అహోరాత్ర యాగం
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలోని వీరంపాలెం గ్రామంలో 2013 అక్టోబరు-నవంబరు నెలల్లో శ్రీనవకుండాత్మక శతసహస్ర మహాచండీ అహోరాత్ర యాగం జరిగింది. ఈ యాగం ప్రసార మాధ్యమాల్లోనూ, జనబాహుళ్యంలోనూ అహోరాత్ర యాగం అనీ, అహోరాత్రం అనీ వ్యవహరించబడింది. వీరంపాలెం బాలాత్రిపురసుందరీ పీఠం ప్రాంగణంలో నిర్వహించిన అహోరాత్ర యాగానికి శ్రీ భారతీయ వేదవిజ్ఞాన ధర్మసేవాపరిషత్తు నిర్వహించగా పీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యం వహించారు. 552 గంటలపాటు (23 రోజులు) పగలు రాత్రి నిర్విరామంగా సాగిన ఈ క్రతువుకు 15 మంది హిమాలయ నాగసాధువులు, 24 మంది ఉపాసకులు, 89 మంది దీక్షధారులు పాల్గొన్నారు.[1]
యాగశాల నిర్మాణం
మార్చు60అడుగుల వైశాల్యంలో, 39అడుగుల ఎత్తున, నాలుగుప్రాకారాలు యాగశాల నిర్మించారు. సప్తమహర్షి స్వరూపమైన దేవతా ఆవాహనాలు, సప్తమాతృక విగ్రహారూపాలు, దశమహావిద్యల విగ్రహాలు, నవదుర్గామూర్తులు, మధ్యలో ఏడడుగుల ఎత్తున శ్రీచక్రం నిలిపారు. ఎత్తైన ప్రాకారంలో శ్రీచక్రం చుట్టూ తూర్పున మహా సరస్వతీ దేవి క్షేత్రపాలకురాలిగా, ఉత్తరాన బాలాత్రిపురసుందరి దేవి క్షేత్రపాలకురాలిగా,పశ్చిమంలో మహాలక్ష్మీదేవి, దక్షిణాన మహాకాళీమాత క్షేత్రపాలకులుగా లోపలి నుంచి ద్వారాలను చూస్తూన్నట్టుగా నెలకొల్పారు. యాగశాల చుట్టూ పశ్చిమాన అనంతేశ్వరస్వామి, ఉత్తరాన లక్ష్మీగణపతి, తూర్పున మహా ప్రత్యంగైరా దేవి, దక్షిణాన లలితాపరమేశ్వరి క్షేత్రపాలకులుగా బయట నుంచి ద్వారాలను చూస్తున్నట్టుగా నిలిపారు. 128 సిద్ధాకర్షక యంత్రాలు, 128 దుర్గాశూలాలు, 12 ప్రధాన హోమగుండాలు, 18 కల్పిత హోమకుండాలతో యాగశాల నిర్మితమైంది.
చతుస్సష్టి యోగినీ యోగశాల
మార్చుఅహోరాత్ర యాగం కోసం నిర్మించిన యాగశాల చతుస్సష్టి యోగినీ యాగశాల. యాగశాలలో మొత్తం 64 స్తంభాలు, 4 వేదికలు ఉన్నాయి. యాగశాలను యాగం ముగిశాకా కూడా భక్తుల సందర్శనార్థం అలాగే వుంచారు.
నిర్మాణం
మార్చు64 యోగిని స్తంభములతో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాకారాలతో, 4 వరుసలతో, రెల్లుగడ్డితో నిర్మించిన యాగశాలలో 31 హోమకుండములలో పూజలు జరిగాయి. నవదుర్గ,సప్తమాతృక, దశమహావిద్య, మేరు శ్రీచక్ర, లక్ష్మీసరస్వతి, గౌరీ, బాలా, లక్ష్మీగణపతి, శివ,నందీశ్వర, భైరవ, సూర్య, క్షేత్రపాలక, మహాదేవి సహిత 29 దివ్య విగ్రహాములకు పూజలు జరిపారు. 39 అడుగుల ఎత్తు, 60అడుగుల వైశాల్యంతో 216 మంది సుఖాసీనులై యాగము నిర్వహించే విధంగా దీన్ని నిర్మించడం విశేషం. ప్రాకరానికి ప్రాకారానికి మధ్య 3 అడుగుల ఎత్తు ఉండేలా నాలుగు ప్రాకారాలుగా నిర్మించారు. 108 దుర్గాశూలాలతో, 108 దివ్య యంత్రాలతో 4 ద్వారాలకూ 4 వేదమూరులతో 9అడుగుల ఎత్తున మహాదేవి యాగశాలను నిర్మించారు. ఈ యాగశాలలో ఉన్న 64 స్తంభాలకూ యాగబలి, బలిహరణ, పూజ నిర్వహిస్తారు.[2]
దైవీ మూర్తులు
మార్చుయాగశాల లోపల, ప్రాంగణంలోనూ పలు దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
యాగశాల లోపల
మార్చుయాగశాల లోపల సప్తమాతృకలు, దశమహావిద్యల విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవదుర్గల శక్తులను మంత్రసహితంగా కలశాలలో ఆవాహన చేశారు. క్షేత్రపాలకుల విగ్రహాలతో పాటుగా యాగంలో ప్రధాన దేవతైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠచేశారు.
సప్తమాతృకలు
మార్చునవదుర్గలు
మార్చుశ్రీచక్రం
మార్చుయాగశాల ప్రాంగణంలో
మార్చు- యాగశాలకు పశ్చిమ దిశలో నర్మదానదీ తీరం నుంచి తీరం నుంచి తీసుకువచ్చిన అనంతేశ్వరస్వామి విగ్రహం సశాస్త్రీయంగా ప్రతిష్ఠించారు. అమ్మవారికి నిర్వహిస్తున్న చండీయాగ ఫలం లభించాలంటే శివుని అభిషేకాలు చేయాలనే విధిని అనుసరించి నిత్యం అభిషేకాలు నిర్వహించేందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
- యాగశాలకు తూర్పు దిక్కున మహాప్రత్యంగిరా అమ్మవారిని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు. భూత ప్రేత పిశాచాది గణాల వల్ల ఏర్పడే బాధలన్నీ నివృత్తి చేసే శక్తిగా మహా ప్రత్యంగిరా అమ్మవారికి శాక్తేయ ఆరాధనలో ప్రసిద్ధి ఉంది. మహా ప్రత్యంగిరా అమ్మవారి పూజలను చేయడం ద్వారా లోకంలో పలు వినాశన కార్యాలు, ఉగ్రవాద చర్యలు తగ్గుతాయని నిర్వాహకులు వేంకటరమణ శాస్త్రి తెలిపారు.
- యాగశాలకు ఉత్తరాన లక్ష్మీగణపతిని ప్రతిష్ఠించారు. నిత్యం యాగప్రారంభంలో స్వామివారికి పూజాదికాలు చేశారు.
- యాగశాలకు దక్షిణ దిశలో లలితాపరమేశ్వరి మూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేశారు.
యాగ క్రతువు
మార్చుయాగ క్రతువులో భాగంగా 23 రోజుల్లో 1124 సంపూర్ణ చండీహోమాలు, లక్ష బాలానవాక్షరి మూలమంత్ర జపం, లక్ష లలితా సహస్ర నామపారాయణ, కోటి కుంకుమార్చన కార్యక్రమాలను సంకల్పించి పూర్తిచేశారు. ముందుగా సంకల్పించిన ఈ కార్యక్రమాలతో పాటు నాలుగు వేదాలను పూర్తిగా పారాయణ చేశారు.[3]
చండీహోమాలు
మార్చుఋత్వికులు చండీపారాయణ చేస్తూండగా యాగశాలలోని మూడు వేదికల్లో ఏర్పాటుచేసిన ప్రధాన హోమగుండాల్లో చండీపారాయణలు నిర్వహించారు. నిత్యం 12 హోమకుండాల్లో 48కి పైగా చండీహోమాలు నిర్వహిస్తూ 23రోజుల్లో 1124 చండీపారాయణలు పూర్తిచేశారు. మంత్రభాగం, హవిర్భాగం వంటీ 4విధాలైన క్రతువులతో కూడిన చతుర్విధ హోమాలు నిర్వహించారు.[3]
కుంకుమార్చనలు
మార్చుయాగశాలకు తూర్పు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శ్రీచక్రాలకు కోటి కుంకుమార్చన నిర్వహించారు. పీఠం సేవాదళ సభ్యులైన వేలమంది స్త్రీలు వంతుల వారీగా 22రోజుల పాటు నిర్వహించే కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు. 23వ రోజున పట్టుచీర కట్టుకుని వచ్చిన సువాసినులందరినీ అనుమతించారు.
లక్ష లలితా సహస్ర నామ పారాయణ
మార్చుపీఠం సభ్యులైన వేలాది మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణలో పాల్గొన్నారు. 23రోజుల్లో లక్ష లలితా సహస్రనామ పారాయణలు నిర్వహించారు. పూర్ణాహుతి సమయంలో లలితా సహస్రనామ పారాయణ ఫలాన్ని లోక కళ్యాణం కొరకు ధారపోశారు.
బాలానవాక్షరి మంత్రజపం
మార్చుబాలాత్రిపురసుందరి దేవిని ఆరాధించే బాలానవాక్షరి మూలమంత్రజపం లక్షసార్లు నిర్వహించారు. లక్ష మంత్రజపంతోపాటు లక్ష బాలానవాక్షరి హోమాలు నిర్వహించారు. ఈ మంత్రజపాన్ని యాగశాలలో ఋత్వికులు నిర్వహించారు.
ఇతర పూజలు, హోమాలు
మార్చుఈ ప్రధాన క్రతువులతోపాటు నిత్యం ఉచితంగా నమోదుచేసుకున్న ప్రతివారికీ నక్షత్ర శాంతిహోమాలు, వివాహం ఆలస్యమైన యువతీయువకుల కోసం దోషనివారణ హోమాలు, ఉపాసకులు, నాగ సాధువులతో నవదుర్గాదేవిలకు, సప్తమాతృకులకు, దశ మహా విద్యా శక్తులకు, శ్రీ చక్రాలకు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, బాలా దేవీలకు శాస్త్రోక్తంగా అర్చన చేసారు. ఉదయం మూడు గంటలనుంచి నాలుగు గంటలవరకు ఉపాసకులతో 31 మంది విశేష దేవతామూర్తులకు మూల మంత్రహోమం, ఉపద్రవ నిర్మూలన హోమం, సర్వదేవతా హోమాలను నిర్వహించారు. యాగశాలలోని 64 స్తంభాలకు ఆవేశించే 64 యోగినీదేవతలకు పూజలు, యాగబలి వంటివి నిర్వహించారు.
ఋత్వికులు
మార్చుభారీఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో యాగనిర్వహణకు ఆంధ్రప్రదేశ్ నుంచి, దశమహావిద్యల ఆరాధనకు వారణాసి నుంచి, చతుర్వేద పారాయణ సప్తమాతృక, నవదుర్గల ఆరాధనకు తమిళనాడు నుంచి, ప్రత్యంగిర, శ్రీచక్ర ఆరాధనకు కాశీ నుంచి ఋత్వికులు, ఆరాధకులు విచ్చేశారు. హిమాలయాలు, కాశీ ప్రాంతం నుంచి తొలిసారిగా దక్షిణాది ప్రాంతానికి నాగసాధువులు వీరంపాలెం గ్రామానికి వచ్చారు. నఖశిఖ పర్యంతం విభూది ధారణ, కౌపీనధారణ వంటి విచిత్రమైన ఆహార్యంతో, విశేషమైన సంప్రదాయాలతో ప్రవర్తిల్లే నాగసాధువులను దర్శించుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా యాగంలో పాల్గొన్నారు.
ఋత్విక బృందం
మార్చుచండీహోమాలు, చండీపారాయణలు నిర్వహించేందుకు వందమందితో కూడిన ఋత్విక బృందం యాగంలో పాల్గొంది. యజుర్వేద అధ్యయన కుటుంబాలకు చెందిన స్మార్త పండితుల బృందానికి నాయకత్వం వహించారు.
దశమహావిద్యల ఆరాధక బృందం
మార్చుదశమహావిద్యల ఆరాధకులైన అర్చక బృందం అహోరాత్రం యాగశాలలోని దశమహావిద్య మూర్తుల నిత్య ఆరాధన, కైంకర్యాలు చేసేందుకు నియమితులయ్యారు. వీరు యాగం జరిగిన సమయంలోనే కాక నిత్యం దశమహావిద్యలను ఆరాధించేవారు.
వేదపండితుల బృందం
మార్చుతమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు నవదుర్గ, సప్తమాతృకల ఆరాధనలు, కైంకర్యాలు నిర్వహించారు. యాగంలో అదనంగా చేరిన చతుర్వేద పారాయణలు వీరే చేశారు.
శ్రీచక్రారాధకులు
మార్చు- వారణాసిలోని ప్రసిద్ధ క్షేత్ర పూజారులు శ్రీచక్ర పూజాదికాలు నిర్వహించారు.
- విశిష్టమైన మహాప్రత్యంగిరా అమ్మవారి పూజలు, కైంకర్యాలు చేశారు.
