గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (Gadicharla Harisarvottama Rao). స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం editor(ఎడిటర్)కు సంపాదకుడు అనే పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.

1883 సెప్టెంబర్ 14కర్నూలు లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు. వారి పూర్వీకులు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాల లో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906 లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీత బుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు. (మొత్తం వ్యాసం చూడండి)