శ్రీ అంజనేయ స్వామి దేవాలయం (పొనుగుపాడు)
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామంలో నెలకొన్న ఆలయం.ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ప్రభుత్వ రికార్డులో శ్రీ అంజనేయస్వామి వారి దేవస్థానంగా గుర్తించబడింది.[1]
శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E |
పేరు | |
ఇతర పేర్లు: | రామాలయం |
ప్రధాన పేరు : | శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | గుంటూరు |
ప్రదేశం: | ఫిరంగిపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ఆంజనేయస్వామి |
ప్రధాన దేవత: | సీతమ్మవారు (శ్రీ సీతారామస్వామి ఉపాలయం) శ్రీదేవి అమ్మవారు భూనీళా అమ్మవారు శ్రీ శ్రీదేవి భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (ఉపాలయం) |
ముఖ్య_ఉత్సవాలు: | హనుమజ్జయంతి శ్రీరామనవమి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ఆగమ శాస్త్రం (హిందూ సంస్కృతి) |
కట్టడాల సంఖ్య: | 3 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.పూ.సిద్ధార్ది నామ సంవత్సరం.(1799-1800) |
సృష్టికర్త: | పొనుగుపాటి పాపరాజు |
ఆలయ పూర్వ చరిత్ర
మార్చుఈ ఆలయాన్ని గత రెండు సంవత్సరం క్రిందట వరకు ఎవరు ఎప్పుడు నిర్మించారో గ్రామ ప్రజలకుగానీ, దేవాదాయశాఖకు గానీ తెలియదు.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/1987 లోని సెక్షన్ 43 ప్రకారం దేవాదాయ ధర్మాదాయశాఖ ఈ ఆలయానికి సంబంధించి తయారు చేసిన రికార్డులో సుమారు 300 సం.ల.క్రిందట లోక కళ్యాణార్ధం గ్రామస్థులు కట్టించారని గ్రామస్తులను,అర్చకస్వామిని విచారించగా తెలుస్తుంది అని రాసుకున్నారు.[2] గ్రామ ప్రజలు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని అనుకుంటారు. గ్రామ ప్రజలు అనుకోవటంలో ఒక కారణం ఉంది.ఈ ఆలయానికి నిత్యనైవేద్యం, దీపారాధన కార్యక్రమాలకు య.22.00లు భూమిని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇనాంగా ఇచ్చాడు.అతను చాలా దేవాలయాలు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెసుస్తున్నందున ఈ దేవాలయాన్నికూడా వెంకటాద్రినాయుడు నిర్మించి ఉండవచ్చు అనే అభిప్రాయం గ్రామ ప్రజలలో కలిగింది.
వెలుగులోకి వచ్చిన అసలు చరిత్ర
మార్చుకొద్దికాలం క్రిందట తగిన ఆధారాలతో వెలుగులోకి వచ్చిన దానిప్రకారం 1918 నాటికి 200 సంవత్సరాలకు ముందు ఈ ఆలయం పాపరాజుచే నిర్మించబడినట్లు, ఈ ఆలయం నిర్మించకముందు 12వ శతాబ్దంలో కుళోత్తంగ చోళ మహారాజ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో గ్రామంలో శ్రీ రామేశ్వరుని ఆలయం తప్ప ఎటువంటి ఆలయాలు లేనట్లుగా తెలుస్తుంది.
ఆలయ మొదటి వ్యవస్థాపక ధర్మకర్త పాపరాజు
మార్చుఈ ఆలయాన్ని సిద్దార్థి నామ సంవత్సరంలో గ్రామానికి తూర్పు పార్శ్యం (ప్రక్క) పాపరాజు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కట్టించి,స్వామివారిని ప్రతిష్ఠించి పూజించటానికి పాంచరాత్రుని (ఆగమ శాస్రం తెలిసిన వ్యక్తి) కౌండిన్యస గోత్రికులైన పెరంబదూరు కేశవాచార్యులనే అతనిని నియమించాడు. అంతేగాదు ఇతను ఆలయంలో నిత్యనైవేద్యం, దీపారాధన వగైరా కార్యక్రమాలు జరగటానికి ఈ ప్రాంతాన్ని అప్పడు పరిపాలిస్తున్న వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకు చెప్పి అరకుచ్చల ఇనాం భూమి ఆలయానికి ఇప్పించాడు.[3][4] ఇనాం భూమి య.22.00లు (డి.నెం.464) ఇప్పటికీ ఈ ఆలయం అధీనంలో ఉంది. పూర్వం ఈ గ్రామానికి వొణుకుపాడు, పొణుకుపాడు అనే పేర్లు ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డు ద్వారా తెలుస్తుంది.
తలెత్తిన సందేహాలు
మార్చుపైన చెప్పిన దాని ప్రకారం సిద్దార్ది నామ సంవత్సరం అంటే సామాన్య శకం ప్రకారం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? అసలీ పాపరాజు అంటే ఎవరు? అనేది సరియైన వివరంగా లేదనేది సహజంగా సందేహం కలుగుతుంది.
సందేహాలు నివృత్తి
మార్చుసిద్దార్ది నామ సంవత్సరానికి వివరణ
మార్చుఆలయం మొదటి వ్యవస్థాపక ధర్మకర్త పాపరాజు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకు చెప్పి ఆలయానికి ఇనాం భూమి ఇప్పించినట్లు కైఫియత్తుల ద్వారా తెలుస్తుంది.వాసరెడ్డి వెంకటాద్రినాయుడు కృష్ణాడెల్టా సంస్థానంగా అమరావతి ధరణికోట కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని 1783 నుండి 1816 వరకు పరి పాలించాడు. ఈ కాలంతో పోల్చి పరిశీలించగా (06-04-1799 నుండి 25-03-1800 వరకు సిద్ధార్థి నామ సంవత్సరం ఉన్నట్లుగా ఆ సంవత్సరం తెలుగు సంవత్సరాల పంచాగం ద్వారా తెలుస్తుంది.దీనిని బట్టి 1799-1800 సం.లో దేవాలయం నిర్మించి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఎటువంటి ఆధారాలు లేక పోయినప్పటికి 1799 ఏప్రియల్ 19న హనుమాన్ జయంతి వచ్చింది. ఆ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేసిఉండటానికి ఆస్కారం ఉంది.[5]
అసలీ పాపరాజు ఎవరు? అనే దానికి వివరణ
మార్చులభించిన ఆధారాల ప్రకారం పొనుగుపాడు గ్రామంలో పూర్వం నుండి నివసించే బ్రాహ్మణ కులానికి చెందిన పొనుగుపాటి వంశీయుల తొమ్మిది తరాల క్రిందటి మూల పురుషుడు వెంకమరాజు.ఇతను 18 శతాబ్దం (1725-1875) మధ్య కాలానికి చెందినవాడు.అతని సంతానం నలుగురు కుమారులు. వారిలో పాపరాజు ప్రథమ కుమారుడు. దేవల్ రాజు, అయ్యపరాజు, వీర్రాజు వరసగా రెండవ, మూడవ, నాలుగవ సంతానం.
ఈ వంశీయులుకు చెందిన అప్పయ్య, సుందరరామయ్య, సీతారామయ్య, కాంతయ్య, నాగభూషణం, వెంకటరమణయ్యలు ఈ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా పనిచేసారు.ఈ వంశీయులే గ్రామానికి కరణీకం కూడా చేసారు. పై వారిలో చివరివాడైన వెంకటరమణయ్య దత్తుకుమారుడు లక్ష్మీ కాంతారావు గ్రామానికి కరణీకం చేస్తూనే, మొదటిసారిగా హిందూ మతహక్కుల చట్టం క్రింద స్వాతంత్ర్యం రాక ముందే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హిందూ రెలిజియస్ ఎండోమెంట్ బోర్డు వద్ద ఆంజనేయస్వామి ఆలయ వంశ పారంపర్య ఆలయ ట్రష్టు బోర్డును రిజిష్టరు చేసి (రి.సంఖ్య. 4776 తేది.27-10.1943) అప్రోవల్ పొందాడు. ఆతను 1952 ఆ ప్రాంతం వరకు ట్రష్ఠీగా చేసాడు. ఆ తరువాత కోటేశ్వరరావు పంతులు, లక్ష్మీ కాంతారావు కుమారుడు వెంకట రమణయ్య (కరణం) వంశపారంపర్య ట్రష్ఠీలుగా చేసారు. ట్రష్ఠీలుగా పనిచేసిన పానుగుపాటి వంశీయులలో వెంకట రమణయ్య చివరవాడు. ఇతను 1986 వరకు ట్రష్ఠీగా పనిచేసాడు.ప్రభుత్వ ఉద్యోగరీత్యా వేరే గ్రామానికి వెళ్లినందున ట్రష్ఠీ పదవిని వదులుకున్నాడు.అప్పటికి గ్రామంలో ఈ వంశీయులు అందరూ దాదాపుగా వివిధ కారాణాలవలన వేరే గ్రామాలకు వెళ్లారు. వెంకటరమణయ్య సవతి తల్లి (లక్ష్మీకాంతారావు రెండవ భార్య) దగ్గర లభించిన సిరిపురం వెంకటరమణయ్య (పొనుగుపాటి వంశీయులు కుమార్తెను వివాహమాడాడు. గుంటూరుజిల్లా, మేడికొండూరు మండలం పాలడుగు గ్రామం, స్వాతంత్ర్య సమరయోధుడు, 1922లో అల్లూరి సీతారామరాజుకు ధైర్యంగా ఆతిధ్యమిచ్చిన వ్యక్తి, విజయవాడలోని సత్యనారాయణపురం వ్యవస్థాపకుడు) శతజయంతి ఉత్సవ సంచిక (1987 సెప్టెంబరు, 24) లో ఆంజనేయస్వామి ఆలయ నిర్మించిన పాపరాజు తండ్రి అయ్యపరాజు దగ్గర నుండి చివరగా వంశపారంపర్య ఆలయ ట్రష్ఠీగా పనిచేసిన వెంకట రమణయ్య సంతతి వరకు కలిగిన పూర్వీకుల వంశవృక్షం ప్రకారం పాపరాజు పొనుగుపాటి వంశీయులకు చెెందినవాడని తెలుస్తుంది.[6]
ప్రవేటు ట్రష్టుబోర్డుల నియామకం అమలు
మార్చు- వంశపారంపర్య ట్రష్టీలుగా పనిచేసిన వారిలో చివరివాడైన వెంకటరమణయ్య ఉద్యోగరీత్యా ట్రష్టీ బాధ్యతలు 1986 లో వదులుకున్న తరువాత వంశపారంపర్య ధర్మకర్తలు స్థానంలో దేవాదాయ శాఖ 1987 జూన్ లో మొదటిసారిగా ఆలయ నిర్వహణకు కొంగర జగన్నాధం,గుర్రం లక్ష్మణరావు,కట్టమూరి సుబ్బారావులతో ప్రవేటు ట్రష్టుబోర్డును మొదటిసారిగా నియమించింది.ట్రష్టుబోర్డు చైర్మెనుగా కొంగర జగన్నాధం 1987 జూన్ లో ప్రమాణ స్వీకారంచేసాడు.1990లో తిరిగి జగన్నాధం చైర్మెనుగా ఇదే ట్రష్టుబోర్డు కొనసాగుటకు దేవాదాయశాఖచే నియమించి కొనసాగుచుండగా 1992 ఫిబ్రవరిలో చెైర్మెను జగన్నాధాన్ని ప్రభుత్వం గ్రామ పరిపాలనాధికారిగా నియమించినందున చైర్మెను పదవికి రాజీనామా ఇచ్చాడు.
- ఆ తరువాత 1997 జనవరి వరకు ప్రభుత్వం ఆలయ నిర్వహణకు ఎటువంటి ట్రష్టుబోర్డును నియమించలేదు.అయినప్పటికీ అనధికారంగా ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పటివరకు కొంగర జగన్నాధం నిర్వహించాడు.
