విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది పాట 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు.[1]

"విధాత తలపున ప్రభవించినది"
విధాత తలపున ప్రభవించినది పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంకె.వి.మహదేవన్
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణసిరివెన్నెల (1986)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పాటలోని సాహిత్యం

మార్చు

పల్లవి:
విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం...
ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ...
సరసస్వర సురఝరీ గమనమౌ, సామ వేద సారమిది ||2||

నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 1:
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2||

పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం
చరణం 2:
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||
  
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన శృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం

అర్థాలు

మార్చు

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క

తలపున = ఊహలో

ప్రభవించినది = మెరిసినది

అనాది = మొదలు లేని

జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)

ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో

స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన

ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము

కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే

ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన

విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ

ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో

ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన

విరించి = బ్రహ్మ యొక్క

విపంచి = వీణ

గానం = సంగీతం

సరస = రసముతో కూడిన ( నవరసాల రసం )

స్వర = సంగీత స్వరం (స, రి గ)

సురఝరీ = దేవనది, గంగ

గమనమౌ = ప్రవాహము ఐనట్టి

సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది

నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం

విరించినై = నేనే బ్రహ్మనై

విరచించితిని = రచించితిని

ఈ కవనం = ఈ కవిత్వం

విపంచినై = వీణనై

వినిపించితిని = వినిపిస్తున్నా

ఈ గీతం - ఈ పాట

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద

దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ

జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు

వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే వేదిక మీద

పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు

స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట

జగతికి = ప్రపంచానికి, విశ్వానికి

శ్రీకారము కాగా = మొదలు కాగా

విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి

ఇది భాష్యముగా = వివరణగా

జనించు = పుట్టిన

ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన

జీవన నాద తరంగం = జీవితమనే ధ్వని తరంగం, అల, కెరటం

చేతన = చైతన్యం, ప్రాణం

స్పందన = కదలిక

ధ్వనించు = శబ్దం

హృదయ మృదంగ ధ్వానం = హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.

అనాది రాగం = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న రాగం

ఆది తాళం = ఆది తాళం

అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా

సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి

కవనం = కవిత్వం

నా నిశ్వాసం = వదిలే ఊపిరి, గాలి

గానం = పాట

పురస్కారాలు

మార్చు
  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1986.
  2. కళాసాగర్ అవార్డు -1986
  3. భరతముని అవార్డు -1992

మూలాలు

మార్చు
  1. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (12 November 2018). ""విధాత తలపున ప్రభవించినది" అనే ఈ పాట!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

ఇతర వివరాలు

మార్చు
  1. నందన్ భవానీభట్ల బ్లాగ్ లో పాట గురించిన వ్యాసం[permanent dead link]
  2. లో పాట వీడియో