విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.

విశ్వంభర
విశ్వంభర రెండవ ముద్రణ పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: సి.నారాయణరెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కవిత్వం
ప్రచురణ: మౌక్తిక ప్రచురణలు
విడుదల: 1980

ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.

ప్రస్తావన

మార్చు

ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.

మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.

అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!

కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.

మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.

ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం 'విశ్వంభర' కావ్యరచనకు పునాది.

రచననుండి ఉదాహరణలు

మార్చు
 
విశ్వంభర రచయిత డా.సి. నారాయణరెడ్డి
ఆరంభం

నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర

ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి

ఇంకా

బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది

వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్ని జయిస్తుందా...


ముగింపు

మనసుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
ఇదే అనంత జీవిత సత్యం....

అనువాదాలు

మార్చు
  • విశ్వంభర కావ్యాన్ని డాక్టర్ అమరేంద్ర ఆంగ్ల భాషలోకి అనువదించారు. దీనిని స్టెర్లింగ్ పబ్లిషర్స్ 1986లో ముద్రించారు.[1]
  • దీనిని హిందీ భాషలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్ అనువదించారు.

ప్రశంసలు, పురస్కారాలు

మార్చు

ఈ రచనకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆంగ్ల, హిందీ భాషలలోకి ఇది అనువదించబడింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో దీనిని పాఠ్యగ్రంధంగా నిర్ణయించారు. దీనిపై డాక్టరేటు పరిశోధనలు కూడా జరిగాయి.[2]. కలకత్తా భారతీయ భాషా పరిషత్తు 'భిల్వారా' అవార్డును, త్రివేండ్రం కుమారన్‌ ఆసాన్‌ అవార్డును, సోవియెట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డును పొందింది.

  • ఈ రచన గురించి చీకోలు సుందరయ్య ఇలా వ్రాశాడు - [3] భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలైన ఈ విశ్వంభర కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా ఆవిష్కరిస్తుంది. మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు... అన్నీ విశ్వంభరలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. మనశ్శక్తి వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా, సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మనముందు నిలుపుతుంది. విశ్వంభర ఆధునిక ఐతిహాసిక వచన కవితా కావ్యం. కాల గమనానికి దర్పణం. తేదీలు, దస్తావేజులు, గణాంకాలు లేక మానవ చరిత్రను కీర్తిస్తున్న గానం. ఇందులో కవిత్వాన్ని ఆస్వాదించే వారికి అడుగడుగునా కవిత్వమే లభిస్తుంది... . ... కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అంశాలను స్పృశిస్తోన్న విశ్వంభర మరో మాటలో చెప్పాలంటే మనసు కావ్యం ... . విశ్వంభరలోని మానవుడు, కథానాయకుడు ఒక్క భారతీయుడే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందులో సంపూర్ణ మానవ వికాసమే కావ్యాత్మగా ఉంది. సినారె ప్రతి పంక్తినీ చమత్కారంగా, రసాత్మకంగా తీర్చిదిద్దారు. భావాల్లో కొన్నిచోట్ల నూతనత్వం కొరవడినా సినారె నాజూకు నగిషీ పనితనం నూతనత్వం కలిగిస్తుంది. ఆధునిక కవిత్వంలోని గందరగోళం ఏమాత్రం లేకుండా ప్రతి దృశ్యం పాఠకుల ముందు కదలాడుతూ కాలయంత్రంలా సాగిపోతుంది. ఆ అనుభవాలతో తడిసిపోతుంది.
  • ఆచార్య ఎన్‌.గోపీ - "విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో అతని సంబంధాన్ని గురించి. మట్టే విశ్వంభర. విశ్వంభరే మానవుడు"
  • డా. పి.వి.రమణ - "విశ్వమానవ ఆత్మకథగా, అనుభవ గాథగా క్లాసిక్‌ ప్రమాణాలతో భావచిత్రాభి వ్యక్తి కవితా శిల్పంలో ప్రతీకాత్మంగా విశ్వంభరను అలంకరించారు.

ఇవి కూడా చూడండి

మార్చు


మూలాలు

మార్చు
  • విశ్వంభర, డా.సి.నారాయణరెడ్డి, రెండవ ముద్రణ, మౌక్తిక ప్రచురణలు, హైదరాబాదు, 1990.
  1. విశ్వంభర ఆంగ్ల అనువాదం గూగుల్ పుస్తకాల సైట్ లో.
  2. ఎ.వి.కె.ఎఫ్. పుస్తకప్రపంచం సైటులో పరిచయం
  3. "ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2010-06-12. Retrieved 2009-05-18.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=విశ్వంభర&oldid=4232612" నుండి వెలికితీశారు