- ఆ తరువాత దాడి రాధాకృష్ణ చైర్మెనుగా, కొంగర శివకుమారి, కనమర్లపూడి జగన్నాధం, పోట్లూరి లక్ష్మిపతి, బెల్లంకాండ వెంకయ్యలతో 1997 జనవరి 3న దేవాదాయశాఖ తిరిగి ప్రవేటు ట్రష్టుబోర్డు నియమించింది.రాధాకృష్ణ చైర్మెనుగా 1997 జనవరి 18న ప్రమాణ స్వీకారం చేసి, అప్పటి నుండి ఒక సంవత్సరంపాటు కొనసాగాడు.[7] 2004 నవంబరు 23 వరకు ఎటువంటి కమిటీని ఆలయ నిర్వహణకు నియమించలేదు. ఆకాలంలో అనధికారంగా మాజీ ట్రష్టుబోర్డు చైర్మెన్లు జగన్నాధం, రాధాకష్ణ ఆలయ నిర్వహణ బాధ్యతలు పర్వేక్షించారు.
- ఆ తరువాత 2004 నవంబరు 23న క్రోసూరి వెంకట్రావు, మాగులూరి సత్యవతి, కుంభా సుశీలరావు, తెలగతోటి చిన లక్ష్మయ్య, కట్టమూరి సుబ్బారావులతో నియమించిన ట్రష్టుబోర్డుకు వెంకట్రావు చైర్మనుగా 2004 డిశెంబరు 18న ఎన్నికై 2007 ఏప్రియల్ 25 వరకు పనిచేసాడు.[8] తిరిగి ఇదే సభ్యులుతో 2007 ఏప్రియల్ 9న నియమించిన ట్రష్టీకి 2007 ఏప్రియల్ 26న జరిగిన ఎన్నికలో తిరిగి రెండవసారి వెంకట్రావు ఎన్నికై 2010 జూన్ వరకు పనిచేసాడు.[9] ఆ దరిమిలా 2010 జూన్ లో క్రోసూరి పున్నమ్మ (మాజీ ట్రష్టు బోర్డు చైర్మెన్ వెంకట్రావు భార్య) ఎన్నికై 2013 జూన్ వరకు పనిచేసింది. ఈ ట్రష్టు బోర్డు సభ్యులుగా తెలగతోటి చిన లక్ష్మయ్య, మాగులూరి సత్యవతి, అదనంగా ఆలయ పూజారి శ్రీనివాస రాజగోపాలాచారిని ఎక్స్ అఫిసియో మెంబరుగా దేవాదాయ శాఖ నియమించింది.[10] అదే ట్రష్టుబోర్డు సభ్యులుతో నియమించిన కమిటీకి చైర్మెనుగా తిరిగి పున్నమ్మ ఎన్నికై 2016 ఆగస్టు వరకు పనిచేసింది.[11]
ఆలయంలో గల పూర్వ విగ్రహాలు
మార్చుమొదట పాపరాజు ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి మూలరాతి విగ్రహంతో పాటు, మరొక ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయంలోనే శ్రీ సీతారామస్వామి దేవస్థానం అనే పేరుతో మరొక ఉపాలయం ఉంది.అందువలన గ్రామస్థులు వాడుకలో రామాలయం అని వ్యవహరిస్తుంటారు.ఈ ఉపాలయంలో శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఏకశిల విగ్రహం ప్రతిష్ఠంచబడింది.ఈ ఉపాలయంలో శ్రీ సీతారామలక్ష్మణస్వామి విగ్రహం ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించారో సరియైన ఆధారం లేదు.'రామాలయం లేని ఊరు ఊరే కాదు' అనే నానుడి ఆలోచనతో ధర్మకర్తలు గ్రామస్థుల సహకారంతో సీతారామలక్ష్మణస్వామి ఉపాలయం నిర్మించి విగ్రహం ప్రతిష్ఠించ ఉండవచ్చు అని, గ్రామస్థుల ఐతిహ్యం (పూర్వుల నుండి నేటి వరకు పరంపరగాజేయుచు వచ్చిన సమాచారం).ఆలయంలో శ్రీ రామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తుల (ప్రతిరూపాల) పంచలోహ విగ్రహాలు ఉన్నాయి.లక్ష్మీకాంతారావు ధర్మకర్తగా పనిచేసిన కాలంలో శ్రీ సీతారామస్వామి ఉపాలయం భజంత్రీలకు స్వంత భూమి డి.నెం.102రులో య.2.00లు ఇనాంగా ఇచ్చాడు.కోటేశ్వరావు పంతులు ధర్మకర్తగా పనిచేసిన కాలంలో ఆలయ ముఖమండపం కట్టించాడు.
గతంలో అర్చకత్వం నిర్వహించిన పూజారులు
మార్చుఆలయ మొదటి పూజారి పెరంబదూరు కేశవాచార్యుల తరువాత పెద్దింటి వెంకటాచార్యులు,అతని కుమారులు,అగ్నిహోత్ర రంగాచార్యులు,చిలకపాటి అప్పలాచార్యులు,అతని కుమారుడు శ్రీనివాసాచార్యులు 1975 వరకు చేసారు.ఆ తరువాత ప్రభుత్వం కాంప్రమైజ్ యాక్టు అమలులోకి తీసుకొచ్చింది.దాని ప్రకారం దేవాలయ భూమి య.6.00లు నిత్య నైవేధ్య,దీపారాధన కార్యక్రమాలకు కేటాయించింది.కాంప్రమైజ్ యాక్టు అమలులోకి వచ్చిన తరువాత కొడకళ్ల ఆచార్యులు, కృష్ణమాచార్యులు, చందవరం గ్రామానికి చెందిన ఆచార్యులు పూజారులుగా పనిచేసారు.వీరి తరువాత 1981 సెప్టెంబరు 6 నుండి కొదమగుండ్ల శ్రీనివాస రాజగోపాలాచార్యులు అర్చకుడుగా పనిచేసాడు
ఆలయ జీర్ణోద్దరణ గావించుటకు తొలిమెట్టు
మార్చుదేవాలయం దాదాపుగా 21 శతాబ్దం ప్రారంభం నాటికి పూర్తిగా శిథిలావస్థ దశకు చేరుకుంది.క్రోసూరి వెంకట్రావు చైర్మెనుగా కొనసాగిన కాలంలో గ్రామస్థులు ఆలయ నిర్మాణం చేపట్టాలని 2008లో నిర్ణయం గైకొన్నారు.ట్రష్టుబోర్డు చైర్మెన్ వెంకట్రావు,మాజీ ట్రష్టుబోర్డు చైర్మెన్లు జగన్నాధం,రాధాకృష్ణ,గ్రామ పెద్దలు గుర్రం రామారాయుడు, క్రోసూరి బుచ్చయ్య,కోయ వెంకట్రావు, క్రోసూరి బాలరాజు మరికొంతమంది కలసి అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదు వెళ్లి అప్పటి దేవాదాయ శాఖ మంత్రికి 2008 జూలై 18న ధరఖాస్తు ఇచ్చారు.2011లో పొన్నాల లక్ష్మయ్య దేవాదాయశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించే కాలంలో ప్రభుత్వం సి.జి.యఫ్.గ్రాంటు క్రింద 1/3 మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ చెల్లించే పద్ధతిపై రు.24.45 లక్షలు అంచనా మొత్తంగా శాంక్షన్ చేయబడింది.[12].ప్రభుత్వం నుండి దేవాలయ నిర్మాణ అనుమతి ఉత్తర్వులు సకాలంలో అందటానికి గేరా కోటేశ్వరరావు, హైదరాబాదులో నివసిస్తున్న క్రోసూరి సుబ్బారావు,అభినయ శ్రీనివాస్,ఆలయ వ్యవస్థాపక వారసులకు చెందిన కీ.శే.పొనుగుపాటి వెంకట నాగభూషణంల కృషి ఉంది.ఆరోజుకు వాస్తవంగా వెంకట నాగభూషణం పూర్వీకులు ఆలయ నిర్మాణం చేసారని ఆతనికి కూడా తెలియదు.పొనుగుపాడు గ్రామానికి చెందిన యర్రం కోటేశ్వరరావు ప్రోద్బలంతో, మాచవరపు కోటేశ్వరరావు, సీతమ్మ దంపతుల కుమారుడు సాయి గోపాల్, రీతి దంపతులు (యు.ఎస్) 1/3 వంతు విరాళం రు.8.15 లక్షలు చెల్లించి జీర్ణోద్ధరణకు మార్గం సుగుమం చేసారు.