స్వామి జ్ఞానానంద

స్వామి జ్ఞానానంద (1896 - 1969) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో గొరగనమూడి (ప్రస్తుత పాలకోడేరు మండలం) లో డిసెంబరు 5, 1896లో శనివారం రోజు జన్మించారు. వీరి తల్లిదండ్రులు భూపతిరాజు శ్రీరామరాజు, సీతయ్యమ్మ. వీరి జన్మనామం భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. వీరికి ఒకే ఒక చెల్లెలు ఉన్నారు. జాతకచక్రం ప్రకారం, వీరి జన్మనక్షత్రం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి.

ప్రాథమిక విద్య

మార్చు

వీరి ప్రాథమిక విద్య సూరంపూడిలోను, మాధ్యమిక విద్య తణుకులోను, ఉన్నత పాఠశాల విద్య నర్సాపురంలోని టేలర్ హైస్కూలులో జరిగాయి. చిన్నప్పటి నుండే వీరికి ఆధ్యాత్మిక విషయాలపై అభిరుచి ఉండేది. వీరికి 12 సంవత్సరాల వయసులో ఒక యోగి "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించారు. ఆనాటి నుండి భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాలకు ప్రవక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ వీరికి పరమారాధ్య దైవమయ్యారు.

బాల్యం

మార్చు

తల్లిదండ్రులు వీరికి బాల్యంలోనే నడింపల్లి సుబ్బరాజు గారి కుమార్తె సోమావతమ్మతో వివాహం చేశారు. 1917లో పరీక్షల అనంతరం కలకత్తా పారిపోయి దక్షిణేశ్వరం బేలూరు మఠాధిపతి స్వామి శివానందుని ఆశ్రయించారు. తండ్రి కోరిక మేరకు స్వగ్రామానికి తిరిగివచ్చి భార్యకు పరమార్ధాన్ని బోధించి తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళారు. హృషీకేశ్, అబూ పర్వత ప్రాంతాలలో తీవ్రమైన తపస్సు చేశారు. అక్కడే శరత్ చంద్రసేన్ అనే మహాత్ముడు వీరికి దీక్షనిచ్చారు. నాటి నుండి స్వామి జ్ఞానానంద వీరి ఆశ్రమ నామమైనది.

తండ్రి ఆహ్వానం మీద జన్మస్థలానికి వచ్చి 1923 నుండి మరల నాలుగు సంవత్సరాలు గంగోత్రి, బద్రీనాధ్, కేదార్నాధ్, మానస సరోవరం, గోముఖ్, కైలాసం లలో దిగంబరులుగా ఘోర తపస్సు చేసి గొప్ప శక్తులు సంపాదించారు.

 
జేమ్స్ చాడ్విక్

రచనలు

మార్చు

1927లో "పూర్ణ సూత్రాలు" రచించి ఆ గ్రంథాన్ని జర్మనీలో ముద్రించాలని సంకల్పించి ఐరోపా వెళ్ళి అక్కడ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగా రూపొందారు. చెకోస్లవేకియా దేశపు ప్రాగ్ విశ్వవిద్యాలయంలో డి.ఎస్.సి. పట్టాను, బ్రిటన్ లోని లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పట్టాను పొందారు. భౌతిక శాస్త్రంలో అత్యున్నత పురస్కారాలను అందుకొన్న జేమ్స్ చాడ్విక్తో కలిసి పనిచేసి పరమాణు భౌతిక విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేసి, లండన్ లో ఫెలోషిప్, అమెరికా దేశపు పురస్కారాలు పొందారు.

స్వాతంత్ర్యానంతరం

మార్చు

1947లో భారతదేశం స్వాతంత్యమైన తరువాత జవహర్ లాల్ నెహ్రూ కోరికపై స్వదేశానికి తిరిగివచ్చి ఢిల్లీలోని జాతీయ భౌతిక ప్రయోగశాల (National Physical Laboratory) లో పరమాణు భౌతిక శాస్త్ర శాఖాధిపత్యాన్ని చేపట్టి, తరువాత 1954 నుండి పదేళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగంలో ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా వెలుగొంది వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. వీరి జ్ఞాపకార్ధం పరమాణు భౌతిక శాస్త్రంలోని ప్రయోగశాలకు "స్వామి జ్ఞానానంద పరమాణు పరిశోధన ప్రయోగశాల" (Swami Jnanananda Laboratories for Nuclear Research) గా నామకరణం చేశారు.

రచనలు

మార్చు

వీరు రచించిన పూర్ణ సూత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. పరమాణు భౌతిక విజ్ఞాన ప్రాథమిక పాఠాలు, ఫిలాసఫీ ఆఫ్ యోగ, రాజయోగ గ్లిమ్సెస్, హై వాక్యుయా మొదలైనవి ఆంగ్లంలో ముద్రించబడ్డాయి.

ఆచార్యోత్తములు, పరమహంస, దర్శనవేత్త, కర్మయోగి అయిన వీరు 1969 సెప్టెంబరు 21 తేదీన పరమపదించారు. గొరగనమూడిలో వీరి సమాధిని పలువురు దర్శించుకొంటారు.

వీరి స్వీయచరిత్ర "శ్రీ స్వామి జ్ఞానానంద చరితామృతము" వీరు మరణించిన తరువాత వెలువడిన గ్రంథం.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు