హంఫ్రీ డేవీ

(సర్ హంప్రీ డేవి నుండి దారిమార్పు చెందింది)

సర్ హంఫ్రీ డేవీ (జ: 17 డిసెంబర్, 1778 - మ: 29 మే, 1829) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త, నూతన ఆవిష్కర్త. సా.శ. 19 వ శతాబ్దం తొలిరోజుల్లో గనులలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. గనులలోని పెద్ద నిల్వలలో మీథేన్ వాయువు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ వాయువు ఏ కొద్ది ఉష్ణోగ్రతకైనా మండే స్వభావం కలిగి ఉంటుంది. గనులలో వెలుతురు కోస్ం దీపాలను తీసుకు వెళ్ళే టప్పుడు ఈ వాయువు తేలికగా మండుకొని భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగేది. 1815 లో సర్ హంప్రీ డేవి సేఫ్టీ దీపాన్ని కనుక్కునే వరకు ఈ గనుల ప్రమాదాలకు అడ్డూ అదుపూ ఉండేవి కాదు.

సర్ హంఫ్రీ డేవీ
హెన్రీ హోవార్డ్ గీసిన చిత్రం, 1803
జననం(1778-12-17)1778 డిసెంబరు 17
Penzance, Cornwall, గ్రేట్ బ్రిటన్
మరణం1829 మే 29(1829-05-29) (వయసు 50)
జెనీవా, స్విట్జర్లాండ్
జాతీయతబ్రిటిష్
జాతికార్నిష్
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలురాయల్ సొసైటీ, రాయల్ ఇన్‌స్టిట్యూట్
ప్రసిద్ధివిద్యుద్విశ్లేషణ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, బేరియం, బోరాన్, డేవీ దీపం
ప్రభావితులుమైఖల్ ఫారడే
The Davy lamp

జీవిత విశేషాలు

మార్చు

సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్) లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793లో ట్రూరో వెళ్లాడు. 1798లో బ్రిష్టల్‌లోని న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరాడు. అక్కడ వాయువులపై ప్రయోగాలు చేశాడు. 1801లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌' కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఒక మందులమ్మే ఆయన, ఒక వైద్యుడి దగ్గర అప్రెంటీస్ గా పనిచేస్తూ రసాయన శాస్త్రం పై మక్కువ పెంచుకున్నాడు. 1799 లో బ్రిస్టన్ లోని న్యూమాటిక్ ఇన్‌స్టిట్యూట్ లో సహాయకుడుగా పనిచేస్తూనే నైట్రస్ ఆక్సైడ్ యొక్క లక్షణాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నాడు. దీంతో ఆయన్ను 23 సంవత్సరాల వయసులోనే గ్రేట్ బ్రిటన్ లోని రాయల్ ఇన్‌స్టిట్యూషన్ వారు రసాయన శాస్త్ర ఆచార్యులుగా నియమించుకున్నారు.

ఆవిష్కరణలు

మార్చు

ఆయన ప్రధాన ఆవిష్కరణలు: క్షార, క్షార మృత్తిక లోహాలు, క్లోరిన్, అయోడిన్. ఇతడు డేవీ దీపంను కనుగొని గనులలో విషవాయువులను గుర్తించి కార్మికులు సురక్షితంగా పనిచేసుకొనే వీలు కల్పించాడు. విద్యుద్విశ్లేషణతో బ్యాటరీ విద్యుత్ ని ఉపయోగించి సాధారణ పదార్ధాలను విడగొట్టి కొత్త మూలకాలు తయారుచేయడంలో డేవీ మొదటివాడు.

భాస్వరం, సోడియం మూలకాలను 1807 వసంవత్సరంలో కనుగొన్నాడు. 1808 లో బేరియం, కాల్షియం మూలకాల్ని కనుగొన్నాడు. మెగ్నీషియం, స్ట్రోనియం మూలకాలని మొట్టమొదటి సారిగా వేరు చేసింది కూడా ఆయనే.[1]

1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి పొటాషియం తయారుచేశాడు. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి సొడియాన్ని వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్ వాయువుకి ఆ పేరును ప్రతిపాదించాడు.

