విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి

విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి ప్రముఖ వేద విద్వాంసులు. ఆయన రాజమండ్రి కీర్తిని ఇనుమడింపజేస్తూ, నగర చరిత్రలో అంతర్భాగంగా నిలిచిన ధన్యజీవి.

జీవిత విశేషాలుసవరించు

వేదం వింటే విధాత సమక్షంలో వినాలి, లేదంటే బ్రహ్మశ్రీ జగన్నాధ ఘనపాటి నోట వినాలి

", విద్యాతీర్ధస్వామి
శృంగేరి శారదా పీఠాధిపతులు

ఆయన కంఠస్వరం మధురమైనది. స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఆయన సొత్తు. వేదవాఙ్మయ సౌరభాన్ని లయబద్దంగా విశ్వానికి చాటిచెప్పిన సనాతన ధర్మజ్యోతి ఈయన. ఈయన బ్రహ్మశ్రీ సుబ్బావధానులు, శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు విశాఖపట్నం జిల్లా, చోడవరం తాలూకా, చిన్ననందిపల్లి అగ్రహారంలో సౌమ్య పుష్య బహుళ విదియనాడు (జనవరి 27, 1910) జన్మించారు. రాజోలు సమీపంలోని నరేంద్రపురంలో బ్రహ్మశ్రీ రాణి సుబ్బావధానులు దగ్గర కూడా కొంతకాలం శిష్యరికం చేసారు. ఆయన వేదం చెబుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదని పలువురి ప్రశంసలు అందుకున్నారు. పిన్నవయస్సులోనే ఆదిభట్ల నారాయణదాసు దగ్గర లయబద్దంగా వేదస్వస్తిచెప్పి, ప్రశంసలు అందుకున్నారు. ఎక్కడైనా వేదసభలు జరుగుతుంటే అందరితో కలసి జగన్నాధ ఘనపాఠి వేదస్వస్తి చెప్పేవారు. అక్కడున్న వేద పండితులంతా కనీసం ఒక పనసైనా చెప్పాలని పట్టుబట్టేవారు.

పురస్కారాలుసవరించు

భారత తొలి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 1961 జూలై 2న విద్యా వాచస్పతి పురస్కారం అందుకున్న ఘనపాఠీ గారు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డా జాకీర్ హుస్సేన్, వి. వి. గిరి, డా. శంకర్ దయాళ్ శర్మ, నాటి ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, పి. వి. నరసింహారావు అలాగే డా కె.ఎల్.రావు వంటి ప్రముఖుల చేత సత్కారాలు పొందారు. శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధులవారు ఘనాలంకార బిరుదుతో సత్కరించగా, శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా ఘనపాటి చక్రవర్తి బిరుదుతో సన్మానం అందుకున్నారు. విజయనగరం వేద పరిషత్ వేద సమ్రాట్ బిరుదుతో సత్కారం చేయగా, సువర్ణ పతకంతో శృంగేరి శారదా పీఠాధిపతులు, సువర్ణ హారంతో కంచి కామకోటి పీఠాధిపతి సన్మానించారు. సువర్ణ గండ పెండేరంతో విశాఖ వేద శాస్త్ర పరిషత్ సత్కరించింది.

సువర్ణ ఘంటా కంకణ సన్మానంసవరించు

రాజమహేంద్రవర పుర వాసులు 1964లో జగన్నాధ ఘనపాఠీ వారిని సువర్ణ ఘంటా కంకణ సన్మానం చేసారు. 1970లో పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి ఆధ్వర్యాన ఘనపాఠిగారి షష్టిపూర్తి మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. 1975లో రాష్ట్ర ప్రభుత్వంనుంచి పండిత పురస్కారం అందుకున్నారు. శ్రీ రామభక్త గానసభ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ విశ్వనాధ జగన్నాధ ఘనపాఠీకి కనకాభిషేకం చేయగా, 1991 జనవరి2న రాజమండ్రి పురపాలక సంఘం పౌర సన్మానం చేసి, గౌరవించింది. అదేరోజు ఘనపాఠీ వారి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం పురవాసులు ఘనంగా నిర్వహించారు.

ప్రపంచ తొలి తెలుగు మహాసభలలోసవరించు

హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తొలి తెలుగు మహాసభలు జగన్నాధ ఘనపాఠీ వారి వేదస్వస్తి తోనే శుభారంభ మయ్యాయి. ఇందిరాగాంధి ప్రధానిగా వుండగా, పెద జీయర్ స్వామి డిల్లీలో నిర్వహించిన అఖిల వేదశాఖా సమ్మేళనంలో ఘనపాఠీ గారు పాల్గొని, లయబద్దమైన వేద స్వస్తితో అందరి ప్రశంసలు పొందారు. రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ తో పాటు, విజయవాడ, టి టి డి వేద శాస్త్ర పరిషత్ లు నిర్వహించే పరీక్షలకు పరీక్షాధికారిగా వ్యవహరించారు . కాశీలో శ్రీ రాజేశ్వర శాస్త్రి ద్రవిడ అధ్యక్షతన జరిగిన వేద సభలలో పాల్గొని, వేద వాజ్మయంలో ఓలలాడించారు. ఇక 1958 ఫిబ్రవరిలో శ్రీ ఉమా మార్కందేయేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనస్వస్తి ప్రారంభించి, 40 రోజుల పాటు నిర్వహించడమే కాక, పండితులందరికీ సువర్ణ కుండలాలతో సత్కారం చేయించిన ఘనత ఘనపాటి వారిదే. బ్రహ్మశ్రిలు గుళ్ళపల్లి వెంకట నారాయణ ఘనపాఠీ, చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాఠీ, శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనపాఠీ, ఈమని రామకృష్ణ ఘనపాఠీ వంటి ఉద్దండులతో ఈ ఘనస్వస్తిలో జగన్నాధ ఘనపాఠీ పాలుపంచుకున్నారు.శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధుల వారితో కలసి కాశ్మీర్ యాత్ర సాగించారు.

వేదసభసవరించు

యావద్భారతదేశంలో పర్యటించి, వేద ప్రచారం గావించిన ఘనపాఠీ వారికి ఎందఱో శిష్యులున్నారు. బ్రహ్మశ్రిలు గోలి కొండావధానులు, అయ్యల సోమయాజుల సుబ్బావధానులు, యడవల్లి రమణావధానులు వంటి వారంతా శిష్యగణంలోవారే. టిటిడి వేద పారాయణ స్కీం పర్యవేక్షకునిగా కొంతకాలం సేవలందించిన ఘనపాఠీ గారు 1994 ఆగస్టు27 శ్రావణ బహుళ షష్టి శనివారం తెల్లవారుఝామున మహాభి నిష్క్రమణం (మరణం) చేసారు. ఆయన పేరిట వేద శాస్త్ర పరిషత్ ట్రస్ట్ పెట్టి, ప్రతియేటా కృష్టాష్టమికి వేదసభ నిర్వహించి, పండిత సత్కారం చేస్తున్నారు.

2010లో శత జయంతిసవరించు

2010, జనవరి 2వ తేదిన ఘనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాధ జగనాధ ఘనపాఠి శత జయంతి సభ రాజమహేంద్రవరం టిటిడి కల్యాణ మంటపంలో నిర్వహించారు. శతజయంతి కమిటీ ఆధ్వర్యాన ప్రత్రేక సంచిక ప్రచురించారు. కాగా శ్రీ ఘనపాఠి గారికి ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. రెండవ కుమారుడు శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి కూడా ఇప్పుడు రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికయ్యారు. [1]

మూలాలుసవరించు

  1. 2010 జనవరి2న శత జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక