కస్తూరి శివరావు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కస్తూరి శివరావు ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు.[1] తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. చూడామణి, స్వర్గసీమ, బాలరాజు, గుణసుందరి కథ ఈయన నటించిన ముఖ్యమైన సినిమాల్లో కొన్ని. నటుడిగా మంచి పేరు, ధనం సంపాదించి, ఖరీదైన కారుల్లోనూ తిరిగాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. తర్వాత ఆస్తులు తరిగి పోయాయి. అవసాన దశలో పేదరికం అనుభవించి చివరకు అనామకుడిగా మరణించాడు.
కస్తూరి శివరావు | |
---|---|
జననం | 6 మార్చి, 1913 |
మరణం | 1966 |
వృత్తి | నటుడు |
బాల్యం
మార్చుశివరావు 1913 మార్చి 6న కాకినాడలో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నతనంలో చదువుమీద తప్ప మిగతా అన్నింటిలో ఆసక్తి చూపించేవాడు. హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు వాయించేవాడు. మంచి గాత్రంతో పద్యాలు, పాటలు పాడేవాడు. శివరావు తండ్రి దగ్గర చదువుకుని సినీ రంగంలో అడుగు పెట్టిన సి. పుల్లయ్యను సంప్రదించి తన కొడుకును దారిలో పెట్టమన్నాడు.
సినీ జీవితం
మార్చుశివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్ రికార్డులుగా ఇచ్చాడు. వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డాడు. తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, స్వర్గసీమ (1945) తో ఇంకా ప్రేక్షకులకు చేరువయ్యాడు. బాలరాజు (1948) ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళితే, శివరావు దగ్గర మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
వెలుగు తగ్గిన తార
మార్చుప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది. రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాల్లో అవకాశాలను దెబ్బ తీసింది. ఐనా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు.
శివరావుకి అంతకుముందున్న ప్రఖ్యాతిని నాటకరంగం బాగా ఉపయోగించుకుంది. తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి బ్యూక్ కారు వుండేది. అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్ కారునే వాడేవారు. మద్రాసు పాండీ బజార్లో ఆ బ్యూక్ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంట పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా తగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడిని. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల కంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు. ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన శివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు. "తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే! అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని పరిస్థితిలో శివరావు మీద అభిమానంతో ఎన్.టి.రామారావు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించాడు. సినిమా చిత్రీకరణలకు కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదు.
మరణం
మార్చుశివరావు చివరి దశలో వ్యసనాలకు బానిస అయ్యాడు.[2] అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా 1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. చివరకు అద్దె కారు డిక్కీలో, మధ్యలో ఇబ్బందులు పడుతూ మద్రాసు చేరుకున్నాడు. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డమ్ లో లేదనో, గ్లామర్ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది చివరిచూపులకు రాలేదు.
మూలాలు
మార్చు- ↑ "కస్తూరి శివరావు చివరి రోజుల్లో". స్వాతి. Archived from the original on 2020-10-10. Retrieved 2018-12-31.
- ↑ టి. ఎస్, జగన్మోహన్. హాస్య నట చక్రవర్తి రేలంగి. p. 95.[permanent dead link]