నిజామాబాదు జిల్లా

తెలంగాణ లోని జిల్లా
(నిజామాబాద్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

నిజామాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

  ?నిజామాబాద్
తెలంగాణ • భారతదేశం
నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటలోని శివాలయం
నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటలోని శివాలయం
నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటలోని శివాలయం
అక్షాంశరేఖాంశాలు: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 7,956 కి.మీ² (3,072 చ.మై)
ముఖ్య పట్టణం నిజామాబాద్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
25,52,073 (2011 నాటికి)
• 321/కి.మీ² (831/చ.మై)
• 1252191
• 1299882
• 53.26(2001)
• 66.27
• 40.57

నిజామాబాద్ నగరం ఈ జిల్లా ముఖ్య పట్టణం. నిజామాబాద్ను పూర్వం ఇందూరు, ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, ఆర్మూరు ఇతర ప్రధాన పట్టణాలు.నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతిపెద్ద నగరం.

పటం
నిజామాబాదు జిల్లా

జిల్లా పేరు వెనుక చరిత్ర సవరించు

నిజామాబాద్ ను 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు సా.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది.[2] 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాద్ గా మార్చడం జరిగింది.

జిల్లా చరిత్ర సవరించు

జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్' (చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

జిల్లాలోని సంస్థానాలు:

రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ, ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం.

కౌలాస్

కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి.

సిర్నాపల్లి సంస్థానం

జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాంనవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్‌వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు.

వెల్మల సంస్థానం

జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి.

దోమకొండ సంస్థానం

ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.

హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో, ఇందూరు జిల్లాగా ఉంది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూర్ తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా, బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు. భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు.[3] జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి - ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు.

1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిని కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు.[4]

భౌగోళిక స్వరూపం సవరించు

జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా, మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5', 19' ఉత్తర అక్షాంశాల మధ్య, 77-40', 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తరించి ఉంది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెం, సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.9 డిగ్రీల సెం గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు సెం వరకు పడిపోవడం, వేసవిలో 47'డిగ్రీలు సెం వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని.

ఇందూరు జిల్లా గణాంకాలు సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా....25,52,073, అందులో పురుషులు 1252191,స్త్రీలు 1299882, జనసాంద్రత.321/కి.మీ² (831/చ.మై),అక్షరాస్యత శాతం మగ ...66.27, ఆడ .... 40.57.

ఇందూరు జిల్లా ఆర్ధిక స్థితి గతులు సవరించు

2006లో భారత ప్రభుత్వం నిజామాబాదు జిల్లాను, దేశంలోని మొత్తం 640 జిల్లాలలోకెల్లా ఆర్థికంగా వెనుకబడిన 250 జిల్లాలలో ఒకటిగా గుర్తించింది.[5] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకం క్రింద ఆర్థిక సహాయాన్ని పొందుతున్న పదమూడు జిల్లాలలో నిజామాబాదు జిల్లా కూడా ఒకటి.[5]

పునర్య్వస్థీకరణ ముందు నిజామాబాదు జిల్లా సవరించు

 
2016 పునర్య్వస్థీకరణ ముందు నిజామాబాదు జిల్లా

2016 పునర్య్వస్థీకరణ ముందు 7,956 చదరపు కిలోమీటర్ల విస్తీరణం కల నిజామాబాద్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కొరకు మూడు రెవిన్యూ డివిజన్లుగానూ, 36 రెవిన్యూ మండలాలుగానూ విభజించారు.[6] జిల్లాలో మొత్తం 922 గ్రామాలున్నాయి. అందులో 64 నిర్జన గ్రామాలు. మొత్తం 718 గ్రామపంచాయితీలున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ నిజామాబాద్ అయితే, బోధన్, కామారెడ్డి, ఆర్మూరు మునిసిపాలిటీలు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి.[7] పునర్య్వస్థీకరణకు ముందు ఉన్న36 మండలాలతో కలిగిన జిల్లా పటం.

పునర్య్వస్థీకరణ తరువాత నిజామాబాదు జిల్లా సవరించు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా నిజమాబాదు జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 36 పాత మండలాల నుండి 17 మండలాలు విడగొట్టి కామారెడ్డి జిల్లాను కొత్తగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

కామారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు సవరించు

నిజామాబాదు జిల్లాలోని మండలాలు. సవరించు

  • పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట నిజామాబాదు జిల్లాలో 19 పాత మండలాలు కాగా,8 కొత్తమండలాలు ఏర్పాటుతో జిల్లా అవతరించింది.[8]
  • ఆ తరువాత చివరి రెండు మండలాలు ది.07.03.2019న కొత్తగా ఏర్పడినవి.[9]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (12) చివరి పేర్కొన్న 28,29 సంఖ్య గల మండలాలు మోస్రా మండలం, చందూర్ మండలం 2019 మార్చి 7 కొత్తగా ఏర్పడినవి.[10]

