వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/ఎర్రలింకుల నిర్వహణ

వెనక్కి తీసుకున్నారు

చర్చలో ఒక్కరు కూడా పాల్గొనలేదు. అందుచేత ఈ ప్రతిపాదనను మూసేసాం

కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

వికీపీడియాలో ఎర్రలింకులు ఒక భాగం. వికీపీడియా అభివృద్ధికి దోహదపడే అంశాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఏదైనా పేజీకి లింకు ఇచ్చినపుడు, ఆ పేజీ ఉనికిలో ఉంటే నీలిలింకును చూపిస్తుంది. దాన్ని నొక్కినపుడు ఆ పేజీకి తీసుకెళ్తుంది. అసలు ఉనికి లోనే లేని పేజీకి లింకు ఇచ్చినపుడు, ఆ లింకును చూపించకుండా ఉంటే సరిపోతుంది. కానీ వికీ సాఫ్టువేరు ఆ లింకును ఎర్రరంగులో చూపిస్తుంది. దాన్ని నొక్కినపుడు ఒక ఖాళీ పేజీకి తీసుకెళ్ళి, "మీరు అడిగిన పేజీ లేదు, ఇపుడు మీరు దాన్ని సృష్టించవచ్చు" అని చెబుతుంది. కొత్త పేజీల సృష్టికి, తద్వారా వికీ అభివృద్ధికీ తోడ్పడేందుకు ఇది ఒక మార్గంగా భావించి వికీ ఈ అంశాన్ని ప్రవేశపెట్టింది.

తెవిలో ఉన్న ఎర్రలింకులను నిర్వహించే విషయంలో ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇది ప్రతిపాదన.

ఎర్రలింకులు ఎలా ఏర్పడతాయి మార్చు

తెలుగు వికీపీడియాలో అనేక వేల పేజీల్లో, ఇలాంటి ఎర్రలింకులు లక్షల్లో ఉన్నాయి. ఈ లింకులు కింది సందర్భాల్లో మనకు ఏర్పడతాయి:

  1. అసలు ఉనికిలో లేని పేజీకి లింకు ఇచ్చినపుడు
  2. పేజీ ఉనికిలో ఉన్నప్పటికీ లింకును తప్పుగా రాసినపుడు
  3. గతంలో ఉనికిలో ఉన్న పేజీని ఇపుడు తొలగించి, దానికి వచ్చే లింకులను తీసెయ్యనపుడు

ఎక్కడెక్కడ ఉంటాయి మార్చు

ఈ లింకులను వ్యాసంలో కింది చోట్ల మనం చూడవచ్చు:

  1. వ్యాసం పేజీలో ప్రధాన కంటెంటులో
  2. పేజీలో ఇమిడ్చిన సమాచారపెట్టెలో
  3. పేజీలో ఇమిడ్చిన నేవిగేషను మూసలో (ఫలానా మండలం లోని గ్రామాలు, ఫలానా ఖండం లోని దేశాలు వంటి మూసలు). సాధారణంగా ఇవి పేజీకి అడుగున ఉంటాయి.
  4. వర్గం (ఉనికిలో లేని వర్గాన్ని పేజీలో చేర్చినపుడు)
  5. జాబితా పేజీల్లో, జాబితా లోని ప్రతీ అంశానికీ ఉండవచ్చు

ఎర్రలింకుల గణాంకాలు మార్చు

2022 ఆగస్టు 18 నాటికి తెవికీలో ఎర్ర లింకుల గణాంకాలు ఇలా ఉన్నాయి.

  1. వ్యాసాల్లో ఎర్రలింకులున్న మొత్తం పేజీల సంఖ్య: 38,814. ఈ పేజీల్లో ఉన్న మొత్తం ఎర్రలింకుల సంఖ్య: 5,26,682. ఇందులో వ్యాసం పాఠ్యం లోనివే కాకుండా, మూసల్లో, వర్గాల్లో ఉన్న ఎర్ర లింకులు కూడా కలిసి ఉంటాయి.
  2. మూసల్లో ఎర్రలింకులున్న మొత్తం పేజీల సంఖ్య: 7541. ఈ మూసల్లో ఉన్న మొత్తం ఎర్రలింకుల సంఖ్య: 1,26,028. ఈ మూసల్లోని ఎర్రలింకులను సవరిస్తే, వ్యాసాల్లోని ఎర్రలింకులు కూడా తగ్గిపోతాయి.

అత్యధికంగా ఎర్రలింకులున్న పేజీల్లో అంత పెద్ద సంఖ్యలో ఎర్రలింకులుండడానికి ప్రధానమైన కారణం - ఆ పేజీల్లో ఎర్రలింకులున్న మూసలను చేర్చడమే. ఆయా మూసల్లోని ఎర్రలింకులను సవరించినట్లైతే (ఆయా పేజీలను సృష్టించడం, తప్పు లింకులను సవరించడం, లిఖులను తీసెయ్యడం) ఆయా వ్యాసాల్లోని ఎర్రలింకుల సంఖ్య ఆ మేరకు తగ్గిపోతుంది. ముఖ్యమైన గమనిక: పై లింకుల గమ్యం పేజీలన్ని ప్రధానబరి లోనివే. ఇతర పేరుబరుల్లోని పేజీలకు ఉన్న లింకులను ఈ గణాంకాల పరిధి లోకి రావు.

ఎర్రలింకుల మంచి చెడులు మార్చు

ఎర్రలింకుల ఆవశ్యకత ఏమిటనేది నిర్వివాదాంశం. ఎర్రలింకుల వలన ఏయే పేజీలను సృష్టించాలనే సంగతి తెలుస్తుంది. కొత్తవారికి ఆయా పేజీలను సృష్టించడం సులువౌతుంది కూడాను.

ఎర్రలింకుల వలన ఎదురయ్యే ప్రతికూలాంశాలు ఇవి:

  1. ఎర్రలింకులు వికీపై కొంత వ్యతిరేకతను కలిగించే అవకాశం ఉంది.
  2. మరీ ఎక్కువ ఎర్రలింకులు ఉంటే ఆ పేజీ కొంత ఏవగింపు కలిగించవచ్చు. ఉదాహరణకు భారతీయ_రైల్వే_స్టేషన్ల_జాబితా పేజీలో 5,771 ఎర్రలింకులున్నాయి. నీలిక్లింకులు బహుకొద్ది మాత్రమే.

ఎర్రలింకులను తగ్గించేందుకు ఏమేం చెయ్యవచ్చు మార్చు

ఎర్రలింకులను తగ్గించేందుకు ఆయా పేజీలను సృష్టించడమే అత్యుత్తమ మార్గమని మనకు తెలుసు. అయితే తెవికీ పరిమాణం దృష్ట్యా, ఇక్కడ చురుగ్గా పనిచేసే వాడుకరుల సంఖ్య దృష్ట్యా ఆయా వ్యాసాలను సృష్టించడానికి చాలా కాలం పడుతుంది. అయితే, పేజీలను సృష్టించడం కాకుండా, ఈ లింకులను తగ్గించే ఇతర సత్వర మార్గాలను పరిశీలించాలి. వాటిలో కొన్ని ఇవి:

