సర్వమంగళేశ్వర శాస్త్రి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శబ్దమంజరి చేతపట్టిన ప్రతిఒక్కరికీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారి నామం సుపరిచితమే.సంస్కృతం అభ్యసించాలన్న ఆసక్తి గలవారికి ఎలా అభ్యసించాలో తెలియక సరియైన ప్రాథమిక పాఠ్య గ్రంథాలు లేక దారీ తెన్నూ తెలియకుండా ఉన్న అయోమయస్థితిలో శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు శబ్దమంజరి నీ, సమాసకుసుమావళి నీ రచించి మహోపకారం చేశారు.ఈ రెండూ ఒకే గ్రంథముగా సంపుటీకరింపబడి సంస్కృత బాలశిక్షగా ఒక్క ఆంధ్రశీమలోనే గాక ఆసేతుహిమాచలం వ్యాప్తిలో ఉంది.సంస్కృతం చదువుకోవాలనే వారికి నాటికి నేటికీ ఇదే శరణ్యం.సమాసకుసుమావళిలోని దిగువశ్లోకంలో వారి నామధేయాలు పొదుపరిచిఉన్నాయి.
సర్వమంగళేశ్వర శాస్త్రి | |
---|---|
జననం | గన్నవరం |
మరణం | సెప్టెంబరు 22, 1952 |
ఇతర పేర్లు | అభినవ కాళిదాసు |
వృత్తి | కవి |
శ్రీమధ్యమందిర కులాంబుధి పూర్ణచంద్ర
శ్రీ సర్వమంగళమనీషికృతా సలీలం
ఏషా సమాసకుసుమావళి రాబ్జతారం
జీయాత్కృపానిధి సదాశివ సత్ప్రసాదాత్
అమలాపురం తాలూకా ముంగండ గ్రామానికి చేరువలో ఉన్న గన్నవరమనే గ్రామములో శాస్త్రిగారు జన్మించారు. విజయనగర గజపతిరాజుల ఆస్థానములో విజయరామగజపతి, నారాయణగజపతి ల కాలములో పండితులుగా ఉండేవారు.ఆసేతుహిమాచలం పర్యటించారు. ఆయాదేశాలలో ఉన్న పెక్కురు సంస్కృత పండితులతో వాదోపవాదాలు చేసి జయించారు.వీరికి అభినవ కాళిదాసు అన్న బిరుదు ఉంది.
సమాసకుసుమావళి లో శాస్త్రిగారి చమత్కార రసజ్ఞత
మార్చుశ్రీ శాస్త్రిగారు చాటూక్తులు మధురములు చమత్కార సంయుతములు.దక్షిణదేశయాత్రలో సర్వమంగళేశ్వర శాస్త్రి గారు, ఓరోజున ఆనందతాండవపురమనె ఒక అగ్రహారములో ఒక తమిళ బ్రాహ్మడు ఇంట్లో భోజనం చేసారు. ఆఇంట యజమానురాలు శాస్త్రిగారుకి నేయి వడ్డించింది. అనంతరం ఆనేతిగిన్నె మీద శాస్త్రిగారు చెప్పిన చాటువు
ఆనందతాండవపురే ద్రవిడస్య గేహే
చిత్రంవశిష్టవనితా సమ మాజ్యపాత్రాం
విద్యుల తేవ పరివృత్యతి తత్ర దర్వీ
ధారాం విలోకయతి కశ్చన యోగసిద్ధః
అర్ధము: ఆనందతాండవపురమున ఒక ద్రావిడుని యింటియందు ఆజ్యపాత్ర అరుంధతి నక్షత్రమువలె (వశిష్త వనిత) ఉంది. అంటే కనిపించి కనిపించకుండా మినుకుమినుకుమని ఉంది.అంటే అంత చిన్నది.అందులో గరిటి మెరుపు తీగవలె నాట్యమాడు చున్నది అంతలోనే కనిపించి అంతలో మాయమవుతున్నది.గరిటలోనుంచి పడే ఆజ్యధారను యోగసిద్ధి పొంది దివ్యదృష్టిని సంపాదించిన మహామహులు మాత్రమే చూడగలరు.
సత్యప్ప పంతులు అనే ఉద్యోగి మీద శ్రీ శాస్త్రిగారు చెప్పిన మరో శ్లోకం
అ మంగళే మంగళ వార సంజ్ఞా
అపుణ్యగే పుణ్యజన ప్రతీతిః
అ సత్యసే సత్యప ఇత్యభిఖ్యా
త్రయః ప్రసిద్ధా విపరీతరీత్యా
అమంగళమగు వారమునకు మంగళవారమని పేరు పెట్టుట, అతి పాపులగు రాక్షసులకు పుణ్యజనులని పేరుపెట్టుట. సంతము అనృతములే పల్కు వీనికి సత్యప్ప అనిపేరు పెట్టుట ఈ మూడును ప్రసిద్ధి విపరీతములు.
చాటువులు కాక శాస్త్రి గారి జీవితానికి సంబంధించిన చిత్రవిచిత్రములైన కథలెన్నింటినో రచయిత ఈ గ్రంథములో పొందుపరిచారు.
ఒకసారి జగన్నాధ క్షేత్రం వెళ్ళినప్పుడు శాస్త్రిగారు దేవదర్సనం చేసుకొని బయటికి వస్తూ ఆలయ ప్రాకారంలో ఉన్న మర్రిచెట్టు ఆకులు నాలుగు కోసి చేత్తో బట్టుకొన్నారట. అది ఒక ఉత్కళ పండితుడు చూచి ఇలా పృఛ్ఛ్హించినాడట.
ఉ. పం: అయ్యా మీరు మర్రియాకుల నెందుకు తెంపిరి. మం.శా: విస్తరింట కుట్టి భోజనము చేయుటకు. ఉ. పం:మర్రిఆకును భుజింతురా? మం.శా:ఏమి? నిషేధమున్నదా? ఉ. పం:లేకేమి మీకు తెలియదా? మం.శా:నాకు తెలిసినంతవరకు ఎట్టి నిషేధము లేదు. ఉ. పం:వటర్కాశ్వత్థ పత్రేషు భుక్త్వా చాంద్రాయణం దరేత్ అనిలేదా? మం.శా:దాని అర్ధము మీరేమనుకొనుచున్నారు? ఉ. పం:మర్రి, జిల్లేడు, రావి ఈఆకులలో భుజించినయెడల తత్తాప పరిహారార్ధము చాంద్రాయణ వ్రతము చేయవలెనని. మం.శా:అట్లా కాదు; చాంద్రాయణ వ్రతము చేయదలచుకొన్నవారు, వట, ఆర్క, అశ్వత్థ ఈమూడు జాతుల ఆకులలో ఏదైనా ఒకదానియందు భుజించి తరువాత నావ్రతము చేయవలనని దాని అర్ధము. అయ్యది విధిని సూచించుచున్నది కాని నిషేధము లేదు. ఉ. పం:అయన భగంతుడు వట పత్రసాయి కాడా? భగవంతుని శయ్యను భిజింపదగునా? మం.శా:మీ ఉత్కళులు భగవంతుని అవతారములలో మత్స్యకూర్మ వరాహములనే భిజించి వేయుచున్నారు గదా. ఆయన శయ్యను భుజించుట మీకు తప్పు అనిపిస్తున్నదా?
శాస్త్రిగారి కుమారుడు భగవత్పతంజలి శాస్త్రి గారికి వివాహం జరుగుతోంది. ఆడపెళ్ళివారు పెళ్ళికొడుకును తలుపుదగ్గర అటకాయించి పెళ్ళికూతురు పేరు చెబితేకాని తలుపుతీయ మని పట్టుపట్టినారు.మేము పేరుచెప్పవలసినవారము కాము, అన్నాడు పెళ్ళి కొడుకు.అలా కుదరదన్నారు ఆడపెళ్ళివారు.ప్రక్కన నిల్చున్న శాస్త్రిగారు అబ్బాయీ నీవన్న మాట ముమ్మారు చెప్పరా అన్నారు. ఆతడు మేము పేరు చెప్పవలసినవారము కాము, కాము, కాము అన్నాడు.
సరే యిక యిరువిరి పంతాలు చెల్లిపోయాయి కనుక తలుపుతీయండి అని చమత్కరించారు శాస్త్రిగారు. నలుగురూ తెల్లబోయినారు. పెళ్ళికూతురు పేరు కామాక్షి కామాక్షమ్మ.తల్లి తండ్రులు కాము కాము అని కూడా పిలుస్తారట.
ఇలాంటి చక్కటి కథలు ఎన్నో ఈగ్రంథంలో ఉన్నాయి.
శాస్త్రి గారి ఇతర రచనలు
మార్చు- కర్మజ్ఞానవివరణము (మీమాంస శాస్త్రసారం)
- వేదసారము
- పార్ధవిజయము (కావ్యం)
- సమాసకుసుమావళి (శబ్దమంజరి సహితము)
- విభక్తి విలాసము
- సర్వమంగళీయము ( వ్యాకరణ గ్రంథం)
- సన్నుతీయం (ఖండన గ్రంథమ్)
- భగవద్గీతాభాష్యము
- శ్రీ జగనాధాష్టకము
- శ్రీలలితా పంచదశీ మంత్ర వర్ణమాలా స్తోత్రము.
- సూర్యాష్టకము.
మూలము
మార్చు- 1956 భారతి మాస పత్రిక.