జిల్లాలో ముఖ్య పట్టణాలు సవరించు

  1. ఆర్మూర్
  2. బోధన్
  3. భీంగల్
  4. జక్రాన్‌పల్లి
  5. నందిపేట్

రవాణా వ్వవస్థ సవరించు

జిల్లా గుండా సికింద్రాబాదు- మన్మాడ్ మార్గం వెళ్ళుచుండగా, జానకంపేట నుంచి బోధన్ వరకు మరో మార్గం ఉంది. జిల్లాలో మొత్తం కిమీ పొడవు కల మార్గంలో 15 రైల్వేస్టేషనులు ఉన్నాయి.[11] కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది. జిల్లా గుండా ఉత్తర-దక్షిణంగా 44వ నెంబరు జాతీయ రహదారి, నిజామాబాదు - భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాదు, ఆర్మూరు జాతీయరహదారి పై ఉన్న ప్రధాన పట్టణాలు.

జనాభా లెక్కలు సవరించు

నిజామాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా తర్వాత రెండవ అత్యల్ప జనాభా గల జిల్లా.[12] 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లా జనాభా 25,52,073. స్త్రీ, పురుషుల నిష్పత్తి 1038:1000. భారతదేశ జనాభాతో పోల్చుకుంటే, జిల్లాలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం అక్షరాస్యత 53.26 శాతం (2001 జనగణన). జిల్లాలో ఏడు పట్టణాలు, 923 గ్రామాలు ఉన్నాయి.

పశుపక్ష్యాదులు సవరించు

అలీసాగర్

అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లో కట్టబడింది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతంతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానంగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.

మల్లారం అడవి

మల్లారం అడవి, నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. చుట్టూ వన్య ప్రదేశములో ఒదిగి ఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము, ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు, ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము.

విద్యాసంస్థలు సవరించు

నిజామాబాదు, అదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు పెంపొందించేందుకు 2006లో నిజామాబాదు జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంగా తెలంగాణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇది వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న బిక్నూరు పోస్టుగ్రాడ్యుయేట్ కేంద్రం 2011-12 విద్యాసంవత్సరం నుండి తెలంగాణా విశ్వవిద్యాలయం దక్షిణ క్యాంపసుగా మారింది.[13]

ఆకర్షణలు సవరించు

 
దోమకొండ దేవాలయం

నిజామాబాదు నగరంలో చూడడానికి చాల ఉన్నాయి. నీలకంఠేశ్వరాయలయం, సారంగపూర్ హనుమాన్ మందిరము, తిలక్ గార్డెను, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయము మొదలయినవి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్,, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్‌పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, ఖిల్లా రామాలయం,భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర దేవాలయం, రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం,సంతాయిపేట్ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి.

పురాతత్వ ప్రదర్శనశాల

నిజామాబాదులోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబరులో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు, అనేక రకములైన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

అశోక్ సాగర్

అందమైన శిలలు, ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉంది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు.

పుణ్య క్షేత్రాలు సవరించు

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద, సారంగాపూర్ మొదలైనవి ఉన్నాయి.

లింబాద్రి గుట్ట

లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశం భీమగల్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. దీనిని నింబాచలం అని కూడా పిలుస్తారు. పచ్చని కొండల మధ్య ఎంతో అహ్లాదంగా ఉంది

బడా పహాడ్

వర్ని, చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును.

సారంగాపూర్

నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగి ఉంది.

శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవాలయం

దక్షిణ కాశిగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి దేవాలయం, నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో భిక్కనూరు మండల కేంద్రంలో ఉంది.

శ్రీ కాలభైరవస్వామి దేవాలయం

ఎంతో ప్రాచుర్యం కలిగిన శ్రీ కాల భైరవస్వామి దేవాలయం, సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి గ్రామంలో ఉంది.

కంఠేశ్వర్

కంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతి ఏటా పెద్దెత్తున జరుపుతారు.

డిచ్ పల్లి రామాలయం

సా.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ.

ఖిల్లా రామాలయం

ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. సా.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల బురుజులతో ఉంది. సా.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ.

కంజర్లో కూడా హనుమంతుని దేవాలయం ఉంది. ఈ గుడి 1843లో నిర్మించబడ్డది.

జిల్లా గణాంకాలు సవరించు

ప్రముఖ వ్యక్తులు సవరించు

బయటి లింకులు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-24.
  2. District Census Handbook, Andhra Pradesh, Census 1961: Nizamabad
  3. Hyderabad State
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  6. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నిజామాబాద్ జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-27 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
  7. "Nizamabad District profile at a glance". Archived from the original on 2015-11-06. Retrieved 2012-12-11.
  8. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 229, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  9. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
  10. "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-05-20.
  11. Handbook of Statistics, Nizamabad Dist, 2010, PNo 153
  12. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-25. Retrieved 2012-12-11.