వెంకటేశ్వరస్వామి ఆలయం గ్రామంలో లోగడ లేదని, గ్రామస్థులు అసంతృప్తిగా ఉన్న విషయం గ్రహించి గ్రామానికి చెందిన క్రోసూరి రామకోటేశ్వరరావు, అరుణశ్రీ దంపతులు ఆలయ నిర్మాణం పూర్తిగా వారి స్వంత నిధులతో గావించుటకు ముందుకు వచ్చారు.ప్రభుత్వం సి.జి.ఎఫ్. గ్రాంటుతో కలుపుకొని మంజూరు చేసిన రు.24.45 లక్షలు అంచనాతో ఆలయ నిర్మాణం అసాధ్యమని అందరూ గుర్తించారు.గ్రామ ప్రజలు, పెద్దలు దేశ విదేశాలలో ఉన్న పొనుగుపాడు నివాసులు అందరూ ఎవరి శక్తి కొలది వారు విరాళాలు అందించారు.కొంతమంది దాతలు వారి శక్తికొలది విరాళాలు అందజేయగలమని స్పందించారు.
జీర్ణోద్దరణ కార్యక్రమానికి శంకుస్థాపన
మార్చుట్రష్టుబోర్డు చైర్మెను క్రోసూరి పున్నమ్మ,ఆలయ నిర్వహణాధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో, అప్పటి పూజారి శ్రీనివాస రాజగోపాలాచార్యులు అర్చకత్వంలో ఖర నామ సంవత్సరం, పాల్గుణ మాసం,బహుళ పాడ్యమి, శుక్రవారం,ఉదయం గం.6.59 ని.కు ఉత్తరానక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశమందు (2012 మార్చి 12న) ఒకే ఆవరణలో శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన దేవాలయంతోపాటు,లోగడ ఉన్న శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉపాలయం జీర్ణోద్దరణ కార్యక్రమానికి, శ్రీ శ్రీదేవి భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉపాలయం కొత్తగా నిర్మించుటకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు, సర్పంచి మాధవరావు, దేవాదాయశాఖ అధికారులు ఉప కమీషనరు సుబ్బారెడ్డి, సహాయ కమీషనరు పరమేశ్వరరెడ్డి, డిప్యూటి ఇంజనీరు శ్రీనివాసులు, స్థపతి పరమేశ్వరరావు, ఇనస్పెక్టరు సుబ్రమణ్యం, మాజీ ట్రష్టు బోర్డు చైర్మెన్లు జగన్నాధం, రాదాకృష్ణ, వెంకట్రావు, ట్రష్టుబోర్టు సభ్యులు, దాతలు సాయి గోపాల్, వంకాయలపాటి బలరామకృష్ణయ్య, కోయ వెంకట్రావు, క్రోసూరి రామకోటేశ్వరరావు సుబ్బారావు,బాలరాజు, యర్రం కోటేశ్వరరావు, గుర్రం పెదబాబు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణం విశేషాలు
మార్చు- ఆలయ నిర్మాణానికి టెండర్లు కోరగా కె.బి.సి.కనస్ట్రక్షన్, గుంటూరుకు దక్కింది.
- ఆలయనిర్మాణం, బొమ్మకట్టు, ఇతర పనులు తూ.గో.జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన సూరి సూరిబాబు ఆద్వర్యంలో జరిగాయి.
- ఆలయ నిర్మాణంలో భాగాలైన ఆధారాలు, చిత్తవాహనం, ఉపపీఠం, అదిస్ఠానం, స్తంబవర్గం, ప్రస్తరం, గోపురం అను సప్త నిర్మాణాలు స్థపతి పరమేశ్వరరావు పర్వేక్షణలో నిర్మించబడ్డాయి.
- 2012 నవంబరు 15న పీఠంనందు భక్తులు ఇసుకను నింపారు.
- ఆంజనేయస్వామి ప్రదాన దేవాలయం ఉపపీఠం నిర్మాణం 2012 డిశెంబరు 8న మొదటి రాయికి శాస్త్రోక్తంగా పూజలు జరిపి ప్రారంభించబడింది.
- శ్రీ శ్రీదేవి భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉపాలయం ఉపపీఠం మొదటి రాయికి శాస్త్రోక్తంగా పూజలు జరిపి 2012 డిశెంబరు 15న ప్రారంభించబడింది.
- శ్రీ సీతారామలక్ష్మణస్వామి ఉపాలయం ఉపపీఠం మొదటి రాయికి శాస్త్రోక్తంగా పూజలు జరిపి 2012 డిసెంబరు 23న ప్రారంభించబడింది.
- 2013 జూన్ 13న శాస్త్రోక్తంగా పూజలు జరిపి దేవాలయ సముదాయంనకు దర్వాజాలు అమర్చబడ్డాయి.ఆసందర్భంగా ఆలయ నిర్మాణ శ్రామికులకు నూతన వస్త్రాలు బహుకరించబడ్డాయి.
- బ్రహ్మకపాలం శిలాఫలకాలు 2014 ఫిబ్రవరి 18న గ్రామంలో భక్తుల కోలాహలంతో ఊరేగించి, మరుసటిరోజు శాస్త్రోక్తంగా పూజలు జరిపి అమర్చారు.
- ప్రస్థరం, గోపురం నిర్మాణ కార్యక్రమాలు 2015 మార్చి 26న మొదలుపెట్టారు.
- జీవ ద్వజస్తంభంల మూలాలు తూ.గో.జిల్లా, రంపచోవరం మండలం, మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుండి సేకరించబడి బడినవి.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్,గుంటూరు వారి దృవపత్రం Reg.No.C11647/A3/2006 Dt.04.12,2006
- ↑ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హిందూమత దేవాదాయ ధర్మాదాయశాఖ చట్టం 30/1987 నందలి సెక్షన్ 43 ప్రకారం తయారుచేసిన రిజిష్టరు (తయారు తేదీ 16-10-2006) పేజీ నెం.1
- ↑ "Guntur Thuluka Grama Kaifiyyathulu-FEB 1988(VOL-4) |Page No.192,193". Telugu Kaifiyat.
- ↑ కొడాలి లక్ష్మీనారాయణ రచించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చరిత్ర గ్రంధం పేజి సంఖ్య 196/18
- ↑ LLP, Adarsh Mobile Applications. "1799 Hanuman Jayanti Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
- ↑ సిరిపురపు వేంకట రమణయ్య శతజయంతి సంచిక 1987 లో జతపర్చిన పొనుగుపాటివారి వంశవృక్షం.పేజి సంఖ్య. 4
- ↑ అసిస్టెంట్ కమీషనరు.దేవాదాయ శాఖ,గుంటూరు వారి ప్రొసీడింగ్స్ సంఖ్య.A6-14255/96 తేది.03.01.1997
- ↑ అసిస్టెంట్ కమీషనరు.దేవాదాయ శాఖ,గుంటూరు వారి ప్రొసీడింగ్స్ సంఖ్య.A3/7646/2004 తేది.23.11.2004
- ↑ అసిస్టెంట్ కమీషనరు.దేవాదాయ శాఖ,గుంటూరు వారి ప్రొసీడింగ్స్ సంఖ్య.A3/14018/2006 తేది.09.04.2007
- ↑ అసిస్టెంట్ కమీషనరు.దేవాదాయ శాఖ,గుంటూరు వారి ప్రొసీడింగ్స్ Rc.No.A6/1889/2010 తేది.31.05.2010
- ↑ అసిస్టెంట్ కమీషనరు.దేవాదాయ శాఖ,గుంటూరు వారి ప్రొసీడింగ్స్ Rc.No.A6/4763/2012, తేది.13.05.2013
- ↑ దేవాదాయ శాఖ కమిషనర్, సెక్రటరీ సి.జి.యఫ్. కమిటీ,ఆంధ్ర ప్రదేశ్ ఆర్.సి.నెం:P1/8975/2010, తేది:24.12.2011