సార్వభౌమిక దేశపు దివాలా

సార్వభౌమిక దేశపు ప్రభుత్వం తమ అప్పును తిరిగి చెల్లించలేకపోవడం లేదా చెల్లించకపోవడం

సార్వభౌమిక దేశ ప్రభుత్వం తన రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన సమయంలో పూర్తిగా తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడం లేదా చెల్లించేందుకు నిరాకరించడాన్ని సార్వభౌమిక దేశపు దివాలా అంటారు. దీన్ని ఇంగ్లీషులో సావరిన్ డిఫాల్ట్ అంటారు. బకాయి చెల్లింపులు నిలిపివేసేటపుడు ఆ ప్రభుత్వం, రుణాలను చెల్లించలేమని గాని లేదా పాక్షికంగా మాత్రమే చెల్లిస్తామని గానీ ప్రకటన చెయ్యవచ్చు లేదా అసలు ప్రకటన చెయ్యకనే పోవచ్చు.

కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు ద్రవ్యోల్బణం ద్వారా తమ అప్పుల నిజమైన భారం నుండి తప్పించుకున్నాయి. వాస్తవంగా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో రుణాన్ని తీర్చేస్తారు కాబట్టి సాధారణ అర్థంలో దీన్ని "దివాలా" అనరు. కొన్నిసార్లు ప్రభుత్వాలు తమ ద్రవ్య విలువను తగ్గించుకుంటాయి. డబ్బును ఎక్కువగా ముద్రించడం ద్వారా గానీ, లేదా తమ కరెన్సీలను విలువైన లోహాలుగా లేదా విదేశీ కరెన్సీగా స్థిర ధరలకు మార్చుకుని దాని చెలామణీని ముగించడం మొదలైనవి చేసి ఇలా ద్రవ్యవిలువను తగ్గించుకోవచ్చు. వడ్డీ లేదా మూలధన ఎగవేత కంటే దీన్ని లెక్కించడం కష్టమైన పని.

రుణదాతలు లేదా బాండ్ కొనుగోలుదారులు, ప్రభుత్వం తమ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవుతుందని అనుమానించడం ప్రారంభిస్తే, ఎగవేత ముప్పుకు పరిహారంగా వారు అధిక వడ్డీ రేటును డిమాండ్ చేయవచ్చు. ప్రభుత్వం రుణాన్ని గౌరవించడంలో విఫలమవుతుందనే భయంతో వడ్డీ రేటు పెరగడాన్ని సార్వభౌమిక రుణ సంక్షోభం అంటారు. ప్రత్యేకించి, స్వల్పకాలిక బాండ్ల ద్వారా తెచ్చే అప్పులపై ఆధారపడినప్పుడు ప్రభుత్వాలు సార్వభౌమ రుణ సంక్షోభానికి గురవుతాయి. ఎందుకంటే ఇది వారి స్వల్పకాలిక బాండ్ ఫైనాన్సింగ్, వారి దీర్ఘకాలిక ఆస్తి విలువల మధ్య మెచ్యూరిటీ అసమతుల్యతను సృష్టిస్తుంది.

కరెన్సీ అసమతుల్యత కారణంగా కూడా వారు సార్వభౌమ రుణ సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉంది: వారి స్వంత కరెన్సీలో బాండ్లకు విదేశాలలో పరపతి లేనపుడు, దేశం విదేశీ కరెన్సీలో బాండ్లను జారీ చేస్తాయి. వారి స్వంత కరెన్సీ విలువ తగ్గునపుడు, ఆ బాండ్లను తిరిగి చెల్లించడం చాలా ఖరీదైన పని అవుతుంది. [1]

సార్వభౌమ ప్రభుత్వపు నిర్వచనం ప్రకారం, అది దాని స్వంత వ్యవహారాలపై నియంత్రణ దానిదే. కాబట్టి, అది తన రుణాన్ని తిరిగి చెల్లించడంలో దానిపై నిర్బంధమేమీ ఉండదు. [2] అయినప్పటికీ, రుణాలు ఇచ్చే దేశాల నుండి ప్రభుత్వాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, రుణదాత దేశం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు రుణగ్రహీత దేశంపై యుద్ధ బెదిరింపులు చేసేవి లేదా యుద్ధమే చేసేవి. (UN చార్టర్ ఆర్టికల్ 2 (4) ద్వారా దేశాలు ఇతర దేశాలపై బలాన్ని ఉపయోగించడాన్ని నిషేధించక ముందు). ఉదాహరణకు, 1882లో, యునైటెడ్ కింగ్‌డమ్ ఈజిప్టుపై దాడి చేసింది. 1890ల మధ్యకాలంలో వెనిజులాలో యునైటెడ్ స్టేట్స్ యొక్క " గన్‌బోట్ దౌత్యం", 1915లో ప్రారంభమైన హైతీపై అమెరికా ఆక్రమణ కూడా దీనికి ఉదాహరణలే.

దివాలా తీసిన ప్రభుత్వం మరింత రుణం పొందలేకవచ్చు; దాని విదేశీ ఆస్తులలో కొన్నిటిని జప్తు చేయవచ్చు; [3] అలాగే దేశీయంగా అప్పులిచ్చినవారు తమ రుణాన్ని తిరిగి చెల్లించమని రాజకీయంగా ఒత్తిడి చేయవచ్చు. అందువల్ల, ప్రభుత్వాలు చాలా అరుదుగా గానీ తమ రుణం యావత్తునూ ఎగగొట్టవు. దాని బదులు అవి, తమ రుణదాతలతో చర్చలు జరిపి రుణ పునర్వ్యవస్థీకరణ చేయమని లేదా రుణాన్ని పాక్షికంగా తగ్గించమని గానీ కోరతాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సార్వభౌమ రుణ పునర్నిర్మాణం కోసం రుణాలు ఇస్తుంది. సార్వభౌమ రుణంలో మిగిలిన భాగాన్ని చెల్లించడానికి నిధులు అందజేయడానికి అది కొన్ని షరతులు విధిస్తుంది. దేశంలో అవినీతిని తగ్గించడం, లాభాపేక్షలేని ప్రభుత్వ రంగ సేవలను తగ్గించడం వంటి పొదుపు చర్యలు, పన్నులు పెంచడం వంటి షరతులపై రుణాలు అందిస్తుంది. కొన్నిసార్లు, అవినీతి లేని లాభదాయకంగా ఉండే ఆర్థిక రంగాలను జాతీయం చేయడం వంటి రాబడిని పెంచే ఇతర రూపాలను కూడా సూచిస్తుంది. 2010 మే లో గ్రీకు బెయిలౌట్ ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత, సార్వభౌమిక దివాలాను నివారించడానికి, స్పెయిన్, పోర్చుగల్, తదితర దేశాలు తమ వాణిజ్య, కరెంట్ ఖాతా లోటులను మిగులుగా మార్చుకున్నాయి. [4] ప్రస్తుతం, CIS లోని కొన్ని సభ్య దేశాలు ( అర్మేనియా, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్ ), కొన్ని ఆఫ్రికన్ దేశాలు ( కామెరూన్, ఈజిప్ట్ ), పాకిస్తాన్, అలాగే అనేక ఇతర దేశాలు, ఆ దేశాల ఆరు నెలల జిడిపి కి మించి కేంద్ర ప్రభుత్వ రుణాలను సేకరించాయి.

కారణాలుసవరించు

ఆర్థిక చరిత్రకారుడు ఎడ్వర్డ్ ఛాన్సలర్ ప్రకారం, గతంలో సార్వభౌమిక దివాలాలకు దారితీసిన కారణాలు కొన్ని ఇవి: [5]

 • ప్రపంచ పెట్టుబడుల ప్రవాహాలు తిరోగమించడం
 • మందబుద్ధితో అప్పులివ్వడం
 • మోసపూరితంగా అప్పులివ్వడం
 • విపరీతమైన విదేశీ అప్పులు
 • పేలవమైన క్రెడిట్ చరిత్ర
 • అనుత్పాదక రుణాలివ్వడం
 • రోల్ ఓవర్ ముప్పు
 • క్షీణించిన ఆదాయాలు
 • పెరుగుతున్న వడ్డీ రేట్లు
 • వినాశకర అప్పు (టర్మినల్ డెట్) [నోట్స్ 1]

బ్యాంకుల వంటి విదేశీ పెట్టుబడిదారులు అత్యున్నత న్యాయస్థానాల ద్వారా గానీ చర్చల ద్వారా గానీ, రాజకీయ మద్దతు ద్వారా గానీ ప్రభుత్వాల నుండి సకాలంలో చెల్లింపులను వసూలు చేసుకోలేక పోవడం సార్వభౌమ ఎగవేతలో ముఖ్యమైన అంశం; సార్వభౌమాధికార రాజ్యాలకు వ్యతిరేకంగా రుణదాతల హక్కులను అమలు చేయడం కష్టం. ఇటువంటి ఉద్దేశపూర్వక ఎగవేతలు వివిధ రకాల సార్వభౌమ దొంగతనంగా పరిగణించవచ్చు; ఇది దోపిడీని పోలి ఉంటుంది. [6] [7] సార్వభౌమిక దివాలా అనేది ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానాల్లో ఉన్న చీకటి కోణం అని కూడా భావిస్తారు. [8]

