ఇక్బాల్ పాష అను ఈ కవి, రచయిత మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్కు చెందినవారు. 'ఉజ్వల్ ' పేరుతో రాస్తుంటారు. వీరి తల్లిదండ్రులు ఖాజాబీ, మహ్మద్ ఇబ్రహీం సాహెబ్. ఇక్బాల్ గారు 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గద్వాల మండలం అనంతాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గద్వాలలో స్థిరపడ్డారు.

ఇక్బాల్ పాషా
ఇక్బాల్ పాషా
జననంఇక్బాల్ పాషా
మహబూబ్ నగర్ జిల్లా , కొల్లాపూర్
నివాస ప్రాంతంగద్వాల
ఇతర పేర్లుఉజ్వల్
వృత్తిఉపాధ్యాయులు
ప్రసిద్ధికవి
మతంముస్లిమ్
పిల్లలు2 కుమారైలు
తండ్రిమహ్మద్ ఇబ్రహీం సాహెబ్
తల్లిఖాజాబీ

కథకుడిగా ఇక్బాల్

మార్చు

కళాశాలలో చదివే రోజుల నుంచే సాహిత్య రచనను మొదలు పెట్టారు. 1977 లో 'ఎవరికి సొంతం వాడిన వసంతం' పేరుతో మొదటి కథను రాశారు. 1992లో 'ఆటా' వారు నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ' ఎటు చూసినా వాడే ' కు ప్రత్యేక బహుమతి వచ్చింది. అమెరికా నుండి వెలువడే ' అమెరికా భారతి ' లోనూ ఈ కథ అచ్చయింది. వీరి కథలన్నీ సామాజిక సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై రాసిన ' కాల్వ మింగిన ఊరు ', పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ' కఫన్ ' కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011 లో కఫన్[1] అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. విరసం వారి 'కథల పంట' లో, ప్రజా సాహితీ, అరుణతార పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి.

కవిగా ఇక్బాల్

మార్చు

1977 లో తొలిసారి 'దేవుడికో లేఖ' పేరుతో దీర్ఘ కవిత రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం రాష్ట్ర మహాసభలలో స్పందన పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. దీనిని అప్పటి విరసం సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన సాగర్ గారు ఆవిష్కరించారు. వీరి 'తుఫాను ' కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటిలో మొదటి బహుమతి వచ్చింది. ' జర్మినేషన్ ' పేరుతో వీరు రాసిన కవిత స్కైబాబ గారి సంపాదకత్వంలో వెలువడిన ' మునుమ 'లోనూ చోటు దక్కించుకుంది. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఉత్తమమైన ఓ 88 కవితలతో సేద్యం[2] పేరుతో ఓ కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. పాలమూరు అధ్యయన వేదికకు జిల్లా బాధ్యులుగా పనిచేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పనిచేస్తున్న ఇతర కవులు పరిమళ్, ఉదయమిత్ర లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ [3] అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు, కవితలతో కలిపి ఓడిపోలే...పల్లె [4] అను పుస్తకాన్ని వెలువరించారు. ఇంకా బాల గేయాలు, కరువు పాటలు, ఉపాధ్యాయ ఉద్యమ గీతాలు కూడా రాశారు.

నటుడిగా ఇక్బాల్

మార్చు

వీరు రంగస్థల నటులు కూడా. ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ శరబందరాజు గారి ఆధ్వర్యంలో వీరు 'గరిబీ హటావో' నాటకంలో మొదటి సారి నటించారు. విద్య, ఇంకా తెల్లారలే, కోడిపిల్లలొచ్చె, బాసగూడ మొదలగు వీధి నాటకాలలోనూ వీరు నటించారు.

చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఇక్బాల్, కఫన్, పాలమూరు ప్రచురణలు, 2011
  2. ఇక్బాల్, సేద్యం, పాలమూరు ప్రచురణలు, 2011
  3. ఇక్బాల్, పరిమళ్, ఉదయమిత్ర, దుఃఖాగ్నుల తెలంగాణ, పాలమూరు ప్రచురణలు,2009
  4. ఉదయమిత్ర, ఇక్బాల్, ఓడిపోలే...పల్లె, పాలమూరు ప్రచురణలు,2009