జనవరి 28 2006, శనివారంసవరించు

 • గోదావరి జలసాధన యాత్ర: గోదావరి, ప్రాణహిత నదీ జలాలు తెలంగాణా ప్రాంతానికి అందివ్వాలని, తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ సారథ్యంలో చేపట్టిన గోదావరి జలసాధన యాత్ర ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాదు జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామ సమీపంలోని పాలవాగు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర 450 కి.మీ పొడవున ఏడు జిల్లాల్లో కొనసాగనుంది. ఆయా జిల్లాల నుంచి తెదేపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దేవేందర్‌గౌడ్‌తోపాటు తెదేపా నాయకులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాలాచారి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండవ వెంకటేశ్వర్‌రావు, సానా మారుతి, ఉమామాధవరెడ్డి, మాణిక్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్‌ సుహాసినీరెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
 • కర్ణాటక రాజకీయం: కర్ణాటక ముఖ్యమంత్రి ధరం సింగ్ రాజీనామా చేసాడు. ఫిబ్రవరి మూడోతేదీన సాయంత్రం అయిదు గంటలకు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు, బి.ఎస్‌.యడియూరప్ప ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.
 • విజయవంతంగా ఆకాశ్‌ క్షిపణి పరీక్ష: ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్‌ క్షిపణిని శనివారం ఒడిషా లోని చాందీపూర్‌ వద్ద రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు. పైలట్‌ రహిత విమానం నుంచి జారవిడిచిన వస్తువులను రెండుసార్లూ ఆకాశ్‌ ఛేదించిందని ఇక్కడి అధికార వర్గాలు తెలిపాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్‌డీవో ప్రస్తుతం వివిధ దశల్లో అభివృద్ధి చేస్తున్న ఐదు క్షిపణుల్లో ఆకాశ్‌ ఒకటి.
 • యురేనియం మైనింగ్‌, ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు: నల్గొండ జిల్లాలో యురేనియం మైనింగ్‌, ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే నాగార్జున సాగర్‌ జలాశయానికి గాని, పర్యావరణ సమతుల్యతకు గాని ఎలాంటి హానీ జరగదని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) స్పష్టం చేసింది.

జనవరి 26 2006, గురువారంసవరించు

 • దామాషా పద్ధతిలో ఓటింగ్: ఎన్నికలలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే.. దామాషా పద్ధతిలో ఓటింగ్ ఉండాలని లోక్‌సత్తా జాతీయ సమన్వయకర్త డా.జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నాడు. ఈ నూతన పద్ధతిలో ప్రతి ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు తాను ఎన్నుకొనే అభ్యర్థి (నియోజకవర్గ ఓటు)కి వేస్తాడు. మరొక ఓటు తాను గెలిపించాలనుకున్న పార్టీకి వేస్తాడు. 50 శాతం సీట్లకు నేరుగా అభ్యర్థులు ఎన్నికైతే మిగిలిన సీట్లు పార్టీలకు లభించిన ఓట్ల ఆధారంగా లభిస్తాయి. ఈ రెండు పద్ధతులను మేళవించటం వల్ల నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి ప్రతినిధి కావటంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వార్డు మెంబరు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకూ అన్ని పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నాడు.
 • బూటాసింగ్ రాజీనామా : సుప్రీం కోర్టు అభిశంసనకు గురైన బీహార్ గవర్నరు బూటాసింగ్, గణతంత్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరించాక, రాజీనామా చేసాడు.
 • స్వామి పరమార్థానంద మరణం: హైదరాబాదు రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరమార్థానంద మరణించాడు.

జనవరి 25 2006, బుధవారంసవరించు

 • పద్మ పురస్కారాలు: ఈ ఏటి పద్మ పురస్కారాల్లో - సినీనటుడు చిరంజీవికి పద్మభూషణ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం 9 మందికి పద్మవిభూషణ, 36 మందికి పద్మభూషణ, 61 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
 • ఈ ఏటి కామన్ ఎంట్రెన్సు పరీక్షల తేదీలు ప్రకటించారు:
  1. ఎంసెట్‌ : మే 4
  2. ఈసెట్‌ : మే 14
  3. ఐసెట్‌ : మే 25
  4. పాసెట్‌ : మే 29
  5. లాసెట్‌ (5 ఏళ్లు) : జూన్‌ 3
  6. లాసెట్‌ (3 ఏళ్లు) : జూన్‌ 3

జనవరి 24 2006, మంగళవారంసవరించు

 • బీహార్‌ శాసనసభ రద్దు అసమంజసం: బీహార్‌ శాసనసభ రద్దుపై గవర్నరు బూటా సింగ్‌తోపాటు, కేంద్ర ప్రభుత్వానికీ సుప్రీంకోర్టు మంగళవారం మొట్టికాయలు వేసింది. నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యు) ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బూటాసింగ్‌ వ్యవహరించారని, కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని తేల్చిచెప్పింది. గవర్నర్‌ సిఫారసును పరమ సత్యంగా ఆమోదించే ముందు కేంద్రం దానిని ధ్రువీకరించుకోవాల్సిందని వ్యాఖ్యానించింది. రాజకీయాలతో సంబంధంలేని వారిని మాత్రమే గవర్నర్లుగా నియమించేలా మొత్తం గవర్నర్ల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని సూచించింది. ఈ తీర్పు నేపథ్యంలో తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, గణతంత్ర దినం నాడు గవర్నర్‌గా గౌరవ వందనం స్వీకరించి తీరతానంటున్నాడు బూటాసింగ్‌.
 • పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం సాధ్యం కాదు: పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం సాధ్యం కాదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తేల్చిచెప్పాడు. పోలవరం ఎత్తు, ముంపును తగ్గించే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా గోదావరి నదిపై బ్యారేజీలను నిర్మించాలని కొందరు నిపుణులు సూచించారనీ ఈ అంశాన్ని కూడా కమిటీ పరిశీలించిందన్నాడు. ప్రత్యామ్నాయ విధానం ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని నిల్వ చేసుకోలేమని, బ్యారేజీల నిర్మాణం వల్ల ఖర్చుకూడా ఎన్నో రెట్లు పెరుగుతుందని కమిటీ పేర్కొన్నట్లు వివరించాడు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని ఎత్తును ఐదు అడుగులు తగ్గిస్తే నీటి నిల్వ సామర్థ్యం 75.2 టీఎంసీల నుంచి 47 టీఎంసీలకు పడిపోతుందని తెలిపాడు. ఎత్తు తగ్గించడం వల్ల 15 గ్రామాలు, 14,615 ఎకరాల మేర మాత్రమే ముంపు తగ్గుతుందన్నాడు. పోలవరం వల్ల ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశాడు.
 • పల్లెల్లో 24 గంటలూ విద్యుత్‌ సరఫరా: పల్లెల్లో ఇళ్లకు 2006 ఏప్రిల్‌ నుండి 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు స్పష్టం చేశాయి.

జనవరి 23 2006, సోమవారంసవరించు

 • ఖాతా ఖాళీ చేసిన కత్రోచ్చి: ఇటలీ వ్యాపార వేత్త ఒట్టావియో ఖత్రోచీ జనవరి 16 నే లండన్‌ బ్యాంకులోని తన రెండు ఖాతాలనుంచి సొమ్మును విత్‌డ్రా చేసినట్టు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. బోఫోర్స్‌ కేసులో ఖత్రోచీ నిందితుడైనందున ఆ రెండు ఖాతాల నుంచి సొమ్ము తరలకుండా కేంద్రానికి, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన రోజే (జనవరి 16) ఖాతాల్లోని సొమ్ము బయటకు వెళ్లింది. ఖత్రోచీ ఖాతాలపై స్తంభనను ఎత్తివేసేముందు సీబీఐ ఒకసారి కోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదా అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది.

జనవరి 22 2006 ఆదివారంసవరించు

 • తెలంగాణా ఇన్‌స్టంట్‌ కాఫీ కాదు: తెలంగాణాపై ఏర్పాటు చేసిన యు.పి.ఎ. ఉపసంఘం అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు ప్లీనరీ సందర్భంగా హైదరాబాదులో ఇలా అన్నాడు. "తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని 2000 సంవత్సరంలో సీడబ్ల్యూసీలో తీర్మానించాం. యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ అంశాన్ని సీఎంపీలో చేర్చాం. పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ ఈ అంశం ఉంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా రెండో ఎస్సార్సీ అనే పరిస్థితి లేదు. ఏకాభిప్రాయం, సంప్రతింపుల ద్వారానే తెలంగాణా అన్నది మా వైఖరి. ఇందుకోసం ఉపసంఘం వేశాం. పలు పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం. కొన్ని పార్టీలు అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాయి. ప్రధాన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటివరకూ తన అభిప్రాయం వెల్లడించలేదు. ఆ పార్టీకి రెండుసార్లు లేఖ రాసినా స్పందన లేదు. వాళ్లు ఏదో ఒక నిర్ణయం చెబితే, మా కమిటీ నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. తెలంగాణా కోసం తెరాస అధినేత కేసీఆర్‌ పెట్టారంటున్న రెండు నెలల గడువుతో మాకు సంబంధం లేదు. నేనెప్పుడూ గడువు చెప్పలేదు. చెప్పలేను కూడా. ఎందుకంటే అది చాలా కష్టం. తెలంగాణా ఇన్‌స్టంట్‌ కాఫీ కాదు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు."