వికీమీడియా కామన్స్
వికీమీడియా కామన్స్ (లేదా కామన్స్) అనేది స్వేచ్ఛా-వినియోగ చిత్రాలు, శబ్దాలు, ఇతర మీడియా, జెసన్ (JSON) [1] ఫైళ్ళ యొక్క ఆన్‌లైన్ నిల్వ. ఇది వికీమీడియా ఫౌండేషన్ వారి ప్రాజెక్టు .
![]() | |
Type of site | ఫైళ్ల నెలవు |
---|---|
Owner | వికీమీడియా ఫౌండేషన్ |
Created by | వికీమీడియా సముదాయం |
URL | commons |
Commercial | No |
Registration | ఐచ్ఛికం (ఫైళ్ళు ఎక్కించాలంటే అవసరం) |
Launched | సెప్టెంబరు 7, 2004 |
Current status | ఆన్లైన్ |
Content license | స్వేఛ్ఛాయుత |
వికీమీడియా కామన్స్ లోని ఫైళ్ళను అన్ని వికీమీడియా ప్రాజెక్టులలోను - వికీపీడియా, విక్షనరీ, వికీబుక్స్, వికీవాయేజ్, వికీస్పెసిస్, వికీసోర్స్, వికీన్యూస్ మొదలైన ప్రాజెక్టుల్లో - అన్ని భాషల లోనూ ఉపయోగించవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2019 నాటికి, ఈ నిల్వలో ఐదున్నర కోట్లకు పైగా ఫైళ్ళు ఉన్నాయి.[2] 2013 జూలైలో, కామన్స్‌లో మార్పుచేర్పుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది.[3]
చరిత్రసవరించు
ఈ ప్రాజెక్టును 2004 మార్చిలో ఎరిక్ ముల్లర్ ప్రతిపాదించాడు. 2004 సెప్టెంబరు 7 న దీన్ని ప్రారంభించారు. కామన్స్ సృష్టించటానికి ముందు ఒకే ఫైలును వివిధ వికీమీడియా ప్రాజెక్టుల లోకి విడివిడిగా ఎక్కించాల్సి వచ్చేది. ఇలా వివిధ ప్రాజెక్టులు, వివిధ భాషల్లో ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యడాన్ని తగ్గించడమే ఈ కేంద్ర ఖజానాను స్థాపించడం వెనుక ఉన్న ప్రధానమైన ప్రేరణ.
వికీమీడియా కామన్స్ లక్ష్యం - "స్వేచ్ఛా వినియోగ షరతులతో, వివిధ రూపాలలో విద్యా విషయాలను సార్వజనికంగా అందుబాటులోకి తెచ్చే, వికీమీడియా ఫౌండేషన్ వారి వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఖజానాగా పనిచేసే" మీడియా ఖజానాను తయారుచెయ్యడం. ఇక్కడ "విద్య" అనే పదాన్ని "జ్ఞానాన్ని అందించడం -బోధనాత్మకంగా గానీ సమాచారం కోసం గానీ" అనే విస్తృత అర్ధంలో వాడారు. [4]
చాలా వికీమీడియా ప్రాజెక్టులు ఇప్పటికీ, ఇతర ప్రాజెక్టులకు, భాషలకు అందుబాటులో ఉండని స్థానిక ఎక్కింపులను అనుమతిస్తున్నాయి. అయితే ప్రధానంగా, కామన్స్ కాపీహక్కుల విధానం ప్రకారం అనుమతించని వాటికి, స్థానిక ప్రాజెక్ట్ విధానాలు అనుమతించే సముచిత వినియోగం క్రింద ఎక్కించేందుకు ఈ పద్ధతిని వాడుతారు. సముచిత వినియోగం క్రింద, ఉచితం-కాని లైసెన్సులు, ఫైళ్ల వాణిజ్య వినియోగాన్ని పరిమితం చేసే లైసెన్సులు, వ్యుత్పన్న కృతులను అనుమతించని లైసెన్స్‌లు గల వాటిని ఎక్కింపులు చేసేందుకు వికీమీడియా కామన్స్ అనుమతించదు. అందువలన వికీమీడియా కామన్స్ ఎల్లప్పుడూ స్వేచ్ఛా లైసెన్సు పొందిన మీడియానే నిర్వహిస్తుంది. కాపీహక్కుల ఉల్లంఘించే ఫైళ్ళను తొలగిస్తుంది. క్రియేటివ్ కామన్స్ కృతికర్త గుర్తింపు ఇచ్చేటటువంటి, కృతికర్త గుర్తింపు ఇచ్చేటటువంటి / అదే విధంగా పంచుకొనగలిగే లైసెన్సులు, ఇతర ఉచిత కృతులు, ఉచిత సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు, ప్రజోపయోగ పరిధి ఆమోదయోగ్యమైన లైసెన్సుల్లో ఉన్నాయి.
