వీథి నాటకము
వీథి నాటకం తెలుగువారికి సంబంధించిన ఒక ప్రాచీన జానపద కళారూపం. ప్రాచీన కాలంలో పంచాయితీలు, ఊరేగింపులు, బడులు, వినోద కార్యక్రమాలన్నీ వీథుల్లోనే జరిగేవి. మహాభారతం, రామాయణం, మొదలైన పురాణ గాథలు చదవటం, తేటతెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్పేవారు. గ్రామాలలోని పెద్దలు అనగా గ్రామ రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు నిర్వహణబాధ్యత తీసుకొనేవారు.వీథుల్లోనే వీథి బడులు పెట్టి చదువు చెప్పే వారు. అందువలన వీథికి అంతటి ప్రాముఖ్యముండేది. వీథుల్లో నాటకాలు ఆడేవారు గనుక వీథి నాటకాలనీ ప్రదర్శించేవారిని వీథి భాగవతులని పిలిచేవారు.[1] కూచిపూడి భాగవతులే కాక, యానాదులు, గొల్లలు, చెంచులు, మాలలు కూడా వీధి నాటకాలను ఆడేవారు.వీటినే రాయలసీమ ప్రాంతంలో బయలు నాటకమంటారు. [2] యక్షగానాలు తొలి వీథినాటకాలుగా పేర్కొనవచ్చు.
ప్రముఖులు
మార్చుకూచిపూడి భాగవతుల వీథి నాటక ప్రదర్శనాలతో ఆంధ్ర దేశం అంతటా విజయ యాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం గానూ వీథి నాటకాలు ప్రదర్శించి నడిపిన వారిలో ప్రముఖులు తమ్మారపు వెంకటస్వామి.[2] ఆయన స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని తమ్మవరం. ఆయన దేవదాసి కులానికి చెందిన వ్వక్తి. బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఆగ్రామం లోని కుందుర్తి వారి వద్ద సంస్కృతం నేర్చుకుని తరువాత పగటి వేషాల ను అద్భుతంగా ప్రదర్శించాడు. వెంకటస్వామి జట్టులో చేరిన వారందరూ కళావంతుల కులానికి చెందిన వ్వక్తులే. ఆయన జట్టులో పురుషులు పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ వుండేవారు. అందరదీ అమ్మనబ్రోలు గ్రామమే. అందులో పెద్ద హనుమయ్య నాయిక పాత్రలను చెల్లయ్య, చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాత్రలు ధరించేవారు. అలివేలమ్మ నాయిక పాత్రలు నిర్వహిస్తూ వుండేది. మంగ తాయమ్మ మాత్రం పురుష పాత్రలు ధరించేది.
ఈ జట్టు ఉత్తర గోగ్రహణ హరిశ్చంద్ర శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నలచరిత్ర, భామా కలాపం, గొల్ల కలాపం మొదలైన నాటకాలను ప్రదర్శించేవారు. ఒక వూరిలో ప్రదర్శనాలు ప్రారంభిస్తే ఇక రోజుల తరబడి ఆ గ్రామంలోనే వివిధ నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. ప్రతి ప్రదర్శనానికి నాలుగు రూపాయలిచ్చేటట్లూ ఇంటికి ఒకరు చొప్పున జట్టులోని వాళ్ళకు భోజనాలు పెట్టటం ప్రదర్శనానికి అవసరమైన షరతులు.
మూలాలు
మార్చు- ↑ మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). " వీథి నలంకరించిన వీథి నాటకం". తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్.
- ↑ 2.0 2.1 మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). " ప్రజలు మెచ్చిన బయలు నాటకాలు". తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్.