అలమేలు మంగ
అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా "ఆలమేలు మంగాపురం"లోని అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధమైనది.
లక్ష్మియే అలమేలు
మార్చుశ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును.
- శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
- వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")
- మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.
- భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కథనం గమనించాలి.
- కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కథనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కథనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును.
ఈ కథనాల సారంగానూ, స్థల పురాణాల వల్లనూ, సాహిత్యంలో ప్రస్తావనలను బట్టీ, అర్చనాది ఆచారాలనుబట్టీ లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును. అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు (క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం ... ... జగతి అలమేలు మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభల నీరాజనం)
పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో బట్టల వ్యాపారం చేసే ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం తాళ్ళపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలున్నాయి. పంచ భూతములనెడు పలువన్నెల నూలుతో నేసి, నీడనుండి చీరలమ్మే నే బేహారి - అని అన్నమయ్య వేంకటేశ్వరుని నర్ణించడం గమనించ దగిన విషయం.
అలమేలు మంగ ఆలయం
మార్చుత్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిందట. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించిందట. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడట.
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.
చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది "తిరువెంగడ కూటం"గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి.
సేవలు, సంప్రదాయాలు
మార్చుఅమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ప్రతి సోమవారం "అష్టదళ పదపద్మారాధన" జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు.
"కార్తీక బ్రహ్మోత్సవాలు" ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది.
స్తోత్రములు
మార్చు- అలమేలుమంగా వేంకటేశ్వర శతకము, అలమేలు మంగ మీద తాళ్ళపాక అన్నమాచార్య రచించిన శతకం.
విశేషాలు
మార్చుపదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.అందులో రాధాకృష్ణ కల్యాణ మండపం ఆలయం వెనుక భాగంలో ఉంటుంది. శుభకార్యాలకు, వివాహాది కార్యాలకు, బస చేయుటకు శుభసూచకంగా భక్త్తులు భావిస్తుంటారు.బస చేయుటకు రాధా కృష్ణ కల్యాణ మంటపం అనువైన చోటుగా భావిస్తారు..భక్తులు.వసతి గదులు, సామాను భద్రపరుచు లాక్కెర్లు, స్నానపు గదులు అందుబాటులో ఉంటాయి...!!
మూలాలు
మార్చువనరులు
మార్చు- తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002)
- లక్ష్మీ నివాసా వేదవతీ వల్లభా - వ్యాసం రచన: జి. కావ్యశ్రీ - స్వాతి వారపత్రిక - 2004 జనవరి 2
బయటి లింకులు
మార్చు- తి.తి.దే. వారి వెబ్సైటు Archived 2016-02-02 at the Wayback Machine