  1. తప్పు లింకులను సవరించి సరైన పేజీ పేరును ఇచ్చి లింకులను మార్చాలి. ఉదా: ఈ దిద్దుబాట్లలో చేసిన సవరణల్లో 10 పైచిలుకు తప్పు లింకులను సవరించడంతో ఈ మూసను చేర్చిన పేజీల్లోని ఎర్రలింకుల సంఖ్య తగ్గిపోయింది.
  2. అయోమయ నివృత్తి పేజీల్లో ఎర్రలింకులు: ఎర్రలింకులున్నాయంటే ఆ పేజీ లేదని అర్థం. అసలు పేజీయే లేకపోతే, ఇక అయోమయమేముంది. అంచేత ఆ ఎర్రలింకుల పేజీలను అయోమయ నివృత్తి పేజీల్లోంచి తీసెయ్యాలి.
  3. ముందుగా, మూసల్లోని - మరీ ముఖ్యంగా నేవిగేషను మూసల్లోని - ఎర్రలింకులను సవరించాలి. తద్వారా ఆ మూసలను చేర్చిన అనేక పేజీల్లో లింకులు ఆటోమాటిగ్గా సవరించబడతాయి.
  4. ఎర్ర వర్గాల పేజీల్లో ఆ వర్గం గురించిన వివరణను ఒకటి రెండు వాక్యాల్లో రాసి వర్గాన్ని సృష్టించాలి. (ఏదైనా పేజీలో ఒక వర్గాన్ని చేర్చినంత మాత్రాన ఆ వర్గానికి పేజీని సృష్టించినట్టు కాదు. ఆ వర్గం పేజీలో కొంత సమాచారాన్ని చేరిస్తేనే ఆ వర్గాన్ని సృష్టించినట్టు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆ వర్గాన్ని మరొక మాతృవర్గంలో చేర్చినా, ఆ వర్గాన్ని సృష్టించినట్లే)
  5. వ్యాసంలో ఇవి కూడా చూడండి విభాగంలో ఎర్రలింకులు ఉండకూడదు. వ్యాసానికి, వ్యాస విషయానికీ సంబంధించిన పేజీలు తెవికీలో ఇంకా ఉన్నాయి. వాటిని చూడండి అని ఈ విభాగంలో చెబుతాం. ఇక్కడ ఎర్రలింకులివ్వడం భావ్యం కాదు. వాటిని నేరుగా తొలగించవచ్చు.
  6. ఇప్పట్లో పేజీని సృష్టించే అవకాశం లేదు అనిపించిన ఎర్రలింకులను తొలగిస్తే మంచిది. ఉదాహరణకు - తెలుగునాట_ఇంటిపేర్ల_జాబితా పేజీలో 2,551 లింకులున్నాయి. ఆయా ఇంటిపేర్లకు లింకులు సృష్టించగలమా అంటే ఇప్పట్లో అది దాదాపు సంభవం కాదు అనే అనిపిస్తోంది. అంచేత ఈ లింకులను తీసెయ్యవచ్చు.
    • ముఖ్యమైన గమనికలు:
      • ఎర్రలింకులను తీసేసినంత మాత్రాన ఆ పేజీలను సృష్టించకూడదని కాదు. సృష్టించవచ్చు.
      • ముఖ్యంగా జాబితాల పేజీల్లో కొన్ని నీలిలింకులుంటే, మిగతా అంశాలకు కూడా పేజీలు సృష్టించవచ్చనే సంగతి ఎర్రలింకులు లేఖపోయినా తెలుస్తుంది.
  7. ఇంగ్లీషు వికీ నుండి తెలుగులోనికి వ్యాసాలను అనువదించేటపుడు, మూలాన్ని తెచ్చి ఇక్కడ పేజీలో పెట్టి అనువాదం చేస్తే, లింకులను జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీషు లోని గమ్యం పేజీకి సంబంధించిన తెలుగు పేజీ ఉంటే దాన్ని ఇక్కడ ఇవ్వాలి. లేదంటే ఆ లింకు ఎర్రలింకుగా మారిపోతుంది. దీన్ని నివారించడానికి అత్యుత్తమ మార్గం - అనువాదాన్ని అనువాద పరికరం ద్వారా చెయ్యడం. ఇంగ్లీషు గయ్మం పేజీలకు సంబంధించిన తెలుగు పేజీ ఉంటేనే అది లింకు ఇస్తుంది. లేదంటే ఇవ్వదు. ఆ విధంగా అనువాద పరికరం, ఇక్కడ ఎర్రలింకు వచ్చే అవకాశమే ఇవ్వదు.

ఎర్రలింకుల జాబితాలు మార్చు

ఎర్రలింకులకు సంబంధించిన వికీలింకులను ఇక్కడ చూడవచ్చు:

  1. ఎర్రలింకుల గమ్యస్థాన వ్యాసాలు - ఇందులో ప్రధానబరి లోని పేజీలే కాకుండా మిగతా పేరుబరుల్లోని పేజీలు కూడా ఉంటాయి. ఈ జాబితా లోని వ్యాసాలను సృష్టించాలి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ పేజీకి ఎన్ని పేజీల నుండి లింకులున్నాయో చూపిస్తుంది.
  2. ఈ పరికరం ద్వారా ఎర్రలింకులున్న వ్యాసాల జాబితాను మాత్రమే చూడవచ్చు.
  3. ఎర్రలింకుల మూసలు - ఈ మూసలు అసలు ఉనికిలోనే లేవు. కానీ వివిధ పేజీల్లో వీటిని వాడారు. లేని మూసలను వాడడానికి ప్రధానమైన కారణం, ఇంగ్లీషు నుండి వికీపేజీలను అనువదించినపుడు ఆ పేజీలయ్తో పాటు మూసల లింకులు కూడా వస్తాయి. కానీ ఆయా మూసలను దిగుమతి చేసుకోకపోవడం వలన అవి ఎర్రలింకులుగా కనిపిస్తాయి. నిర్వాహకులు ఈ మూసలను దిగుమతి చేస్తే సరిపోతుంది - ఈ ఎర్రలింకులు నీలిలింకులుగా మారిపోతాయి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ మూసను ఎన్ని పేజీల్లో ఇమిడ్చారో చూపిస్తుంది.
  4. ఎర్రలింకుల వర్గాలు - ఈ వర్గాల పేజీలను సృష్టించాలి. బ్రాకెట్లోని సంఖ్య, ఆ వర్గంలో ఎన్ని పేజీలున్నాయో చూపిస్తుంది.
  5. వ్యాసాల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. దీన్ని క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్నాం.
  6. మూసల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్న జాబితా.
  7. అయోమయ నివృత్తి పేజీల్లో ఉన్న ఎర్రలింకుల జాబితా ఇది. క్వారీ నుండి 2022 ఆగస్టు 19 న తీసుకున్న జాబితా.

ఎర్రలింకులపై గతంలో జరిగిన చర్చల లింకులు మార్చు

ఎర్రలింకుల అంశంపై గతంలో జరిగిన చర్చలను కింది లింకుల్లో చూడవచ్చు

  1. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_8#మొలకలకు_మరొక_కారణం
  2. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#తెలుగు_సినిమా_పేజీల_ఎర్రలింకులు, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#సినిమా_పేజీల_ఎర్రలింకులు
  3. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_55#వర్గాలు,_వర్గీకరణలు
  4. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_81#అయోమయ_నివృత్తి_పేజీల్లో_ఎర్ర_లింకులు

ప్రస్తుత చర్చ కోసం మార్చు

పై సమాచారం ఆధారంగా కింది అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది.

  1. వ్యాసాల పేజీల్లో ఎర్రలింకుల తొలగింపు
    1. మూకుమ్మడిగా తొలగిద్దామా?
    2. ఒక సంఖ్య అనుకుని ఆ పై ఉన్నవాటిని తొలగిద్దామా?
    3. లింకు ఔచిత్యాన్ని, ఆ పేజీని సృష్టించగలిగే సంభావ్యతనూ పరిశీలించి తొలగిద్దామా?
  2. తప్పు లింకుల సవరణకు, అయోమయ నివృత్తి పేజీల్లో ఎర్రలింకుల తొలగింపుకు, "ఇవి కూడా చూడండి" విభాగంలో ఎర్రలింకుల తొలగింపుకు, జాబితా పేజీల్లో ఎర్రలింకుల తొలగింపుకు, ఎర్రవర్గాల సృష్టికీ - ఒక వికీప్రాజెక్టును మొదలుపెడదామా? ఎందుకంటే పనిచేసేవారు ఉంటేనే ప్రాజెక్టుకు సార్థకత. పనిచేసేవారు ఉన్నా లేకున్నా ప్రాజెక్టును సృష్టించవచ్చు, సృష్టించాలి కూడా. కానీ ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటే ప్రాజెక్టు ఉత్సాహవంతంగా సాగుతుందని భావన.
  3. ఈ ఎర్రలింకుల స్థానంలో ఇంగ్లీషువికీకి లింకులివ్వడమనే ఒక సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఇది తెవికీకి దోహదపడకపోగా, పాఠకులలో ఆసక్తిని తగ్గిస్తుంది - ఇంగ్లీషు రానివారు ఉండడం, ఇంగ్లీషుకు తీసుకెళ్తోంటే ఇక ఇక్కడికి రావడమెందుకు అనే భావన కలగడం మొదలైనవి కారణం. పైగా నీలిలింకుపై మౌసుపెడితే తప్ప అది తెవికీ లింకు కాదని తెలీదు. అంచేత ఆ పేజీని సృష్టించాల్సిన అవసరం ఉందని వాడూకరులకు తోచదు. కాబట్టి ఎన్వికీ లింకులివ్వడం మానాలి.

ఈ అంశాలను పరిశీలించి, ఇంకా ఇతర అంశాలేమైనా ఉంటే వాటిని కూడా చేర్చి చర్చలో పాల్గొనవలసినదిగా వాడుకరులకు అభ్యర్థన.

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.