ముహమ్మద్ అలీ షబ్బీర్ (محمد علی شبّیر) : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేశాడు. ఆయన 2021లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కన్వీనర్‌గా నియమితులయ్యాడు.[1][2]

ముహమ్మద్ అలీ షబ్బీర్ (محمد علی شبّیر)
జననం15 ఫిబ్రవరి 1957
మాచారెడ్డి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
ఇతర పేర్లుషబ్బీర్ అలీ, అలీ షబ్బీర్
ప్రసిద్ధిమాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
మతంఇస్లాం (ముస్లిం)
భాగస్వాములునఫీస్ పర్వీన్
పిల్లలుమహ్మద్ ఇలియాస్ (కుమారుడు), ఇద్దరు కుమార్తెలు
తండ్రిముహమ్మద్ మాసూమ్

రాజకీయ జీవితం

మార్చు

షబ్బీర్ అలీ 1970లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యూసుఫ్ అలీ పై 12978 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, 31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్‌చార్జ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్‌, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్‌, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని చేశాడు.[3]

షబ్బీర్ అలీ 2009లో జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి ఓటమిపాలై, తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 14 మార్చి 2013న ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014లో టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సభ్యునిగా నియమితుడయ్యాడు. ఆయన 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4] ఆయన తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పని చేశాడు.

షబ్బీర్ అలీ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారుగా నియమించింది.[5][6]

మూలాలు

మార్చు
  1. Eenadu (12 September 2021). "తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ నియామకం". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  2. Sakshi (13 September 2021). "TS: 'కోర్‌' స్థానంలో పీఏసీ". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  3. Sakshi (9 November 2018). "కాంగ్రెస్‌ దూకుడు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  5. Sakshi (21 January 2024). "ప్రభుత్వ సలహాదారుల నియామకం". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  6. Eenadu (22 January 2024). "ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.

బాహ్య లింకులు

మార్చు

షబ్బీర్ అలీ వెబ్‌సైటు