సా.శ. 1599 లో ఇంగ్లండులో ఈస్టిండియా కంపెనీగా స్ధాపింపబడి 1600 సంవత్సరంలో పట్టాపుచ్చుకుని వ్యాపారంచేసుకోటానికి భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ ఈస్టుఇండియా వర్తక కంపెనీనుబ్రిటిష్ ఇండియాగా జేయుటకు పునాదులు వేసిన రాజ్యతంత్రజ్ఞుడు రాబర్టు క్లైవు. ఈ దేశ భాగబోగ్యములను ఇంగ్లండుకు తరలించుటకు మార్గము చూపినదీ నితడే. భారతదేశములోని వంగరాష్ట్రము అతని కర్మభూమిగా చెప్పవచ్చును. రాబర్టు క్లైవు జీవిత కాలం 1725-1774. అధికార కార్యకాలం 1743-1767. కీలుబొమ్మలుగా నుండేవారిని నవాబుగా సింహాసనాధిష్ఠానంచేసి నాటకమాడి రాజ ఖజానాలలోని ధన సంపత్తిని ఇంగ్లండుకు పంపిచే మార్గం, బ్రిటిష్ రాజ్యస్థాపనకు క్లైవు చూపినదారి. వంగరాష్ట్ర స్వాధీనంచేసుకోటంలో అవలంబించిన రాజ్యతంత్రమూ, తదుపరి 3 సంవత్సరములు పరిపాలనలో,కార్యాచరణలో క్లైవు దొర అవలంబించిన రాజనీతి వల్ల వంగరాష్ట్రములో అవినీతి,దుష్టపరిపాలన ప్రజాపీడనలతోకూడిన విషమస్థితికి దారితీసినదని ఇంగ్లండులో నెలకొల్పిన రెండు పార్లమెంటు కమిటీలు విచారణ జరిపి తేల్చిన వాస్తవం. ఆనాటి వంగరాష్ట్రం లోకలిగిన ప్రజల దుస్థితికి కారణమైన లంచగోండితనం, ప్రజా పీఢనము,కంపెనీ ఉద్యోగుల స్వంత వ్యాపారాలు లంచ గొండి తనమేననీను, కంపెనీఉద్యోగుల జీతములు చాలకపోబట్టి లంచగొండితనమునకు పాల్పడుచున్నారనియూ క్లైవు దొరగారే వారి కంపెనీ డైరక్టర్లకు 1765 సెప్టెంబరు 30తేది వ్రాసిన లేఖలో వాపోయినా అనేక సంస్కరణ చర్యలు చేపట్టినా చివరకు క్లైవు దొర వ్యక్తిగతముగాను, ఆయన కార్యకాలమునూ బాధ్యులగా గుర్తించి 1773లో బ్రిటిష్ కామన్సు సభలో విశ్వాసరాహిత్య తీర్మానము నేరారోపణ తీవ్రచర్చ జరిగింది.[1].[2]. రాబర్టు క్లైవు, అతని కుమారుడు ఎడ్వర్డు క్లైవు భారతదేశములో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ ఉద్యోగ పదవులు నిర్వహించిన కార్యకాలంలో వారు అక్రమంగా కూడబెట్టుకుని ఇంగ్లండుకు చేరవేసుకున్న అనేక భారతీయ అమూల్యవస్తువులు ఇప్పటికీ వేల్సు పొవిస్ కోట (POWIS CASTLE IN WALES) లో క్లైవు చిత్రవస్తు ప్రదర్శన శాల (The Clive Museum)లో నున్నటుల తెలియుచున్నది.[3]

రాబర్టు క్లైవు
The Lord Clive
Lord Clive in military uniform. The Battle of Plassey is shown behind him.
Portrait by Nathaniel Dance
Governor of the Presidency of Fort William
In office
1757–1760
అంతకు ముందు వారుRoger Drake
as President
తరువాత వారుHenry Vansittart
In office
1765–1766
అంతకు ముందు వారుHenry Vansittart
తరువాత వారుHarry Verelst
వ్యక్తిగత వివరాలు
జననం(1725-09-29)1725 సెప్టెంబరు 29
Styche Hall, Market Drayton, Shropshire, ఇంగ్లండు
మరణం1774 నవంబరు 22(1774-11-22) (వయసు 49)
Berkeley Square, Westminster, లండన్
జాతీయతబ్రిటిష్
కళాశాలMerchant Taylors' School
పురస్కారాలుKB
మారుపేరుClive of India
Military service
Allegiance Kingdom of Great Britain / British Empire
Branch/service British Army
Years of service1746–1774
Rankమేజర్-జనరల్
Unitబ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ
CommandsCommander-in-Chief of India
Battles/warsWar of the Austrian Succession
Battle of Madras
కర్ణాటక యుద్ధాలు
Siege of Arcot
Battle of Arnee
Battle of Chingleput
Seven Years' War
Battle of Chandannagar
Battle of Plassey

