స్వరాజ్య పత్రిక
స్వరాజ్య పత్రిక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం ప్రారంభించి నిర్వహించిన పత్రిక. స్వరాజ్య పత్రిక సంచికలు తెలుగు, తమిళ, ఆంగ్లభాషల్లో ఒకేమారు వెలువడేవి.
ప్రచురణకర్త | టంగుటూరి ప్రకాశం పంతులు |
---|---|
స్థాపించినది | 1921, అక్టోబరు 29 |
రాజకీయత మొగ్గు | జాతీయోద్యమ అనుకూల పత్రిక |
ముద్రణ నిలిపివేసినది | 1930 |
కేంద్రం | మద్రాసు(నేటి చెన్నై) |
నేపథ్యం
మార్చుబారిస్టరుగా టంగుటూరి ప్రకాశం మద్రాసు న్యాయస్థానంలోనే కాక ఆంధ్రదేశంలోని పలు న్యాయస్థానాల్లో పనిచేస్తూ అపారమైన డబ్బు, కీర్తి పొందుతున్న సమయంలో గాంధీజీ పిలుపు మేరకు వృత్తిని త్యజించారు. ఆ సమయంలోనే ప్రకాశం స్వరాజ్య సాధన ఆశయాన్ని ప్రతిబింబించేలా ఈ పత్రికను ప్రారంభించారు.
చరిత్ర
మార్చుప్రకాశం పంతులు 1921 అక్టోబరు 29న స్వరాజ్య పత్రికను స్థాపించారు. పత్రిక అనతికాలంలోనే ప్రజాభిమానాన్ని సంపాదించింది. 1930 వరకూ ప్రచురణ పొందిన పత్రిక ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో ప్రభుత్వ నిర్బంధాలకు లోనైంది. పత్రికను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు బ్రిటీష్ ప్రభుత్వం భారీ ధరావతు సొమ్మును చెల్లించాలని నిర్దేశించింది. అప్పటికే పత్రికా నిర్వహణ వల్ల ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రకాశం ఆ డబ్బును సమకూర్చుకోలేక పత్రికను మూసివేయాల్సి వచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందంలో భాగంగా పత్రికపై ఒత్తిళ్లు, నిర్బంధాలు సడలడంతో స్వరాజ్య పత్రికను పునఃప్రారంభించారు. ఐతే ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకావడంతో తప్పనిసరి పరిస్థితుల నడుమ ఈ పత్రికను మూసేశారు. 1935లో పత్రికను పునఃప్రారంభించేందుకు కొన్ని విఫలయత్నాలు చేశారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పత్రికను నిర్వహించేందుకు ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. 1920 నాటికి తెలుగు, తమిళ ప్రాంతాల్లో ప్రఖ్యాతి పొందిన న్యాయవాదిగా పొలాలు, తోటలు, ఇళ్లు, నగదు, బంగారం రూపేణా ఎంతో సొమ్ము కూడబెట్టిన ప్రకాశం ఈ పత్రిక నిర్వహణలోనే ఆ డబ్బు అంతా కోల్పోయారు. ఆ రోజుల్లోనే నెలకు దాదాపుగా లక్ష వరకూ సంపాదించిన ప్రకాశం అంతటి అపార ధనసంపదలు లాభాపేక్ష లేకుండా ఈ పత్రికను నిర్వహించి ప్రజలను చైతన్యపరిచే క్రమంలో సమిధలుగా సమర్పించారు.
ప్రకాశం పత్రికా నిర్వహణ గురించి తన ఆత్మకథలో మహాత్మా గాంధీ పత్రికానిర్వహణలో డబ్బు కోల్పోవద్దనీ, ఆర్థికపరమైన ఇబ్బందుల దృష్ట్యా పత్రిక మూసేయమని చెప్పినా తాను పట్టువీడక పత్రికను కొనసాగించానని రాసుకున్నారు.[1]
స్వరాజ్యలో జి.వి. కృపానిధి సహాయ సంపాదకునిగా పనిచేసారు
మూలం
మార్చు- ↑ టంగుటూరి ప్రకాశం ఆత్మకథ "నా జీవితయాత్ర"