కామన్స్ అప్రమేయ భాష ఇంగ్లీషు. కానీ నమోదైన వాడుకరులు అందుబాటులో ఉన్న ఇతర ఇంటర్‌ఫేసు అనువాదాలను ఉపయోగించుకోవచ్చు. చాలా విషయ పేజీలు, ప్రత్యేకించి విధాన పేజీలు, వేదికలు(పోర్టళ్లు) కూడా వివిధ భాషలలోకి అనువదించారు. మీడియావికీ వర్గ వ్యవస్థను ఉపయోగించి, వికీమీడియా కామన్స్ లోని ఫైళ్ళను వర్గీకరించారు. దీనితో పాటు, విషయాలు సందర్భోచిత గ్యాలరీ పేజీలలో సమీకరించబడి ఉంటాయి. ఈ ప్రాజెక్టును తొలుత ఉచిత పాఠ్యం (టెక్స్టు) ఫైళ్ళ కోసం కూడా ఉద్దేశించినప్పటికీ, వాటిని వికీసోర్స్ అనే సోదర ప్రాజెక్టులో అందిస్తున్నారు.
వివాదాస్పద విషయాలుసవరించు
పెద్ద మొత్తంలో ఔత్సాహిక అశ్లీల చిత్రాలను నిల్వ చేసినందుకు గాను, కామన్స్ విమర్శలు ఎదుర్కొంది. వికారచేష్టలు ప్రదర్శించేవారు వ్యక్తిగత సంతృప్తి కోసం జాలస్థలాన్ని అవకాశంగా వాడుకుని ఈ చిత్రాలను ఎక్కించారు. సానుభూతిపరులైన నిర్వాహకులు కొందరు వాటిని అనుమతించారు. [5] 2012 లో, వికీమీడియా కామన్స్ "డిక్స్ (పురుష మర్మావయవాలు) తో నిండిపోయింది" అని బజ్‌ఫీడ్ అభివర్ణించింది. [6]
"లోలికాన్" అని పిలిచే పిల్లల లైంగిక చిత్రాలను నిల్వ చేసినందుకు గాను, 2010 లో వికీమీడియా కామన్స్‌పై వికీపీడియా సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్ బి ఐ(FBI) కి ఫిర్యాదు చేసాడు. ఇది మాధ్యమాలలో ప్రచురితమైన తరువాత, వికీమీడియా ఫౌండేషన్ (కామన్స్‌ను నిర్వహించేది ఈ సంస్థే) వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్, తన నిర్వాహక హోదాను వాడి, కామన్స్ సముదాయంలో చర్చించకుండా, అనేక చిత్రాలను తొలగించాడు. ఈ తొలగింపు పట్ల కామన్స్ సముదాయంలో ఎదురైన వ్యతిరేకత కారణంగా తనకున్న ఫైళ్ల తొలగింపు అనుమతులతో సహా కొన్ని అధికారాలను వేల్స్ స్వచ్ఛందంగా వదులుకున్నాడు. [7]
ఉపయోగితలుసవరించు
కాలక్రమేణా, వికీమీడియా కామన్స్ ను ఇతర వికీమీడియా ప్రాజెక్టులతో మిళితం చేయడానికి అదనపు ప్రయోజకత్వాలను చేర్చారు. ఎక్కించిన ఫైళ్ళకు తగిన వర్గాలను కనుగొనడం ("CommonSense"), వివిధ వికీమీడియా ప్రాజెక్టులలో ఫైళ్ల వాడకాన్ని నిర్ధారించడం ("CheckUsage"), కాపీహక్కుల సమాచారం లేని చిత్రాలను గుర్తించడం ("UntaggedImages"), తొలగింపు వంటి నిర్వాహక చర్యల గురించి సంబంధిత వికీలకు సమాచారాన్ని ప్రసారం చేయడం ("CommonsTicker") వంటి పనులకు డేనియల్ కిన్‌జ్లర్ సాఫ్టువేరు రాసాడు.
పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎక్కించే విధానాన్ని సరళీకృతం చేయడానికి " కామనిస్ట్ " వంటి ప్రత్యేకమైన అప్‌లోడింగ్ సాధనాలను, స్క్రిప్టులను తయారు చేసారు. ఒక సమయంలో, ఫ్లికర్ (Flickr) కు ఎక్కించిన చిత్రాలలో స్వేచ్ఛా చిత్రాలను గుర్తించడానికి వాడుకరులు ఒక పరస్పర తోడ్పాటుతో ఒక సమీక్షా పద్ధతిని ("FlickrLickr") అవలంబించి 10,000 కు పైగా ఫైళ్ళను కామన్స్ లోకి ఎక్కించారు. ప్రస్తుతం ఈ పద్ధతి అమల్లో లేదు.
క్రమపద్ధతి డేటాసవరించు
స్ట్రక్చర్డ్ డేటా ఆన్ కామన్స్ (ఎస్‌డిసి) అనేది స్లోన్ ఫౌండేషన్ నిధులతో చేపట్టిన మూడేళ్ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు. మీడియా ఫైళ్ళ గురించిన డేటాను స్థిరంగా నిర్వహించడానికి వికీమీడియా కామన్స్ ఔత్సాహికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. ఈ డేటా మరింత క్రమపద్ధతిలో ఉండి, యంత్రం చదవగలిగేలా ఉంటుంది. కామన్స్ లోకి చిత్రాలను సమర్పించడాన్ని సులభతరం చేసే సాఫ్ట్‌వేర్‌ను తయారు చెయ్యడం, సవరించడం, క్రమపద్ధతిలో కూర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే, కామన్స్‌లో వెతకడాన్ని, అందులోని చిత్రాలను తిరిగి వినియోగించుకోవడాన్నీ సులభతరం చెయ్యడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. [8] [9]
నాణ్యతసవరించు
నాణ్యమైన రచనలను గుర్తించడానికి సైట్‌లో మూడు పద్ధతు లున్నాయి. ఒకటి " విశిష్ట చిత్రాలు". దీనికి నామినేట్ చేసిన ఫైళ్ళను ఇతర సభ్యులు అంగీకరిస్తూనో తిరస్కరిస్తూనో ఓటు వేస్తారు. ఈ ప్రక్రియ 2004 నవంబరులో మొదలైంది. " నాణ్యమైన చిత్రాలు " అనే మరొక ప్రక్రియ 2006 జూన్ లో మొదలైంది. "విశిష్ట చిత్రాలతో" పోలిస్తే ఇందులో సరళమైన నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. "నాణ్యమైన చిత్రాలు" వికీమీడియా వాడుకరులు సృష్టించిన కృతులను మాత్రమే అంగీకరిస్తాయి. "విశిష్ట చిత్రాల"కు వీటితో పాటు నాసా వంటి బయటి పార్టీల కృతుల నామినేషన్లను కూడా స్వీకరిస్తారు. " విలువైన చిత్రాలు " అనే మూడవ మూల్యాంకన ప్రాజెక్టు 2008 జూన్ 1 న మొదలైంది. "వివిధ రకాలకు చెందిన అత్యంత విలువైన చిత్రీకరణ"లను గుర్తించే ఉద్దేశ్యంతో దీన్ని మొదలు పెట్టారు. తొలి రెండు ప్రక్రియల్లో చిత్రాల నాణ్యతను ముఖ్యంగా వాటి సాంకేతిక విలువను బట్టి నిర్ణయించగా, ఈ ప్రాజెక్టులో విలువ అధారంగా నిర్ణయిస్తారు.
పేర్కొన్న మూడు ప్రక్రియల్లో ఎంపికయ్యే ఫైళ్ళ సంఖ్య, మొత్తం ఫైళ్ళ సంఖ్యలో చాలా స్వల్ప భాగమే (0.1% కన్నా తక్కువ) ఉంటాయి. అయితే, కామన్స్ లో అన్ని రకాల నాణ్యత గల ఫైళ్ళనూ అప్‌లోడు చెయ్యవచ్చు. చాలా ప్రొఫెషనల్ స్థాయి నుండి సాధారణ స్థాయి, ఔత్సాహికుల ఫైళ్ళు, చాలా తక్కువ నాణ్యత గల ఫైళ్ళ వరకూ అన్ని రకాల ఫైళ్ళూ కామన్స్‌లో ఉన్నాయి. కామన్స్ ఒక పోటీ కాదు, అదొక సేకరణ. ఫైళ్ళ సాంకేతికత, కళాత్మకతల కంటే వాటి వివరణ, వాటిని అమర్చిన విధానం, వాటి సమాచార ప్రయోజనం మొదలైనవి ఇక్కడ ముఖ్యమైనవి. నిర్దుష్ట లోపాలతో ఉన్న ఫైళ్ళను మెరుగుదల కోసం, హెచ్చరిక కోసం ట్యాగ్ చేయవచ్చు లేదా తొలగించడానికి కూడా ప్రతిపాదించవచ్చు. అయితే, ఫైళ్ళకు రేటింగు ఇచ్చే క్రమబద్ధమైన ప్రక్రియేమీ లేదు.
2006 లో కామన్స్ తొలిసారిగా "పిక్చర్ ఆఫ్ ది ఇయర్" పోటీని నిర్వహించింది. 2006 లో విశిష్ట చిత్రాలుగా ఎంపికైన చిత్రాలన్నీ ఈ పోటికి అర్హులు. రెండు రౌండ్ల ఓటింగ్ ద్వారా అర్హతగల వికీమీడియా సముదాయ సభ్యులు ఓటు వేశారు. గెలిచిన చిత్రం యుఎస్ వైమానిక దళానికి చెందిన ఒక వైమానిక వ్యక్తి తీసిన "స్నోలాండ్స్ పై అరోరా బోరియాలిస్" అనే చిత్రం. అప్పటి నుండి ఈ పోటీ ఒక వార్షిక కార్యక్రమంగా మారింది.
వికీమీడియా కామన్స్ సంవత్సరంలో ఉత్కృష్ట చిత్రాలు (పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్)సవరించు
ఫైళ్ల గణాంకాలుసవరించు
మూలం: కామన్స్: కామన్స్: మైలురాళ్ళు
- 2006 నవంబరు 30: 10 లక్షల ఫైళ్ళు
- 2009 సెప్టెంబరు 2: 50 లక్షల ఫైళ్ళు
- 2011 ఏప్రిల్ 15: 1 కోటి ఫైళ్ళు
- 2012 డిసెంబరు 4: కోటిన్నర ఫైళ్ళు
- 2013 జూలై 14: 10 కోట్ల మార్పుచేర్పులు [3]
- 2016 జనవరి 13: 3 కోట్ల ఫైళ్ళు
- 2017 జూన్ 21: 4 కోట్ల ఫైళ్ళు
- 2018 అక్టోబరు 7: 5 కోట్ల ఫైళ్ళు
- ప్రస్తుత గణాంకాలు: కామన్స్: స్పెషల్: స్టాటిస్టిక్స్
ఉపకరణాలుసవరించు
- వికీమీడియా కామన్స్ నుండి చిత్రాలను ఉపయోగించడానికి యూరోఆఫీస్ ఆన్‌లైన్ క్లిపార్ట్ పొడిగింత [10]
ఇవి కూడా చూడండిసవరించు
- క్రియేటివ్ కామన్స్ - కంటెంట్ లైసెన్స్‌ల సమితిని, వాటిని ఉపయోగించే రచనల డైరెక్టరీని అందించే ప్రాజెక్ట్
- ఇంటర్నెట్ ఆర్కైవ్ - వీడియోలు, పత్రాలు, వెబ్‌పేజీల ఆన్లైన్ సేకరణ
బాహ్య లింకులుసవరించు
- Official website
- వికీమీడియా కామన్స్ మిర్రర్ ద్వారా WikiTeam
మూలాలుసవరించు
- ↑ Yurik. "Help:Tabular_Data".
- ↑ Statistics page on Wikimedia Commons
- ↑ 3.0 3.1 ÄŒesky (July 15, 2013). "100,000,000th edit". Commons.wikimedia.org. Retrieved August 22, 2013.
- ↑ "Commons:Project scope". Wikimedia Commons editors. Retrieved January 26, 2014.
- ↑ "The Daily Dot – How Wikimedia Commons became a massive amateur porn hub".
- ↑ "The Epic Battle For Wikipedia's Autofellatio Page".
- ↑ "Wikimedia's Wales gives up some top-level controls | Internet & Media - CNET News". Archived from the original on 2012-10-25. Retrieved 2020-01-17.
- ↑ https://wikimania2017.wikimedia.org/wiki/Submissions/Structured_Commons:_what_changes_are_coming%3F
- ↑ https://commons.wikimedia.org/wiki/Commons:Structured_data
- ↑ "EuroOffice Online Clipart – EuroOffice / English". Archived from the original on 2020-01-03. Retrieved 2020-01-17.