వ్యక్తిగత జీవిత ముఖ్యాంశాలు

మార్చు

రాబర్టు క్లైవు ఇంగ్లండులోని (Shropshire) షోర్ప్ షీర్ లో సెప్టంబరు 29, 1725 జన్మించెను. వివిధ స్కూళ్ళలో చదివి 18 వ ఏటనే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో గుమాస్తా (బుక్ కీపరు)గా 1743 లో భారతదేశానికి వచ్చాడు. తరువాత 1746లో ఫ్రెంచివారితో జరిగిన యధ్ధములో అతని సైనిక కౌశల్యం గుర్తింపబడగా సివిల్ ఉద్యోగమునుండి సైనికోద్యోగిగా మారాడు. 1749 లో సైనిక సిబ్బంది ఆహార సామగ్రీ సప్లై అధికారిగానియమించబడ్డాడు. 1753 లో Margaret Maskelyne తో వివాహం అయిన కొద్దిరోజులకు మొదటి విడుత కార్యకాలం (1748-1753) పూర్తిచేసుకుని గొప్పకీర్తి సంపదలతో 1753 మార్చిలో ఇంగ్లండుకి వెళ్లిపోయాడు.రెండవ విడుతగా 1755 లో చెన్నపట్నంలోని బ్రిటిష్ వారి దేవీకోట (Fort Saint David) కు గవర్నరు గానూ, లెఫ్టినెంటు కర్నలు (Lt.COLONEL)పదవీహోదాతోనూ వచ్చి రెండవ విడుత కార్యకాలం (1755-1760) పూర్తిచేసుకు 1760 ఫిబ్రవరిలో ఇంగ్లండుకు మరింత కీర్తి, సంపత్తితో తిరగి వెళ్ళాడు. ఇంగ్లండులో తన స్వదేశ రాజకీయలలో ప్రముఖస్తానంకోసం ఇండియాలో వంగరాష్ట్రములో సంపాదించిన సంపత్తిని వినియోగించి బ్రిటిష్ పార్లమెంటులో సభ్యత్వంకోసం ప్రయత్నించాడు. 1762 లో బరాన్ క్లైవు ప్లాసీ (BARON CLIVE OF PLASSEY) అను బిరుదునూ, 1764 లో K B అనే బ్రటిష్ వారి గొప్ప పురస్కారం (Knighthood Ribbon of a Knight Bachelor) తోనూ సన్మానితుడై మూడవ విడతగా 1765 లో వచ్చాడు.1765 మూడవ విడతగా వచ్చింది కంపెనీ గవర్నరుగానే వచ్చాడు. అయితే ఈ సారివచ్చినది 1760-1765 లమధ్యకాలం తను లేనప్పడు భారతదేశములో వంగరాష్ట్రములో ప్రబలవిస్తున్న అవినీతి, ప్రజాపీడన విషమస్థితిని సరిచేయమని పంపగా వచ్చాడు. క్లైవు తనకు అతి ప్రియమైన కోరిక బ్రిటిష్ పార్లమెంటులో సభ్యునిగానగుట చిరవరకు సాధించాడు. ష్రూసబరీ (SHREWSBURY COUNTY) నుండి లండన్ బ్రిటిష్ కామన్సు సభకు (పార్లమెంటుకు) సభ్యుడైనాడు. వంగరాష్ట్రములో క్లైవుపదవీకాలంలో చేకూర్చుకున్న ధన సంపాదన, సంపత్తిల గురించి విచారణ చేయుటకు 1773 లో రెండు పార్లమెంటరీ కమిటీలు ఏర్పరచి విచాారణ జరిపి క్లైవు వంగరాష్ట్ర కార్యకాలం అవినీతి, కంపెనీఉద్యాగుల సొంతవ్యాపారాలు, ప్రజాపీడనలు జరిగినట్టుగా ధ్రువపరచారు. 1773లో బ్రిటిష్ కామన్సు సభలో విశ్వాసరాహిత్య తీర్మానమును క్లైవు తన దేశానికి చేసిన మహోపకార దృష్ట్యా రద్దు చేయబడింది. కానీ 1774 నవంబరు 22 రాబర్టు క్లైవు స్వకృతచర్యతో మరణించాడు. రాబర్టు క్లైవు చేసిన ప్రముఖ కార్యసాధనలు 1751 లో ఆర్కాటును రక్షించటం, 1757 లో చంద్రనగర్ (వంగరాష్ట్రము) పట్టుకుని కలకత్తాను విడిపించటం.

క్లైవు కార్యకాల సమీక్ష

మార్చు

క్లైవు భాతదేశములో బ్రిటిష్ సంస్థలో పనిచేసిన మొత్తం కార్యకాలం 18 ఏండ్లును (1743-1767 మధ్య కాలంలో) మూడు పెద్ద విభాగములుగా చేసి సమీక్షిస్తే మొదటి విడత 1743 నుండి 1753 పది సంవత్సరములు దక్షిణాపధములో జరిగిన చరిత్ర క్లైవు యుధ్దనైపుణ్యము చాటునదిగను. రెండవ విడత కార్యకాలం 1755 నుండి 1760 ఐదుసంవత్సరములలో చివరి 3 సంవత్సరములు (1757-1760) వంగరాష్ట్రములో తన పరిపాలన వల్ల ప్రజ్వరిల్లిన అవినీతి, లంచగొండితనం,ప్రజాపీడనలు క్లైవుదొరను వినాశనానికి గురిచేసి అతని అంతమునకే కారణమైనది. ఆర్దిక అవినీతి మిత్రద్రోహచర్యలతో కూడిన రాజ్యతంత్రములుచేసినదే క్లైవుచరిత్ర అయినది. కానీ తన కార్యకాలంలో క్లైవు దొర సాధించిన విజయాలు బ్రటిష్ సంస్థవారికి అతి విలువైనవి. అవిఏమనగా (1) అతి సంపన్నమైన, ప్రాముఖ్యమైన వ్యాపార కేంద్రము మొగల్ సామ్రాజ్యములో ఆభరణమైన వంగ రాష్ట్రము బ్రిటిష్ వారికి పూర్తిగా కైవశం అవటం, వంగరాష్ట్రముతోపాటు బీహారు ఒరిస్సారాజ్యములలో కూడా బ్రిటిష్ కంపెనీ వారికి దివానీ గిరి సంపాదింటం (చూడు రాబర్ట్ క్లైవు-వారన్ హేస్టింగ్సుల రాజ్యతంత్రములు). అదేసమయంలో ఉత్తర సర్కారులలో జరిగిన బొబ్బిలియుధ్ధం, మచిలీపట్నంయుధ్ధంతో 1765 లో ఉత్తర సర్కారులును బ్రిటిషవారికి వశం చెసినట్లు మొగలుచక్రవర్తి గారి ఫర్మానా లభించటం, చివరకు మొగలు చక్రవర్తి షా ఆలాన్ని వశంచేసుకుని మనోవర్తిదారునిగా జీవిత బత్యమునిచ్చి మొగల్ సామ్రాజ్యమంతమొందించి, బ్రిటిష్ రాజ్యస్ధాపనచేసిన క్లైవుదొరను సాటిలేని మేటిగా బ్రిటిష్ ప్రభువుల దృష్టిలో పెట్టినది. ఇక మూడవ విడత కార్యకాలం (1765-1767) లో 1765 క్లైవు తిరిగి వచేటప్పటికి మీర జఫర్ ని తిరిగి రెండవసారి (మొదటిసారి 1757-1760) నవాబుగా1763 లో నియమించ బడియున్నాడు. అతను చనిపోతూ 1765లో క్లైవుకు 70000 రూపాయలనిచ్చి తనతరువాత కుమారుని వారసునిచేయమన్నాడు. అయినాకూడా మీర్ జఫర్ కుమారుడు, వారసుడైన నజముద్దీన్ అలీ ఖాన్ దగ్గరనుండి ఇంకో లక్ష రూపాయలు తీసుకుని పట్టముకట్టారు అటువంటి ఆర్థిక అవినీతి, మిత్రద్రోహచర్యలతో కూడిన రాజ్యతంత్రములుచేసిన క్లైవుచరిత్ర చాల అవమానకరమైనది. క్లైవు సంపాదించిన అక్రమ బహుమతు లను విలువకట్టుటకు 1772 లో ఇంగ్లండులో పార్లమెంటు వారు ఏర్పాటుచేసిన సెలక్టు కమిటీవారు అంచనా 12,50,000£ పౌనులుండునని అందు క్లైవు వాటా2,34,000£ నుడునని అంచనావేసి నిర్ణయించారు (3) క్లైవుకు ఉమ్రావు హోదానిచ్చి ఆ దర్జాను నడిపించుటకు సాలూనా 30వేల పౌనులు ఆదాయం వచ్చే 24 పరగణాలు జాగీరు క్లైవు తన జీవితాంతమనుభవించేటటులు, అతని తదనంతరం కంపెనీ వారికి వర్తించేట్లు లభించింది. కానీ జాగీరు ఇచ్చిన షరత్తును ఉల్లంఘించుతూ కొద్దిరోజలకే ఆ జాగీరును క్లైవు కంపెనీవారికి1765 లోనే స్వాధీన పరచాడు . దానిపై సాలుకు 30000 పౌనులు క్విట్టు రెంటు (QUIT RENT) గా రొక్కం కంపెనీవారు 1774 దాకా క్లైవుకిచ్చేవారు. అదిచాలక క్లైవు దొర బ్రిటిష్ వస్తువుల పై దిగుమతి సుంకములుతేసేయించి సుంకరాహిత వ్యాపారం చేయటం మొదలగు అక్రమ ఆర్థిక లాభాలు గ్రహంచటం వల్ల తన కంపెనీ ఉద్యోగస్తులు కూడాఅదే దోవ అవలంబించారు. 1757 నుండి జరిగిన దుష్పరిపాలన, యధ్ధముల వలననే 1770 లో వంగరాష్ట్రములో తీవ్రమైన కఱవు సంభవించింది [2]లో రెండు సంవత్సరముల సంస్కరణ ప్రయాస ద్వారా ఇంతకుముందు 3 సంవత్సముల పరిపాలన+ తదుపరి మరో రెండు సంవత్సరములు అదే దోవనే (క్లైవు చూపిన తప్పు దోవనే) అవలంబించి నడచిన కంపెనీ ఉద్యోగుల లంచగొండితనం స్వంత వ్యాపారాలు, ప్రజాపీడనలు మాన్పి సంస్కరింప ప్రయత్నంచేశాడు. తెల్లఉద్యోగుల అగ్రహానికి గురైనా కూడా క్లైవు చేసిన గతజల సేతుబంధన సంస్కరణాలలో మరో రెండు ప్రముఖమైనవి (1)ఔధ్ (అవధ్,అయోధ్య) నవాబు షూజా ఉద్దౌలాను తనచేతుల్లో ఓడించినప్పటికీ ఆ నవాబునే సింహాసనాదీశుడుగా నుంచి పరిపాలనచేయించటం (2) అప్పటి ఢిల్లీ చక్రవర్తి రెండవ షా ఆలం (SHAH- ALAM II ) పూర్తిగా వశమైపోయి ఉత్తర హిందుస్తానం మొత్తం బ్రిటిష్ వారికి 1767 కే కైవశమైయ్యే పరిస్థితివున్నపటికీ క్లైవుదొర షా ఆలం చక్రవర్తినే సింహాసనంలోనుంచటం. ఆ రెండు నిర్ణయాలు గొప్ప రాజ్యతంత్రోద్దేశ్యములతో కూడినవే.[2]

క్లైవు రాజ్యతంత్రం

మార్చు

సామదాన దండోపాయమార్గములు అవలంబించి న బ్రిటిష్ వారికి రాబర్టు క్లైవుదొర వరప్రసాదము. నవాబులు, సామంతరాజులతో రాజకీయాలుచేసి, వారికోరికపైనే సైనిక రక్షణకల్పించేనిమత్తమైన ఖర్చులు, వారిపక్షమున పోరాటటానికైన యుధ్ధపు ఖర్చులకుగానూ, వారి రాజ్యములలో అంతః కలహముల మధ్య జోక్యముచేసుకుని బ్రిటిష్ వారికి కీలుబొమ్మలుగా నుండేవారిని నవాబుగా సింహాసనాధిష్ఠానంచేసి రాజ ఖజానాలలోని ధన సంపత్తిని వెలుపలికితెచ్చియుధ్ధపు ఖర్చులక్రింద వసూలుచేసుకుని ఇంగ్లండుకు పంపిచే మార్గం బ్రిటిష్ రాజ్యస్థాపనకు క్లైవు చూపినదారి. ఆర్థికంగా అది ఒక గొప్పసూత్రం. భారతదేశములో యుద్ధములు సలపటానికి వలసరాజ్యస్థాపన నిగ్రహించటానికైయ్యే ధనం ఇక్కడనుండే తీసుకునేటటువంటి రాజ్యతంత్రములు. చూడు రాబర్టు క్లైవు-వారన్ హెస్టింగ్సుల రాజ్యతంత్రములు

క్లైవు కార్యకాలంలో జరిగిన ప్రముఖ యుద్ధాలు

మార్చు

రాబర్టు క్లైవు కార్యకాలం (1743-1767) లో బ్రిటిష్ వారు భారతదేశములో చేసిన యుద్ధాలలో పాత్రధారులను రెండు పెద్ద విభాగములుగా చర్చించటం సులువుగా నుండును. (అ)బ్రిటిష్ వారు సాటి విదేశీయ సంస్ధలతో చేసిన యుద్ధములు (ఆ)బ్రిటిష్ వారు దేశీయ నవాబులు, సామంతరాజులు, ఇతరలతో చేసిన యుద్ధాలు. అందుచే ఈ క్రింది యుధ్ధాల జాబితాలో చెప్పిన 8 యుధ్ధాలను ఈ రెండువిభాగములలోకి సర్దవలెను. (1). మూడుమాట్లు జరిగిన కర్నాటక యుధ్ధములు (పుదుచ్చెరి, చెన్నపట్నం లో) 1746-1748, 1749-1754, 1758-1763. ఫ్రెంచి వారితోను, దేశీయ నవాబులతోను (2). 1740 శతాబ్దములో రెండుమార్లు తంజావూర్ రాజా ప్రతాపసింహునితో జరిగిన తంజావూరు యుధ్ధం వల్ల దేవీకోట బ్రిటిష్ వారి వశం అయినది (3). కర్నాటక నవాబుదావాదారుడైన చందాసాహెబ్ కుమారుడు రజాసాహెబుతో ఆర్కాటులో జరిగినవ యుధ్ధం (4). వంగ రాష్ట్రములోప్లాసీ యుధ్ధము 1757 (వంగరాష్ట్ర నవాబు సురాజుద్దౌలాతో జరిగిన యుద్ధము) (5). ఉత్తర సర్కారులో పెద్దాపురం (బొబ్బిలి యుధ్ధం), మచిలీపట్నంలో జరిగిన యుద్ధములు 1758, 1759 (6). 1759 పాట్నాలో మొగల చక్రవర్తితో జరిగిన యుధ్ధం (7). డచ్చివారితో చింసురా లోజరిగిన యుధ్దం (8). 1757 లో బ్రిటిష్ సంస్థ చంద్రనగోరులో ఫ్రెంచి సంస్ధ పై దాడి (9). 1764 బక్సరు యుద్ధం

తంజావూరు చరిత్ర, యుధ్ధం 1740 శతాబ్దం చివరలో

మార్చు

తంజావూరు చాలాకాలమునుండి స్వతంత్రరాజ్య పరిపాలనలోనుండిన చిన్నరాజ్యము. తంజావూరునే టాంజోర్ (TANJORE) అని కూడా అనేవారు. 1741 లో తంజావూరు ప్రతాపసింహుడను రాజు పరిపాలనలో నుండినది. దక్షిణాపధములో బ్రిటిష్ కంపెనీ వారితనితో స్నేహముగా నుండిరి. అంతః కలహములు, స్వామిద్రోహములు సర్వసాధారణమైన రాజకీయాలలో, విదేశీయ సంస్ధలు వలసరాజ్యస్థాపనకై అవలంబించిన మిత్రభేదము, మిత్రద్రోహము సూత్రములు ఇచ్చటకూడా పనిచేశాయి. ఈ రాజుగారి తమ్ముడు బ్రిటిషవారినాశ్రయించి తనకు పట్టము గట్టినచో కడ్డలూరు లోని దేవీకోటను (FORT SAINT DAVID)జాగీరుగానిచ్చెదనని ఆశచూపించాడు. అంతట బ్రిటిష్ సంస్థ వారు ప్రతాప సింహుని పదభ్రష్టునిచేయుటకై రాబర్టు క్లైవు లెఫ్టనెంన్టు పదవిలోనున్నప్పుడు తన సైన్యముతో తంజావూరును ముట్టడించాడు. కానీ విఫలు డైనాడు. కొంత సైన్య నష్టము,సామగ్రి ష్టములతో బయటపడ్డాడు. అందుకని పదవోన్నతి లభించలేదు. బ్రిటిష్ సంస్థవారు భారతదేశ దక్షిణాపధములో చేసిన మొదటి ధర్మయుధ్ధం. తమకు దేవీకోటనిచ్చినచో స్వామిద్రోహుడైన ప్రతాపసింహుని తమ్మునిపట్టుకుని వప్పచెపుతామని రాజీకివచ్చారు. కానీ ప్రతాపసింహుడు తొణకలేదు. తరువాత క్లైవు సైన్యమును పోగుచేసుకుని మళ్లీ మరోమారు తంజావూరును ముట్టడించి ప్రతాపసింహుని ఓడించగా ప్రతాపసింహుడు రాజీకి వచ్చి దేవీకోటను యుధ్దపు ఖర్చులను ఇచ్చి రాజీచేసుకున్నాడు. దీనితో క్లైవు సైనికనైపుణ్యతాఘనత గుర్తించబడినది కానీ పదోన్నతి రాలేదు. తరువాత తంజావూరు కర్నాటక నవాబు క్రింద సామంతరాజ్యమైనది.

తిరుచినాపల్లి చరిత్ర, ఆర్కాటు యుధ్ధం 1751

మార్చు

తిరచునాపల్లి (TIRUCHUR, TRICHINOPOLY, TIRCHY, TIRUCHI) ని త్రిచూరు,తిరుచూరు అనికూడా అంటారు. 1741-1743 మధ్యకాలంలో తిరుచునాపల్లి మహారాష్ట్రనాయకుల పరిపాలనలోనుండినది. 1734 కర్నాటక నవాబు అల్లుడు చందాసాహెబు తిరుచునాపల్లిని ఆక్రమించాడు. అప్పటి పరిపాలకురాలు, నాయకుల వంశీయ రాణి, మీనాక్షి నాయక్ ఇతనితో రాజీచేసుకుని 1734 లో అతని తిరుచునాపల్లికి సార్వభౌమునిగా గుర్తించి అతనిక్రింద సామంతరాణిలాగ కప్పము కట్టుటకొప్పునగా కప్పముతీసుకుని చందాసాహేబు వెనక్కి ఆర్కాటు వెళ్ళిపోయాడు. అతనిని తిరుచునాపల్లి నవాబు అనేవారు. కాని ఇతడు కొద్దికాలంకే 1736 లో మళ్లీ తిరుచునాపల్లి వచ్చి సింహాసం అదిష్టించి రాజ శాసనాలు చేయటం మొదలు పెట్టేటప్పటికి రాణీ మీనాక్షి అభ్యంతరం కలుగజేసింది. చందాసాహెబు రాణీని బందీగానుంచి 1736 -1741 దాకా తిరుచునాపల్లిని పరిపాలించాడు. 1741 లో మహారాష్ట్ర నాయకులు మళ్లీ వచ్చి ఇతనిని ఓడించి బందీగా పట్టుకుని 1741 నుండి 1749 దాకా చరసాలలో నుంచారు. కానీ 1749 లో చందాసాహెబు తప్పించుకుని ఆర్కాటుకు (కర్నాటక నవాబు రాజ్యం)కు పారిపోయాడు. తరువాత హైదరాబాదు నవాబు తిరుచునాపల్లిని మహారాష్ట్రులవద్దనుండి చేజిక్కించుకున్నాడు. కర్నాటక నవాబు హైదరాబాదు నవాబుక్రింద సామంతరాజు. కర్నాటక నవాబు అనర్వుద్దీన్ మహమ్మద్ ఖాన్కు అల్లుడు చందాసాహెబు, కుమారుడు మహమ్మదాలీ. 1749 కర్నాటక నవాబు చనిపోయాడు. వారి వారసత్వం తగాదాలో అల్లుడు చందాసాహెబు పక్షం ఫ్రెంచివారు, కుమారుడు మహమ్మదాలీ పక్షం బ్రిటిష్ వారు. 1751 లో కర్నాటక నవాబు కుమారుడు మహమ్మదాలీ తిరుచునాపల్లి రాతికోటలో తల దాచుకునున్న సమయంలో చందాసాహెబు కోటను ముట్టడించాడు. అతని దృష్టి మళ్ళించి మహమ్మదాలీని రక్షించుటకు క్లైవు తనసైన్యముతో ఆర్కాటును ముట్టడించి 31-08-1751 న ఆర్కాటు కోటనాక్రమిచాడు. కానీ చందాసాహెబ్ కుమారుడు, రజాసాహెబు ఫ్రెంచివారి సైన్యంకొంతా దేశీయ సైన్యం కొంత కలుపుకుని కోటలో నున్న క్లైవునిఅతని స్వల్ప సైన్యమును చుట్టుముట్టడించి సరాసరి 53 రోజులు (సెప్టెబరు 23 నుడీ నవంబరు 14 వరకూ పట్టివుంచాడు. మద్రాసునుండి సైనికబలగం వచ్చేంత వరకూ క్లైవు రజాసాహెబ్ గారి తాకిడి తట్టుకుని ఆర్కాటు కోటను నిలబెట్టి వుంచటం క్లైవుకి చాల గొప్ప ఖ్యాతిని తెచ్చింది. 1751 ఆగస్టు నవంబరు దాకా ఆర్కాటులో జరిగిన ఈ యద్ధమే ఆర్కాటు యధ్దం.

కర్నాటక రాజ్యము,కర్నాటక యుద్దాలు

మార్చు

పూర్వకాలం కర్నాటక రాజ్యము కృష్ణానది మొదలు కావేరీ నదివరకునూ గల సముద్రతీర భూభాగం మరియూ పడమర కడప, సేలం, ]]దిండిగల్లు]] సరిహద్దులవర వరకూ కర్ణాటకమనేవారు. కర్నాటక రాజ్యమును 1646లో చంద్రగిరి రాజులు దగ్గరనుండి గోల్కోండ సుల్తాను జయించాడు. అప్పటినుండి కర్నాటకరాజ్య పరిపాలకులు నవాబులైనారు. కర్ణాటక రాజ్యములో చంద్రగిరిరాజుల పరిపాలన 1647తో అంతమై నవాబుల పరిపాలనలోకి వచ్చింది. గోల్కొండసూల్తాన్ గారి సేనాని మీర్ జమ్లా 1647 లో మొట్టమొదటి నవాబుగా నియమింపబడ్డాడు. 1692 లో గోల్కోండసుల్తానులనుండి మొగల్ చక్రవర్తి జయించాడు. ఆ తరువాత ఔరంగజీబు మరణం చేవరకూ (సా.శ.1707) కర్నాటక నవాబు హైదరాబాదు నిజాం గారకి లోబడి రాజ్యపాలనచేసే వాడు. పేరుకు సామంతరాజైనాగానీ కర్నాటక నవాబు దోస్త్ అలీఖాన్ స్వతంత్రపాలన చేశాడు అతని తరువాత అన్వరుద్దీన్ ఖాన్ కర్నాటక నవాబైనాడు. కర్నాటక నవాబుగారినే ఆర్కాటునవాబు అనికూడా అనేవారు. పుదుచ్చెరీలోని ఫ్రెంచిసంస్థ, దేవీకోట (చెన్నపట్న)లోని బ్రిటిష్ సంస్ధ కూడా కర్నాటక నవాబు పరిపాలన పరిధిలోనుండిరి. కర్నాటక రాజ్యములో 1746-1748, 1749-1754, 1758-1763 మధ్య పుదుచ్చెరీ,చెన్నపట్నం,ఆర్కాటులో జరిగినవి. ఆ యుధ్ధాలు కర్నాటక యుధ్ధములుగా ప్రసిధ్ధి చెందినవి. ఈ మూడు యుధ్ధాలలో పాత్రలువహించిన పక్షాలు: (1)మొదటి పక్షము; ఫ్రెంచివారి సంస్థతరఫున డూప్లే + మిత్రపక్షాలు (ALLIED FORCES)గానున్న హైదరాబాదు నిజాం దావాదారుడైన ముజఫర్ జంగ్ + కర్నాటకనవాబుగా దావాదారుడైన చందాసాహెబు+అతని కుమారుడు రజాసాహిబ్. (2) రెండవ పక్షము; బ్రిటిష్ వారి సంస్థ తరఫున రాబర్టు క్లైవు + మిత్రపక్షాలు (ALLIED FORCES)హైదరాబాదు నవాబు పదవికి దావాదారుడైన నాజర్ జంగ్ + కర్నాటక నవాబు పదవికి దావాదారుడైన మహమ్మద్ అలీ. భారతదేశ చరిత్రలో రాజులు, నవాబులు, సామంతరాజుల అంతః కలహములు, వారస్తత్వపు తగాదాలు, స్వామి ద్రోహ కుట్రలు సర్వసాధరణమైనవి. వ్యాపారమునకు వచ్చిన ఫ్రెంచి సంస్థ, భ్రిటిష్ సంస్థల వారు సైనికి సబ్బందితో ఆ అంతః కలహములలో పక్షములు వహించి పోరాడుట కూడా సాధారణమైన రాజ్యతంత్రము . కానీ ఈ కర్నాటక యుధ్ధాలకు వెనక కారణం ఫ్రెంచి సంస్థ, భ్రిటిష్ సంస్థల మధ్య కేవలం వ్యాపార, వలసరాజ్యస్ధాపన పోటీలే గాక అసలు కారణం ఆ దేశాల స్వదేశ భూభాగమైన యూరోప్ ఖండములో అప్పటిలో ( 18 వ శతాబ్దము) జరుగుచున్న ఆస్ట్రియా వారసత్వత యుద్ధాలు గాదాలు (AUSTRIA SUCCESSION WAR). 1760 ఫ్రెంచి సమస్వాథకు, బ్రిటిషసంస్థకూ జరిగిన యుధ్ధమును వాండీవాష యుధ్దము (Battle of WANDIWASH) అన్న యుధ్ధములో బ్రిటిష్ సంస్థవారు ఫ్రెంచిసంస్థను పూర్తిగా ఓడించేసి పుదుచ్చెరీని కైవశం చేసుకున్నది. ఇంకా వివరాలకు చూడు కర్ణాటక యుద్ధాలు,చూడు డూప్లే

వంగ రాష్ట్ర చరిత్ర

మార్చు

చక్రవర్తి ఔరంగ జేబు చనిపోయేనాటికి ( 1707 ) వంగరాష్ట్రమనగా బెంగాలు+ ఒరిస్సా. జఫర్ ఖాన్ అను బిరుదు వహించిన ముర్షీద్ ఖులీ ఖాన్ (మరో పేరు మహమ్మద హదీ ) ముర్షీదాబాదు రాజధానిగా 1727 దాకా వంగరాజ్యమునకు నవాబుగా పరిపాలించాడు. తరువాత అతని అల్లుడు షూజా ఉద్దీన్ మహమ్మద్ ఖాన్ వంగరాష్ట్ర నవాబైనాడు. 1733లో ముగల్ చక్రవర్తి మహమ్మద్ షా బీహారు కూడా వంగ రాష్ట్రములో చేర్చాడు. 1733 నాటికి వంగరాష్టము (బెంగాలు+బీహారు+ఒరిస్సా కలసిన పెద్ద రాజ్యము). పరిపాలనకు వీలుగా షూజా ఉద్దీన్ తన మొత్తం రాజ్యమును 4 విభాగాలుగా చేసి మధ్యభాగములో తన క్రిందవుంచుకుని దక్షిణ బెంగాలు+ బీహారు నుకలిపి తన సోదరుడు ఆలీవర్ధీ ఖాన్ బహద్దర్ (హషీమ్ ఉద్దౌలా) ను దివానుగా పరిపాలనలోనూ తన కుమారుడు తాకీఖాన్ను ఒరిస్సాపరిపాలనలో దివానులుగానుంచి 1739 దాకా వంగరాష్ట్రమును పరిపాలించాడు. 1739 లో షజాఉద్దీన్ మరణించినపిదప అతనికుమారుడు సర్ ఫరజ్ వారసుడై చాల తక్కువకాలం 1740 దాకానే పరిపాలించాడు. 1740 నుడీ వంగరాష్టమునకు (బెంగాలు+బీహారు+ఒరిస్సా కలసిన పెద్ద రాజ్యమునకు) ఆలీవర్ధీ ఖాన్ నవాబుగా నియమింపబడి పరిపాలించుచున్న కాలంలో మహారాష్ట్రపరిపాలకులు ఒరిస్సాను ముట్టండించి 1751 లో వశంచేసుకున్నారు. 1751 తరువాత వంగరాష్ట్రము (బెంగాలు+బీహారు) ను 1756 దాకా ఆలీవర్ధన్ పరిపాలించాడు. అల్వరుద్దీన్ చనిపోగా అతని మనుమడు సురాజ్ ఉద్దౌలా 1756 లో వంగరాష్ట్ర నవాబైనాడు. అప్పటికి వంగరాషట్రము సమృధ్ధిగనుండెను, ఆ రాజ్య ముఖ్య పట్టణం ముర్షిదాబాదు. లండను నగరంలో కన్నా చాల సంపన్నులుకలరని క్లైవు వర్ణించిన నగరం ముర్షిరాబాదు. చాలమట్టుకూ ఆంగ్లేయులు రచించిన భారతదేశచరిత్ర అసత్యములతోకూడిన చరిత్ర. అలాగనే ఆంగ్ల చరిత్రకారులుక్లైవుని సమర్ధించుతూ సురాజ్ ఉద్దౌలాను చాల దుర్మార్గునిగా వర్ణించియున్నారు. కానీ అతనికాలంలో జరిగిన వాస్తవం కొందరు ఆంగ్లేయ చరిత్రకారులు వాస్తవస్థితి గుర్తించియున్నారు. సిరాజ్ ఉద్దౌలా 1756లో కలకత్తా ముట్టడించిని బ్రిటిష్ వారి సంస్థను ఆక్రమించటానికి రెండు ముఖ్య కారణాలు (1)స్వామిద్రోహము చేయుచున్నవారిని ఆంగ్లేయులు దగ్గరకు చేర్చి ప్రోత్సహిస్తున్నారన్నదీ (2) బ్రిటిష్ సంస్థవారు ఎక్కడ నెలకొంటే అక్కడు ముఖ్యకేంద్రాలలో కోటలు నిర్మించి సైనికబలగంచేకూర్చుకుంటూ వుండటం. ఈ రెండు ముఖ్య కారణ లవల్ల సురాజ్ ఉద్దౌలా ఆగ్రహించి వంగరాష్ట్రములో ఖాసింబజారు ఆంగ్లేయుల ఫాక్టరీనిని మొట్టమొదటగా పట్టుకుని, తరువాత కలకత్తాలోని ఆంగ్లేయుల విలియం కోట దాడిచేసి ఆక్రమించాడు. అప్పుడు జరిగిన యుద్ధమే ప్లాసీయుద్ధం అనబడింది. రాబర్టు క్లైవు కార్యకాలంలో జరిగిన యుద్ధం.

ప్లాసీ యుధ్ధం (1757)

మార్చు

కలకత్తా విడిపించటానికి చేసిన ఆ స్వల్పకాలయుధం 1757 జనేవరి మాసము లోప్లాసీ అనే కలకత్తాదగ్గర గ్రామంలో జరిగినది ప్లాసీ యుధ్ధంగా ప్రసిధ్ధిచెందినది. యుధ్ధంమనేది అక్కడ జరిగింది చాల కొంత సేపే. చాల స్వల్ప సైనిక చర్యతోనే కలకత్తా బ్రిటిష్ వారి వశమై క్లైవు విజయవంతుడ వటానికి కారణం యుద్ధానికి చాలా ముందే అనేక కుతంత్రాలు, కూటసృష్టి పత్రములు, పన్నాగాలు, రాజకీయ కుట్రలు, స్వామి ద్రోహములు, మిత్రదోహములతోకూడినది. 23-07-1757 న వంగరాష్ట్ర విజయం క్లైవు చేయించిన కుతంత్ర కార్యమని ప్రముఖ చరిత్రకారులు వ్రాసిన చరిత్ర చెపుతున్నది. ప్లాసీయుద్ధ కాలంలోవంగరాష్ట్రములో చిన్న ఉద్యోగిగానున్నవారన్ హేస్టింగ్సు కార్యసాధతను క్లైవు గుర్తించాడు. తరువాత వారన్ హేస్టింగ్సు పదోన్నతులతో పైకిరాణించి రాబర్టు క్లైవు తరువాత వంగరాష్టమునకు గవర్నర్ జనరల్ అయినాడు.

పాట్నా యుద్ధం (1759)

మార్చు

మొగల చక్రవర్తి అలంఘిర్ II అతని సేనాని ఇమద్ ఉల్ ముల్క్ చే హత్యచేయబడిన తరువాత యువచక్రవర్తి షా ఆలమ్ II ( అలీ గౌహర్) పారిపోయి ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా రాజ్యంలో కాలం గడుపుతున్నరోజులలో అతని సహాయంతో బీహారు, ఒరిస్సాలో కొన్నిప్రాంతాలు జయించి బ్రిటిష్ వారి చేతుల్లోనుండి వంగరాష్ట్రము పరిపాలించుచున్న మీర జఫర్ మీదకి దాడిచేయటానికి ముందుకు సాగి పాట్నాదాకా వచ్చాడు . అప్పుడు మీర జఫర్ తన సేనాని రామనారాయణని పట్నాను కాపాడటానికి పంపించాడు. కానీ అలీ గౌహర్ పాట్నాను ముట్టడించి వశంచేసుకున్నాడు. అప్పుడు మీర్ జఫర్ క్లైవు సైనిక సహాయం కోరాడు. బ్రిటిష్ సైనికాధికారి మేజర్ జాన్ కైలాడ్ (JOHN CAILLAUD) పాట్నా యుధ్ధంచేసి పాట్నాను తిరిగి తీసుకున్నాడు.

బక్సరు యుధ్ధం(1764), అలహాబాదు సంధి(1765)

మార్చు

1760-1765 మద్య భారతదేశములో రాబర్టుక్లైవు లేని కాలపరధిలో 1764 లో జరిగిన యుద్ధం,బక్సరు యద్ధం. 1763లో మీర్ జఫర్ ను తోలగించిమీర ఖాసింను నవాబుగా చేశారు. కానీ కొన్నాళ్ళకే మీర్ ఖాసిం బ్రిటిషవారు పన్నురహిత వర్తకము ఆపటానికి విఫల ప్రయత్నంచేశాడు. తన రాజధానిని ముర్షీదాబాదునుండి ముంగేరుకు మార్చాడు. చివరకు పాట్నాలోని బ్రిటిష్ రెసిడెంటు కార్యాలయం ముట్టడించాడు. ఢిల్లీ చక్రవర్తి షా ఆలమ్ II ( అలీ గౌహర్), ఔధ్ నవాబు షూజా ఉద్దౌలా మీర్ ఖాసింకు మద్దతిచ్చి, కలసి బీహారులో బక్సరు అను గ్రామంలో 1764 అక్టోబరు22 తేదీన బ్రిటిష్ సైన్యాధికారి జనరల్ హెక్టర్ మన్రో (Gn. Hector Munro) తో యుధ్ధం చేసి ఓడిపోయారు, యుద్ధం ఆపుచేయటానికి వంగరాష్ట్ర పరిపాలనా కౌన్సిల్ లో సభ్యునిగానున్న వారన్ హేస్టింగ్సు, గవర్నరు కార్టియర్ చేసిన ప్రయత్నం విఫలమవటంతో యుధ్ధం జరిగింది. ఆ బక్సరు యుద్ధంలో పరాజితుడైన కారణంగా ముగల్ చక్రవర్తి షా ఆలంII 1765 బ్రిటిష్ వారితో సంధికుచ్చాడు. అలహాబాదులో ఆగస్టు 16 వ తేదీన రాబర్టు క్లైవుతో చేసిన సంధినే అల్ హాబాదు సంది అంటారు. ఆ అల్ హాబాదు సంది వలననే మొగల్ చక్రవర్తిగానున్న షా ఆలంII బ్రిటిషవారికి వంగ, బీహారు, ఒరిస్సా రాష్ట్రములలో దివానీ గిరి ( రాజస్వ హక్కు) ఇస్తూ 1765 లోఫర్మానా చేశాడు. అప్పటిదాకా భారతదేశములో రాజ్య పరిపాలనాధికారము న్యాయబధ్ధమైన ఆధారమేమీ లేనివారైన బ్రిటిష్ వారికి అ ఫర్మానా రాజ్యపాలక హక్కుతీసుకుచ్చిన ఒక దస్తావేజు (లిఖిత అధికారమైనది). అందువలన ప్లాసీ యుధ్ద విజయం కన్నా బక్సరు యుద్ధ విజయం వలసరాజ్యస్థాపనలో చాలా పెద్ద ముందడుగు (ACHIEVEMENT FOR THE BRITISH). ఆ సంధి ప్రకారము రాబర్టు క్లైవు 26 లక్షలు సాలూనా కప్పముక్రిందనూ, ఔధ్ రాజ్యములో నున్న అలహా బాదు,కోరా ప్రాంతాలను చక్రవర్తి షా ఆలానికి ఇచ్చాడు. యుధ్ధపు ఖర్చులక్రింద షా ఆలం 53 లక్షల రూపాయలు బ్రిటిష్ వారికి నష్టపరిహారమిచ్చాడు.

క్లైవు-హేస్టింగ్సు కార్యకాలంలోని వంగరాష్ట్రపు నవాబులు, వారి పరిపాలనాకాలాలు

మార్చు

అల్వరుద్దీన్ (1740-1756), సిరాజ్ ఉద్దౌలా (1756-1757), (1757-1760)మీర్ జఫర్ అలీఖాన్ బహద్దూర్ (మీర్ జఫర్), (1760-1763) మీర్ ఖాసీం (ఇతివమద్ ఉద్ దౌలా), (1763-1765)[మీర్ జఫర్ అలీఖాన్ బహద్దూర్ (మీర్ జఫర్) రెండవసారి మళ్లీ నవాబై 1765 లో చనిపోయాడు. (175-1766)నజముద్దీన్ అలీ ఖాన్, (1766-1770) సైఫ్ ఉద్ దౌలా, (17770-1793)ముబారక్ ఉద్ దౌలా

24 పరగణాలు

మార్చు

పరగణ అంటే దేశములో ఒక భూభాగము ( బ్రౌన్ నిఘంటువులో పరగణా అంటే Division of a Country).18 వ శతాబ్దములో వాడుకలోనున్న మాట 'పరగణా' అంటే ప్రాంతము (AREA) అని చెప్పచ్చును. తాలూకా గానీ గ్రామపేర్లుగానీ విశదీకరించక చెప్ప బడే భూభాగము. ఉదాహరణకు బ్రిటిష్ వ్యాపారసంస్థ వారు ఇండియాను ఇంగ్లీషు పరగణాలుగా చేయుచుండిరి అని చరిత్రపుస్తకములలో కనబడును. పరగణా అని ఉపయెగించిన సందర్భములు చూచినచో పరగణా అంటే ఇంకా విపులమగును. వంగరాష్ట్రములోని 24 పరగణాలను ( 24 భూభూగములను) 1759 లో వంగరాష్ట్ర నవాబు సిరాజ్ ఉద్దౌలా రాబర్టు క్లైవుదొరకు జాగీరుగానిచ్చాడు. ఆ 24 పరగణాల మొత్తం విస్తీర్ణం 882 చదరపు మైళ్ళు. ఇప్పటికీ అదే పేరుతో పశ్చమబంగళా రాష్ట్రములో 24 పరగణాలు (North paraganas) అను పేరుతో ఒక జిల్లాగా నున్నది.

వంగరాష్ట్ర దుస్తితికి దారితీసిన రాబర్టు క్లైవు కార్యాచరణ

మార్చు

1757 మొదలు 1767 వరకూ రాబర్టు క్లైవు బ్రిటిష వ్యాపార కంపెనీని, బ్రిటిష్ దేశముని ప్రతిగ్రాహకులుగా చేయటమేకాక వ్యక్తిగతగ్రాహకునిగా రాజకీయంగానూ ఆర్థికంగానూ అమిత లబ్ధిపొంది వంగరాష్ట్రమును దుస్థితికి పాలుచేసి, రాజనిధులు, దేశాదాయము బ్రిటన్ కు మళ్లించిన సంగతి కొలది వ్యత్యాసములతో అనేక చరిత్రకారులు వెలిబుచ్చిన చరిత్ర. సా.శ. 1770 నాటి వంగరాష్ట్రపు కరవు ప్రకృతి వైపరీత్యమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు దుస్థితికి చేదోడైనవి అప్పటికి పదేండ్లుగానడచిన దుస్థితి 1770లో సంభవించిన కరవు తీవ్రతకు దోహదంచేసినదనుటలో సందేహంలేదు.

1757 -1767 మధ్య జరిగిన రాజనిధుల దుర్వినియోగం

మార్చు

వంగరాష్ట్ర రాజనిధులు దుర్వినియోగమౌటకు రాజ్యములోని అంతః కలహములు, పదవీకాంక్షలకు చేదోడుగా క్లైవుదొర కుతంత్రములు తోడ్పడినవి. 1757 నాటికి నవాబు సురాజ్ ఉద్దౌలా రాజనిధులు సంపత్తీ దాదపుగా 4 కోట్ల (పౌనుల)£ విలువగలవని అంచనాలు చరిత్రలో కనపడుచున్నవి. ప్లాసీయుద్ధంలో ఓడిపోయిన నవాబు సురాజ్ ఉద్ధౌలా ప్రస్తావించిన సంధి కుదుర్చుకునివున్న పక్షములో వంగరాష్ట్రమునకు జరిగే ఆర్థిక నష్టములకన్నా చాల అధిక రెట్లు స్వామిద్రోహముచేసిన మీర్ జఫర్ తో క్లైవు దొర రహస్య వప్పందముచేసుకునటం వల్ల కలిగింది. ఆవిధంగా సింహాసనాధీశుడై వచ్చిన మీర్ జఫర్ నవాబు వంగరాష్ట్ర రాజనిధులనుండి బ్రిటిష్ కంపెనీకి, వారి సిబ్బందికీ క్లైవు దొరకు కలిపి దాదాపుగా రెండున్నర కోట్లకు పైగా పారితోషికాలుగా ఇచ్చాడు. అంతేకాక 1759 లో జరిగిన పాట్నాయుద్ధం వల్ల తనపక్షం నిలచి సైనిక సహాయంచేసినందకు యుధ్ద వ్యయములక్రింద ఇంకా కొన్ని నిధులను క్లైవు దొరకు ఇచ్చాడు. 1763 లో పదవీ వ్యామోహంతో వచ్చిన మీర్ ఖాసిం నవాబు సింహాసనం అధిరోహించుటకు ఇంకో కోటిన్నర దాకా రాజనిధులను సంపత్తులనూ క్లైవు దొరకు ముట్టచెప్పాడు. తరువాత రెండోసారి 1765లో మళ్లీ పదవిలోకి వచ్చిన మీర్ జఫర్ నవాబు తన తదనంతరం తన వారసుడుగా తన కుమారునిక్షేమంకోసం 70000£ క్లైవు దొరకిచ్చాడు. 1765 లో నవాబు వారసుడు సింహాసనాధీశుడగుటకు ( మీర్ జఫర్ కుమారుడు నిజామ్ ఉద్దౌలా నిజాముద్దీన్ అలీ ఖాన్ ) తనతండ్రి ఇచ్చిన 70000£ కాకుండా ఇంకో లక్ష£ క్లైవు దొరకు ముట్టచెప్పాల్సి వచ్చింది. ఆవిధంగా వంగరాష్ట్ర రాజనిధులుయావత్తూ బ్రిటిష్ కంపెనీకి, రాబర్టు క్లైవు దొరకూ పారితోషకాలకు గానూ యుధ్ద వ్యయముల క్రిందనూ దుర్వినియోగమైనవి.[4]

