అల్లావుద్దీన్ ఖాన్
అల్లావుద్దీన్ ఖాన్ (బాబా అల్లావుద్దీన్ ఖాన్ గానూ, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ గానూ ప్రఖ్యాతులు) (1862 - సెప్టెంబర్ 6, 1972) బెంగాలీ సరోద్ విద్వాంసుడు, సుప్రఖ్యాత హిందుస్తానీ సంగీతకారుడు. 20వ శతాబ్దిలోకెల్లా అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచారు.[1]
అల్లావుద్దీన్ ఖాన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ca. 1862 బ్రహ్మాంబరియా, బెంగాల్ ప్రెసిడెన్సీ, (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది) |
మరణం | 1972 సెప్టెంబరు 6 |
సంగీత శైలి | హిందుస్తానీ సాంప్రదాయ సంగీతం |
వృత్తి | స్వరకర్త |
వాయిద్యాలు | షెహనాయి, సరోద్, సితార |
వ్యక్తిగత జీవితం
మార్చుఅల్లావుద్దీన్ ఖాన్ 1862లో ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మస్థలం త్రిపుర. అల్లావుద్దీన్ ఖాన్ హిందూ, ముస్లిం ఆరాధనా పద్ధతులు రెంటినీ పాటించేవారు. ఆయన నిత్యం నమాజ్ చేయడంతో పాటుగా నిత్య శివారాధకుడు కూడా. శివుడిపై ఆయనకున్న భక్తిభావం వల్లనే కుమార్తెకు అన్నపూర్ణాదేవి అని పేరుపెట్టుకున్నారు. ఆయన కుమార్తె అన్నపూర్ణా దేవి సుర్ బాహిర్ (బేస్ సితార్) వాద్యకారిణి, కుమారుడు అలీ అక్బర్ ఖాన్ ప్రముఖ సరోద్ విద్వాంసుడు.[1]
సంగీత రంగం
మార్చుఏడవ ఏటనే సంగీత విద్యను అభ్యసించేందుకు స్వస్థలమైన త్రిపురను విడిచిపెట్టి కలకత్తా (నేటి కోల్ కతా) చేరుకుని ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. చివరికి తాన్ సేన్ వంశస్థుడు, సుప్రసిద్ధుడు అయిన వజీర్ ఖాన్ వద్ద శిష్యరికం పొందారు. అల్లావుద్దీన్ ఖాన్ ప్రధానంగా సరోద్ విద్వాంసుడిగా ప్రఖ్యాతి పొందినా మొత్తంగా 16 వాద్యాలపై ఆయన నైపుణ్యం సాధించారు.