హైదరాబాద్ సిస్టర్స్

హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన భాస్కర లలిత, భాస్కర హరిప్రియలు కర్ణాటక సంగీతంలో జంట గాయనీమణులు.

హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, లలిత

జీవిత విశేషాలు మార్చు

హైదరాబాదుకు చెందిన ఈ సోదరీమణులు బి.శివచంద్ర, సరోజ దంపతులకు జన్మించారు. వీరు మొత్తం 8 మంది అక్కచెల్లెళ్లు. ఈకుటుంబం లోని ఎనిమిది మంది కూడా సంగీతంతో సంబంధం ఉన్నవారే. ఒకరు గజల్స్ పాడటంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఇద్దరు వయోలిన్ విదాంసులు. మరొక సోదరి లలిత గీతాలను ఆకాశవాణిలో పాడుతుంది. లలిత, హరిప్రియలు మాత్రం హైదరాబాద్ సిస్టర్స్ పేరుతో ప్రసిద్ధి చెందారు. వీరిలో లలిత 1950, అక్టోబరు 6న, హరిప్రియ 1952, సెప్టెంబర్ 27న జన్మించారు. వీరి తల్లి సరోజ సంగీత విద్వాంసుడు టి.జి.పద్మనాభన్ వద్ద సంగీతం అభ్యసించింది. అతడే ఈ ఇరువురికి కూడా సంగీతం నేర్పించాడు. అనేక సంవత్సరాల సంప్రదాయబద్ధ కఠోర శిక్షణ తరువాత వీరు సృజించిన మనోధర్మ సంగీత రసజ్ఞులను ఆకర్షించింది. సంగీత సాధన వీరి చదువులకు అడ్డు కాలేదు. లలిత బి.ఎ. చదువగా, హరిప్రియ సైన్సులో పట్టభద్రురాలు.

సంగీతప్రస్థానం మార్చు

వీరి మొదటి సంగీత కచేరీ 1960లో హైదరాబాదులోని శంకరమఠంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగింది. వీరు మొదటి కచేరీతోనే పలువురు సంగీత విద్వాంసుల ప్రశంసలనందుకున్నారు. వీరు స్కూలుకు వెళ్లే దినాలలోనే అనేక అవార్డులు గెలుచుకున్నారు. 1968, 1969లో ఆల్ ఇండియా రేడియో పోటీలలో పాల్గొని వీరిద్దరూ ప్రథములుగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ గాత్ర సంగీతకళాకారులు. చెన్నైలో వీరి మొదటి కచేరీ కృష్ణ సభలో జరిగింది. ఆ కచేరీలో వీరి ప్రదర్శనకు ఎనలేని ప్రచారం లభించింది. ఆ తరువాత వీరు వెనుకకు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ప్రతియేటా కనీసం 12 సంగీతసభలలో పాల్గొనడానికి వీరికి ఆహ్వానం వచ్చేది. వీరు ఆంధ్రరాష్ట్రమంతటా తమ సంగీతకచేరీలు ఇవ్వడమే కాక భారతదేశంలోని పలు నగరాలలోను, అమెరికా, కెనడా, సింగపూర్, ఇంగ్లాండ్, దుబాయి వంటి దేశాలలో కూడా తమ సంగీత ప్రదర్శనలు ఇచ్చి అక్కడి సంగీతప్రియుల ప్రశంసలకు పాత్రులయ్యారు.

తోడి, కాంభోజి, శంకరాభరణం, కళ్యాణి, పూర్వి కళ్యాణి మొదలైన రాగాలు వీరికి చాలా ఇష్టమైన రాగాలు. ప్రాచీనమైన కర్ణాటక సంగీతానికి వీరు ఆధునిక సాంకేతికతను ప్రతిభావంతంగా జోడించారు. ఎలెక్ట్రానిక్ తంబూరను వినియోగంతో మొదలుపెట్టి కష్టతరమైన పాటలను చదువుతూ పాడటానికి వీలుగా ఐపాడ్‌లను ఉపయోగించేవారు. ఇంటర్నెట్ ద్వారా అనేక కొత్త కృతుల గురించి తెలుసుకున్నారు. తమ శిష్యులకు సంగీతం నేర్పడానికి స్కైప్‌ను వినియోగిస్తున్నారు.

వీరిద్దరూ స్వయంగా కచేరీలు చేయడమే కాక అనేక మంది యువ గాయనీగాయకులకు శిక్షణ నిచ్చి వారిని జాతీయస్థాయి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. వీరిద్దరూ హైదరాబాదు, సికిందరాబాదులలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నారు.

పురస్కారాలు, పత్రికా ప్రశంసలు మార్చు

ఈ జంటకు వారి సంగీతప్రతిభకు గుర్తింపుగా అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు కె.ఆర్.సుందరం అయ్యర్/కామేశ్వరీ అమ్మాళ్ అవార్డును బహూకరించింది. సంగీత చూడామణి, సప్తగిరి విద్వన్మణి మొదలైన బిరుదులు లభించాయి. వీరి కర్ణాటక సంగీత కచేరీల గురించి న్యూస్‌టైమ్స్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ దినపత్రికలు ప్రశంసలను కురిపించాయి.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు