స్థలాకృతి
(Area నుండి దారిమార్పు చెందింది)
స్థలాకృతి భూమి ఉపరితలపు నిలువు, అడ్డు కొలతలను వివరిస్తుంది. ఇంగ్లీషులో దీన్ని టెర్రెయిన్ అని అంటారు. నీటి అడుగున ఈ కొలతలను వివరించడాన్ని బాతిమెట్రీ అంటారు. హైప్సోమెట్రీ అంటే సముద్ర మట్టాన్ని భూభాగాన్ని అధ్యయనం చేస్తుంది.
భౌతిక భూగోళ శాస్త్రంలో స్థలాకృతి, భూమి ఎత్తును వాలునూ దిగ్విన్యాసాన్నీ (ఏయే దిశల్లో ఎలా ఉంది అనేది) వివరిస్తుంది. భూమి ఉపరితలంపై నీటి ప్రవాహాన్ని, నీటి పంపిణీనీ స్థలాకృతి ప్రభావితం చేస్తుంది. విస్తారమైన ప్రాంతంలో, ఇది వాతావరణాన్ని, శీతోష్ణస్థితి నమూనాలను కూడా ప్రభావితం చేస్తుంది.
ప్రాముఖ్యత
మార్చుస్థలాకృతిని అవగాహన చేసుకోవడమనేది చాలా కారణాల వల్ల కీలకమైన అంశం. వాటిలో కొన్ని:
- ఒక ప్రాంతం మానవ ఆవాసాలకు ఏమాత్రం అనుకూలంగా ఉంటుందనేది అక్కడి స్థలాకృతిని బట్టి ఉంటుంది: రాళ్ళతో కూడిన మెట్ట ప్రాంతాల కంటే సమతలంగా ఉండే మెత్తటి ఒండ్రు మైదానాలలో వ్యసాయానికి అనుకూలమైన నేలలు ఎక్కువగా ఉంటాయి.
- పర్యావరణ నాణ్యత, వ్యవసాయం, హైడ్రాలజీ తదితర శాస్త్రాల పరంగా;[1] ఒక ప్రాంతపు స్థలాకృతిని అర్థం చేసుకుంటే వాటర్‌షెడ్ల సరిహద్దులు, పారుదల లక్షణాలు,[2] పారుదల వ్యవస్థలు, భూగర్భజల వ్యవస్థలు, నీటి కదలికలు, నీటి నాణ్యతపై పడుతున్న ప్రభావాలనూ అర్థం చేసుకోవడం సులభమౌతుంది.
- స్థలాకృతిని అర్థం చేసుకుంటే, వ్యవసాయంలో భూసార సంరక్షణకు తోడ్పడుతుంది. వాలుగా ఉన్న నేలల్లో లాభదాయకంగా వ్యవసాయం చేసేందుకు కాంటూరు దున్నకం పద్ధతిని అవలంబిస్తారు. వాలు వెంబడి దున్నకుండా, ఒకే ఎత్తులో ఉన్న నేలలో దున్నే పద్ధతి ఇది.
- సైనికపరంగా స్థలాకృతి అనేది కీలకమైనది. ప్రదేశాలను ఆక్రమించుకోవడం లోను, ఆక్రమణలో ఉంచుకోవడం లోనూ స్థలాకృతి అవగాహన ఉపయోగపడుతుంది. సైనిక దళాలను, సామాగ్రినీ ప్రదేశాలలోకి తరలించడానికి, ప్రదేశాల గుండా తరలించడానికీ ఈ అవగాహన పనికొస్తుంది. రక్షణ వ్యూహాలు, దాడి వ్యూహాలు రెండింటికీ స్థలాకృతి అవగాహన ప్రాథమికమైనది.
- వాతావరణ నమూనాలను నిర్ణయించడంలో స్థలాకృతి ముఖ్య పాత్ర వహిస్తుంది. భౌగోళికంగా దగ్గర దగ్గరగా ఉన్న రెండు ప్రాంతాల్లో, ఎత్తులో తేడాల వలన గానీ "వర్షచ్ఛాయ" ప్రభావం కారణంగా గానీ, వర్షపాతాల్లోను వర్షాలు పడే కాలాల్లోనూ తీవ్రమైన తేడాలు ఏర్పడవచ్చు.
- విమానయానంలో స్థలాకృతి గురించిన కచ్చితమైన పరిజ్ఞానం కలిగి ఉండడం చాలా ముఖ్యమైనది -మరీ ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే మార్గాల్లో. రాడార్లు, భూస్థిత రేడియో నావిగేషన్ వ్యవస్థల పరిధులనూ వాటి పనితీరునూ కూడా స్థలాకృతి ప్రభావితం చేస్తుంది. కొండ లేదా పర్వతీయ స్థలాకృతి వలన కొత్త విమానాశ్రయాల స్థాపన, దాని రన్‌వేల దిశలూ తీవ్రంగా ప్రభావితమౌతాయి.
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ Baker, N.T., and Capel, P.D., 2011, "Environmental factors that influence the location of crop agriculture in the conterminous United States": U.S. Geological Survey Scientific Investigations Report 2011–5108, 72 p.
- ↑ Brush, L. M. (1961). "Drainage basins, channels, and flow characteristics of selected streams in central Pennsylvania" (pp. 1-44) (United States, U.S. Department of the Interior, GEOLOGICAL SURVEY). Washington D.C.: UNITED STATES GOVERNMENT PRINTING OFFICE. Retrieved October 29, 2017, from https://pubs.usgs.gov/pp/0282f/report.pdf