అంబటిపూడి వెంకటరత్నం

అంబటిపూడి వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, ఏదుబాడులో సుబ్బమ్మ, సుబ్రహ్మణ్యం దంపతులకు 1908, జనవరి 5న జన్మించాడు.[1] కౌశికశ గోత్రజుడు. మాధవపెద్ది వెంకటనరసయ్య వద్ద అక్షరాభిషేకం గావించాడు. ఎనిమిద యేట ఉపనయనము అయిన తరువాత పొన్నూరు చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివాడు. తరువాత బందరు వెళ్లి అక్కడ తొమ్మిదవ తరగతిలో చేరాడు. అక్కడ చెరుకువాడ నరసింహపంతులు ఇంగ్లీషును, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగును బోధించేవారు. ఆ తరువాత ఇతడు నల్లపాడు గ్రామంలో బండ్లమూడి వెంకయ్యశాస్త్రి వద్ద సంస్కృతాధ్యయనం చేసి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని పఠించాడు. తరువాత తిమ్మరాజుపాలెంలో ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి వద్ద పంచకావ్యాలను చదువుకున్నాడు. తరువాత కడియం వెళ్లి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది కొంతభాగం చదువుకున్నాడు. మిగిలిన భాగాన్ని అగిరిపల్లిలో సంపత్కుమారాచార్య వద్ద అభ్యసించాడు. చిరివాడలో వేలూరి శివరామశాస్త్రివద్ద సంస్కృతాంధ్రాంగ్ల భాషలు నేర్చుకున్నాడు. ఆ తరువాత గుంటూరులో ఉన్నత పాఠశాల విద్య పూర్తిగావించాడు. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఏ చదువుకున్నాడు. అదే కళాశాలలో బి.ఏ. తెలుగు, చరిత్ర ప్రధానాంశాలుగా చదివాడు.

అంబడిపూడి వెంకటరత్నం
జననంఅంబటిపూడి వెంకటరత్నం
(1908-01-05)1908 జనవరి 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా , పర్చూరు మండలం, ఏదుబాడు
మరణం1983 మే 18
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర పండితుడు, బహుగ్రంథకర్త
మతంహిందూ
పిల్లలుఅంబటిపూడి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి
తండ్రిఅంబటిపూడి సుబ్రహ్మణ్యం
తల్లిసుబ్బమ్మ

ఉద్యోగం, సంఘసేవ మార్చు

నల్లగొండ జిల్లా చుండూరు గ్రామం చేరుకుని అక్కడ విద్య బోధించేవాడు. ఇతడు ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు. దరిద్ర నారాయణ సంఘమును స్థాపించి అన్నదానము, వస్త్రదానము చేసి ఆచరణతో కూడిన ఆదర్శమును ప్రదర్శించాడు. కస్తాల గ్రామంలో విద్యానాథ గ్రంథాలయమును స్థాపించాడు. అట్లే చుండూరులో ఆంధ్రరత్న పఠనమందిరమును ప్రారంభించాడు. హరిజన పాఠశాలను నెలకొల్పాడు. మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశాడు. ఇతడు కొంతకాలం నల్లగొండలోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

సాహిత్య సేవ మార్చు

1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో సాహితీమేఖల అనే సంస్థను స్థాపించాడు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచాడు. ఎన్నో వ్యాసాలు, కావ్యాలు, నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, ఆంగ్ల గ్రంథాలు రచించాడు.

రచనలు మార్చు

  1. ఇందిరావిజయమ్‌ (సంస్కృత నాటకం)
  2. కృష్ణకథ (అనువాదం మూలం:శ్రీరామకృష్ణానంద స్వామి)[2]
  3. ప్రణయవాహిని
  4. మైనాదేవి[3]
  5. మొరాన్‌కన్య
  6. వత్సలుడు[4]
  7. వనవాటి
  8. దక్షిణ
  9. వీరాంజలి
  10. ఇంద్రధనువు
  11. చంద్రశాల (సంస్కృతము, తెలుగు, ఆంగ్లము)
  12. కథావళి
  13. కౌమోదకి
  14. షడ్దర్శన రహస్యం
  15. ఓటర్లకొకమాట
  16. వివేక శిఖరాలు(అనువాదం. ఆంగ్లమూలం: శ్రీ ఆనందాచార్యులు - కార్లిమారాణి)
  17. మేలిముసుగు(నాటకం)
  18. స్వప్నకారుడు (నాటకం)
  19. మధురయాత్ర
  20. శాంతి తీరాలకు(అనువాదం. ఆంగ్లమూలం: శ్రీ ఆనందాచార్యులు - శక్రశాఖ)
  21. గోపి కావ్యమ్‌
  22. హితోపదేశం
  23. చూడాల
  24. అకృతజ్ఞో నరః (సంస్కృతము)
  25. సంధ్యావిద్య
  26. ప్రభు సప్తతి
  27. భారతీయ సంస్కృతి
  28. కృష్ణ బోధ
  29. తత్త్వ సమావర్తనమ్‌
  30. వేదాంతసారము
  31. దశోపనిషత్తులు
  32. బ్రహ్మసూత్రములు (వచనం)
  33. ప్రస్థానత్రయోపోద్ఘాతము
  34. తాత్విక తరంగాలు
  35. రామాయణోత్తరకాండ
  36. భాగవతమహాత్మ్యము
  37. తర్కభాష
  38. ఆశీఃపంచరత్నాలు
  39. ధర్మజనిర్వేదం
  40. భార్గవుని జీవిత స్థితి
  41. చతుష్పాత్తులు
  42. సుఖలిప్స
  43. కూజానామా
  44. ఆంధ్రుడెవాడనాంధ్రుడెవ్వడు (గేయం)
  45. అపాత్తులు
  46. తెలుగుతల్లి
  47. ధన్యాత్మ
  48. హితోక్తి
  49. ఏరినపూలు
  50. ఆంధ్రప్రదేశప్రాశస్త్యం
  51. చంద్రగామి
  52. చైతన్యస్పృహ
  53. జగద్దర్శనం
  54. ఆత్మచర్చ
  55. అనుభూతి
  56. జగద్విలాసం
  57. గాంధీస్మృతి
  58. గాంధీనిర్యాణం
  59. అమరకుని శృంగారశతకము (తెలుగు అనువాదం)
  60. భర్తృహరి శృంగారశతకము (తెలుగు అనువాదం)
  61. శ్రుతిగీతలు (వచనానువాదం)

పురస్కారాలు, సన్మానాలు మార్చు

మరణం మార్చు

ఇతడు తన 75వ సంవత్సరం మే 18, 1983వ తేదీన మరణించాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. నిష్టల, సుబ్రహ్మణ్యం (1986). రత్నకవి సాహిత్యానుశీలనము (1 ed.). చండూరు, ఏదుబాడు: సాహితీమేఖల. pp. 1–15. Retrieved 31 December 2014.
  2. అంబటిపూడి, వెంకటరత్నం (1924). కృష్ణకథ (1 ed.). చుండూరు: సాహితీమేఖల. Retrieved 25 December 2014.
  3. సి.హెచ్.లక్ష్మణ, చక్రవర్తి (2014-10-02). "మైనాదేవి (సమీక్ష)". ప్రజాశక్తి. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 December 2014.
  4. అంబటిపూడి, వెంకటరత్నం (1950). వత్సలుడు (2 ed.). చుండూరు: సాహితీమేఖల. Retrieved 25 December 2014.