ఆలూరి బైరాగి
ఆలూరి బైరాగి: (1925 - 1978) ప్రముఖ కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది.
ఆలూరి బైరాగి | |
---|---|
దస్త్రం:Aluri Bairagi.jpg | |
జననం | ఆలూరి బైరాగి చౌదరి 1925, నవంబర్ 5 తెనాలి తాలూకాలోని ఐతానగరం |
మరణం | 1978 సెప్టెంబరు 9 హైదరాబాదు |
ఇతర పేర్లు | ఆలూరి బైరాగి |
ప్రసిద్ధి | నూతిలో గొంతుకలు - కవితా సంపుటి |
మతం | హిందూ |
భార్య / భర్త | ఆజన్మ బ్రహ్మచారి |
తండ్రి | ఆలూరి వెంకట్రాయుడు |
తల్లి | సరస్వతి, |
పురస్కారాలు | కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత |
జననం, విద్య
మార్చుబైరాగి చౌదరి , తెనాలి తాలూకాలోని ఐతానగరంలో 1925, నవంబర్ 5వ తేదీన ఆలూరి వెంకట్రాయుడు,సరస్వతి దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి దేశ భక్తుడు. తండ్రి హిందీ చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో యలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనో ఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే పలాయన్ అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు.
బైరాగి తండ్రి అడుగు జాడలలో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోన్నారు. ఆ తరువాత ఎం.ఎన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు.
బైరాగి బహుభాషా కోవిదుడు. వీరికి తెలుగు,హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు బెంగాలి, ఉర్డు భాషలలో కూడా ప్రవేశం ఉంది.
రచనా వ్యాసంగం
మార్చుబైరాగి పినతండ్రి, చందమామ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ చందమామకు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. హిందీ చందమామ లో పిల్లల కొరకు చిట్టి పొట్టి కవితలు, కధలు రాసారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు.
తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం చీకటి నీడలు ప్రచురించారు. నూతిలో గొంతుకలు, దివ్యభవనం కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా నూతిలో గొంతుకలు ఆయన ఉత్కృష్ట రచన.
బైరాగి స్వతంత్ర భావాలుగల వ్యక్తి. ఆయన తన పంథా మార్చుకోవాలని ఎవరైనా సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకొనేవారే తప్ప తన భావాలను మార్చుకునేవారు కాదు. చాలా నిరాడంబరంగా జీవించారు.
1978లో క్షయవ్యాధికి గురయ్యారు. మిత్రులు ఎంత బతిమాలినా వైద్యంపట్ల ఆసక్తి చూపలేదు. చివరిరోజుల్లో ఆయన తన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆంగ్లంలో ఒక మంచి నవల రాశారు. ఆయన నవల, నాటకం, కొన్ని అముద్రితాలుగానే మిగిలిపోయాయి. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీలో జీవనానంద దాస్ అనే కవి ఆయనకి చాలా ఇష్టం.
మరణం
మార్చుఆజన్మ బ్రహ్మచారి అయిన బైరాగి 54 ఏళ్ళ వయస్సులో 1978 సెప్టెంబరు 9న మరణించారు. తెలుగు సాహిత్యంలో ఒక దృవతార నేల రాలిపోయింది.
బైరాగికి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారు.[1]
- బైరాగి - మబ్బుల్లో పసిపాపల నవ్వులను చూడగలిగారు. కొండలపై కులికే కిరణాలకు మురిసిపోగలిగారు. అడవులలో వికసించే నవ్వులకు పరవశించగలిగారు. బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం -నార్ల వెంకటేశ్వరరావు
కవితలు
మార్చుతెలుగులో నవ్య పదప్రయోగ కర్తగా బైరాగి గారికి ప్రత్యేక స్థానం ఉంది. బైరాగి లో ప్రధానంగా అస్తిత్వవాదం,సామ్యవాదం కనిపిస్తాయి. ఎం.ఎన్.రాయ్ ఆలోచనలు, సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా వుండేది.ఫలితంగా అస్తిత్వవాదం నుంచి సామ్యవాదానికి మొగ్గు చూపాడు. ఆయన సాహిత్యంలో ఈ రెండు వాదాలు బలంగా కనబడతాయి. బైరాగి తొలి కవితా సంపుటి "చీకటి నీడలు" ధ్వంస వాదంతో పాటు పేదల పక్షం వహించడం ఇందులో ప్రధానంగా కనబడుతుంది.
"చీకటి నీడలు " కవితలో నీడలు బహురూప వర్ణన చేశాడు. సామాజిక చీకట్లకు ఈ కవితా సంపుటి దివిటీ పట్టింది.
*గాలిలోన మృతకాత్మల నీడలు
నేలపైన కృతకాత్మక నీడలు
ఆశయాల ఆకాశపు నీడలు
వాస్తవాలు యమపాశపు నీడలు.'
!ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య -ప్రేమలు పొసగవు; ఈ బండరాళ్ళపైన-ఏ మొక్కలూ ఎదగవు; జీవిత ప్రభంజనం-కలయిక సహించదు; ఉన్న గడువు కొద్ది - చీకటి నీడలు
"నూతిలో గొంతుకలు" ఈ కవితా సంపుటికి ముందు తన ఉద్దేశాన్ని ఇలా వివరించాడు.
*గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు..అదొక పాడు నుయ్యి.మనిషి పతనానికీ ,మరణానికీ సంకేతం.అందులో జీవనం వుండదు.అందులో పడి వున్న వారికివెలుగు గోచరించదు.పైకి ప్రాకటానికి ఆధారం కనిపించదు. వారు కేకలు వేస్తారు.కాని వారి గొంతులు బయటకు స్పష్టంగా వినిపించవు..భూగర్భపు లోతులు వారిని బాహ్యప్రపంచాన్నుంచి వేరు పరుస్తోంది.వారు యాత్రికులు కూడాకాదు.వారికొక గమ్యం లేదు. చీకటి తప్ప వారికెవ్వరూతోడు లేరు."!
బైరాగి తాను ఎంతో అభిమానించే ఎం.ఎన్.రాయ్ గారి 'మానవతా వాదం ' నేపద్యంలో "ఆగమగీతి" అనే కవితా సంపుటిని రాసారు.
*ఈ సంధ్యా ధూళినుంచి ,వికృతి భస్మం పాళి నుంచి,ఉదయిస్తాడనల సంభవుడాత్మధవుడు
నవమానవుడు".. అంటూ తన ఉద్దేశాన్ని చెబుతాడు. "నరునికి మూల మంత్రం ప్రేమ.నరునికి గుర్తు తంత్రం కరుణ..". అంటాడు.
*ప్రతి హృదయం శివనిలయం, ప్రతి మొనవుడొక తీర్థం, ఇదే సకల జ్ఞాన సూన పరిమళాలు పరమార్థం " అంటూ
ఈ సంపుటిలో మానవుడిని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
రచనలు
మార్చు- చీకటి నీడలు
- ఆగమ గీతి (కేంద్ర సాహిత్య ఆకాడెమీ పురస్కారం)
- నూతిలో గొంతుకలు
- దివ్య భవనం (కథలు)
- కాంచన మృగం ( రూపకం)
- పాప పోయింది (నవల)
- హిందీ లో "నయా కవిత" ను రాశాడు. హిందీ నుంచి అనేక అనువాదాలు చేశాడు.
- ఆలూరి బైరాగి " PAIN of BEING " (అస్తిత్వ వేదన) పేరుతో ఆంగ్లంలో రాసిన కవితా సంపుటి ఇందులో 80కు పైగా కవితలున్నాయి.
బయటి లంకెలు
మార్చు- ఆలూరి బైరాగి రాసిన ఆగమ గీతి గ్రంథం
- "Aluri Bairagi,ఆలూరి బైరాగి. - LastDaysofEminentPersons4". sites.google.com. Archived from the original on 2020-10-14. Retrieved 2020-04-21.