జి.వి. కృపానిధి పత్రికా సంపాదకునిగా పలు ఆంగ్ల పత్రికలలో పనిచేసిన పాత్రికేయుడు.

జి.వి.కృపానిధి
జననం(1896-06-24)1896 జూన్ 24
మరణం1970 మే 5(1970-05-05) (వయసు 73)
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ.(ఆనర్స్), బి.ఎల్.
విద్యాసంస్థమద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల,
మద్రాసు న్యాయకళాశాల
వృత్తిసంపాదకుడు
క్రియాశీల సంవత్సరాలు1928-1966
ఉద్యోగంస్వరాజ్య,
హిందుస్తాన్ టైమ్స్,
డెక్కన్ హెరాల్డ్

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1896, జూన్ 24వ తేదీన కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు[1]. ఇతడి విద్యాభ్యాసం మచిలీపట్నంలో జరిగింది. తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ.ఆనర్స్ చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. పిమ్మట మద్రాసు న్యాయకళాశాలలో చదివి బి.ఎల్.పట్టా పుచ్చుకున్నాడు. ప్రకాశం పంతులు మద్రాసునుండి ఒక ఆంగ్ల దినపత్రిక ప్రారంభించాలని నిర్ణయించుకుని 1928, అక్టోబరు 28 నుండి స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను ప్రకటించాడు. కృపానిధి ఈ పత్రికలో మొదట కార్యాలయ నిర్వహణలో భాగం వహించి తరువాత పత్రికా సంపాదక వర్గంలో సహాయ సంపాదకుడిగా చేరాడు. ఈ పత్రిక ప్రారంభం నుండి 1935లో నిలిచిపోయే సమయానికి మూడు నెలల ముందు వరకు ఈ పత్రికలో పనిచేశాడు. ఇతడు ఇండియన్ న్యూస్ క్రానికల్ అనే పత్రికను స్థాపించినవారిలో ఒకడు. ఈ పత్రిక 1947-50ల మధ్యకాలంలో వెలువడింది. కృపానిధి ఈ పత్రికకు అసోసియేటెడ్ ఎడిటర్‌గా వ్యవహరించాడు. స్వరాజ్య పత్రికనుండి వచ్చిన తరువాత ఇతడు ఢిల్లీలో దేవదాస్ గాంధీ సంపాదకత్వంలో వచ్చిన హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్‌గా ప్రవేశించి కొంత కాలం పార్లమెంట్ కార్యకలాపాలను నివేదించిన విలేఖరిగా ఆ పదవిలో ఉండి, ఆ తర్వాత పత్రిక సంయుక్త సంపాదకునిగా (జాయింట్ ఎడిటర్)గా పనిచేశాడు. స్వాతంత్ర్య సమూపార్జనానంతరం కృపానిధి ఈ పత్రికకు కొంతకాలం అసోసియేట్ ఎడిటర్ హోదాలో కూడ పనిచేశాడు. ఇతడు సుమారు 15 సంవత్సరాలు హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో వివిధ హోదాలలో పనిచేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ విడిచి వెళ్ళిన తర్వాత ఇతడు సౌత్ ఇండియా బుక్ ట్రస్ట్కు ఛైర్మన్‌గా మూడు సంవత్సరాలు పనిచేసాడు. ఆ తర్వాత మరలా పత్రికా రంగంలోనికి ప్రవేశించి, బెంగుళూరునుండి వెలువడే డెక్కన్‍హెరాల్డ్ దినపత్రికలో పోతన్ జోసెఫ్ తర్వాత సంపాదకడిగా చేరాడు. ఇతడు ఈ పత్రికకు 1958-66 సంవత్సరాల మధ్య సంపాదకునిగా పనిచేశాడు.

డెక్కన్ హెరాల్డ్ పత్రికనుండి విరమించిన తరువాత ఇతడు బెంగళూరులోనే తన విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వివిధ పత్రికలకు రచనలు చేశాడు.

పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆంగ్ల పత్రికలలో విశిష్ట సేవలందించిన ఆంధ్రుడిగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన కృపానిధి తన 75వ యేట 1970, మే 5వ తేదీన బెంగుళూరులో మరణించాడు[1].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 గుత్తికొండ జవహర్‌లాల్ (2012). కృష్ణాజిల్లా తేజోమూర్తులు (1 ed.). విజయవాడ: సాహితి ప్రచురణలు. pp. 79–80.