నాగసాధువులు
మార్చుహిమాలయ ప్రాంతాలు, వారణాసి, కుంభమేళా సమయంలో ఆయా ప్రదేశాలు తప్ప ఇతర ప్రదేశాలకు వెళ్లని నాగసాధువులు అహోరాత్ర యాగంలో పాల్గొనేందుకు వీరంపాలెంలో 23రోజుల పాటు ఉన్నారు. 15 మందితో కూడిన నాగసాధువుల బృందానికి హేమగిరి తానాపతి, మహంత్ సంతోష్‌పూరి, రమేష్‌గిరి కారోవరి నాయకత్వం వహించారు. వీరిలో హనుమాన్‌పూజారి సదానంద్ గిరి, దత్తపూజారి, సురేంద్రగిరి,మహంత్ రాంచరణ్‌గిరి, భండారి, రత్నానంద్, నాగబాబా దశమగిరి, ఘనశ్యాం గిరి, రఘు నందన్‌గిరి, శ్యాంగిరి ఉన్నారు. రోజంతా విడిదిలో తపస్సులోనే వున్న నాగసాధువులు రోజూ తెల్లవారుజామున పూజాకార్యక్రమాల్లోనూ 2గంటలు, మధ్యాహ్నం యాగశాలలో యోగధ్యానం చేస్తూ కొంతసేపు, రాత్రి విశేషహారతి నిర్వహించేందుకు అరగంట మాత్రమే భక్తులకు కనిపించారు. సాధువుల దర్శనం కోసం నిత్యం ఆయా సమయాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నాగసాధువులు ఇచ్చే హారతి తిలకించేందుకు లక్ష మంది కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
-
అహోరాత్ర యాగంలో నాగసాధువుల విశేషహారతి
-
అహోరాత్ర యాగశాల ప్రాంగణంలో నాగసాధువులు
-
నాగసాధువుల హారతి కోసం ఎదురుచూస్తున్న భక్త సందోహం
యాగ ద్రవ్యాలు
మార్చుచండీహోమాలు, లక్షకుంకుమార్చన, పూజాకార్యక్రమాలలో ఉపయోగించిన ద్రవ్యాలు ఇవి:
- 12,500 కేజీల ఆవునెయ్యి
- టన్ను పసుపు
- 6 టన్నుల కుంకుమ
- 4 టన్నుల పువ్వులు
- 230 టన్నుల యజ్ఞ సమిధలు
నిర్వహణ
మార్చుశ్రీ భారతీయ వేదవిజ్ఞాన ధర్మసేవాపరిషత్తు నిర్వహించగా కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ బాలాత్రిపురసుందరి పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ళ వేంకటరమణశాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యం వహించారు. నిర్వహణలో వేలాదిమంది పీఠం స్వచ్ఛంద కార్యకర్తలు పాలుపంచుకున్నారు. 23రోజుల పాటు గ్రామాలవారీగా సేవాబృందాలు కార్యక్రమంలో వివిధ నిర్వహణా బాధ్యతలను పంచుకున్నాయి. వేలాదిగా భక్తులు తరలివస్తుండడంతో ముగ్గురు సీ.ఐ.లు, 6ఎస్సైలు, వందకుపైగా కానిస్టేబుళ్ళు రక్షణ బాధ్యతలు చేపట్టారు.[2]
ప్రాచుర్యం
మార్చు23 రోజులపాటు నిర్వహించిన అహోరాత్రంలో నిత్యం వేల నుంచి లక్షల మంది సాధారణ భక్తులు పాల్గొన్నారు. ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహ భాషణాలు చేశారు. యాగంలో పాల్గొనేందుకు రాష్ట్ర, దేశ స్థాయి రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.[4]
-
యాగంలో పాల్గొన్న సినీనటుడు, రాజకీయనేత కృష్ణంరాజు దంపతులు
-
యాగశాలకు ప్రదక్షిణలు చేస్తున్న ప్రజలు
-
యాగాన్ని సందర్శిస్తున్న భక్తులు
-
అనుగ్రహ భాషణం చేస్తున్న ఉమర్ ఆలీషా (దృశ్యంలో యాగనిర్వాహకులు వేంకటరమణశాస్త్రి)
ఇవి కూడా చూడండి
మార్చుచిత్రమాలిక
మార్చు-
అహోరాత్ర యాగాన్ని సందర్శించుకునేందుకు విచ్చేసిన ప్రజలు
-
యాగ ప్రాంగణంలో కోలాట దృశ్యం
మూలాలు
మార్చు- ↑ వీరంపాలెంలో లోక కల్యాణార్థం 23 రోజుల యాగం ప్రారంభం:సాక్షి:19-10-2013
- ↑ 2.0 2.1 ఏడో రోజుకు చేరిన అహోరాత్ర యాగం:ఆంధ్రప్రభ:అక్టోబర్ 25, 2013[permanent dead link]
- ↑ 3.0 3.1 నేటి నుంచి అహోరాత్ర యాగం:ఆంధ్రజ్యోతి:18-10-2013[permanent dead link]
- ↑ ముగిసిన అహోరాత్ర యాగం:6TV:నవంబరు 10, 2013[permanent dead link]