సింహాద్రి శివారెడ్డి

సింహాద్రి శివారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.[1]

జీవిత విశేషాలుసవరించు

సుదీర్ఘ కాలం పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేసిన శివారెడ్డి పాతతరం కమ్యూనిస్టు నాయకుల్లో ప్రముఖులు. తెలంగాణా సాయుధ పోరాటం లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలోను, ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు జైలు జీవితం గడిపారు. మంగళగిరి డివిజన్‌, గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన శివారెడ్డి, జిల్లాలో సిపిఎం ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. పార్టీ పిలుపును అందుకుని సొంత ఆస్తులను సైతం త్యాగం చేసి ఉద్యమంలో పని చేశారాయన. తన సర్వస్వాన్ని త్యాగం చేయడమే కాకుండా తన కుటుంబం, బంధువులనూ కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దిన ఆదర్శ కమ్యూనిస్టు శివారెడ్డి.

మంగళగిరి మండలం కాజ గ్రామంలో ధనిక రైతు కుటుంబంలో జన్మించిన శివారెడ్డి 1946 లో పార్టీలో చేరి, స్వగ్రామంలో పాలేర్ల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో అజ్ఞాతంలో ఉన్న నాయకులకు ఆశ్రయం ఏర్పాటు చేశారు. 1950లో అరెస్టయి ఆయన పోలీసుల చిత్రహింసలకు గురయ్యారు. అంత నిర్బంధంలోనూ తన ఆస్తులు అమ్మి పార్టీకి సమర్పించారు. వినుకొండ అడవుల్లో గెరిల్లా దళంలో చేరి పని చేశారు. స్థానిక భూస్వాములు పేదల నుంచి బలవంతంగా రాయించుకున్న ప్రామిసరీ నోట్లను దగ్ధం చేసే కార్యక్రమాలు చేపట్టారు. అనేక మాసాలు జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పార్టీ చీలిక అనంతరం సిపిఎంలో చేరి గుంటూరు జిల్లా కమిటీ సభ్యులుగా, 1981 నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. చివరి వరకు కమ్యూనిస్టు కార్యకర్తగా, నాయకునిగా సేవలు అందించారు.[1]

మరణంసవరించు

ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ తన 90వ యేట ఫిబ్రవరి 24 2017 న గుంటూరులోని కారుమూరు వైద్యశాలలో కన్ను మూసారు. ఆయన భార్య సింహాద్రి రత్తమ్మ గతంలోనే కన్ను మూసారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు