సయ్యద్ అహ్మద్ సుల్తాన్

సఖి సర్వర్ గా పిలువబడే హజరత్ సయ్యద్ అహ్మద్ సుల్తాన్ , పంజాబ్ రాష్ట్రానికి చెందిన 12వ శతాబ్దానికి చెందిన ఒక సూఫీ సాధువు.[1].ఇతడికి సుల్తాన్ (రాజు), లఖ్‌దాత (లక్షలాది మందిని అనుగ్రహించేవాడు), లలన్‌వాల (శ్రేష్ఠమైన మాణిక్యము, నిగాహియ పీర్ (నిగాహ సాధువు), రోహియన్‌వాల (అరణ్యాల ప్రభువు) అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడి అనుచరులను సుల్తానియాస్ లేదా సర్వరియాస్ గా పిలుస్తారు.[2]

సఖి సర్వర్ (లఖ్‌దాత) కపుర్తల
లఖ్ దాత (సఖి సర్వర్) ఆరాధనా స్థలము, జలంధర్ జిల్లా
వార్షిక ఉర్స్ ఉత్సవాలు, హజరత్ సయ్యద్ జైన్ ఉల్ అబిదీన్ సమాధి వద్ద, సుల్తాన్ సర్వర్

సఖి సర్వర్ తండ్రి మదీనా నగరం నుండి వచ్చి షాహ్‌కోట్ పట్టణంలో స్థిరపడ్డ సయ్యద్ సఖి జైన్-ఉల్-అబిదిన్.[1] ఇతడు షాహ్‌కోట్ గ్రామ పెద్ద [2] పీరా కుమార్తె ఈషన్ ను వివాహం చేసుకున్నాడు.[1] వీరికి కలిగిన కుమారుడే సఖి సర్వర్.

జీవితము

మార్చు

ఇతడి తండ్రి మరణించిన తర్వాత ఇతని బంధువులు ఇతడి పట్ల కౄరంగా ప్రవర్తించారు. వీరి బాధలు పడలేక ఇతడు బాగ్దాద్ వెళ్ళిపోయాడు. అక్కడ ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు సాధువులు ఘౌన్స్-ఉల్-అజ్ం, షేక్ షబ్-ఉద్-దీన్ సుహ్రావాడి, ఖ్వాజ మౌదూద్ చిష్ఠీ ల చే ఖిలాఫత్ ఆశీర్వాదాలు పొందాడు.[1]

మనదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మొదట గుజ్రాన్‌వాల జిల్లా లోని ధౌంకాల్ లో కొద్ది కాలం నివసించాడు. తర్వాత షహ్‌కోట్ లో కొద్దికాలం గడిపాడు. ముల్తాన్లో ఒక ప్రముఖును కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని మహిమలు ప్రదర్శించడం చేత ఆ ప్రాంతాలలో ఇతని పేరు మారు మోగిపోయింది. ఇతడికి కొద్దిమంది అనుచరులు కూడా ఏర్పడ్డారు.[2]

ఇతడికి ఇంత మంచి పేరు రావడం సహించని ఇతడి కుటుంబ సభ్యులు ఇతడిని చంపాలని అనుకున్నారు. ఈ సంగతి పసిగట్టిన సఖి సర్వార్ డేరా గంజీ ఖాన్ జిల్లాలోని సులేమాన్ పర్వతం వద్దగల నిగాహకు వెళ్ళిపోయాడు. కానీ ఇతడు అక్కడికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని 1174లో అతడిని హత్య చేశారు. సఖి సర్వార్ మృతదేహాన్ని అక్కడే ఖననం చేసిన అతడు అనుచరులు అతడి సమాధిపై ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మించారు. కాలక్రమేణా అది ఒక పుణ్య క్షేత్రంగా మారి భక్తులు విరివిగా సందర్శించసాగారు.[1]

ఇతడి మత విశ్వాసాలు, ప్రబోధనలపై ఎలాంటి సమాచారం లేకున్ననూ ఇతడు ప్రదర్శించిన కొన్ని అధ్బుతాలు, మహిమల కారణంగా, ఇతడు జంతువులను సంరక్షించిన కొన్ని మహిమలు అనేకమందిని ఆకర్షించి ఇతని పట్ల ఆసక్తిని కలిగించింది.[2]