వంగ రాష్ట్రములో క్లైవు చేసిన రాజ్యతంత్రం

మార్చు

1757 ప్లాసీ యుద్ధమేకనక దర్మయుద్దమైయుంటే సురాజ్ ఉద్దౌలా ఓడిపోయేవుండేవాడుకాదని చరిత్రలో విశదమైన సంగతి. అనేక రెట్లు సైనిక బలగంగల సురాజ్ ఉద్దౌలాను జయించటమసంభవమని తెలిసిన క్లైవు దొర కుటిల మార్గములను అవలంబించి జయించిన మీదట వంగరాష్ట్రము పూర్తిగా అతని సర్వోఛాధిపత్యముక్రిందయుండెను. నవాబుని నియమించటం, భర్తరఫ్ చేయ గల స్తోమత వచ్చింది. అటువంటి (King making) స్తోమతను వంగరాష్ట్రములో రాజ్యతంత్రములుప్రయోగించి ఆర్థిక లాభములకోసం దుర్వినియోగంచేశాడు. ఆ పదేండ్లలో మూడు సార్లు నవాబులు మారటం, మూడు యుధ్దాలలోనూ సైనిక సహాయం అందించటం వల్ల బ్రిటిష్ వారికి ఆర్ధి కంగా అమిత లాభదాయకమైనది. సరాసరి సైనిక చర్యతో ఆక్రమణచేయకుండా వంగరాష్ట్రమును బ్రిటిష్ వారివశపరచిన ఘనత రాబర్టు క్లైవు దొరకే దక్కినది. ప్లాసీయుధ్దానంతరం వచ్చిన స్తోమత, 1765 నుంచీ వచ్చిన రాజస్వహక్కు క్లైవుదొరచేతుల్లోనున్నందువల్ల వంగరాష్ట్ర మునకు దేశాదాయం సూన్య మగుటయే కాక రాజస్వ వసూలుకు దళారీలను నియమించి వసూలు చేయించటం వల్ల రైతుల పరిస్థితి మరీ దుస్థితికి దిగజారింది. అంతేకాక నవాబు పదవి లోనియమింపబడటానికి తన షరత్తులలో బ్రిటిష్ వర్తకుల వ్యాపార దిగుమతులు సుంక రాహిత్యముగా వర్తకము చేసుకొనుట ఒకటి. ఆ షరతును అంగీకరించిన నవాబుకు రాష్ట్ర పరిపాలనకావససిన ఆదాయం కేవలము దేశీయ వర్తకులదగ్గరనుండే లభించవలసియున్నది. ఆదాయంలేక, రాజనిదులు లేక పరిపాలన బాధ్యత నిర్వహించటం అసాద్యమన్న విషయం అవగాహనలేని దొరకాదు రాబర్టు క్లైవు. అదే ముద్దపై 1764లో వారన్ హేస్టింగ్సు వంగరాష్ట్ర కౌన్సిల్ లో సభ్యునిగానున్నప్పుడు తీవ్ర ఆక్షేపణలుతెలిపి రాజీనామా చేశాడు. ముఖ్య లక్ష్యం ఆర్థిక లాభ సంపాదనగాయున్న వ్యాపార కంపెనీ రాష్ట్రాభివృధ్ధి, ప్రజాక్షేమం వ్యవసాయోత్పత్తి మొదలగువాటినేమీ చేయకపోవటంవల్లం రాష్ట్రము క్రమేణా దుస్థితికి పాలైనది. అధికార కాంక్షతో క్లైవుదొరను ఆశ్రయించిన నవాబులు సింహాసనం అధిష్టించిన కొలదిరోజలకే క్లైవు రాజ్యతంత్రముల పరిణామములు అవగాహనమౌవగానే వ్యతిరేకతతో తిరుగుబాటు చేయ ప్రయత్నించి విఫలులైనారు.

చరిత్రాధారాలు

మార్చు

The British Rule in India by D.V. Siva rao (1938) బిబిలియోగ్రఫిలో 95 చరిత్రాధారములైన పుస్తకములు ఉల్లేఖించబడియున్నవి. The History of British India, (10 volumes)1858 by James Mill, the History of British Empire in India (6 volumes) 1841, The Discovery of India by Jawaharlal Nehru (1946), Essay on Robert Clive by Macaulay (xxxx), Rise of Christian Power in India by Major B.D. Basu (xxxx) ఇత్యాదులు

ఇందులోని విశేషాలను తెలుగులోకి లార్డ్ క్లైవ్ చరిత్రము (Life of Lord Clive) అను పేరుతో అనువదించి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారిచే 1913 సంవత్సరంలో ప్రకటించబడినది.[5] ఈ పుస్తకంలో బ్రిటిష్ సైన్యాధికారి లార్డ్ క్లైవ్ (Lord Clive) గా తెలుపబడిన రాబర్ట్ క్లైవు (Robert Clive) (1725-1774) కు సంబంధించిన జీవిత విశేషాలున్నాయి.

మూలాలు

మార్చు
  1. "The British Rule in India” D.V.Siva Rao (1938) ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల,2-10-1938 . బెజవాడ
  2. 2.0 2.1 2.2 Encyclopedia Britannica Macropedia Volume 4,(1984)pp741-742
  3. SLICE OF INDIAN HISTORY IN WALES, K.S.S. SESHAN. THE HINDU FRIDAY REVIEW SEPTEMBER 9, 2016
  4. http://www.historydiscussion.net/history-of-india/history-of-bengal/bengal-under-the-rule-of-nawabs-a-close-view/5931[permanent dead link]
  5. లార్డ్ క్లైవ్ చరిత్రము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1913.