వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 11వ వారం

రమణ మహర్షి

రమణ మహర్షి (తమిళం: ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879ఏప్రిల్ 14, 1950), ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు. ఈయన అసలు పేరు వేంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు. ఈయన తమిళనాడులోని తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895 లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్లు పట్ల భక్తి భావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది. 1896 లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు. ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930వ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది.

రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను, మార్గాలను ఆమోదించాడు. కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మ చింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచు చెప్పేవాడు. ఆయన బోధనలలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. ఇతని బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు.
(ఇంకా…)