గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

స్వాతంత్ర్య సమరయోధుడు

ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1883 సెప్టెంబరు 14 - 1960 ఫిబ్రవరి 29) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటరుకు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
జననంసెప్టెంబర్ 14, 1883
కర్నూలు
మరణంఫిబ్రవరి 29, 1960
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమర యోధుడు,
పాత్రికేయుడు,
గ్రంథాలయోద్యమ నాయకుడు
తండ్రివెంకటరావు
తల్లిభాగీరధీ బాయి
సంతకం

జీవిత విశేషాలు

మార్చు

1883 సెప్టెంబరు 14కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు [1]. వారి పూర్వీకులు కడప జిల్లా, సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రకాశం పంతులు ప్రారంభించిన స్వరాజ్య అనే తెలుగు పత్రిక కు సహసంపదకుడిగా చేరాడు , బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908లో తిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు క్రూరమైన విదేశీ పులి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.[2] వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.

1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.

1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.

రచనా వ్యాసంగం

మార్చు
 
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు చిత్రపటం

పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:

  • ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు ఆయన తొలి సంపాదకుడు. 1916 నుండి 1918 వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.
  • ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు.
  • మహిళల సమస్యలు పరిష్కరం కోసం " సౌందర్యవల్లి " అనే పత్రిక నడిపాడు.
  • మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నాడు.
  • జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాసాడు.
  • స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకం రాసాడు.
  • ఆయన రాసిన శ్రీరామ చరిత్ర అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.
  • ఆయన రచించిన పౌరవిద్య అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది.
  • ఆయన వ్రాసిన ఆబ్రహాము లింకను చరిత్ర (1907) అనే పుస్తకాన్ని కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు.[3]
  • వయోజన విద్య అనే తెలుగు పుస్తకాన్ని రచించాడు.[4] దీని మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953లలో ముద్రించారు.

విశిష్టతలు

మార్చు

తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు కొన్నిరాయలసీమ కు ఆ పేరు పెట్టింది అతను [1] 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని దత్తమండలం అని పిలిచేవారు.

  • రాయలసీమకు పేరును మొదట సూచించింది చిలుకూరి నారాయణరావు.[ఆధారం చూపాలి]. నాడు జరిగిన సభలో గాడిచర్ల, చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే రాయలసీమ పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.ఆంధ్రదేశాని కాకతీయ, ముసునూరి సార్వబౌముల పరిపాలన తరువాత విజయనగర వంశాలు పాలించాయి. రాయల కాలంలో సీడెడ్ ప్రాంతముని పెమ్మసాని, రావెళ్ళ, సాయపనేని వంశాలు పాలించాయి. ఏనాటి నుండో తెలుగు ప్రాంతం అంతా ఆంధ్రదేశముగా పిలువబడింది. రాయలకు ఆంధ్రభోజా బిరుదులు ఉండటం సీడెడ్ ప్రాంతములో రాయల ప్రభావం ఎక్కువగా ఉండటం ఆంధ్రదేశములోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలకు రాయలసీమ పేరు ప్రస్తావించడం జరిగింది. రాయలసీమగా ప్రకటించమని కొందరు, అలాగే విజయనగరానికి గుండెకాయలాంటి గండికొట నుండి ఏలి, రక్షణ వలయములా పోరాడిన పెమ్మసాని యోధుల పేరు పెట్టాలని కూడా కొందరు ప్రస్తావించారు.
  • సంపాదకుడు, భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.
  • ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవాడు.

పెద్దల పలుకులు

మార్చు
వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?
అందరికెవనితొ పొత్తు - అఖిలాంధ్రంబెవని సొత్తు?
ఏస్థాన కవిని నేనో, ఆ స్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది
హరిసర్వోత్తముడాతడు, ఆంధ్రులపాలిటి దేవుడు
  • తనను విమర్శించిన హరిసర్వోత్తమ రావును గురించి మహాత్మా గాంధీ అన్న మాట: ది బ్రేవ్ సర్వోత్తమ రావ్

మూలాలు, వనరులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. 1.0 1.1 జానమద్ది, హనుమచ్ఛాస్త్రి. "గాడిచర్ల హరిసర్వోత్తమరావు". సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ISBN 81-7098-108-5. Retrieved 2013-03-11.
  2. "Modern Period". AP Online. Archived from the original on 26 సెప్టెంబరు 2011. Retrieved 1 March 2015.
  3. హరిసర్వోత్తమరావు, గాడిచర్ల (1907). అబ్రహాం లింకన్. చెన్నై: విజ్ఞాన చంద్రికా గ్రంథమాల. Retrieved 2 January 2015.
  4. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1941). వయోజన విద్య (మొదటి పుస్తకం).
  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు