విలియం హార్వే (ఏప్రిల్ 1, 1578 - జూన్ 3, 1657) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు. మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్ర బద్ధంగా అందజేసిన ఘనత విలియం హార్వేకు దక్కుతుంది.

విలియం హార్వే
విలియం హార్వే
జననంఏప్రిల్ 1, 1578
ఫోక్‌స్టోన్
మరణంజూన్ 3, 1657
రోహాప్టన్
జాతీయతఇంగ్లీషు
రంగములువైద్య శాస్త్రము
అనాటమీ
పరిశోధనా సలహాదారుడు(లు)హరోనిమస్ ఫాబ్రీసియస్
ప్రసిద్ధిరక్త ప్రసరణ వ్యవస్థ
ముఖ్యమైన పురస్కారాలుnoble
సంతకం

బాల్యం,విద్యాభ్యాసం

మార్చు

విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు. అచట పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు. అక్కడ హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యరికం పుచ్చుకున్నాడు. 1602 లో వైద్య శాస్త్రంలో పట్టా పుచ్చుకొనటమే కాకుండా ప్రత్యేకమైన యోగ్యతా పత్రాన్ని పొందగలిగాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నుడెవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసుకోడానికి పరిశోధకుడిగా మారాడు. గుండెకు సంబంధించిన సందేహాలు మాత్రం ఆయనను వదలలేదు. గుండె నుండి బయలుదేరిన రక్తం రక్త నాళాలలో అటూ ఇటూ ప్రవహించి చివరికి హరించుకు పోతుందే తప్ప మళ్లీ గుండెను చేరదు అనే వాదంలో నిజం ఉన్నట్లు హార్వేకు తోచలేదు. పెద్ద పెద్ద సిరలలో కవాటాలు ఎందుకు ఉంటాయనే తపన కూడా ఈయనలో బయలుదేరింది.

పరిశోధనలు

మార్చు

1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో ఈయన లెక్చరర్ గా నియమింప బడ్డారు. చేపలు, కప్పలు, కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేయసాగాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్తుకోవడమే అని రుజువు చేశాడు. గుండెలో నాలుగు గదులు ఉంటాయని, ధమనుల ద్వారా గుండె లోని రక్తం బయటికి పంప్ చేయబడుతుందని, సిరల ద్వారా కవాటాలు రక్తాన్ని గుండె వైపుకి వెళ్ళనిస్తాయే కాని గుండె లోంచి రక్తాన్ని వెలుపలికి రానివ్వవని తెలుసుకున్నాడు. ఒక అర గంటలో శరీరంలో ఉన్న మొత్తం రక్తం గుండె నుండి వెలువడే రక్తమే ఎక్కువగా ఉంటుందని నాడీ వేగం, గుండె స్పందించే రేటు ఆధారంగా నిర్ధారించుకోగలిగాడు.

మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.

గ్రంధములు

మార్చు

సా.శ. 1628 లో హార్వే ప్రచురించిన అనటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను మళ్ళీ పరిశోధనల ద్వారానే రూఢి పరచాలనే శాస్త్రవాది హార్వే. ఈ పుస్తకం ప్రచురించిన మూడు సంవత్సరాల తరువాత హార్వే మొదటి చార్లెస్ మహారాజుకు రాజ వైద్యునిగా నియమించబడ్డాడు. కానీ రాజకీయ విపరిణామాల కారణంగా హార్వే లండన్ విడిచి పెట్టవలసి వచ్చింది. అప్పుడే కొంతమంది దుండగులు హార్వే ఇంటిలో లేని సమయం చూచి ఆయన నాలుగు దశాబ్దాలుగా సేకరించిన దాచుకున్న అమూల్యమైన విజ్ఞాన సంపద నంతా నాశనం చేశారు. అయినా హార్వే బాధ పడలేదు. నిరాశతో క్రుంగిపోలేదు. ప్రత్యుత్పత్తి, పిండాభివృద్ధి అంశాల మీద జీవితమంతా పరిశోధించాడు. 1651 లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రతులు అతి త్వరితగతిలో అమ్ముడైపోయి కొత్త చరిత్రను సృష్టించాయి.

అస్తమయం

మార్చు

హార్వే 1657 సంవత్సరం జూన్ 3 న మరణించాడు. ఈయన ప్రయోగాల ద్వారా రాబట్టిన ఫలితాలే ఈ వేళ కూడా రోగ నిర్ణయం చేయటానికి ఉపయోగపడుతున్నాయి.