శ్రీ వ్యాసాశ్రమం

శ్రీ వ్యాసాశ్రమం చిత్తూరు జిల్లా, ఏర్పేడుకు సమీపంలోని కాశీ బుగ్గ వద్ద మలయాళ స్వామి జూన్ 3, 1926[1] న స్థాపించిన ఆశ్రమం.[2] ఈ ఆశ్రమ విస్తీర్ణం సుమారు 115 ఎకరాలు. ఆశ్రమ భవనాలు సుమారు 30 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.[1] ఈ ఆశ్రమంలో కుల, మత, లింగ బేధాలు లేకుండా అందరికీ సమానంగా సంస్కృత పాఠశాలలు, బ్రహ్మవిద్య, ఆరోగ్యం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వ్యాసాశ్రమం పేరుమీదుగా దేశ వ్యాప్తంగా వేదాంత జ్ఞానసభలు నిర్వహిస్తున్నారు.

చరిత్ర మార్చు

వ్యాసాశ్రమ స్థాపకుడైన మలయాళ స్వామి జన్మతః కేరళ రాష్ట్రానికి చెందిన వాడు. ఆయన చిన్న వయసులోనే నారాయణ గురు అనే సామాజిక విప్లవకారుని శిష్యుడైన శివలింగప్ప వద్ద శిష్యరికం చేసి వేదాలను, హిందూ పురాణాలను అధ్యయనం చేశాడు. హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన దేశాటన చేశాడు. చివరకు తిరుమల చేరి గోగర్భం వద్ద పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. తరువాత ఏర్పేడు దగ్గరున్న కాశీబుగ్గ చేరి నంది పర్వతం పాదాల దగ్గర వ్యాస మహర్షి పేరు మీదుగా ఆశ్రమం స్థాపించాడు.

ఆశ్రమ ఆవరణం మార్చు

మలయాళ స్వామి కాశీ బుగ్గలో అడుగు పెట్టినప్పటి నుంచే వ్యాసాశ్రమం ప్రారంభమైందని ఆయన భక్తులు విశ్వసిస్తారు. మొదట్లో ఈ ఆశ్రమం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఆయన అనుచరులు నివసించడానికి అనువుగా కాశీబుగ్గ కు ఉత్తరంగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించి ఇచ్చారు. అది ప్రస్తుతం పూజా మందిరంగా వ్యవహరించబడుతోంది. ఆయన ధ్యానం చేసుకోవడానికి వీలుగా నిష్టాశ్రమం నిర్మించి ఇచ్చారు. అది ప్రస్తుతం అధిష్టాన మందిరంగా పిలవబడుతోంది. ఆశ్రమం ఎవరి పేరు మీదుగా లేకపోతే ఆక్రమణలకు గురవుతుందనే ఉద్దేశ్యంతో అప్పటి శ్రీకాళహస్తి పరిపాలకుడు శ్రీ కుమార వెంకట నాయనింగారు ఈ స్థలాన్ని స్వామి పేరుతో విరాళంగా ఇచ్చారు.

విభాగాలు మార్చు

ఏర్పేడులో ఉన్న ప్రధాన కేంద్రం ఉన్న ఈ ఆశ్రమానికి పలు చోట్ల శాఖలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు, కడప, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ పట్నం, గుంటూరు, కృష్ణా, హైదరాబాదు, కరీంనగర్, కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాక కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఈ ఆశ్రమ విభాగాలున్నాయి.[3]

పీఠాధిపతులు మార్చు

ఈ ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి మరణించేదాకా మలయాళ స్వామి పీఠాధిపతిగా కొనసాగాడు. ఆయన తర్వాత విమలానంది గిరి, విద్యానంద గిరి పీఠాధిపత్యం వహించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమానికి పరిపూర్ణానంద గిరి స్వామి అధ్యక్షత వహిస్తున్నారు.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "ఆధ్యాత్మికతను పెంచే 88వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు" (PDF). bamsg.org. ది బొంబాయి ఆంధ్ర మహాసభ, జింఖానా. Retrieved 8 November 2016.
  2. "శ్రీ వ్యాసాశ్రమం గురించి". vyasasramam.org. వ్యాసాశ్రమం. Retrieved 8 November 2016.
  3. "ఇతర శాఖలు". vyasasramam.org. శ్రీ వ్యాసాశ్రమం. Retrieved 8 November 2016.
  4. "భగవంతుడిది తల్లిప్రేమ". andhrajyothy.com. వేమూరి రాధాకృష్ణ. Retrieved 8 November 2016.[permanent dead link]