వేంకట రామకృష్ణ కవులు

వేంకట రామకృష్ణ కవులు అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణశాస్త్రి[1][2]. వీరు 1909 సంవత్సరములో పిఠాపుర సంస్థానంలో ప్రవేశించారు. నాటికి ఓలేటి వేంకటరామశాస్త్రి వయస్సు 26 సంవత్సరాలు. వేదుల రామకృష్ణశాస్త్రి 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు ఈ కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి అవధానము చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన పిఠాపురం సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు. వీరు ఆ సంస్థానంలో శతావధానము, శతవిధానము (గంటకు 100 పద్యాలు చెప్పుట), శత ప్రాసము (ఒకేప్రాసతో 100 పాదాలు గంటలో చెప్పుట), అష్టావధానము మొదలైనవాటిని నిర్వహించి పండితుల, ప్రభువుల మెప్పు పొందారు. వీరు పిఠాపుర సంస్థానంలో ప్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన తిరుపతి వేంకటకవులతో వాగ్యుద్ధం తటస్థించింది. రామకృష్ణకవులు వయసున చిన్నవారైనా ఆ కవుల కృతులలోని దోషాలను బయట బెట్టి 'శతఘ్ని' అనే ఖండన గ్రంథాన్ని ప్రకటించారు. ఈ వివాదం మొదట చక్కని కృతి విమర్శలతో ప్రారంభమై క్రమక్రమంగా శ్రుతి మించి వ్యక్తిదూషణలకు దారితీసింది. ఏదిఏమైనా ఆనాటి ఈ వివాదం సాహిత్యప్రియులకు మంచి కాలక్షేపాన్ని కలిగించింది. ఈ వాక్సమరంలో దేశము లోని పండిత కవులెందఱో కలుగ చేసికొని పైకి వచ్చారు. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టం. ఈ వివాదారంభంలో కవిత అనే మాసపత్రికను వీరు నెలకొల్పారు. ఈ పత్రిక తొమ్మిది ఏండ్లు అవిచ్ఛిన్నంగా సాగింది.

అవధానాలు

మార్చు

వీరు అవధానాలలో అత్యద్భుత శతావధానం, శతవిధానం, శతప్రాసం, ద్విగుణీకృత అష్టావధానం అనే వినూత్న ప్రయోగాలు ప్రవేశపెట్టి తమ ప్రత్యేకతను చాటుకొన్నారు. వీరు యానాం మహాలక్ష్మి సంస్థానంలో ఒక శతావధానం, పిఠాపురం సంస్థానంలో రెండు అష్టావధానాలు జంటగా చేయగా, వేదుల రామకృష్ణశాస్త్రి కాకరపర్రులో ఒక అష్టావధానం, పల్లిపాలెంలో రెండు అష్టావధానాలు చేశాడు.[3]

వీరి అవధాన పద్యాలు మచ్చుకు:

  • సమస్య: కుండను గొండసొచ్చి నిదిగో! యని పల్కెను విస్మయంబునన్

పూరణ:

కొండలురేగి లోకముల గుండలు సేయుచునుండ జూచి యా
ఖండలు డుద్ధతుండయి యఖండ పరాక్రమమొప్ప ఱెక్కలన్
జెండ గడంగుటన్ దెలిసి శీతనగాత్మజు డబ్ధి వజ్రిరా
కుండను గొండ సొచ్చెనిదిగో! యని పలెక్ను విస్మయంబునన్

  • సమస్య: రాతికిఁ కోతిపుట్టె రఘురామునికైవడి సీతకైవడిన్

పూరణ:

ఖ్యాతి యెసంగ నంజనకుఁ గల్గిన శ్రీ హనుమానుఁజూచి సం
ప్రీతినిజెంది దేవతలు పేరిమిఁజెప్పుకొనంగ సాగిరా
భూతలమందు రావణుని బొల్పడగింపగ నిప్డుడంధకా
రాతికిఁ కోతిపుట్టె రఘురామునికైవడి సీతకైవడిన్

  • వర్ణన: ఉషాకన్య సౌందర్యము

చెన్నుమీఱిన గన్నులుచేరదీసి
పసలు మీఱిన వెండ్రుకల్‌బారెడేసి
బాగు మీఱిన గుబ్బలు పట్టెడేసి
కలిగి చెన్నారె యౌవనకాలమందు

రచనలు

మార్చు

వీరిరువురూ కలిసి 30కి పైగా రచనలను ప్రచురించారు.

వాటిలో కొన్ని:

  1. శతఘ్ని
  2. రామకృష్ణ మహాభారతము[4]
  3. అట్టహాసము
  4. శృంగభంగము ?
  5. కోకిలకాకము ?
  6. విశ్వగుణాదర్శము (అనువాదం)
  7. ఔచిత్య విచారచర్చ (అనువాదం)
  8. కవి కంఠాభరణము (అనువాదం)
  9. ఇందిరాదేవి (నవల)
  10. సుభద్ర (నవల)
  11. శకుంతల (నవల)
  12. దమయంతి (నవల)
  13. వ్యాసాభ్యుదయము
  14. దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము)
  15. ఉత్తరరామచరిత్ర
  16. మదాలస (నాటకము)
  17. భోజచరిత్ర
  18. కాత్యాయన చరిత్ర
  19. సువృత్త తిలకము (అనువాదం)
  20. పాణిగృహీతి
  21. కొండవీటి దండయాత్ర
  22. అత్యద్భుత శతావధానము
  23. పరాస్తపాశుపతము
  24. ఆంధ్ర కథాసరిత్సాగరము (6 లంబకములు)[5]

మూలాలు

మార్చు
  1. [1]ఆంధ్ర రచయితలు - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పేజీలు 295-307
  2. పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ - సి.కమలా అనార్కలి - పేజీలు: 341-352
  3. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 138–141.
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో రామకృష్ణ మహాభారతము పుస్తకప్రతి
  5. భారత డిజిటల్ లైబ్రరీలో ఆంధ్ర కథాసరిత్సాగరము పుస్తక ప్రతి.