చంద్రునిపై ఒక బిలానికి డేవీ పేరు పెట్టారు. నెపోలియన్ బోనా పార్టీ నుంచి ఒక పతకాన్ని పొందాడు. 1819లో హంఫ్రీ డేవీకిసర్ బిరుదు ఇచ్చి గౌరవించారు. 1829 మే 29న 50వ ఏట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.

\

డేవీ దీపం

మార్చు

బ్రిటన్ కు చెందిన డేవీ గనుల కార్మికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ దీపాన్ని గురించి ఆలోచించేవాడు. ఆక్సిజన్ తో వెలిగే దీపంవల్ల కొద్దిగనో, ఎక్కువగానో ఉష్ణం వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలకు తావు ఇవ్వకుండ సరికొత్త నమూనాలో సేఫ్టీ దీపాన్ని తయారు చేయవలసిన అవసరాన్ని డేవీ గుర్తించాడు. ఇందుకోసం యీయన నూనె దీపం చుట్టూ వైర్ గేజ్ గోడను అమర్చాడు. ఆ విధంగా ఆక్సిజన్ దీపానికి అందుతుంది. ఏ కొంచెం కూడా అంతరాయం ఉండదు. పోతే దీపం వెలగటం వల్ల వెలువడే ఉష్ణం దాని చుట్టూ ఉన్న వైర్ గేజ్ గోడను చేరి వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కారణంగా మీథెన్ వంటి వాయువులు మందుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు నివారించబడతాయి. కాకపోతె వైర్ గేజ్ వల్ల దీపపు కాంతి కొంచెం తగ్గవచ్చు. అయితే గనిలోపల భాగంలో తిరుగడానికి ఈ కాంతి చాలు. డేవీ రూపొంచించిన సేఫ్టీ దీపాలు ఈనాటికి ఉన్నాయి. ఈ దీపం వెలుగులో కలిగే మార్పు లను బట్టి వెంటనే మీథెన్ వంటి అపాయకరమైన వాయువులు ఉన్నవీ లేనివీ తెలుసుకోవచ్చు.

లాఫింగ్ గ్యాస్

మార్చు

సర్ హంఫ్రీ డెవీ సేఫ్టీ దీపాన్ని కనుగోవటానికే పరిమితం కాలేదు. 1797 నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధనా జీవితం ఆ తరువాత బతికి ఉన్నంత కాలం కొనసాగింది. నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్ గ్యాస్ (నవ్వించె వాయువు) ప్రభావాన్ని గురించి - ఈయన ఎన్నో రకాల పరిశీలనలు చేపట్టాడు. ఈయన ఈ వాయువును తయారుచేసి అరనిముషంపాటు పీల్చేవాడు. ఈయన మత్తులో పడిపోయేవాడు. కాస్సేపయ్యాక నవ్వు వస్తున్నట్లుగా గుర్తించేవాడు. ఈ అనుభవం ఆయనకు చిత్రంగా ఉండేది. నైట్రస్ ఆక్సైడ్ కు లాఫింగ్ గ్యాస్ అని పేరు పెట్టింది కూడా యీయనే.

ఈ లాఫింగ్ గ్యాస్ గురించి సర్ హండ్రీ డేవీ ప్రకటీంచడంతో ఎంతో మంది యీ వార్త పట్ల ఆసక్తినికనబరిచారు. ఒక స్త్రీ యీ గ్యాస్ ను పీచ్లి పిచ్చిగా పరిగెత్తి వీధుల వెంట పడిపోయిందట. యీ లాఫింగ్ గ్యాస్ వార్త లండన్ కు కూడా చేరుకుంది. ఫలితంగా 1800 లో రాయల్ ఇన్ స్టిట్యూషన్ లో డేవీ లెక్చరర్ కాగలిగాడు. యీ లాఫింగ్ గ్యాస్ ధర్మాల గురించి యీయన క్షుణ్ణంగా అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు.

లాఫింగ్ గ్యాస్ ఉపయోగాలు

మార్చు

ఎన్నో సంవత్సరాలు పాటు యీ లాఫింగ్ గ్యాస్ ను వినోదం కోసం సరదాగా పీల్చడం కొంతమంది అలవాటు చేసుకున్నారు.గాయ్యాళి భార్యలను అదుపులో పెట్టడానికి కూడా యీ వాయువును ఉపయోగించేవారట. యీ గ్యాస్ పీల్చి నవ్వుకుంటూ-బెంచీలను, గోడలను ఢీ కొట్టినప్పటికీ కొందరికి ఏ మాత్రం నొప్పి వేసేది కాదు. దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది వైద్యులు యీ గ్యాస్ ను ఉపయోగించి నొప్పి లేకుండా నోటి పండ్లను పీకేవారు. ఇలాగే శస్త్ర చికిత్స ల్లో కూడా ఈ గ్యాస్ ను వాడటం ప్రారంభించేవారు. మత్తు మందుగా యీ గ్యాస్ ను ఈనాటికీ ఎంతోమంది సర్జనులు వాడుతూ ఉన్నారు.

యితర పరిశోధనలు

మార్చు

డేవీ విద్యుద్విశ్లేషన ద్వారా సోడియం, పొటాషియం, లను 1807 లో వేరు చేయగలిగాడు. 1809 లో ఇలాగే క్షార భూలోహాలను కూడా వేరు చేశాడు. బోరాక్స్ ను పొటాషియంలో కలిపి వేడి చేయటం ద్వారా బోరాన్ ను ఉత్పత్తి చేశాడు. క్లోరిన్ వాయువుకు బ్లీచింగ్ లక్షనాలు ఉన్నాయని తెలియజేసి అది ఒక మూలకమని ధ్రువపరిచాడు. యీ సమయం లోనే సుమారుగా 1813 లో మైఖేల్ ఫారడే, డేవీకి అసిస్టెంత్ గా వచ్చాడు. ఇద్దరూ కలిసి అయోడిన్ గురించి తెలిపారు. వజ్రం కూడా ఒక రకంగా బొగ్గేనని స్పష్టం చేశారు. ఉప్పు నీటిలో రాగి లోహం దెబ్బ తింటుందని వెల్లడించారు. వీరిద్దరూ కలిసి ప్రచురించిన "ఎలిమెంట్స్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ" శాస్త్ర లోకంలో నివాళులను అందుకుంది.

అవార్డులు

మార్చు

డేవీ కున్న అధ్బుతమైన బోధనా నైపుణ్యం, శాస్త్ర పరిశోధనలో ఆయనకున్న ట్రాక్ రికార్డులు వెరసి ఆయన్ను తన సమకాలికుల్లో అగ్రస్థానాన్ని కట్టబెట్టాయి. ఆ రోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రెండూ శత్రువులైనప్పటికీ 1808 లో ఫ్రెంచి ఇన్‌స్టిట్యూట్ వారి ఆయనకు నెపోలియన్ ప్రైజును బహూకరించారు. 1812 లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను సర్ బిరుదుతో సత్కరించింది. 1818 లో ఇంకా ఉన్నతమైన బారోనెట్ తో సత్కరించింది. 1820 లో ఆయన రాయల్ సొసైటీకి అధ్యక్షుడయ్యాడు. డేవీ జీవిత కాలంలో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకోగలిగాడు. 1812 లో నైట్ అయ్యాడు. ఆ తరువాత బారోనెట్ అయ్యాడు. 1820 లో రాయల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇది అరుదైన గౌరవం. ఏ కొద్దిమందికో కలిగే భాగ్యం. జీవిత పర్యంతం పరిశోధస్నలలోనే గడిపినా డేవీ 1829 లో జెనీవాలో యీ లోకంతో భౌతికంగా సంబంధాలు వదులుకొని శాస్త్ర లోకంలో శాశ్వతంగా నిలిచిపోయారు.

మూలాలు

మార్చు
  1. Sir Humphry Davy." 01 July 2009. HowStuffWorks.com. <http://science.howstuffworks.com/sir-humphry-davy-info.htm> 01 April 2010.

బయటి లింకులు

మార్చు
  • The Collected Works of Humphry Davy
  • Obituary (1830)
  • Dictionary of National Biography (1888)
  • Humphry Davy, Poet and Philosopher by Thomas Edward Thorpe, New York: Macmillan, 1896
  • Young Humphry Davy: The Making of an Experimental Chemist by June Z. Fullmer, Philadelphia: American Philosophical Society, 2000
  • BBC - Napoleon's medal 'cast into sea'.