దేశపు దివాలా/అధిక రుణభారంసవరించు

ఒక దేశం, ఆర్థిక కారణాల దృష్ట్యా, దాని ఖజానా బాధ్యతలను ఎగవేస్తే, లేదా ఇకపై తన రుణాలు, బాధ్యతలను నిర్వహించడం లేదా ఈ రుణంపై వడ్డీని చెల్లించలేకపోయినా లేక చెల్లించడం ఇష్టం లేకపోయినా, అది సార్వభౌమిక దివాలాను ఎదుర్కొంటుంది. ఒక దేశం దివాలా ప్రకటన తీసినట్లు భావించడానికి, ఆ దేశం బకాయి పడ్డ వడ్డీలో కొంత భాగాన్ని లేదా తీర్చాల్సిన అప్పులో కొంత భాగాన్ని మాత్రమే చెల్లించగలిగినా లేదా చెల్లించేందుకు సిద్ధపడినా [6] చాలు.

దీనికి కారణాల్లో కొన్ని:

 • ప్రజా రుణంలో భారీ పెరుగుదల
 • ఉపాధి తగ్గడం, తద్వారా పన్ను రాబడి తగ్గడం
 • ప్రభుత్వ నియంత్రణ లేదా ఆర్థిక మార్కెట్ల నియంత్రణల ముప్పు
 • ఋణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడం కోసం తీసుకునే పొదుపు చర్యలపై ప్రజల అశాంతి

లిక్విడిటీసవరించు

ద్రవత్వం, దివాలా ల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని ఆర్థిక సాహిత్యం ప్రతిపాదిస్తుంది. ఒక దేశం తగినంత ఆస్తులను అమ్మలేని స్థితిలో ఉన్నందున పెండింగ్‌లో ఉన్న వడ్డీ లేదా అసలు చెల్లింపులను తాత్కాలికంగా తీర్చలేకపోతే, దాన్ని "ద్రవ్యత లేమి కారణంగా దివాలా ఉంది" అంటారు. ఈ భావనలో "తాత్కాలికంగా మాత్రమే ద్రవ్యం లేని" ఆస్తులు ద్రవ్యంగా మారిన వెంటనే చెల్లింపులు జరిగిపోతాయి. అంటే, ద్రవ్యత్వ లేమి అనేది తాత్కాలిక స్థితి మాత్రమే నన్నమాట. ఈ భావనలో బలహీనత ఏమిటంటే, ఒక ఆస్తి తాత్కాలికంగానే లిక్విడ్ కాదు అని నిరూపించడం ఆచరణాత్మకంగా అసాధ్యం.

ప్రభుత్వ మార్పుసవరించు

ప్రభుత్వంలో మార్పులు జరిగినా, మునుపటి ప్రభుత్వాలు సృష్టించిన ఆర్థిక ఒప్పందాల పట్ల దేశ బాధ్యత సాధారణంగా మారదు. అయితే, విప్లవాత్మక పరిస్థితుల్లో పాలన మార్పు తర్వాత కొత్త ప్రభుత్వం మునుపటి ప్రభుత్వ చట్టబద్ధతను ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఇలాంటి ఖజానా బాధ్యతల ఎగవేతను చెల్లని రుణంగా పరిగణిస్తారు.

ముఖ్యమైన ఉదాహరణలు:

 • ఫ్రెంచ్ విప్లవం తర్వాత హౌస్ ఆఫ్ బోర్బన్ రుణాల ఎగవేత.
 • 1850లో డెన్మార్క్ ద్వారా బాండ్ల ఎగవేత. వీటిని జర్మన్ కాన్ఫెడరేషన్ స్థాపించిన హోల్‌స్టెయిన్ ప్రభుత్వం జారీ చేసింది.
 • 1917లో సోవియట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యన్ సామ్రాజ్యం చేసిన అప్పుల ఎగవేత. [9]
 • పద్నాలుగో సవరణలోని సెక్షన్ 4 ఆమోదం ద్వారా అంతర్యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ద్వారా కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన అప్పుల ఎగవేత

దేశం అంతరించడంసవరించు

ఏదైనా దేశం అంతరించినపుడు దాని బాధ్యతలు ఒకటి లేదా అనేక వారసుల దేశాలకు చెందుతాయి. ఉదాహరణకు, సోవియట్ యూనియన్ రద్దైనపుడు, ఎస్టోనియా, రష్యా, జార్జియా, ఉక్రెయిన్ మొదలైన వారస దేశాలు ఏర్పడ్డాయి. సోవియట్ దేశం ఉనికిలో లేదు, కానీ దాని రుణం వారసత్వ దేశాలకు వారసత్వంగా వెళ్ళింది. [10]

రుణ చెల్లింపు విధానాలుసవరించు

సార్వభౌమ దేశాలు తమ రుణాన్ని ఎందుకు తిరిగి చెల్లిస్తాయనే దానిపై రెండు విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి.

ప్రతిష్ఠ మార్గంసవరించు

అంతర్జాతీయ మూలధన మార్కెట్‌ల నుండి పెట్టుబడులు పొందడాన్ని దేశాలు విలువైనవిగా పరిగణిస్తాయని ప్రతిష్ఠ మార్గం చెబుతుంది. ఎందుకంటే ఇది అస్థిర ఉత్పత్తి, పెట్టుబడుల్లో హెచ్చుతగ్గుల అవకాశాల నేపథ్యంలో వినియోగాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పిస్తుంది. రుణగ్రహీత సార్వభౌమాధికార దేశం అయినందున ఈ విధానం చట్టపరమైన లేదా సైనిక చర్య వంటి అంశాలను పరిగణించదు. పేలవమైన పేరున్న రుణగ్రహీత దేశాలు ఈ మూలధన మార్కెట్‌ల నుండి డబ్బును పొందలేవు. [11]

శిక్షా మార్గంసవరించు

శిక్షా విధానం రుణగ్రహీతపై చట్టపరంగానో, సైనిక శక్తి ద్వారానో ఏదో ఒక రూపంలో చర్య తీసుకుంటారని నిర్దేశిస్తుంది. రుణదాత వారి పెట్టుబడిని తిరిగి పొందడానికి చట్టపరమైన లేదా సైనిక బెదిరింపులను ఉపయోగిస్తారు. ఈ శిక్ష వలన, రుణగ్రహీతలు తమ స్వంత కరెన్సీలో రుణం తీసుకోకుండా నిరోధిస్తుంది. [11]

పరిణామాలుసవరించు

సార్వభౌమిక దివాలా వలన అప్పిచ్చిన రుణదాతలు అలాగే ఆర్థిక వ్యవస్థ, పౌరులు ప్రభావితమవుతారు.

రుణదాతలకు పరిణామాలుసవరించు

రుణదాతలకు తక్షణ నష్టం, ఆ దేశానికి వారిచ్చిన అప్పులపై అసలు, వడ్డీని కోల్పోవడం.

ఈ సందర్భంలో చాలా తరచుగా అంతర్జాతీయంగా చర్చలు జరిగి పాక్షిక రుణ రద్దు ( జర్మన్ బాహ్య రుణాలపై లండన్ ఒప్పందం 1953) లేదా రుణ పునర్నిర్మాణం (ఉదా. 1980లలో బ్రాడీ బాండ్స్) వంటి ఒప్పందాలు కుదురుతాయి. ఈ రకమైన ఒప్పందంలో రుణదాత పెద్ద మొత్తంలో అప్పును కోసేందుకు ఒప్పుకుని పాక్షికంగా తిరిగి చెల్లింపుకు ఒప్పుకుంటారు. అర్జెంటీనా ఆర్థిక సంక్షోభం (1999–2002) విషయంలో కొంత మంది రుణదాతలు 75% వరకు రుణాలను తగ్గించుకోడానికి అంగీకరించారు. మరికొందరు మెరుగైన పరిహారం లభిస్తుందనే ఆశతో, ప్రభుత్వంలో మార్పు జరిగి (2015) వేచి ఉండేందుకు సిద్ధపడ్డారు.,

దేశానికి పర్యవసానాలుసవరించు

ఒక దేశం అప్పులను చెల్లించలేనపుడు, నిర్దిష్ట రుణదాతలకు దాని ఆర్థిక బాధ్యతలు/అప్పులను విస్మరిస్తుంది. దీని తక్షణ ప్రభావం, రుణభారం తగ్గిపోవడం, దానిపై వడ్డీపై చెల్లింపులలో తగ్గిపోవడం జరుగుతుంది. మరోవైపు, ఎగవేత వల్ల రుణదాతల వద్ద ఆ దేశ ప్రతిష్ఠ దెబ్బతిని, మరింత అప్పు పొందగల దేశ సామర్థ్యం క్షీణిస్తుంది.[6] కొన్ని సందర్భాల్లో విదేశీ రుణదాతలు రుణగ్రహీత దేశపు ద్రవ్య సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించవచ్చు లేదా యుద్ధం ప్రకటించవచ్చు.

పౌరులపై పరిణామాలుసవరించు

వ్యక్తులు గానీ, సంస్థలు గానీ దేశానికి అప్పిచ్చిన రుణదాతలైతే (ఉదా. ప్రభుత్వ బాండ్‌లు ), అప్పుడు ఎగవేత వలన వారి సంపద విలువ తగ్గిపోతుంది.

అదనంగా, సార్వభౌమిక ఎగవేత వలన రుణగ్రహీత దేశంలో క్రింది పరిస్థితులు సంభవించవచ్చు:

 • దేశానికి ఇచ్చిన క్రెడిట్‌లపై బ్యాంకులు రద్దు చేసుకోవాల్సి రావడంతో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తుతుంది.
 • అంతర్గత డిమాండ్ పడిపోతుంది. పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకుంటారు. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది.
 • విదేశీ పెట్టుబడిదారులు ఈ జాతీయ ఆర్థిక వ్యవస్థను తప్పించుకోవడం వల్ల కరెన్సీ సంక్షోభం ఏర్పడుతుంది

రుణగ్రహీత దేశంలో పౌరులపై అధిక నిరుద్యోగం వలన, సేవలు, ప్రయోజనాల తగ్గుదల వలన పరోక్షంగా ప్రభావాన్ని పడుతుంది. అయితే, ద్రవ్యపరంగా సార్వభౌమాధికారం కలిగిన దేశం ప్రతికూల పరిణామాలను తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయడానికి, సామాజిక/ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోగల అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 1994 లో బ్రెజిల్ తన ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడానికి చేపట్టిన ప్లానో రియల్. [12]

సార్వభౌమిక ఎగవేతల ఉదాహరణలుసవరించు

అప్పులను తీర్చడంలో దేశాల వైఫల్యం చాలా సందర్భాలలో కనిపించింది. మధ్యయుగ ఇంగ్లండు అనేక సార్లు చెల్లింపులను ఎగవేసింది. [13] స్పెయిన్‌కు చెందిన ఫిలిప్ II 1557, 1560, 1575, 1596 లలో నాలుగుసార్లు రుణాన్ని ఎగవేసాడు. ఈ సార్వభౌమిక ఎగవేత జర్మన్ బ్యాంకింగ్ హౌస్‌లను గందరగోళంలో పడేసింది. స్పానిష్ ఫైనాన్షియర్‌లుగా ఫగ్గర్స్ పాలనను ముగించింది. జెనోవా బ్యాంకర్లు హబ్స్‌బర్గ్ వ్యవస్థకు ద్రవ క్రెడిట్, ఆధారపడదగిన సాధారణ ఆదాయాన్ని అపరిమితంగా అందించారు. బదులుగా, తదుపరి సైనిక వెంచర్లకు మూలధనాన్ని అందించడానికి అమెరికన్ వెండిని సెవిల్లె నుండి జెనోవాకు బదిలీ చేసారు.

1820లలో లండన్‌లోని బాండ్ మార్కెట్‌లోకి ప్రవేశించిన అనేక లాటిన్ అమెరికా దేశాలు దివాలా తీసాయి. పంతొమ్మిదవ శతాబ్దంలో ఇవే దేశాలు తరచుగా దివాలా తీసేవి. అయితే కొన్ని రుణాలను మాఫీ చేయడంతో సహా రుణాల పునర్వ్యవస్థీకరణలతో పరిస్థితిని వేగంగా పరిష్కరించుకున్నాయి. [14]

అమెరికా లోని అనేక రాష్ట్రాలు 19వ శతాబ్దం మధ్యలో ఎగవేసాయి. [15] చివరిసారిగా 1933 లో ఆర్కాన్సాస్ డిఫాల్ట్ అయింది.

ఇటీవల గ్రీస్ అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెల్లింపులను ఎగవేసిన మొదటి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. 2015 జూన్‌లో IMFకి $1.7 బిలియన్ల చెల్లింపును గ్రీస్ ఎగవేసింది. [16]

నోట్స్సవరించు

 1. తీసుకున్న అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, ఆదాయాన్ని మించిపోతే ఆ స్థాయిని వినాశకర అప్పు (టర్మినల్ డెట్) అంటారు

మూలాలుసవరించు

 1. Eichengreen, B.; Hausmann, R. (2005). Other People's Money: Debt Denomination and Financial Instability in Emerging Economies. Chicago: Univ. of Chicago Press. ISBN 0-226-19455-8. 
 2. Borensztein, E.; Panizza, U. (Nov 10, 2010). "The Costs of Sovereign Default: Theory and Reality". VOXLACEA.
 3. This time is different: Eight Centuries of Financial Folly (p. 54ff). https://archive.org/details/thistimeisdiffer00rein_0. 
 4. Avetian, Samson (2019). Armenia Economy: The Next 25 Years. Yerevan: Antares. pp. 67–72. ISBN 978-9939-76-173-2. 
 5. Reflections on the sovereign debt crisis, Edward Chancellor, GMO White Paper, Juli 2010.
 6. 6.0 6.1 6.2 Wright, Mark. The Natural Resources Trap: Private Investment without Public Commitment. http://www.econ.ucla.edu/mlwright/research/workingpapers/Papers.html#Theft.  ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "theft" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 7. Hagerty, James R. (17 December 2009). "Is Walking Away From Your Mortgage Immoral?".
 8. "Sovereign Default: The dark side of globalization and capitalism". AllISayIs.com. August 2015.
 9. Landon-Lane, J., Oosterlinck, K. (2006), "Hope springs eternal: French bondholders and the Soviet Repudiation (1915–1919)", Review of Finance, 10, 4, pp. 507–535.
 10. "26 years on, Russia set to repay all Soviet Union's foreign debt". The Straits Times. SPH Media Limited. 26 March 2017. Retrieved 8 March 2022.
 11. 11.0 11.1 . "Why sovereigns repay debts to external creditors and why it matters".
 12. Lim, Richard (2011-06-20). "Brazil's Battle Against Inflation". Soundsandcolours.com. Archived from the original on 2013-10-16. Retrieved 2013-10-14.
 13. Bell, Adrian R.; Brooks, Chris; Moore, Tony. "England's history of defaulting on European lenders shows repercussions of not paying Brexit bill". The Conversation (in ఇంగ్లీష్). Retrieved 2020-07-20.
 14. Erika Jorgensen and Jeffrey Sachs, "Default and Renegotiation of Latin American Foreign Bonds in the Interwar Period" In: Barry J. Eichengreen and Peter H. Lindert, The International Debt Crisis in Historical Perspective
 15. Frum, David (2020-04-25). "Why Mitch McConnell Wants States to Go Bankrupt". The Atlantic (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-02.
 16. Liakos, Virginia Harrison and Chris (2015-06-30). "Greece defaults on $1.7 billion IMF payment". CNNMoney. Retrieved 2017-04-26.

వనరులుసవరించు

 • D. ఆండ్రూ ఆస్టిన్ (2016), US ప్రభుత్వం ఎప్పుడైనా "ఎగవేసిందా"?
 • గిల్లెర్మో కాల్వో (2005), ఎమర్జింగ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ టర్మోయిల్: బ్యాడ్ లక్ లేదా బ్యాడ్ పాలసీ?
 • బారీ ఐచెన్‌గ్రీన్ (2002), ఫైనాన్షియల్ క్రైసెస్: అండ్ వాట్ టు డూ ఎబౌట్ దెమ్ .
 • బారీ ఐచెన్‌గ్రీన్, రికార్డో హౌస్మాన్, eds., (2005), అదర్ పీపుల్స్ మనీ: డెట్ డినామినేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ .
 • బారీ ఐచెన్‌గ్రీన్, పీటర్ లిండర్ట్, eds., (1992), ది ఇంటర్నేషనల్ డెట్ క్రైసిస్ ఇన్ హిస్టారికల్ పెర్స్‌పెక్టివ్ .
 • M. Nicolas J. Firzli (2010), Greece and the Roots the EU డెట్ క్రైసిస్ .
 • చార్లెస్ కలోమిరిస్ (1998), 'బ్లూప్రింట్స్ ఫర్ ఏ న్యూ గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్' .
 • 978-0-691-14216-6జీన్ టిరోల్ (2002), ఫైనాన్షియల్ క్రైసెస్, లిక్విడిటీ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ .