సంగమేశ్వర దేవాలయం, కర్నూలు

matter in telugu

సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం.ఇది కృష్ణ, భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో, శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది.[1] జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఇది ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.

చరిత్ర

మార్చు

సామాన్య శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బాదామి, కర్ణాటక లోని బాగల కోట్ జిల్లా లో ఉంది. నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలించే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది.

కూడలి సంగమేశ్వరాలయం

మార్చు

దక్షిణాపథంలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన మొదటిరాజ్యం బాదామి చాళుక్యులది. ఈ వంశంనుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడ్డాయి. కర్ణాటకలో కళ్యాణి, అంధ్రప్రదేశ్ లో వేంగి, వేములవాడ, ఎలమంచిలి, ముదిగొండ మొదలగునవి. బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు. వీరి తొలి రాజ ధాని ఐహోల్ లోను, తరువాతి కాలం నాటి రాజధాని బాదామిలో ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్నిబౌద్ధ, జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి. వీరు కృష్ణానది ఉపనది మలప్రభా నది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకల్ లో పట్టాభిషేకాలు జరుపుకునే వారు. అక్కడ పాపనాధ గులగనాథ, సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు. వీరికి పల్లవులతో నిరంతర యుద్ధాలు జరిగేవి. విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచి లోని కైలాశనాధ అలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్లో నిర్మించారు. వీరి రాజ్యంలో మలప్రభ కృష్ణతో సంగమించే 'కూడలి' లో సంగమేశ్వరాలయం నిర్మించారు. ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడ కవి, సంస్కర్త, వీరశైవ మత స్థాపకుడు, బసవన్న సమాధి అయ్యాడు. రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలక సీమ లేక ఏరువసీమ లేక రెండేరులనడిమి సీమగా పిలవబడే ప్రస్తుత ​మహబూబ్​నగర్ జిల్లా - కర్నూలు జిల్లా ల్లోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈ సీమలో తుంగభద్ర నది కృష్ణా నదితో కలిసే లో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలయాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా? అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి, విగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చర్యాన్ని గొల్పుతుంది.

కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కానీ వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం వుండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం వుండటం వల్ల ఇక్కడ నవ బ్రహ్మాలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాధ, పాపనాధ, ఆలయాలను పోలి వుంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గ సాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరాలో కొండను తొలిచి కైలాశనాధాలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే 'నివృత్తి సంగమం' కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనది సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి లింగాల కోసం భీముణ్ణి కాశీకి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.

రూపాల సంగమేశ్వరం

మార్చు

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్రకూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని పక్కన భుజంగేశ్వరాలయాలు మహాబలిపురంలో రాతి రథాలను పోలివుండేవి. ఆలయుం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలున్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాప నాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.

శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర దేవాలయం, అలంపురం ఆలయలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా, పురాతత్వ శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని, పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలో పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ బ్రహ్మాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై ప్రతిష్ఠించారు. ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నందికొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద ప్రతిష్ఠించారు. త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాద్ లోని పురాతత్వశాఖవారి ప్రదర్శన శాలలో ఉంది. ఇది పబ్లిక్ గార్డెన్స్ లో ఉంది.

నివృత్తి సంగమేశ్వర దేవాలయం

మార్చు

నివృత్తి సంగమేశ్వరాలయం మాత్రం అక్కడే నీటిలో మునిగి ఉంటుంది. ప్రతి ఏటా వేసవిలో అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ దర్షంచుకునెందుకు కర్నూలు కేంద్రంగా రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నయి.

స్థలపురాణం

మార్చు

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.

ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.[2]

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. "The Hindu : Andhra Pradesh / Kurnool News : Sangameswara temple preservation urged". web.archive.org. 2012-11-06. Archived from the original on 2012-11-06. Retrieved 2022-03-30.
  2. "The History Of Sangameswara Temple Which Is Located In Kurnool District Where 7 Rivers Meet Up | Lord Shiva Temples | Telugu Mythological Stories". 2015-10-07. Retrieved 2018-02-12.

ఇతర లింకులు

మార్చు
  • సాక్షి ఆదివారం అనుభంధం: 2011 ఏప్రిల్ 17