యక్షగానం

(యక్షగానము నుండి దారిమార్పు చెందింది)

యక్షగానం (కన్నడ:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత[1]. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ.[2] కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ, కేరళ లోని కాసరగోడు జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు.[3] యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు, తలపై సవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మిక[4]. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది. యక్షగానంలో నేపథ్యంలో హిమ్మెళ(హిందె+మేళ) నేపథ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెళ(ముందె+మేళ) నృత్య, సంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెళలో ఒక భాగవత గాయకుడు(ఇతనే దర్శకుడు-ఇతనినే మొదలనే వేష(మొదటి వేషగాడు) అంటారు), మద్దెల వారు, హార్మోనియం (ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా చండె (పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు. సంగీతం మట్టు, యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధారపడి ఉంటుంది. యక్షగాన తాళాలే తరువాతి రోజుల్లో కర్ణాటక సంగీత తాళాలుగా మార్పుచెందాయన్నది ఒక మాన్యత.

పగడము, తలకు ధరించే ఒక ఆభరణం. శిరోధార్యాలలో మగవారు పగడము, కిరీటం ధరిస్తారు. స్త్రీలు చిన్న పగడాలను ధరిస్తారు.
ఉత్తరదిక్కు/తిట్టు పాత్రధారి అలంకరణ
దక్షిణదిక్కు/తెట్టు వేషధారణ

ప్రధాన అంశాలు

మార్చు
  • ఉపాఖ్యానము:

యక్షగానములో ఏదైనా ఒక కథను ఎంచుకొని దాన్ని జనాలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథను ఉపాఖ్యానమని పిలుస్తారు. కన్నడలో ప్రసంగ అందురు. ఉదాహరణకు మహాభారతములో భీముడు, దుర్యోధనుని మధ్య గదాయుద్ధకథను ఎంచుకొన్నచో దానిని "గధాయుద్ధ ఉపాఖ్యానము " (కన్నడలోగదాయుద్ధప్రసంగ) అంటారు. పౌరాణిక ఉపాఖ్యాలనే ఎంచుకున్నా, యక్షగానమందు ఉపాఖ్యానం/ఉపకథ/కథనము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికము లేక సామాజికము కావొచ్చు.

  • పాత్రధారులు:

ఉపాఖ్యానంలో వచ్చు కథకు అనుగుణంగా అభినయించు, నర్తించు నటులను/నర్తకులను పాత్రధారులు అంటారు. ఉపాఖ్యానంలోని కథానుసారం నాయకుడు, దుష్టనాయకుడు, హాస్యగాళ్ళు, స్త్రీపాత్రలు ఇత్యాదులను ఆయా పాత్రల కనుగుణంగా ఎన్నుకొనెదరు. నృత్యం, అభినయం/నటన, మనస్సుకు హత్తుకొనే చతుర సంభాషణలతో కథాంశమును ప్రేక్షకుల/వీక్షకుల మనస్సుల్లో హత్తుకు పొయ్యెలా చేసే గురురత బాధ్యత పాత్రధారులదే.

  • వస్త్రధారణ/వస్త్ర అలంకరణ :

యక్షగానంలోని ప్రముఖ విభాగం బయలు ఆట(వీధిభాగోతం) లో పాత్రధారులు ధరించు వస్త్రధారణం చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు రాజు(కథానాయకుడు), దుష్టకథానాయకులు ధరించు కిరీటం, ఇతర పాత్రధారులు ధరించు కిరీటంకన్న విభిన్నంగా, ఆకర్షవంతంగా ఉంటాయి. అలాగే స్త్రీ పాత్రధారులు ధరించు కిరీటము చాలా చిన్నదిగా ఉంటుంది. అంతేకాకుండగా దక్షిణ కన్నడప్రాంతంలోని యక్షగాన పాత్రధారుల వస్త్రధారణ, ఉత్తర కన్నడప్రాంత పాత్రధారుల వస్త్రాలంకరణకన్న భిన్నంగా ఉండును.

  • భాగవతారు

యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒకవిధంగా ఈ గాన ప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు. కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు. ఇలాపాడు గాయకుని భాగవతారు అంటారు. భాగవతారు ఆలపించు పాటకు అనుగుణంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో మూకాభినయం చేయుదురు. పాటకు అనుగుణంగా చేయు నృత్యంలో పాటలోని అర్థమునకు తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.

  • ప్రాసంగికులు/మాటకారులు :

ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికే '(మాతు=మాట) అంటారు. ప్రాసంగికులన్న వాచాలకులు అని కూడా అర్థం. భాగవతారు ఉపాఖ్యానమును పాటరూపంలో ఆలపించటం ముగించిన తరువాత, ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావమును గద్యరూపం(మాటలలో/వచనం)లో చర్చించెదరు. ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన ఉద్దేశం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచేయుట. ప్రాసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.

  • నేపథ్యము:

యక్షగానంలో నేపథ్యమును హిమ్మెళ (హిందె+మేళ,హిందే అనగా వెనుక,మేళ అనగా మేళం(సంగీతవాద్యం)) అంటారు. అనగా యక్షగాన ప్రదర్శన జరుగు సమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహకారం అందించే వాద్యబృందం. ఒకవిధంగా నేపథ్య సంగీతం అనవచ్చునేమో? ఈ వాద్యబృందంలో డప్పు, మద్దెల, మృదంగము, జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు. వీటిని నృత్యసమయంలో, భావవతారుపాడే సమయంలో, ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు. అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదం కావాలన్నచో పాత్రధారుల అభినయం, భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా భాగవతారు గాత్రానికి ప్రాణం ఈ నేపథ్యవాద్యం.

యక్షగాన విధానాలు

మార్చు

యక్షగానాన్ని ప్రదర్శించుటలో అనేకరీతులు, పద్ధతులు ఉన్నప్పటికి, బయలాట(వీధిభాగోతం)అత్యంత జనప్రియ మైనది. బయలాట అనగా వస్త్రాలంకరణ, వేషాలంకరణ కావించుకొని వేదిక భూమిపై ఆడే ప్రదర్శన. పండుగ, సంబారాల సమయాలలో ఊరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రి అంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరు రూఢి అయ్యింది. ప్రజలు మాములుగా 'ఆట ' అని వ్యవరిస్తారు. కాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయమును కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది. బయలాటలో ప్రదర్శనలలో- రంగస్థలం, భాగవతారు(గాయకుడు), అభినయం, చతురసంభాషణలు, నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానానికి చెందిన అన్ని ఘట్టాలు\భూమికలు కనవచ్చును. యక్షగానంలో పశ్చిమ రీతి, తూర్పు రీతి అను రెండు ప్రదర్శన రీతులు ఉన్నాయి. పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో ఉన్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట, మల్నాడు(మలెనాడు,మలె:వాన), కరావళి ప్రాంతంలో అధిక ఆదరణ ఉన్నది పశ్చిమ రీతి(పడవలపాయ). పశ్చిమయాస ఆటలో, 3 రీతులు ఉన్నాయి ; దక్షిణ తిట్టు,తూర్పు తిట్టు,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారి ఉండవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కు లేదా యాస అని భావించవలసి ఉంది.యాస: భాషను ఒకప్రాంతంలో పలుకు విధం). ఉత్తరకన్నడ, శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే, ఉడిపిలో బడగు యాసలో, దక్షిణ కన్నడ, కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్శించెదరు. పాత్రధారులు ధరించు వస్త్రధారణ, అలంకరణ, నృత్యశైలిలో ఉన్న వ్యత్యాసాలకారణంగా ఇలా విభజించారు. మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.

తాళ మద్దలె

మార్చు

తాళమద్దలే అనునది యక్షగానంలో మరొక ప్రదర్శనరీతి, విధానం. ఇది బయలాటకన్న విభిన్నమైనది. ఈపద్ధతిలో వస్త్రాలంకరణ, నృత్యం, భావవ్యక్తీకరణ కనిపించవు. నేపథ్యం, భాగవతారు, ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే ఉంటారు. ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా, అర్థధారులు (కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును, ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు. బయలాటలో నృత్య, అభినయాలు ముఖ్యాంశాలు. ఇందులో సంభాషణలకు ప్రాధాన్యతను ఇస్తారు. బయలాటలో వచనమునకు పరిమితి ఉంది. తాళమద్దలెలో లేదు. తాళమద్దలెలో వచనమే ప్రాధాన్యం.

ప్రముఖ యక్షగాన కళాకారులు

మార్చు
  • భాగవతార్లు: నెబ్బూరు నారాయణ, డి. ఉప్పూరు నారణప్ప, కడతోక మంజునాథ భాగవతార్, డి. గుండ్మి కాళింగ నావుడ, సుబ్రహ్మణ్య ధారేశ్వర, నారాయణ శబరాయ, బలిప నారాయణ భాగవతారు, దామోదర మండెచ్చ, పోళ్య లక్ష్మీనారాయణ శెట్టి, కొళగి కేశవ హెగ్డే, లీలావతి బైపాడిత్తాయ (ఏకైక వృత్తిపర మహిళా భాగవతారు), పద్యాణ గణపతి భట్, దినేశ అమ్మణ్ణాయ, పుత్తిగే రఘురామ హొళ్ళ.
  • హిమ్మేళ కళాకారులు: డి. నెడ్లే నరసింహ భట్, కె.హరినారాయణ బైపాడిత్తాయ, కుద్రేకూడ్లు రామ్ భట్, కేశవ బైపాడిత్తాయ, మోహన బైపాడిత్తాయ, పద్యాణ శంకరనారాయణ భట్, అడూరు గణేశ్ రావు.
  • పాత్రధారులు: ది. కెరెమనే శివరామ హెగ్డే, కెరెమనే మహాబల హెగ్డే, కెరెమనే శంభు హెగ్డే, చిట్టాణి రామచంద్ర హెగ్డే, కొండదకుళి రామచంద్ర హెగ్డే, ఐరోడి రామ గాణిగ, మంటప ప్రభాకర ఉపాధ్యాయ, గోడే నారాయణ హెగ్డే, బళ్కూరు కృష్ణయాజీ, జలవళ్ళి, కణ్ణిమనే గణపతి హెగ్డే, భాస్కర జోషి, కుంబ్లే సుందరరావు, వాసుదేవ సామగ, బణ్ణద మహాలింగ, చంద్రగిరి అంబు, సుబ్రహ్మణ్య హెగ్డే చిట్టాణి, సిద్ధకట్టె చెన్నప్ప శెట్టి, కె. గోవింద భట్, కోళ్యూరు రామచంద్రరావు.
  • తాళ మద్దెల: శేణి గోపాలకృష్ణ భట్, మల్పే లక్ష్మీనారాయణ సామగ, డా.ప్రభాకర జోషి, కీరిక్కాడు మాస్టర్ విష్ణు భట్, దేరాజే సీతారామయ్య, డా. రమానంద బనారి, యు. బి. గోవింద భట్, జబ్బర్ సమో సంపాజె, ఎం.ఆర్.అమాచి
  • ప్రముఖ యక్షగాన మేళాలు: శ్రీ దుర్గా పరమేశ్వరి దశావతార యక్షగానమండలి, శ్రీ ఇడగుంజి మహాగణపతి యక్షగాన మండలి, కరమనె, సాలిగ్రామమేళ, పెర్డురుమేళ, కూండదకూళి మేళ, ధర్మ స్థలమేళ.

యక్షగాన ప్రముఖులు

మార్చు
 
2017 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యక్షగానం కళాకారుల ప్రదర్శన

యక్షగానం 15వ శతాబ్ది నాటికి ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట యక్షుల ప్రస్తావన వారి ఆటపాటల ప్రసక్తి పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరివూతలోని పర్వత ప్రకరణంలో కనిపిస్తుంది. ఆ తరువాత శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కీర్తింతుద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ యక్షగాన ప్రసక్తి కనిపిస్తుంది.[5][6]

చిత్రమాలిక

మార్చు

ఇతర లింకులు

మార్చు

మూలం: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.

సూచికలు

మార్చు
  1. "yaksha". Encyclopædia Britannica. Retrieved 2007-09-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-09. Retrieved 2013-05-18.
  3. "YAKSHAGANA". Archived from the original on 2013-05-30. Retrieved 2013-05-18.
  4. Prof. Sridhara Uppura. 1998. Yakshagana and Nataka Diganta publications
  5. మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). "  అక్షయంగా వెలుగొందిన యక్షగానం".   తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 
  6. నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు - యక్షగానం". Retrieved 21 April 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=యక్షగానం&oldid=4350590" నుండి వెలికితీశారు