సామ్రాట్ విక్రమార్క
సామ్రాట్ విక్రమార్క 1958, ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] తాపీ ధర్మారావు కధ సమకూర్చగా, పి.ఎస్.కొట్నీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, కమలా కొట్నీస్,గోవిందరాజుల సుబ్బారావు, కస్తూరి శివరావు మున్నగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సుధీర్ పడ్కే, రాంకథం, హోంబల్, సమకూర్చారు.
సామ్రాట్ విక్రమార్క (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.కోట్నీస్ |
---|---|
తారాగణం | కమలా కోట్నీస్, గోవిందరాజుల సుబ్బారావు, రంగరాజు |
నిర్మాణ సంస్థ | ప్రభాత్ స్టూడియోస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కమలా కోట్నీస్ - సౌగంధి
- గోవిందరాజుల సుబ్బారావు - ప్రచండ
- రంగరాజు - విక్రమార్క
- ఎం.వి.ఎన్.చారి - భట్టి
- కస్తూరి శివరావు - వినోదుడు
- సూర్యకాంతం - చతురిక
- పరమేశ్వరుడు - భీషణుడు
- ఇ.వి.సరోజ - మదనమంజరి
- శాంత - లవంగి
- లక్ష్మీరాజ్యం
- రాజేశ్వరి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పి.ఎస్.కోట్నీస్
- కథ, మాటలు: తాపీ ధర్మారావు
- పాటలు: తాపీ ధర్మారావు, ఎ.ఎన్.మూర్తి
- సంగీతం: సుధీర్ ఫడ్కె, రాంకదం, హొంబళ్
- నేపథ్యగాయకులు: కె. రాణి, కృష్ణవేణి, సుందరమ్మ
- ఛాయాగ్రహణం: డి.ఎస్.కోట్నీస్, జి.కాలే
- కూర్పు: రిమాయె, రాజ్‌పుత్
- కళ: దల్వి, ధత్తే
కథ
మార్చువిక్రమార్క మహారాజు ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని రాజ్యం చేసే రోజుల్లో ప్రతి యేటా తన జన్మదినోత్సవంనాడు ప్రజలందరినీ పిలిచి వారి కోర్కెలను తీర్చడం ఆచారంగా కొనసాగించాడు. అలాంటి ఒక సందర్భంలో ఒక మాయా సిద్ధుడు విక్రమార్కుని ఆశ్రయించి మదనగిరి పర్వతం మీద తాను చేస్తున్న మహాయాగాన్ని భేతాళుడు ధ్వంసం చేయడం వివరించి ఆ యాగపరిరక్షణను యాచించగా అతడు అభయమిస్తాడు. సిద్ధుని కోరిక ప్రకారం విక్రమార్కుడు ఒక అమావాస్యనాడు బయలుదేరి వెళ్ళి ఆ యాగ ధ్వంసం చేస్తున్న భేతాళుడితో యుద్ధం చేసి గెలుస్తాడు. విక్రమార్కుని పరాక్రమాన్ని మెచ్చుకున్న భేతాళుడు ఆ మాయాసిద్ధుని కపట నాటకాన్ని వివరించి, తాను యావజ్జీవము విక్రమార్కునికి బానిసగా ఉండిపోతాడు. తన యాగం నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న సిద్ధుడు విక్రమార్కుని బలి ఇవ్వదలచి అతడిని హోమ పురుషునికి నమస్కారం చేయమంటాడు. భేతాళుని వల్ల అసలు విషయం తెలుసుకున్న విక్రమార్కుడు సిద్ధుని ఆ నమస్కార విధానం చూపమని కోరగా అతడు నమస్కరించగానే విక్రమార్కుడు అతడిని కడతేర్చి హోమ పురుషుని వల్ల వరాలను పొందుతాడు.
విక్రమార్కుడు భేతాళుని సహాయంతో ఒక రోజు రాత్రి తన ప్రేయసి అయిన స్వర్గపురి రాకుమారి సౌగంధి మందిరం చేరతాడు. అప్పుడే తన ప్రియుడి గురించి కలలు కంటున్న సౌగంధి విక్రమార్కుని ఆహ్వానించి రాబోయే దశమినాడు జరగబోయే తన స్వయంవరం గురించి తెలిపి ఆహ్వానిస్తుంది. అదే సమయంలో కుశరీనగరును రాజధానిగా పరిపాలిస్తున్న ప్రచండసేన మహారాజు మహామాయావి. సౌగంధి అందచందాలను తెలుసుకున్న ప్రచండుడు ఆమెను ఎలాగైనా తన మహారాణిగా చేసుకోవాలని నిశ్చయిస్తాడు. తన పరివారంలోని చతురిక అనే పరిచారికను సౌగంధి వద్ద కొలువుకు కుదిరి తన గుణగణాలను ప్రచారం చేయంటాడు. విక్రమార్కునికి వెళ్తున్న ఆహ్వానాన్ని మార్గమధ్యంలోనే నిరోధించి స్వయంవరానికి హాజరౌతాడు.
స్వయంవరంలో ప్రియునికోసం వెదుకుతున్న సౌగంధి తనను నిర్లక్ష్యం చేయడం చూచి ప్రచండుడు ఉగ్రుడై తన మాయాజాలంతో తనను ఎదుర్కోవచ్చిన రాకుమారులను అందరినీ శిలలుగా మార్చి సౌగంధిని అపహరించుకుని పోతాడు. సౌగంధి స్వయంవర సమాచారం తెలియని కలతతో ఉన్న విక్రమార్కుని వద్దకు స్వర్ణపురి మహారాణి, చెలికత్తె వచ్చి జరిగిన ఆపద గురించి తెలియజేస్తారు. విక్రమార్కుడు భట్టితో కలిసి ప్రచండుని కూపీ లాగడానికి బయలుదేర్తాడు. మార్గమధ్యంలో ఒక కొలను దగ్గరి శిలాశాసనం చదివి దానిప్రకారం సాహసాలు చేసి కాళికాదేవి అనుగ్రహంతో పరకాయప్రవేశ విద్యను సంపాదిస్తాడు.
సౌగంధిని తన రహస్యగృహంలో బంధించి ఆమెను తమ మనసును తనవైపు మరల్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడౌతాడు ప్రచండుడు. ప్రచండుని ఉనికిపట్టును తెలుసుకోవడానికి బయలుదేరిన విక్రమార్కుడికి దారిలో వినోదుడు అనే జూదగాడితో పరిచయం అవుతుంది. విక్రమార్కునితో స్నేహమయిన కొన్ని రోజులకే వినోదుడు దీపాలనాగి అనే మాయావి వద్ద జూదమాడి ఓడిపోయి ఆమె మాయచేత బానిసగా మారిపోతాడు. భేతాళుని ద్వారా ఆ విషయం తెలుసుకున్న విక్రమార్కుడు దీపాలనాగితో జూదం ఆడి ఆమె మాయలు తెలిసి ఆమెను ఓడిస్తాడు. తన స్నేహితుడు వినోదుడికి, ఆమెకు వివాహం జరిపిస్తాడు. మాయాగోళంలో విక్రమార్కుడు తనపైకి బయలుదేరి రావడం తెలుసుకున్న ప్రచండుడు ఉగ్రుడై తన మంత్రదండంతో అతడిని శిలలా మార్చడానికి ప్రయత్నించి విఫలుడౌతాడు. తన శిష్యుడు భూషణుడికి పరకాయప్రవేశ విద్యనేర్పి విక్రమార్కుని వెంబడించి అవకాశం చిక్కినప్పుడు అతడిని బంధించి తన వద్దకు తీసుకురమ్మని పంపుతాడు.
వినోదుని భార్య ఐన దీపాలనాగి మిథిలానగరంలోని తన చెల్లెలు మదనమంజరికి ప్రచండుడితో వైరముందని, ప్రచండుని ఆయువుపట్లు ఆమెకు తెలుసునని చెప్పి ఆమె పేరిట ఒక ఉత్తరం ఇస్తుంది. ఆ ఉత్తరం తీసుకుని విక్రమార్కుడు వినోదునితో కలిసి బయలుదేరుతాడు. మార్గంలో ఒక గ్రామంలో జరుగుతున్న పొట్టేళ్ళ పందాన్ని విక్రమార్కుడు, వినోదుడు చూస్తూ ఉంటారు. జూదగాడైన వినోదుడు ఒక పొట్టేలుపై తన ప్రాణాన్ని పందెంగా ఒడ్డుతాడు. అతని పొట్టేలు ఓడిపోయి మరణిస్తుంది. స్నేహితుని రక్షించడానికి విక్రమార్కుడు ఆ పొట్టేలు శరీరంలో పరకాయప్రవేశం చేస్తాడు. అదను కోసం కాచుకుని ఉన్న భూషణుడు విక్రమార్కుని శరీరంలోకి ప్రవేశిస్తాడు.
మదనమంజరి ఉత్తరాన్ని తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరిన మాయా విక్రముడు తరువాత ఏమి చేస్తాడు? స్నేహితుడికై సొంత శరీరాన్ని కోల్పోయిన విక్రమార్కుడు తన కార్యాన్ని ఎలా సాధిస్తాడు? ప్రచండుని చెరలో బందీ అయిన సౌగంధి గతి ఏమౌతుంది? అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది.[2]
పాటలు
మార్చు- తందాన తాన తందాన తాన తందాన తాన తందాన సిరి సంపదలతో శ్రీలు చెలంగగ చెన్నారుచునుండె
- ఒకేమాట మాటాడె ఒకే మాట మాటాడే మనోహరుడు మాటాడె మాయావినే
- రావే సద్దుచేయకే చల్లగాలీ తమ్మిపూలిప్పుడే తమ్మితోడ నిదురించే
- మహిళకు మనువే శుభమమ్మా మాంగల్య ధారణే శుభమమ్మా
- ఏమో తెలియదాయెనే అది ఏమో తెలియదాయెనే
- దేవీ శంబరీ బ్రోవగా నీ దయరాదా గౌరీ లేదా ప్రేమకు తావు
- అండపిండ బ్రహ్మాండమెల్ల ఆనందంబున ఆనందంబున తాండవమాడే
మూలాలు
మార్చు- ↑ web master. "Samrat Vikramarka". indiancine.ma. Retrieved 19 June 2021.
- ↑ తాపీ ధర్మారావు (1958). సామ్రాట్ విక్రమార్క పాటల పుస్తకం (1 ed.). p. 18. Retrieved 19 June 2021.