వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 05వ వారం
సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.
ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలవబడుతున్నది.
సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ మరియు మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది. 400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి.
క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా…