతాయి. సగటు వర్షపు చుక్క 1 నుండి 2 మి.మీల వ్యాసం కలిగి ఉంటుంది. ప్రపంచములో అత్యంత పెద్ద వర్షపు చుక్కలను 2004 లో బ్రెజిల్, మార్షల్ దీవులలో నమోదు చేశారు. అందులో కొన్ని 10 మి.మీల దాకా ఉన్నాయి. ఈ పెద్ద బిందువులు ఒక పొగ కణంపై ద్రవీభవనం జరగటం వలననో లేక చిన్న ప్రదేశాలలో అతి ఎక్కువ నీరు ఉండటం వలన బిందువులు ఒకదానికొకటి ఢీకొనటం మూలంగానో సంభవిస్తాయి.

వర్షపు బిందువులు తమ అంత్య వేగముతో అభిఘాతము చెందుతాయి. పెద్ద బిందువులకు ఈ అభిఘాతమెక్కువ. సముద్రతలములో గాలిలేకుండా 0.5 మిమీల వర్షపు బిందువు జల్లు 2 మీ/సెతో అభిఘాతం చెందుతుంది, కానీ 5 మిమీల బిందువు 9 మీ/సెతో అభిఘాతం చెందుతుంది.[4] నీటి బిందువులు నీళ్లను తాకే శబ్దం గాలి బుడగలు నీటిలో చేసే కంపనాల వల్ల వస్తుంది. చూడండి బిందువు యొక్క శబ్దం

సాధారణంగా వర్షం యొక్క pH 6 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వర్షపు బిందువులలో కరిగి స్వల్ప మొత్తాలలో కార్బోనిక్ ఆమ్లం ఉత్పత్తి చేయటమే దీనికి కారణం. కార్బోనికామ్లం పీ.హెచ్ ను కొద్దిగా తగ్గిస్తుంది. కొన్ని ఎడారి ప్రాంతాలలో, వాతావరణంలోని గాలిలో అవపాతం యొక్క సహజసిద్ధమైన ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించటానికి సరిపడా కాల్షియం కార్బోనేట్ ఉండటంతో వర్షపాతం తటస్థంగాను లేక క్షారముగా కూడా ఉండే అవకాశముంది. 5.6 కంటే తక్కువ పీ.హెచ్ ఉన్న వర్షాన్ని ఆమ్ల వర్షంగా పరిగణిస్తారు.

వర్ష మానము

మార్చు

వర్షపాతాన్ని సాధారణంగా వర్షమానిక (రెయిన్ గేజ్) తో కొలుస్తారు. ఈ కొలతను ఒక చదరపు తలముపై సేకరించబడిన నీటి యొక్క లోతుగా వ్యక్తీకరిస్తారు. 0.1 మి.మీ లేదా 0.01 అంగుళాలు కచ్చితత్వంతో వర్షాన్ని కొలవగలరు. వివిధ ప్రదేశాలలోని వర్షమానికలను భూమి నుండి ఒకే ఎత్తులో ఉంచుతారు. ఈ తదేక ఎత్తు దేశాన్ని బట్టి మారవచ్చు. వర్షమానికలు రెండు రకాలు. అవి:

  1. నిలువ వర్షమానికలు: ఇవి దినసరి వర్షపాతాన్ని లేదా మాసములోని మొత్తం వర్షపాతాన్ని కొలవటానికి ఉపయోగిస్తారు.
  2. రికార్డింగు వర్షమానికలు: ఇవి వర్షపాతము యొక్క తీవ్రతను ఒక వొలికే బాల్చీ సాయముతో కొలుస్తాయి. వొలికే బాల్చీ, దానిలో నిర్ధిష్ట ఘనపరిమాణములో నీరు చేరినప్పుడే వొలుకుతుంది. ఇలా వొలికిన ప్రతిసారి ఒక విద్యుత్ స్విచ్ దాన్ని రికార్డు చేస్తుంది.

యునైటెడ్ కింగ్‌డంలో ప్రతి 60 చదరపు కిలోమీటర్లకు ఒక వర్షమానిక ఉంది.

