వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 44వ వారం

జమ్మూ & కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో మూడు విభాగాలున్నాయి - జమ్ము ప్రాంతం ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం; కాశ్మీరు లోయ కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు; లడఖ్ హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. - కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "భారతదేశం ఆక్రమించిన కాశ్మీరు" అనీ, పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భాగాన్ని "స్వతంత్ర కాశ్మీరు" అనీ పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీరు భాగాన్ని "పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీరు" అని భారతదేశం వ్యవహరిస్తుంది.

వ్యవసాయం, పశువుల పెంపకం జమ్ము-కాశ్మీరు ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. పరిశ్రమలు ప్రస్తుతం చాలా కొద్ది, కాని క్రమంగా, వేగంగా వృద్ధిపొందుతున్నాయి. 1989కు ముందు (సాయుధపోరాటం పెచ్చుపెరగకముందు) పర్యాటకరంగం జమ్ము-కాశ్మీరు ఆర్ధిక వ్యవస్థలో కీలకమైనదిగా ఉండేది. తీవ్రవాదం వల్ల ఈ రంగం బాగా దెబ్బతిన్నది. అయినా జమ్ము, లడఖ్‌లు పర్యాటకులను ఇప్పటికీ బాగా ఆకర్షిస్తున్నాయి. ఇంకా కాశ్మీరు కుంకుమ పువ్వు కూడా ప్రసిద్ధం. ఇందులో ఎక్కువభాగం ఎగుమతి జరుగుతున్నది.

కాశ్మీరు సహజీవన సంస్కృతివల్ల అన్ని మతాలు ఇరుగుపొరుగులో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం - ఇవి కాశ్మీరీలు అంతా కలసి పంచుకొనే సాంప్రదాయాలు. ఆడ, మగల దుస్తులు రంగులమయం. కాశ్మీరు కవిత్వం, జానపదనృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. వత్తల్ ప్రాంతంలో మగవారు చేసే "దుమ్హల్" నృత్యం, ఆడువారు చేసే "రోఫ్" నృత్యం బాగా పేరుపొందాయి. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి