షట్కాల గోవింద మరార్

గోవింద మరార్ (సా.శ. 1798-1843) కేరళకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీతవేత్త. సాధువు. సంగీత విద్వాంసులు త్యాగరాజు, స్వాతి తిరునాళ్‌ల సమకాలికుడు. తిరువనంతపురం మహారాజు శ్రీ స్వాతి తిరునాళ్ ఆస్థానంలో అష్ట సంగీత విద్వాంసులలో ఒకనిగా కీర్తించబడ్డాడు.[1] సంగీత ప్రపంచంలో షట్కాలాలు అవలీలగా పాడగల ముగ్గురు త్రిమూర్తులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. తన సన్నిధిలో గోవింద మరార్ పాడిన రాగం వినడం పూర్తిచేసిన తరువాతనే త్యాగరాజు తన సుప్రసిద్ధ కృతి ‘ఎందరో మహానుభావులు’ను తొలిసారిగా పాడారని ఇతిహాసంగా పేర్కొంటారు. గోవింద మరార్ చెండ (Chenda), ఎడక్క (Edakka), తిమిల (Thimila) వంటి దక్షిణ భారతదేశ సంగీత వాయిద్యాలను ఉపయోగించడంలో దిట్ట.[2] ఇతని తంబూరాకు ఏడు తీగలు వుండేవని జనశృతిగా చెప్పబడుతుంది.[3]

రాజా రవివర్మ చే చిత్రించబడిన షట్కాల గోవింద మరార్ వర్ణచిత్రం.

ప్రారంభ జీవితం

మార్చు

గోవింద మరార్ సా.శ. 1798 లో కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని మువ్వత్తపురం తాలూకా లోని రామమంగళం గ్రామంలో జన్మించాడు. ఇతను మరార్ (Marar) కులానికి చెందినవాడు. మారర్ అనగా నాదబ్రాహ్మణ సంగీత విద్వాంసులు. మరార్ కులస్తులు కేరళలోని ఆలయాలలో సాంప్రదాయికంగా పాటలు పాడేవారు. అనువంశికంగా బాల్యం నుంచే పాటలు ఆలపించడం నేర్చుకొన్నాడు. హరిపాద రామస్వామి భాగవతార్ వద్ద సంగీతపాఠాలు అభ్యసించాడు.[3] ఇతను సంగీత వాయిద్యం ఎడక్క (ఢమరుకం వంటిది) ను వాయించడంలో మంచి నిపుణుడు. చిన్నతనంలో బహుమతిగా అందుకొన్న తంబురాను చూసి ముగ్ధుడైన అతడు దానిని ప్రయోగాత్మకంగా ఏడు తీగల వాయిద్యంగా మార్చాడు. అక్కడినుండి తంబురా అతని జీవితంలో ఒక భాగమైంది. క్రమేణా తన గాత్ర సంపదతో తంబురా మీటుతూ అఖండ లయసంపద విభూతుడిగా పేరుగాంచాడు.

21 సంవత్సరాల వయసులో ఇతను ఇల్లు విడిచి దేశ సంచారం చేసాడు. కేరళలోని అనేక ప్రముఖ ఆలయాలలో తన తంబురాను మీటుతూ గాత్ర కచేరీలు చేసాడు.[4] తిరువనంతపురం మహారాజు, సంగీత విద్వాంసుడు, పోషకుడు అయిన స్వాతి తిరునాళ్ళను దర్శించి అతనిచే గౌరవించబడ్డాడు. మహారాజు శ్రీ స్వాతి తిరునాళ్ యొక్క అష్ట సంగీత విద్వాంసులలో ఒకనిగా పేరుగాంచాడు. త్యాగరాజును తిరువనంతపురానికి రప్పించగోరిన శ్రీ స్వాతి తిరునాళ్ళ ప్రభువు అందుకోసమై వడివేలును, గోవింద మరార్‌ను తిరువయ్యూర్ (Thiruviyur) నకు పంపించాడు. తిరువయ్యూర్‌లో త్యాగరాజు ఇంట జరిగిన ఒక భజన కార్యక్రమంలో పాల్గొని తన తంబురాతో జయదేవుని అష్టపది ‘చందన చర్చిత’ను షట్కాలాలలో అపూర్వంగా పాడి ఆహతులను సమ్మోహితులను చేయడంతో పాటు త్యాగరాజుచే కొనియాడబడ్డాడు.[2]

విశిష్టత

మార్చు

గోవింద మరార్ తంబురాకు సాధారణంగా వుండే నాలుగు తీగలకు బదులుగా ఏడు తీగలు ఉండేవి.[2] అవి. 2 పంచామాలు, 2 సారణి, 2 అనుసారణి, 1 మంద్రం. ఈ తంబురాతో గోవింద మరార్ ఒక రాగాన్ని అతి విలంబిత స్థాయి నుంచి అతిధృతి స్థాయిలోనికి అవలీలగా పాడగలిగేవాడు.[2]

గోవింద మరార్‌లో ఒక విశిష్ట లక్షణం కనిపిస్తుంది. షట్కాలాలలో పల్లవిని అద్భుతంగా పాడగల సామర్ధ్యం ఇతనికి మెండుగా ఉంది. ఆతి విలంబిత కాలం, విలంబిత కాలం, విలంబిత, మధ్యమ కాలం, ధృతకాలం, అతిధృత కాలం – ఈ ఆరింటినీ షట్కాలాలంటారు. గోవింద మరార్ ఒక రాగాన్ని ఆరంభంలో ఆతి విలంబిత కాలం (వేగం యొక్క మొదటి స్థాయి) లో పాడటం మొదలుపెడతాడు. అతను అంత తక్కువ స్థాయిలో నెమ్మదిగా ఎందుకు ఆరంభించాడోనని ప్రజలు ఆశ్చర్యపడేలోపులో క్రమేణా వేగం అవధిని పెంచుతూ పోయేవాడు. ఆ తరువాత విలంబిత కాలం (ద్వితీయ స్థాయి), విలంబిత (మూడవ స్థాయి), మధ్యమ కాలం (నాలుగవ స్థాయి), ధృతకాలం (ఐదవ స్థాయి), అతిధృత కాలం (ఆరవ స్థాయి) లో పాడేవాడు. అతను ఐదవ స్థాయి వేగంతో చేరుకున్నప్పుడు, మొత్తం ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు. ఇటువంటి సామర్ధ్యం ఆరితేరిన సంగీతకారులకే సాధ్యమవుతుంది. అందుకే ఆరు కాలాలలోనూ అద్వితీయంగా పాడగల గోవింద మరార్‌కి 'షట్కాల' బిరుదు సార్థక నామదేయం అయ్యింది.[2] ఈ విధంగా షట్కాలాలు అవలీలగా పాడగల సంగీతత్రయంలో ఒకనిగా గోవింద మరార్ గుర్తించబడ్డాడు. మిగిలిన ఇరువురు వీణ వెంకట రమణదాసు, శీలం నరసయ్యలుగా సంగీత రసజ్ఞులు పేర్కొంటారు.[5]

ఒకసారి త్యాగరాజు సన్నిధిలో గోవింద మరార్ నీలాంబరి రాగాన్ని ఒక గంట సేపు అపూర్వంగా పాడటం తటస్థించింది. అంత చిన్న రాగాన్ని షట్కాలాలలో అంత విపులంగా పాడటం పూర్తయిన వెంటనే త్యాగరాజు ముగ్ధుడై నిజంగా నీవు మహానుభావుడవని గోవింద మరార్‌ను ప్రశంసించి వెనువెంటనే 'ఎందరో మహానుభావులు' అనే సుప్రసిద్ధ కృతిని తొలిసారిగా పాడాడని ప్రతీతి.

చిరకాలం దేశ సంచారం చేస్తూ, ఆలయాలలో కచేరీలు చేస్తూ గోవింద మరార్ చివరకు పండరిపురం (మహారాష్ట్ర) లోని పాండురంగ విఠలాలయాన్ని చేరుకొన్నాడు. అక్కడ పరమహంస గోవిందదాసుగా కీర్తించచబడ్డాడు. సా.శ. 1843 లో పండరీపురంలో నిర్యాణం పొందాడని ఆలయ రికార్డులను బట్టి తెలుస్తుంది.

షట్కాల గోవింద మరార్ స్మారక కళాసమితి

మార్చు

ప్రసిద్ధ మలయాళ కవి ఉళ్ళూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్ ప్రసంగం ద్వారా గోవింద మరార్ ప్రతిభను తెలుసుకొన్న సర్వోదయ నాయకుడు ఎం. పి. మన్మథన్ 1980 లో అతని జన్మస్థలమైన రామమంగళంలో “ షట్కాల గోవింద మరార్ స్మారక కళాసమితి ”ని ఏర్పాటుచేశారు.[1] ప్రస్తుతం ఈ కళాసమితి సాంప్రదాయిక సంగీతం, దక్షిణ భారతదేశంలోని ఆలయ కళల అభ్యాసాన్ని పెంపొందింపచేసే అధ్యయనకేంద్రాలను స్థాపిస్తూ సంబంధిత కార్యక్రమాలను చేపడుతున్నది.[1] కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో గోవింద మరార్ స్మారక భవనాన్ని, ఆడిటోరియం లను నిర్మించారు.

షట్కాల గోవింద మరార్ సంగీతోత్సవం

మార్చు

1980 లో మువ్వత్తుపూజ (Muvattupuzha) లో మృదంగ విద్వాంసుడు పనంగద్ చంద్రన్ సహకారంతో నారాయణ రామదాస్ అయ్యర్, ప్రదీప్ దియో అనే ఇద్దరు సంగీత ప్రేమికులచే షట్కాల సంగీత సభ ప్రారంభించబడింది. ప్రారంభ సంగీత విభావరిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాలుగు గంటల పైగా సుదీర్ఘ కచేరీ చేసారు.[6] 1992 నుండి కేరళ సంగీత నాటక అకాడమి తోడ్పాటుతో గోవింద మరార్ స్మారకార్ధం ప్రతీ సంవత్సరం రామమంగళంలో గొప్ప సంగీత ఉత్సవం నిర్వహించబడుతున్నది.[1]

వెలుపలి లింకులు

మార్చు
  • Shadkala Govinda Marar
  • 14th Shadkala Govinda Marar Music Festival Archived 2007-02-13 at the Wayback Machine
  • "Shatkala Govinda Marar". kerelaculture.org. Department of Cultural Affairs, Government of Kerala. Archived from the original on 16 డిసెంబరు 2018. Retrieved 3 December 2017.
  • "Shatkala Govinda Marar Memorial Art Society". Keralaculture.org. Department of Cultural Affairs, Government of Kerala. Archived from the original on 5 జనవరి 2018. Retrieved 3 December 2017.
  • [1]
  • [2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Keralaculture.org.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Shatkala Govinda Marar.
  3. 3.0 3.1 "Kerala Gov-Music" (PDF). Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2017-12-03.
  4. "Shadkala". Archived from the original on 2017-07-26. Retrieved 2017-12-03.
  5. నారుమంచి, సుబ్బారావు. సంగీత మహర్షులు (వాగ్గేయకారులు) - మొదటి భాగము. తెనాలి: శివశ్రీ పబ్లిషర్స్. p. 131.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-20. Retrieved 2017-12-03.