విజయ్ మంజ్రేకర్

విజయ్ లక్ష్మణ్ మంజ్రేకర్ (1931 సెప్టెంబరు 26 - 1983 అక్టోబరు 18) 55 టెస్టులు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అనేక జట్లకు (ఆంధ్రా, బెంగాల్, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) ప్రాతినిధ్యం వహించాడు. చిన్నపాటి శరీరంతో ఉండే మంజ్రేకర్, చక్కటి కట్టర్, హుకర్. అతను సంజయ్ మంజ్రేకర్ తండ్రి.

విజయ్ మంజ్రేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విజయ్ లక్ష్మణ్ మంజ్రేకర్
పుట్టిన తేదీ(1931-09-26)1931 సెప్టెంబరు 26
బొంబాయి, బొంబాయి ప్రెసిడెన్సీ
మరణించిన తేదీ1983 అక్టోబరు 18(1983-10-18) (వయసు 52)
మద్రాసు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్‌బ్రేక్
బంధువులుసంజయ్ మంజ్రేకర్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 59)1951 డిసెంబరు 30 - ఇంగ్లాండు తో
చివరి టెస్టు1965 ఫిబ్రవరి 27 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1949–1956బాంబే క్రికెట్ జట్టు
1953–1954బెంగాల్ క్రికెట్ జట్టు
1957ఆంధ్రా క్రికెట్ జట్టు
1957ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టు
1959–1966రాజస్థాన్ క్రికెట్ జట్టు
1966–1970మహారాష్ట్ర క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా
మ్యాచ్‌లు 55 198
చేసిన పరుగులు 3,208 12,832
బ్యాటింగు సగటు 39.12 49.92
100లు/50లు 7/15 38/56
అత్యధిక స్కోరు 189* 283
వేసిన బంతులు 204 1,411
వికెట్లు 1 20
బౌలింగు సగటు 44.00 32.85
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/16 4/21
క్యాచ్‌లు/స్టంపింగులు 19/2 72/6
మూలం: ESPNcricinfo, 2019 జూన్ 8

కెరీర్ మార్చు

మంజ్రేకర్ 1951లో కలకత్తాలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 48 పరుగులు చేశాడు. అతను తన మొదటి టెస్ట్ సెంచరీని 1952 జూన్‌లో ఇంగ్లండ్‌పై హెడ్డింగ్లీలో చేసాడు. ఆ మ్యాచ్‌లో అతను 133 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో ఇది అతని మొదటి టెస్టు. ఆ సమయంలో అతని వయస్సు 20 మాత్రమే. అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు జట్టు 3/42 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఫ్రెడ్ ట్రూమాన్, అలెక్ బెడ్సర్, జిమ్ లేకర్ వంటి బౌలర్లున్న బలమైన లైనప్‌ను ఎదుర్కొన్నాడు.

మంజ్రేకర్ 1952–53లో కరీబియన్‌లో భారత పర్యటనకు వచ్చిన జట్టులో ఉన్నాడు.[1] వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లోని ఐదవది, చివరిదీ ఐన టెస్ట్‌లో మంజ్రేకర్ శతకం చేసాడు. మొత్తం మూడు సెంచరీలతో టూర్‌ను ముగించాడు. భారతజట్టులో ఇతనివే అత్యధిక శతకాలు.[2] ఈ క్రమంలో మూడో స్థానానికి పదోన్నతి పొందిన మంజ్రేకర్ చివరి టెస్టులో 140 నిమిషాల్లో 50కి చేరుకున్నాడు. అతని తదుపరి 50 పరుగులు 80 నిమిషాల్లో వచ్చాయి. రెండో వికెట్‌కు ఓపెనర్ పంకజ్ రాయ్‌తో కలిసి 237 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 118 వద్ద కట్ చేస్తూ మంజ్రేకర్, స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. [3] ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫలితంగా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. మంజ్రేకర్ 36.28 వద్ద 256 పరుగులు చేశాడు.[4] మొత్తంమీద, అతను పరుగుల పరంగా ఆ పర్యటనలో భారతదేశపు రెండవ అత్యుత్తమ బ్యాట్స్‌మన్: అతను 56.75 సగటుతో 681 పరుగులు చేశాడు. [5] టెస్ట్ సిరీస్‌లో అతని ప్రదర్శనను సమీక్షిస్తూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలా రాసింది, "భారత నంబర్ 3 బ్యాట్స్‌మెన్‌గా తనను తాను స్థిరపరచుకున్న మంజ్రేకర్, ఫాస్ట్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా అత్యుత్తమంగా ఆడాడు. కింగ్ అతనిపై బంపర్‌లను విచక్షణారహితంగా బౌల్ చేసినప్పుడు, వాటిని హుక్ చేయడంలో విఫలమైంది దాదాపుగా లేదు. వాటిని చక్కగా బౌండరీ దాటించాడు." [6] తదుపరి సిరీస్‌, 1954-55లో పాకిస్థాన్ పర్యటనలో, మంజ్రేకర్ ఐదు టెస్టుల్లో 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. [7] ఇతర ఫస్ట్-క్లాస్ గేమ్‌లు కూడా ఉన్న ఆ పర్యటనలో, అతను మొత్తం 62.36 సగటుతో బ్యాటింగు చేసాడు. మూడు శతకాలు సాధించాడు.

మంజ్రేకర్ ఒక ఇన్నింగ్స్‌లో విజయ్ హజారేతో కలిసి 222 పరుగులు చేసి, భవిష్యత్తులో తానొక బలమైన శక్తి అవుతానని సూచించాడు. అయితే, తన తొలి ప్రదర్శనను కొనసాగించలేకపోయాడు. అతని బరువు, ఫుట్‌వర్కుతో సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరికి 39 టెస్ట్ బ్యాటింగ్ సగటుతో కెరీర్ ముగించాడు. ఇది 40 కంటే బాగా ఎక్కువ సగటు సాధించగల్గిన వ్యక్తి విషయంలో ఈ సగటు తక్కువే. 1961-62లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఆడినది అతని అత్యుత్తమ సిరీస్. అందులో అతను 83.71 సగటుతో 586 పరుగులు చేశాడు. ఇందులో ఢిల్లీలో చేసిన 189 పరుగులు అతను చేసిన ఏడు సెంచరీల లోకీ అత్యధిక స్కోరు. 1964-65లో మరొక చెప్పుకోదగ్గ ఆటతీరుతో చేసిన 59, 39 పరుగులు ఆస్ట్రేలియాపై భారత టెస్టు విజయానికి దోహదపడింది. 1965 ఫిబ్రవరిలో మద్రాస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో అతను శతకం సాధించాడు.

ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా అత్యధిక టెస్ట్ పరుగులు (3,208) సాధించిన రికార్డు మంజ్రేకర్ పేరిట ఉండేది. తరువాత దాన్ని జోనాథన్ ట్రాట్ బద్దలు చేసాడు. [8] 1952 హెడింగ్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ట్రూమాన్ విధ్వంసంతో భారతదేశం దయనీయంగా 0 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన స్థితికి చేరిన సందర్భంలో ఔటైన ఆ నలుగురు బ్యాట్స్‌మన్లలో మంజ్రేకర్ ఒకడు. (ఇతరులు పంకజ్ రాయ్, దత్తాజీరావు గైక్వాడ్, మాధవ్ మంత్రి).

మంజ్రేకర్ అప్పుడప్పుడు ఆఫ్‌స్పిన్ వేసేవాడు, అప్పుడప్పుడు వికెట్ కీపింగు కూడా చేసేవాడు.

రంజీ ట్రోఫీలో అతను బొంబాయి, బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర -మొత్తం ఆరు జట్ల తరపున ఆడాడు. ఈ టోర్నమెంట్‌లో 57.44 సగటుతో 3,734 పరుగులు సాధించి అద్భుతమైన కెరీర్‌ను సాధించాడు.

విజయ్ మంజ్రేకర్ 1983 అక్టోబరు 18న మద్రాసులో 52 ఏళ్ల వయసులో మరణించాడు.

మూలాలు మార్చు

  1. Ramchand, Gulabrai (20 April 2006). "Sailing by banana boat to face the Three Ws | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 17 August 2020.
  2. "India in West Indies Jan/Apr 1953 – Statistical Highlights". ESPNcricinfo. Retrieved 17 August 2020.
  3. "Manjrekar Also Hits Century". The Indian Express. 4 April 1953. p. 4.
  4. "Youngsters Corner Glory in Tests". The Indian Express. No. 8 April 1953. p. 5.
  5. "Umrigar And Gupte Averages". The Indian Express. No. 11 April 1953. p. 3.
  6. "Future of Indian Cricket Bright". The Indian Express. No. 9 April 1953. p. 6.
  7. "Records / India in Pakistan Test Series 1954/55 / Most Runs". ESPNcricinfo. Retrieved 20 August 2020.
  8. Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067..