వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 13వ వారం

మెండలియెవ్

డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్ (1834 - 1907) రష్యాకు చెందిన రసాయన శాస్త్రవేత్త. మెండలియెవ్ 1834 ఫిబ్రవరి 8న రష్యాలో "వెర్నీ అరెంజ్యాని" అనే గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిని స్వీకరించి అనేక పరిశోధనలు చేశాడు. ఈ దశలోనే మెండలియెవ్ ప్రిన్సిపిల్స్ ఆఫ్ కెమిస్ట్రీ (1868-1870) అనే రెండు భాగాల పాఠ్య పుస్తకాన్ని వ్రాశాడు. అందులో మూలకాలను వాటి రసాయన గుణాల క్రమంలో వర్గీకరించడానికి ప్రయత్నించాడు. అలా చేసే సమయంలో అతనికి కొన్ని సంఖ్యల తరువాత అవే రసాయన గుణాలు ఆ మూలకాలలో పునరావృతమవుతున్నాయని గమనించాడు. అతని ఆవర్తన పట్టిక తయారీకి అదే నాంది. శాస్త్రజ్ఞునిగా ప్రసిద్ధి చెంది అనేక సత్కారాలు పొదాడు. 1907లో రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మరణించాడు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు. ఇంత పని చేసి రసాయన శాస్త్రం మీద తనదైన ముద్ర వేసిన మెండలియెవ్ కి నోబెల్ బహుమానం ఇవ్వలేదు. కాని మెండలియెవ్ పేరు తెలియని విద్యార్థులు ఉండరేమో! మెండలియెవ్ మార్చి 6, 1869 న రష్యన్ కెమికల్ సొసైటీలో "ద డెపెండెన్స్ బిట్వీన్ ద ప్రోపర్టీస్ ఆఫ్ ద ఆటమిక్ వైట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్" అనే ఉపన్యాసాన్ని సమర్పించారు. ఇందులో మూలకాలు ద్రవ్యరాశి మరియు "సంయోజకత" అనే గుణాలలో ఒక క్రమ పద్ధతిని ప్రదర్శిస్తున్నాయని చర్చించారు.

(మార్చి 6 1869- మెట్టమొదటిసారిగా ఆవర్తన పట్టికను వెలువరించారు.)

(ఇంకా…)