అహ! నా పెళ్ళంట! (1987 సినిమా)

1987 తెలుగు సినిమా

అహ! నా పెళ్ళంట ! హాస్యబ్రహ్మగా పేరొందిన జంద్యాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ 1987 సంవత్సరంలో నిర్మించింది. పిసినారితనాన్ని ఆధారం చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తిస్థాయి హాస్యచిత్రాల విషయంలో తెలుగు సినిమా రంగంలో ఓ మేలిమలుపు. మొదటి నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది.

అహ! నా పెళ్ళంట!
(1987 తెలుగు సినిమా)
Aha naa pellanta dvd cover.jpg
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం దగ్గుబాటి రామానాయుడు
రచన ఆదివిష్ణు (కథ),
జంధ్యాల (సంభాషణలు)
తారాగణం రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్ , కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాళ్లపల్లి, సుత్తి వీరభద్రరావు, అశోక్‌రావు, శుభలేఖ సుధాకర్, విద్యాసాగర్
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
నిడివి 148 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి షుమారు 16.00 లక్షల రూపాయలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా నటించగా, కోట శ్రీనివాసరావు పిసినారిగా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇంకా రజని, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి ఇతర పాత్రలు పోషించారు.

కథసవరించు

సత్యనారాయణ (నూతన్ ప్రసాద్) బాగా డబ్బున్న శ్రీమంతుడు. అతని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఈ శ్రీమంతుడు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా, తన ఒక్కగానొక్క కొడుకును గారాబంగా పెంచుతాడు. ఆ కొడుకు పేరు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్). తండ్రి గారాబం వల్ల, కృష్ణమూర్తి చాలా మొండివాడిగా పెరుగుతాడు. ఈ తండ్రీ కొడుకులకు కోపం వస్తే ఒకరితో ఒకరు పోటీ పడి ఇంట్లో సామాన్లు పగలగొడుతూ ఉంటారు. దాన్ని ఆ ఇంట్లో నౌకరైన రాళ్ళపల్లి ప్రేక్షకుడిగా చూస్తూ లెక్కలు వేస్తుంటాడు.

కృష్ణమూర్తి పద్మ(రజని)ని ఒక స్నేహితుని పెళ్ళిలో చూసి ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి వివరిస్తాడు కృష్ణమూర్తి. కాని, సత్యనారాయణ తన భార్యకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రేమ వివాహానికి మాత్రం అంగీకరించనంటాడు. పద్మ వెంకటాపురానికి చెందిన మహా పిసినారి లక్ష్మీపతి(కోట శ్రీనివాసరావు)కూతురు. ఈ విషయం తెలిసి, కొడుకుని ఆ అమ్మాయిని మరచి పొమ్మంటాడు. చివరికి ప్రాణం విసిగి, సత్యనారాయణ, పిసినారి లక్ష్మీపతిని ఒప్పించి, మూడునెలల లోపున పెళ్ళిచేసుకోగలవా అని ఛాలెంజ్ విసురుతాడు. ఆ పని తన కొడుకువల్ల ఎలాగో కాదు కదా అన్న నమ్మకంతో. తన కొడుకుని ఆ పనిలో విజయం సాదించకుండా ఉండేందుకు, ఒక మెలిక కూడ పెడతాడు. అదేమిటంటే, కృష్ణమూర్తి, తాను ఒక కోటీశ్వరుడి ఏకైక కుమారుణ్ణని చెప్పుకోకూడదని ఆంక్ష విధిస్తాడు. తండ్రీ కొడుకులు పందెం కాసుకుంటారు.

ఈ విధంగా తండ్రితో పందెం కాసి, కృష్ణమూర్తి వెంకటాపురానికి వెళ్ళి, జాగ్రత్తగా పిసినారి లక్ష్మిపతి ఇంటోనె అద్దెకి దిగుతాడు. ఇక అక్కడనుంచి, ఆ పిసినారిని తన వలలో పడేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టుతాడు. అందులో భాగంగా కృష్ణమూర్తి తాను ఇంకా వెయ్యి రెట్లు పెద్ద పిసినారినని నిరూపించుకోవటానికి అనేక పనులు చేస్తాడు. అతను చేసే అటువంటి పనులు, పిసినారి ప్రతిస్పందన, హాస్యాన్ని సృష్టిస్తుంది. అలా కొంతకాలానికి, కృష్ణమూర్తి, పిసినారికి చాలా దగ్గరవుతాడు. సత్యనారాయణ కూడ ఆ ఊరు వచ్చి, పిసినారి ఇంట్లోనే దిగి, తన కొడుకు పథకాలను తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తాడు. ఈవిధంగా కథ అనేక హాస్య సంఘటనలతో జరిగి, చివరకు సత్యనారాయణ తన కొడుకు పెళ్ళి, పిసినారి కూతురితో జరగటానికి ఒప్పుకుంటాడు. పిసినారి భార్య, కూతురు కలసి తిరగబడి, అతనికి బుద్ధిచెప్పి ఈ పెళ్ళికి ఒప్పిస్తారు.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

కథాంశం అభివృద్ధిసవరించు

అహ!నా పెళ్ళంట! చిత్రకథను ప్రముఖ కథా రచయిత ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా అభివృద్ధి చేశారు.

తారాగణం ఎంపికసవరించు

కథలో కీలకమైన పాత్ర పిసినారి, కథానాయిక తండ్రి లక్ష్మీపతి పాత్ర. ఈ పాత్రను మొదట రావుగోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారు. కానీ పాత్రస్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో సూచిస్తే ఆయనను కాదనుకుని అప్పటికి కేవలం రెండే సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావును ఆ పాత్రకు తీసుకున్నారు. లక్ష్మీపతి పాత్రకు అనుగుణంగా కోట శ్రీనివాసరావు జుట్టు చాలావరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినమాల్లో నటిస్తూండడంతో, ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర చిత్రాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ దీనిలో పాత్ర పోషించారు. ముతకపంచె, బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ పాత్ర ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి వుండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట, కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.[2]

ప్రాచుర్యంసవరించు

  • హాస్యనటుడు బ్రహ్మానందం కు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాస రావును తిట్టే తిట్లు చాలా ప్రాచుర్యం పొందాయి.

సినిమా తీసిన ప్రాంతాలుసవరించు

ఈ సినిమాను, హైదరాబాదునగరం, దేవర, యామిజాల గ్రామాలలో తీసారు. ఈ గ్రామాలలో ఉన్న కొన్ని ఇళ్ళలో వేరే సెట్లు వెయ్యకుండా తెయ్యటం ఈ సినిమా ప్రత్యేకత.

ఊతపదాలుసవరించు

  • రాజేద్రప్రసాద్ ఎక్స్ పెక్ట్ చేశా
  • కోట శ్రీనివాస రావు నాకేంటి
  • నూతన్ ప్రసాద్ మా తాతలు నలుగురు
  • బ్రహ్మానందం ఆ మొహం చూడు

మూలాలుసవరించు

  1. Namasthe Telangana (19 June 2021). "జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా". Namasthe Telangana. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 26 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. పప్పు, శ్రీనివాస్. "అహనా పెళ్లంట - లక్ష్మీపతి". జంధ్యావందనం. Archived from the original on 6 ఏప్రిల్ 2015. Retrieved 21 April 2015.