అలహాబాద్ కోట

అలహాబాదులో అక్బరు నిర్మించిన కోట

అలహాబాద్ కోటను మొఘల్ చక్రవర్తి అక్బర్, 1583 లో నిర్మించాడు. ఈ కోట, ప్రయాగ్‌రాజ్‌లో యమునా నది ఒడ్డున, అది గంగా నదితోసంగమించే స్థలానికి సమీపంలో ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా వర్గీకరించింది.[1]

అలహాబాద్ కోట
ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్
అలహాబాద్ కోట (యమునా నది ఒడ్డున)

కోట లోపల ఉన్న ఒక రాతి శాసనం 1583 లో దీనికి పునాది వేసారని వెల్లడిస్తోంది.

చరిత్ర

మార్చు

అలహాబాద్ కోటను మొఘల్ చక్రవర్తి అక్బర్, 1583 లో నిర్మించాడు. అబుల్-ఫజల్, తన అక్బర్నామాలో ఇలా రాశాడు:[2]

గంగా, యమునల సంగమ స్థలమైన పియాగ్ [ప్రయాగ] పట్టణంలో గొప్ప నగరాన్ని, ఒక పెద్ద కోటనూ నిర్మించాలనేది [అక్బర్] చిరకాల కోరిక. భారతీయులు దీనిని చాలా గౌరవప్రదంగా భావిస్తారు. ఆ దేశం లోని సన్యాసులకు అది తీర్థయాత్రా స్థలం.

—అబుల్ ఫజల్, అక్బర్‌నామా

అక్బర్ ఈ కోటకు ఇల్లాహబాస్ ("అల్లా ఆశీర్వాదం") అని పేరు పెట్టాడు. అదే ఆ తరువాత "అలహాబాద్"గా మారింది.[2] కేథరీన్ ఆషర్ ప్రకారం, తూర్పు భారతదేశంలో జరుగుతున్న అనేక తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా ఈ కోటను నిర్మించాడు.[3] అలహాబాద్ వ్యూహాత్మక ప్రదేశం కావడంతో పాటు, పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమాన్ని సందర్శించే యాత్రికుల నుండి పన్నులు వసూలు చేయగల సామర్థ్యం ఉండడాం కూడా ఈ కోట నిర్మాణం కోసం అక్బర్‌ను ప్రేరేపించిందని భావిస్తున్నారు.[4] అయితే, అప్పటికే అమల్లో ఉన్న యాత్రికుల పన్నులను అక్బర్ 1563 లో రద్దు చేసాడు అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సరికాదని అనిపిస్తుంది.

 
యమున ఒడ్డున అలహాబాద్ కోటలో, ది చాలీస్ సాటూన్. (1796) - థామస్ డేనియల్ చిత్రించాడు

ఈ కోటను ప్రసిద్ధమైన అక్షయవట వృక్షాన్ని చుట్టుముడుతూ నిర్మించారు. మోక్షాన్ని ఆశించే ప్రజలు ఇక్కడ ప్రాయోపవేశం చేసుకునేవారు.

స్థానిక కథనాల ప్రకారం, అక్బర్ తన పూర్వ జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సన్యాసి. ఒకసారి పొరపాటున పాలు తాగుతూ ఆవు వెంట్రుకలను తిన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పాపం ఫలితంగా అతను మ్లేచ్ఛుడిగా జన్మించాడు. అతని పూర్వజన్మ వాసనలు, పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఒక కోటను నిర్మించడానికి అతన్ని ప్రేరేపించాయి.[4]

 
అలహాబాద్ కోట దృశ్యం, 1783, విలియం హోడ్జెస్, యేల్ సెంటర్ ఫర్ బ్రిటిష్ ఆర్ట్

అక్బరు ఈ కోటను నిర్మించడంలో పదేపదే విఫలమయ్యాడని, ప్రతిసారీ దాని పునాది ఇసుకలో మునిగిపోతూండేదనీ స్థానిక ప్రయాగ్వాల్ బ్రాహ్మణులు చెబుతారు. నిర్మాణం సజావుగా సాగాలంటే నరబలి అవసరమని చక్రవర్తికి చెప్పగా, ఒక స్థానిక బ్రాహ్మణుడు స్వచ్ఛందంగా ఆత్మబలిదానం చేసుకున్నాడు. దానికి ప్రతిగా అక్బర్, అతని వారసులకు - ప్రయాగ్వాల్లకు - సంగమం వద్ద యాత్రికులకు సేవలందించే ప్రత్యేక హక్కులను మంజూరు చేశాడు.[4]

అలహాబాద్ కోట అక్బర్ నిర్మించిన అతిపెద్ద కోట.[5] ఈ కోటలో మూడు గ్యాలరీలు, వాటికి ఇరువైపులా ఎత్తైన టవర్లు ఉన్నాయి. చరిత్రకారుడు విలియం ఫించ్ ప్రకారం, కోటను నిర్మించడానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది. 5,000 నుండి 20,000 మంది వివిధ తెగల కార్మికులు దానిపై పనిచేసారు.[6]

యువరాజు సలీం తిరుగుబాటు

మార్చు

1600 లో మొఘల్ యువరాజు సలీం - అతనే కాబోయే చక్రవర్తి జహంగీర్ - తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అలహాబాద్ కోటలో తన సొంత దర్బారును స్థాపించాడు. అతని పాలనలో చాలా తక్కువ భూభాగం ఉండేది. కొంతకాలం తర్వాత అతను తండ్రితో రాజీపడ్డాడు.[7]

ఈస్టిండియా కంపెనీ పాలన

మార్చు
 
అలహాబాదులో అక్బర్ కోట - 1850

బక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిషు సేనాని రాబర్ట్ క్లైవ్, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, అవధ్ పాలకుడు నవాబ్ షుజా-ఉద్-దౌలాలు సంతకం చేసిన అలహాబాద్ ఒప్పందంలో భాగంగా 1765 లో ఈస్టిండియా కంపెనీ దళాలు ఈ కోటను మొదటిసారిగా ఆక్రమించాయి. ఈ ఒప్పందం ప్రకారం, షా ఆలంను రక్షించడానికి కోటలో బ్రిటిషు దండును మోహరించారు. అయితే, ఈ ఏర్పాటు తనకు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించి, 1772 లో ఢిల్లీకి వెళ్లి, అక్కడ అలహాబాద్‌ను మరాఠా సామ్రాజ్యానికి అప్పగించడానికి ప్రయత్నించాడు. బ్రిటిషు వారు జోక్యం చేసుకుని, కోటపై ఆలం దావాను రద్దు చేయడానికి కుట్ర పన్ని, షుజా-ఉద్-దౌలాను దాని ఏకైక యజమానిగా ప్రకటించారు. షుజా-ఉద్-దౌలా మరణించాక, 1775 లో అసఫ్-ఉద్-దౌలా అవధ్ నవాబుగా వచ్చాడు. కోటను అధికారికంగా స్వాధీనం చేసుకోవడానికి కంపెనీ నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, అది నవాబు చేతుల్లోనే ఉండిపోయింది. అసఫ్-ఉద్-దౌలా కంపెనీకి పెద్దయెత్తున అప్పులు చేసి 1787 లో మరణించాడు. వారసుడిగా వచ్చిన సాదత్ అలీ ఖాన్ I వారసత్వంపై సంగేహాలు రాగా, అతన్ని వెంటనే పదవీచ్యుతుణ్ణి చేసారు. చివరగా, 1798 ఫిబ్రవరిలో ఆర్థికంగా చితికిపోయిన సాదత్ అలీ, కోటను కంపెనీకి అప్పగించాడు. మూడు సంవత్సరాల తరువాత, 1801 లో, సాదత్ అలీ చివరకు అలహాబాద్ జిల్లాను బ్రిటిషు వారికి అప్పగించాడు. అలహాబాద్ ఈస్టిండియా కంపెనీ పాలిత ప్రాంతాలలో ఒకటిగా మారిపోయింది. ఆ తర్వాత, ఆ కోటను సైనిక డిపోలన్నింటికీ ప్రధాన డిపోగా స్థాపించారు.[8][9]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Alphabetical List of Monuments - Uttar Pradesh". Archaeological Survey of India, Government of India. Retrieved 13 November 2014.
  2. 2.0 2.1 William R. Pinch (17 March 2006). Warrior Ascetics and Indian Empires. Cambridge University Press. p. 46. ISBN 978-0-521-85168-8.
  3. Asher, Catherine B. (24 September 1992). Architecture of Mughal India. Cambridge University Press. p. 48. doi:10.1017/chol9780521267281. ISBN 978-0-521-26728-1.
  4. 4.0 4.1 4.2 Kama Maclean (28 August 2008). Pilgrimage and Power: The Kumbh Mela in Allahabad, 1765-1954. OUP USA. pp. 62–69. ISBN 978-0-19-533894-2.
  5. Alfieri, Bianca Maria (2000). Islamic Architecture of the Indian Subcontinent. Lawrence King Publishing. p. 205. ISBN 9781856691895.
  6. Verma, Amrit (1985). Forts of India. New Delhi: The Director of Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 72-4. ISBN 81-230-1002-8.
  7. Asher, Catherine B. (24 September 1992). Architecture of Mughal India. Cambridge University Press. pp. 100–101. doi:10.1017/chol9780521267281. ISBN 978-0-521-26728-1.
  8. Pilgrimage and Power: The Kumbh Mela in Allahabad, 1765-1954 by Kama Maclean; Publisher: Oxford University Press, 2008; page 62–64.
  9. Bhattacherje, S. B. (1 May 2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. pp. A-110. ISBN 9788120740747. Retrieved 24 March 2014.