శనిగరం సంతోష్ రెడ్డి

శనిగరం సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా లోని సీనియర్ రాజకీయ నాయకుడు. ఈయన 1942 ఆగస్టు 12న భీంగల్ మండలం ముచ్‌కూర్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. సంతోష్ రెడ్డి మృధు స్వభావి, సన్నిహితులచే సంతన్నగా పిలవబడుతూ ఉండే నాయకుడు. సంతోష్ రెడ్డిని రాజకీయ నాయకునిగా కాకుండా రాజనీతిజ్ఞునిగా పిలవవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 1978 నుండి 2003 వరకు నాలుగు పర్యాయాలు శాసన సభ్యునిగా గెలిచి అప్పటి ప్రభుత్వాలలో కీలకమై మంత్రి పదవులు నిర్వహించాడు. స్వప్రయోజనాల కొరకు కాకుండా ప్రజల కొరకు పనిచేసిన నాయకుడు. తాను రాజకీయ నాయకునిగా పేరు మాత్రమే సంపాదించుకొని తన ఆస్తులను ఇంటిని ప్రభుత్వ ఆసుపత్రికి, 15ఎకరాల భూమిని పేదలకు పంచాడు.[1]

శనిగరం సంతోష్ రెడ్డి
జననం (1942-11-12) 1942 నవంబరు 12 (వయసు 81)
ఇతర పేర్లుఎస్ఎస్ఆర్
వృత్తిరాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయాలు

కుటుంబ నేపథ్యం, చదువు మార్చు

శనిగరం సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలోని రైతుకుటుంబంలో కీ.శే శ్రీమతి కమల, శ్రీ వెంకట్ రెడ్డి మూడవ సంతానంగా (ప్రథమ పుత్రునిగా) జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిధ్యాలయ పరిధిలోని నిజామాబాద్ గిరిరాజ ప్రభుత్వ కళాశాల నుండి బిఎలో పట్టాభద్రులయ్యాడు. సంతోష్ రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పిడి చట్టం కింద సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ సెంట్రల్ జైలులో రెండు నెలలపాటు శిక్షను అనుభవించాడు, దాని ఫలితంగా తాను చదువుతున్న న్యాయశాస్త్ర పట్టాను మద్యలో వదిలి వేయ వలసి వచ్చింది.

రాజకీయ ప్రవేశం మార్చు

ఆయన తన 10ఏళ్ల చిరుప్రాయంలోనే 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుండి నిజామాబాద్ శాసనసభకు పోటీ చేసిన తన బావగారైన దివంగత బిఆర్ గంగారెడ్డికి, ఆర్మూర్ నియోజవర్గం నుండి పోటీ చేసిన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి మంత్రి శ్రీ అర్గుల (గడ్డం) రాజారాం గార్లకు మద్దతుగా సోషలిస్టు పార్టీ జండా పట్టుకొని ప్రచారంలో పాల్గొన్నారు. చిరుప్రాయంలోనే సోషలిస్టు పార్టీ ప్రభావం అతనిపై ఉంది. వీరి స్పూర్థితోనే ఆయన విద్యార్థి దశలోనే రాజకీయలలోనికి వచ్చాడు. ఆయన గిరిరాజ డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘానికి 1964–65 సంవత్సరంలో ప్రధాన కార్యదర్శిగా, 1966–67 సంవత్సరంలో ఆధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. తరువాత 1970 సంవత్సరంలో ముచ్కూర్ గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎంపికయ్యాడు. 1971 సంవత్సరంలో ఆయన నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1975లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మూడు రోజులు నిరాహార దీక్షలో పాల్గొని వారి వేతనాలను 8 రూపాయల నుండి 10 రూపాయలకు పెంచేలా కృషి చేసాడు. నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు.

శాసన సభ్యునిగా మార్చు

1978లో సంతోష్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీ నారా చంద్రబాబులతో పాటుగా మొదటిసారిగా నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నియోకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి (MLA) శాసన సభ్యునిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. 1983లో అప్పటి చలనచిత్ర తార శ్రీ ఎన్ టి రామారావు గారి తెలుగు దేశం పార్టీ ఉదృతాన్ని కూడా తట్టుకొని కాంగ్రెస్ శాసన సభ్యునిగా రెండవమారు కూడా గెలిచారు. 1989లో మూడవ పర్యాయం (కాంగ్రెస్), నాల్గవ పర్యాయము 2004లో (TRS) శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు.[2]

2002 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎన్నికైన మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.[3]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా మార్చు

శ్రీ శనిగరం సంతోష్ రెడ్డిగారు 1990–1991 సంవత్సరంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలో రహదారులు, భవనముల శాఖ మంత్రిగా, 1991–1992 సంవత్సరంలో ఆర్థిక శాఖ మంత్రిగా, 1992–1993 సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, 2004–2005 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా తన నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో కీలక రంగాలైన విద్య, రవాణ, రహదారులు, విద్యుత్తు, నీటిపారుదల రంగాల అభివృద్ధికి కృషి చేసారు.

విద్యారంగం మార్చు

తన నియోజకవర్గం ఆర్మూరులో విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అనేక ప్రాంతాలలో ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మంజూరు చేయించడమే కాకుండా బాలికా విద్యాభివృద్ధి, మైనార్టీ విద్యాభివృద్ధికి ఆర్మూరులో తెలుగు, ఉర్దు మీడియంలలో బాలికల జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు.

క్రీడాకారునిగా మార్చు

విద్యార్థిదశ నుండే క్రీడల పట్ల మక్కువ కనబరిచారు. ముఖ్యంగా ఫుట్ బాల్, హాకీ క్రీడలలో ఆయన రాణించారు. నిజామాబాదు ఫుట్ బాల్ జట్టుకు నాయకునిగా ఎన్నో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆయన రాష్ట్ర మహిళా హాకి సమాఖ్య అధక్షునిగా కూడా ఎన్నుకోబడ్డారు. తన నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి ఆర్మూర్, వేల్పూర్ లలో మినీ క్రీడా మైదానాలను మంజూరు చేయించి, నిర్మాణాన్ని పూర్తి చేయించారు.

కళాకారునిగా మార్చు

కళల పట్ల అభిమానం కలిగిన సంతోష్ రెడ్డి గారు 1991 సంవత్సరంలో 'తెగింపు అనే తెలుగు సినిమాలో శాసన సభాపతిగా నటించారు. అదేవిధంగా ఆయన దివంగత ప్రముఖ చిత్ర నిర్మాత డి రామానాయుడు నిర్మించిన ఆంధ్ర వైభవం వీడియో సినిమాలో కవిగా పాత్రను పోషించారు.

మూలాలు మార్చు

  1. Sakshi (10 November 2018). "వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా గెలిచి." Sakshi. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
  2. Eenadu (31 October 2023). "మంత్రి, ఎమ్మెల్యేలుగా పనిచేసి..జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  3. Sakshi (29 October 2023). "సొంత ఊరిలో వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా విజయం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.

బయట లింకులు మార్చు