చెర్చన్ మానవుడు

(Charchan Man నుండి దారిమార్పు చెందింది)

వాయువ్య చైనా లోని తారిమ్ నదీ బేసిన్ లో లభ్యం అయిన క్రీ.పూ. ఒకటి, రెండు సహాస్రాబ్దిల నాటి కాకసాయిడ్ జాతికి చెందిన ప్రజల యొక్క మమ్మీలను తారిమ్ మమ్మీలుగా వ్యవహరిస్తారు. ఈ తారిమ్ మమ్మీలలో ఒక ప్రముఖమైన మమ్మీ చెర్చన్ మానవుని మమ్మీ. తక్లమకాన్ ఎడారి ఇసుకలో పాతిపెట్టబడిన ఈ మానవుని శవం, ఎడారి వేడిమికి ఎండిపోయి, శుష్కించి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోయింది. క్రీ.పూ. 1000 నాటి ఈ మమ్మీ కకేసియన్ జాతి లక్షణాలతో, యూరోపియన్ ముఖ లక్షణాలతో కనిపిస్తుంది. ఇతను పశ్చిమ యురేషియా మూల ప్రాంతాలనుంచి చైనా దేశంలోని తారిం బేసిన్ ప్రాంతానికి వలస వచ్చిన ఆదిమ ఇండో-యూరోపియన్ తెగ ప్రజలకు చెందిన వాడు.

తక్లమకాన్ ఎడారి లోని ‘కీమో’ లేదా ‘చెర్చన్’ (Qiemo /Cherchen) నగరానికి 6 కి.మీ. దూరంలో గల జఘున్లుక్ (Zaghunluq) శ్మశానంలో రెండవ సమాధిలో చెర్చన్ మానవుని మమ్మీని 1985 లో వెలికితీశారు. చెర్చన్ వద్ద బయల్పడినందువల్ల ఈ మమ్మీని చెర్చన్ మానవుడు (Cherchen Man) గా వ్యవహరించారు. ఇతనినే ఉర్-డేవిడ్ (Ur-David) అని కూడా పిలుస్తారు. ఈ రెండవ సమాధిలోనే ఈ చెర్చన్ యువకునితో పాటు మరో ముగ్గురు స్త్రీల మమ్మీలు, ఒక శిశువు మమ్మీ ముదురు రంగులతో కూడిన వస్త్రాలలో చుట్టబడి లభించాయి. వీరిని చెర్చన్ మానవుని కుటుంబంగా భావిస్తున్నారు.

భౌతిక లక్షణాలు

మార్చు

3000 సంవత్సరాల క్రితం కాలం నాటి ఈ చెర్చన్ మానవుడు సుమారుగా ట్రోజన్ యుద్ధం జరిగిన కాలంలో జీవించి వుంటాడని భావించారు. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుగా వున్న ఈ చెర్చన్ యువకుడు చనిపోయే నాటికి 50 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. తొలుత ఈ మమ్మీ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు వున్నదని భావించారు. తరువాత పురావస్తు శాస్త్రవేత్తలు మేలరీ (J.P Mallory), విక్టర్ మెయిర్ (Victor Mair) లు 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుకు మించి ఉండదని నిర్ధారించారు. కకేసియన్ జాతి లక్షణాలతో, పెద్ద దవడ ఎముకలు, పొడవైన గద్ద ముక్కును, ఎర్రని గోధుమరంగు (Reddish Brown) తో కూడిన జుట్టు కలిగి ఉన్నాడు. కొద్దిపాటి గడ్డం కలిగి ఉన్నాడు. కనుబొమలు సైతం చెక్కు చెదరకుండా ఉన్నాయి. ముఖం మీద గల పసుపు, ఎరుపు రంగులతో కూడిన చిత్రాలను పచ్చబొట్లు (tattoos) గా గుర్తించారు. ఇతను నిజ జీవితంలో ఎలా కనిపించి ఉండేవాడో అదే విధంగా ఇతని ఫోటోని పునర్నిర్మించారు

వస్తు సంస్కృతి

మార్చు

మెరుస్తున్న ఉన్నితో తయారుచేసిన బోర్డాక్స్ రంగు (Bordeaux colour) వస్త్రాలు, ప్యాంటు, సాక్స్ లు, బూట్లు ధరించాడు. ధరించిన ప్యాంటు తార్తాన్ లెగ్గింగ్స్ (Tartan leggings) మాదిరిగా కనిపిస్తుంది. ధరించిన ఉన్ని బట్టల ఆహార్యాన్ని బట్టి చూస్తే ఇతను శీతాకాలంలోనే మరణించి పాతిపెట్టబడి వుండవచ్చు. తక్లమకాన్ ఎడారి శీతల శుష్క వాతావరణం, సమాధిలోని గాలి శుష్కంగా ఉప్పదనంతో కూడినది కావడం చేత ఈ మమ్మీ మాత్రమే కాక మమ్మీతో పాటు వున్న కళాఖండాలు దుప్పట్లు (blankets), ఉన్ని బట్టలు, గోధుమలు, బేబీ సీసా సైతం సంపూర్ణంగా సంరక్షించబడి ఉన్నాయి.

పరిశోధకులను ఆకర్షించిన అంశం ఇతని వస్త్రాల నేతపని అల్లికలో కనిపిస్తున్న ప్లాడ్ నమూనా (plaid pattern). ఈ విధమైన వస్త్ర నమూనా నాటి ఆస్ట్రియా, జర్మనీ, స్కాటిష్ ప్రజలలో కూడా కనిపిస్తున్న కారణంగా ప్లాడ్ నమూనాను యూరోపియన్ టెక్నిక్ గానే భావించారు.

క్రీ.పూ. 3వ సహస్రాబ్దంలో దక్షిణ సైబీరియాలో ఆదిమ ఇండో-యూరోపియన్ వలస ప్రజల ఏర్పరిచిన అఫానసేవో సంస్కృతి (Afanasevo Culture) తో ఇతనికి దగ్గర సంబంధం కలిగివుండవచ్చునని భావిస్తున్నారు.

చెర్చన్ మానవుని కుటుంబం

మార్చు

ఈ రెండవ సమాధిలోనే లభించిన మరొక స్త్రీ మమ్మీని చెర్చన్ మహిళ (Cherchen woman) గా, శిశువు యొక్క మమ్మీని బ్లూ బేబీ (Blue Baby) గా పేర్కొన్నారు.

బ్లూ బేబీ (Blue Baby) మమ్మీ

మార్చు

చెర్చన్ నగర సమీపంలో గలజఘున్లుక్ (Zaghunluq) శ్మశానంలో రెండవ సమాధిలో చెర్చన్ మానవుని మమ్మీతో పాటు వెలికితీయబడిన స్త్రీ శిశువు యొక్క మమ్మీని బ్లూ బేబీ (Blue Baby) మమ్మీగా వ్యవహరించారు. ఈమెను చెర్చన్ మానవుని కుటుంబానికి చెందిన శిశువుగా భావించారు. ఈ బ్లూ బేబీ ఎరుపు, ఊదా రంగులో నున్న అందమైన దుప్పటిలో చుట్టబడి ఉంది. సుమారు 10 నెలల వయస్సు గల ఈ బేబీ గోధుమ రంగు జుట్టును కలిగి వుండి, ఎరుపు అంచు, నీలం రంగుతో వున్న ఉన్ని క్యాప్ (felt cap) ను ధరించివుంది. ఈ బేబీ రెండు కళ్ళ పైన రెండు చిన్న రాళ్ళు ఉంచబడ్డాయి. ఈ బేబీ ప్రక్కనే గొర్రె చర్మంతో ఎద్దు కొమ్ము ఆకారంలో చేసిన పాత్ర కనిపిస్తుంది. దీనిని ఆ శిశువుకు పాలు పట్టే సీసా (Bottle) గా భావించారు. చరిత్రకు సంబంధించినంత వరకు శిశువులకు పాలు పట్టే పాల సీసాకు సంబంధించిన తొలి ఆధారం ఇది కావచ్చు.

జన్యు పరీక్షలు

మార్చు

విదేశీయులు చేసిన DNA జన్యు పరీక్షలు కూడా చెర్చన్ మానవుడు, అతనితో పాటు వున్న మిగిలిన మమ్మీలు యూరోపియన్ సంతతికి చెందినవే అని ధ్రువీకరించాయి. అయితే 2007 లో జరిపిన ఆధునిక జన్యు విశ్లేషణలు ఈ చెర్చన్ మానవుడు, అతని కుటుంబంగా భావించిన ప్రజలు పశ్చిమ యురేషియాతో పాటు తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా మూలాలను కూడా కలిగి వున్నారని, తద్వారా వీరిని పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమానికి చెందినవారిగా నిర్ధారించాయి. తండ్రి వైపు చూస్తే ప్రత్యేకంగా పశ్చిమ యురేషియా ప్రాంతం నుండి వచ్చిన వంశీయులుగా, తల్లి వైపు నుంచి చూస్తే పశ్చిమ యురేషియా, తూర్పు యురేషియా ప్రాంతం నుండి వచ్చిన మిశ్రమ వంశీయులుగా వెల్లడించాయి.

వీటిని కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  • “The Tarim Mummies", J.P. Mallory and Victor H.Mair, Thames&Hudson
  • Barber, Elizabeth Wayland (1999), The Mummies of Ürümchi, London: Pan Books
  • 'The Caucasian Mummies of Central Asia', Patric Chouinard, Nexus Magazine, Nov 2015 [1]
  • 'The Three Thousand Year Old Charchan Man Preserved at Zaghunluq'], Dolkun Kamberi, Columbia University and Victor H. Mair, Editor, 1994, January [2]