భారతదేశములో ముఖ్యంగా ఆంధ్రదేశములో పూర్వము వర్షాన్ని వ్యవసాయ సంబంధంగా కొలిచేవారు. శరీరం మీద బట్ట తడిపే వానను - బట్టతడుపు వాన అని, నాగలితో దున్నే పదును పడితే - దుక్కి వర్షం అని, మడిగట్లు నిండే వానపడితే దుక్కి వర్షం అని వర్గీకరించారు. కాలవిజ్ఞాన శాస్త్రము దుక్కికి పడిన వర్షము ఒక మానికె, 16 మానికెలు ఒక తూము, 4 తూములు ఒక ద్రోణము అని వర్షమానాన్ని సూచించింది.[5]

వ్యవసాయంపై ప్రభావం

మార్చు

అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. కరువు పరిస్థితులు పంటలను పెద్ద ఎత్తులో నాశనం చేస్తాయి. విపరీతమైన తడి వలన హానికరమైన శిలీంధ్రాలు ఎక్కువవుతాయి. వివిధ మొక్కలు బతకటానికి వివిధ మొత్తాలలో వర్షపాతం అవసరం. ఉదాహరణకు, కాక్టస్ మొక్కలకు అతి తక్కువ నీరు అవసరం కానీ వరి లాంటి ఉష్ణమండల మొక్కలు జీవించటానికి వందలాది అంగుళాల వర్షం అవసరం.

అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. ఉదాహరణకు, భారతీయ వ్యవసాయరంగము (స్థూల జాతీయ ఆదాయములో 25% వాటా కలిగి, 70% జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది) వర్షంపై భారీగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు, ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది 1990వ దశకములో సంభవించిన కరువులలో లాగా దేశ ఆర్థికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

మానవ ప్రభావం

మార్చు

కార్ల పొగగొట్టం నుండి వెలువడే పొగలోని అతి సూక్ష్మ ఘన పదార్ధాలు, ఇతర మానవ సంబంధ కాలుష్య కారకాలు మేఘ ద్రవీభవన కేంద్రకాలను (క్లౌడ్ కండెన్షేషన్ న్యూకియస్) సృష్టించి మేఘాలు యేర్పడేందుకు దోహదం చేస్తాయి. ఈ విధంగా వర్షంపడే సంభావన అధికమవుతుంది. వారమంతా ప్రయాణికులు, కమర్షియల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన బాగా కాలుష్యం పేరుకొని శనివారము కళ్ళా అది వర్షపాతాన్నిస్తుందని భావిస్తున్నారు. జనాభా అత్యధికంగా ఉన్న అమెరికా తూర్పుతీరము లాంటి తీరప్రాంతాలలో ఈ ప్రభావము మరింత స్పష్టంగా కనిపించవచ్చు. సోమవారము కంటే శనివారము వర్షంపడే సంభావన 22% శాతం అధికం అని ఒక పరిశోధనలో సూచించారు.[6]

సంస్కృతిలో వర్షం

మార్చు
 
బయట పచ్చిక భయిళ్ళ పైన పడుతున్న వర్షం

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో వర్షం పట్ల భిన్న ధోరణులు ఉన్నాయి. చాలామటుకు సమశీతోష్ణ వాతావరణం కలిగిన ఐరోపాలో, వర్షాన్ని దుఃఖ సూచకంగా భావిస్తారు. ఇలాంటి ధోరణే రెయిన్ రెయిన్ గో అవే (వర్షమా వర్షమా వెళ్ళిపో) వంటి పిల్లల రైమ్స్‌లో ప్రతిఫలిస్తుంది. దీనికి విరుద్ధంగా ఎండను, సూర్యున్ని దివ్యమూ, ఆనందదాయకంగా భావిస్తారు. పాశ్చాత్య ప్రపంచములో వర్షం పట్ల సాంప్రదాయక భావన ముభావంగా ఉన్నప్పటికీ కొందరు వర్షం సాంత్వననిస్తుందని, చూచి అనుభవించుటకు హృద్యంగా ఉండటం వలన ఆనందదాయమని భావిస్తారు. ఆఫ్రికాలోని కొన్ని భాగాలు, ఆస్ట్రేలియా, భారతదేశం, మధ్యప్రాచ్యము వంటి పొడి ప్రాంతాలలో వర్షాన్ని అత్యంత సంబరముతో ఆహ్వానిస్తారు. (ఎడారి దేశమైనబోత్సువానాలో వర్షానికి స్థానిక సెత్స్వానా పదం "పూలా"ను, దేశ ఆర్థిక వ్యవస్థకు వర్షం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, జాతీయ మారకము పేరుగా పెట్టుకున్నారు.)

అనేక సంస్కృతులు వర్షాన్ని ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులను అభివృద్ధి చేసుకున్నాయి. వీటిలో భాగంగానే గొడుగు, వర్షపు కోటు లాంటి రక్షణా సాధనాలు, వర్షపు కాలువలు, వరద నీటిని డ్రైనేజీ మరల్చే కాలువలు లాంటి దారిమార్పు సాధనాలు అభివృద్ధి చెందాయి. చాలా మంది ప్రజలు వర్షం పడినప్పుడు, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో, వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయి. అంతేకాక, ఋతుపవనాలలో వర్షపాతం భారీగా ఉండటం వలన, ఇంటి లోపటే ఉండటానికే ఇష్టపడతారు. వర్షపు నీటిని పట్టి, నిలువ ఉంచుకోవచ్చు కానీ, వర్షపు నీరు సాధారణంగా స్వచ్ఛంగా ఉండదు. ఇది వాతావరణంలోని వివిధ పదార్ధాలతో కలుషితమౌతుంది. అతివృష్టి, అందునా ప్రత్యేకముగా ఎండాకాలములో భూమి ఎండిపోయి, గట్టిపడి నీటిని పీల్చుకునే స్థితిలో లేనప్పుడు పడే వర్షం వల్ల వరదలు సంభవిస్తాయి.

చాలామంది తొలకరి వర్షానికి ముందు, పడేటప్పుడు భూమి నుండి వచ్చే ప్రత్యేక వాసనను ఇష్టపడతారు. ఈ మట్టి వాసనకు మూలం మొక్కలు ఉత్పత్తి చేసే పెట్రికోర్ అనే నూనెనే. మొక్కలు ఉత్పత్తి చేసే ఈ తైలాన్ని రాళ్లు, నేల పీల్చుకుంటాయి. వర్షం పడినప్పుడు దీనిని గాల్లోకి వదులుతాయి. చిరుజల్లులు రొమాంటిక్ గా ఉంటాయని కొందరు భావిస్తారు. ఆకాశం మేఘావృతమై మబ్బుగా ఉండటం వలన వర్షం కొందరిని డిప్రెషన్ కు గురిచేస్తుంది.

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా), వాంకూవర్ (కెనడా), సియాటిల్ (అమెరికా), బెర్గెన్ (నార్వే) నగరాలను ఆయాదేశాలలో, ప్రాంతాలలో వర్షానికి పెట్టినపేర్లుగా భావిస్తారు. హిమాలయాల దక్షిణ సానువులలో ఉన్న చిరపుంజీ ప్రపంచములో అత్యధిక వర్షపాతము గల ప్రదేశముగా నమోదైనది. ఇటీవల దీన్ని దాటి దగ్గరలోని మాసిన్రం అనే ప్రాంతం ఈ రికార్డును కైవసం చేసుకున్నది అయితే మాసిన్రంలో స్థానికంగా వర్షపాతము నమోదు చేయటానికి వాతావరణ కేంద్రము లేకపోవటం వలన ఇప్పటికీ చిరపుంజీనే అత్యధిక వర్షపాతము గల ప్రదేశముగా పరిగణింపబడుతున్నది.

మూలాలు

మార్చు
  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం వర్షం పదానికి ప్రయోగాలు.[permanent dead link]
  2. Tokay  PDF, Tokay, page361, Journal of Applied Meteorology.
  3. http://www.ems.psu.edu/~fraser/Bad/BadRain.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-07-01. Retrieved 2007-06-29.
  5. మిన్నేరు (జానపదగేయరత్నావళి) - నేదునూరి గంగాధరం ప్రాచీన గ్రంధావళి, రాజమహేంద్రవరం (1968) పేజీ.344
  6. Cerveny, R. S., and R. C. Balling. Weekly cycles of air pollutants, precipitation and tropical cyclones in the coastal NW Atlantic region. Nature. 394, 561-563.

ఇవికూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వర్షం&oldid=4316998" నుండి వెలికితీశారు