స్మారక స్థలాలు

మార్చు

నిగాహ

మార్చు

ఈ సాధువు నిగాహ పట్టణాన్ని తన నివాస పట్టణంగా ఎంచుకొన్నాడు. ఈ ప్రాంతానికున్న ప్రతికూల భౌగోళిక, వాతావరణ పరిస్థుల కారణంగా దీనికి చివరి ప్రదేశంగా పేరున్నది. రోస్ (1970) రచనల ప్రకారం ఈ సమాధి కట్టడంలో పశ్చిమాన సఖి సర్వర్ సమాధితో పాటు ఈశాన్య దిశలో గురునానక్ ఆరాధనా స్థలం ఉంది. తూర్పున ఉన్న గదిలో సఖి సర్వార్ తల్లి మై ఈషన్ ఉపయోగించిన పీఠము, రాట్నము ఉన్నాయి. దీనికి దగ్గరలోనే ఠాకూర్‌ద్వార, భైరన్ బొమ్మతో కూడిన ఒక అర ఉన్నాయి.[1]

ఈ క్షేత్ర ఆవరణలోనే సఖి సర్వర్ భార్య బీబీ బాయ్, ఇతడి మహిమలకు కారణభూతుడై ఇతడు వశపరుచుకుని ఉన్న జిన్ను (ప్రేతాత్మ) యొక్క సమాధులు కూడా ఉన్నాయి.[2]

నిగాహ క్షేత్రానికి దగ్గరలోనే చోం, మోజా అనబడే మరి రెండు క్షేత్రాలు ఉన్నాయి. ఇవి రెండూ కూడా సఖి సర్వార్ అల్లుడు ముర్తజాకు చెందినవి. చోమ్‌లో ఒక రైతు చేతి యొక్క ముద్ర ఉంది. ఈ రైతు ఆశ్రయం పొందిన గుహపై దగ్గరలోని పర్వతం కూలిపోతున్నపుడు ఇతడు దానిని ఆపే ప్రయత్నం చేసినపుడు ముద్రించబడినది అని చెబుతారు.[2]

క్షేత్ర ఆవరణలోని గదులకు, పశ్చిమాన రెండు చనిపోతిన వృక్షములు ఉన్నాయి. ఇవి సఖి సర్వర్ యొక్క పెంపుడు గుర్రం కాకి యొక్క తల, మడమల నుండి పుట్టుకొచ్చినవిగా భావిస్తారు.[1]

ఇతర క్షేత్రములు / దర్శనీయ ప్రదేశాలు

మార్చు

దీనికి దగ్గరలోనే పుణ్యక్షేత్రాలు వజీరాబాద్ జిల్లా లోని ధౌన్‌కాల్ లో, పెషావర్, లాహోర్లో ఉన్నాయి.[1]. పంజాబ్ రాష్ట్రంలోనే నిగాహ పేరుతో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో సఖి సర్వార్ రో పాటు గుగ్గ కూడా పూజలందుకుంటున్నాడు. వీరి ఇద్దరి పుణ్యక్షేత్రాలను పంజ్ పీర్లు లేదా నిగాహాలుగా పిలుస్తారు.[1] హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా లోని బాబా లఖ్‌దాతను చోటా (చిన్నది) నిగాహగా పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద సంత జరుగుతుంది.[3]

ఆరాధన

మార్చు

నిగాహ లోని ఇతడి సమాధిని దర్శించే ఇతని అనుచరులను సంగ్ గా పిలుస్తారు. వీరు ఒకరి కొకరు భరైస్ గా పిలుచుకుంటారు. డోలు వాయిస్తూ కవిత్వాన్ని ఆలపించే ఇక్కడి కవులు ఇక్కడికి వచ్చే యాత్రికులకు అన్ని ప్రదేశాలను చూపిస్తూ గైడ్లుగా వ్యవహరిస్తారు. వీరు పూజాదికాలు కూడా చేస్తారు. వీరిని పీర్‌ఖానాలుగా పిలుస్తారు. సంగ్ లోని సభ్యులు ఒకరి కొకరు పీర్‌భయోర్ లేదా పీర్‌బహిన్ (సోదరుడు లేదా సోదరి) గా పిలుచుకుంటారు.[2]

యాత్రికులు మార్గమధ్యలో విశ్రాంతి తీసుకునే ప్రదేశాలను చౌకీలుగా పిలుస్తారు. ఇక్కడ యాత్రికులు సంప్రదాయాలను గౌరవిస్తూ నేలపైనే నిద్రిస్తారు. నిగాహ వరకు యాత్రను సాగించలేని యాత్రికులు కనీసం ఒక చౌకీలోనైనా విశ్రమిస్తారు. అలా కూడా చేయలేని పక్షంలో మార్గమధ్యలోని ఏదైనా గ్రామంలో ఒక రాత్రి విశ్రమిస్తారు. ఎక్కడికీ వెళ్ళలేని యాత్రికులు తమ స్వగృహాలలో కనీసం ఒక్క రోజు అయినా నేలమీద విశ్రమిస్తారు.[2]

ఈ విధంగా మంచం పై కాకుండా నేలమీద నిదురించే ఆచారాన్ని చౌకీ భర్నాగా పిలుస్తారు.[2]

సంతలు

మార్చు

పంజాబ్ ప్రాంతంలో అనేక రకాల సంతలు జరుగుతుంటాయి. అలాగే నిగాహ ప్రాంత క్షేత్రంలో కూడా ఏప్రిల్ నెలలో వారమంతా జరిగే బైశాఖి సంత జరుగుతుంది.[4] అలాగే సంతలు గుజ్రన్‌వాలా జిల్లా లోని ధౌంకనాల్ లో జూన్/జులై మాసాలలో జరుగుతాయి. పెషావర్ లో ఘండా మేలా (పతాక సంత), లాహోర్లో కదమోంకా మేలా (పాదముల సంత) జరుగుతాయి.[1]

ఈ సంతలలో సాధారణ ఆచారం ఏమనగా రౌత్ సమర్పణ. రౌత్ అనగా 18 కిలోగ్రాముల గోధుమపిండిం, దానిలో సగభాగం బరువు గల బెల్లంతో మిశ్రమంచేసి తయారుచేసే ఒక పెద్ద రొట్టె. ఈ సమర్పణ సంవత్సరంలో ఒకసారి శుక్రవారం నాడు జరుగుతుంది.[2]

రౌత్ తయారీని భయారీలు చేపడతారు. ఇందుకు ప్రతిఫలంగా వారు అందులోని పావుశాతాన్ని తీసుకుంటారు. మిగిలిన భాగాన్ని రౌత్ తయారు చేయించినవారి కుటుంబసభ్యులు, తోటి సుల్తానియన్లు (సఖి సర్వర్ అనుయాయులు) పంపిణీ చేసుకుంటారు.[2]

ముకందాపూర్ లోని చౌంకియోన్ ద మేలా అత్యంత ప్రముఖమైనది.[5] ఈ సంత సఖి సర్వార్ బలాచౌర్ పర్యటనను గుర్తుచేసుకుంటూ జరుపబడుతుంది. ఈ పర్యటనలో అతడు రత్తేవాల్ తో ప్రారంభించి ముకుందాపూర్ చేరుకుని అక్కడ తొమ్మిది రోజులు గడిపాడు. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఈ సంతను తొమ్మిది రోజులు జరుపుతారు. ఇందులో భాగంగా ఒక సంగ్ రత్తేవాల్ నుండి బయలుదేరి ముకుందాపూర్ చేరుకుంటుంది. ఈ సంగ్ కి నాయకత్వం వహించే వ్యక్తి ఒక పతాకాన్ని ధరిస్తాడు. ఈ పతాకాన్ని తోగ్ గా పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

సఖి సర్వర్

మూలాలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 Folk Religion Change and Continuity by H S Bhatti Rawat Publications ISBN 81-7033-608-2
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-22. Retrieved 2016-07-28.
  3. Replicating Memory, Creating Images: Pirs and Dargahs in Popular Art and Media of Contemporary East Punjab [1] Archived 2015-01-09 at the Wayback Machine
  4. Dawn by Suhail Yusuf | Muhammad Umar 15 04 2014
  5. "Fair and Festivals". nawanshahr.nic.in.