ఎంకి పాటలు

తెలుగు పాటలు

ఎంకి పాటలు లేదా యెంకి పాటలు (Yenki Patalu, Enki Patalu) నండూరి వెంకట సుబ్బారావు రచించిన గేయ సంపుటి. తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ క్రొత్త అందాలు సమకూర్చిన ఈ రచనను "ఎంకిపాటల గాలి దుమారము" అని తెలుగు సాహితీకారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఎంకిపాటలలో సుబ్బారావు గోదావరి మాండాలికాన్ని విశాఖ రూపకబేధాలతో కలిపి ఉపయోగించాడు.[1]

ఎంకి పాటలు ముఖచిత్రము

నేపథ్యం

మార్చు

తెలుగు ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని "కాల్పనిక భావ కవిత్వం" (రొమాంటిక్ పొయెట్రీ) ప్రేరణ వలన వెలువడిన రచనలలో "ఎంకి పాటలు" ఒక ప్రముఖ అధ్యాయం. ఈ భావ కవిత్వపు ఉద్యమంలో అప్పటి నవకవులు తమ సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయాన్నీ, పాశ్చాత్య భావ కవితల పోకడలనీ సమ్మిళితం చేసి ఎన్నో ప్రణయ గీతాలు పలికారు. ఆ సందర్భంలోనే ఊర్వశి, హృదయేశ్వరి, శశికళ, వత్సల, ఎంకి వంటి ప్రణయనాయికలు తెలుగు కవితాభిమానుల గుండెలలో స్థానం సంపాదించారు.

ప్రారంభం

మార్చు

నండూరి వెంకట సుబ్బారావు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజులలో, 1917-1918 ప్రాంతంలో ఈ పాటలు వ్రాయసాగారు. ఒకసారి ఆయన ట్రాం బండిలో ఇంటికి వెళుతుండగా "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి రూపు దిద్దుకొన్నదట. ఆ పాట విని మిత్రులు ప్రోత్సహించారు. క్రమంగా "ఎంకి పాటలు" (యెంకి పాటలు) రూపు దిద్దుకొన్నాయి.

యెంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఈ పాటల్లో చక్కని పదాలలో కూర్చబడ్డాయి.

యెంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక. ధర్మబద్ధమైన హద్దులలోనే ప్రేమిస్తుంది.

కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటె అగ్గి దూస్తాది".

అందుకే "యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి", "వయ్యారమొలికించు నా యెంకి, వనలచ్చిమనిపించు నా యెంకి"

యెంకి పాటలు రెండు భాగాలుగా వెలువడ్డాయి. "పాత పాటలు" తరువాత చాలా కాలానికి "కొత్తపాటలు" వెలువడ్డాయి.

స్పందన

మార్చు

యెంకిపాటలపై పాఠకులు, విమర్శకులు, పండితులు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

  • పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి యెంకి, నాయుడు బావలను రతీ మన్మధులతో పోల్చారు.
  • వేదం వేంకటరాయ శాస్త్రి వారినే రంభా-నలకూబరులతో పోల్చారు. ఈయన 1925లో నూజివీడులో జరిగిన కవి సమ్మేళనంలో ఎంకిపాటలను షేక్స్పియర్ సానెట్స్‌తో పోల్చాడు.[2]
  • పురాణం సూరిశాస్త్రి ఆ ప్రేమికులను జీవాత్మ-పరమాత్మలతో పోల్చారు.
  • పొక్కులూరి లక్ష్మీనారాయణ వారిని సంకర దంపతులని అధిక్షేపించారు.
  • ఇంకా వ్యావహారిక భాష బహుళంగా రచనలలో వాడకముందే పల్లె ప్రేమికుల గురించి "తూర్పు కాపు యాస"లో పాటలు వ్రాసిన సాహసి నండూరి సుబ్బారావు
  • ముద్దుకృష్ణ రచించిన "వైతాళికులు" కవితా సంకలనంలో ఇలా చెప్పబడింది - "శ్రీ నండూరి వారు తమకు సాక్షాత్కరించిన కవితను అందుకోవడంలో బంధాలను తెంచివేశారు. నియమాలను తోసిపారవేశారు. భావంలో, బాషలో అన్నిటా "ఎర్రబావుటా" ఎగురవేశారు.
  • ‘ఏడ నీ కాపురమే ఎలుతురు పిల్లా!’ అని అడిగాడు నాయుడు. ‘నీ నీడలోనె మేడకడత నాయుడుబావ!’ అని గడుసుగా బదులిచ్చింది- ఎంకి. ఆ చిలిపిదనాన్ని ఆస్వాదించడం శృంగారానుభవం! ‘కళ్లెత్తితేసాలు, కనకాబిసేకాలు ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌’ అని మురిసిపోతూ, ‘నా గుండెను ఎంకి నమిలి మింగేసింది’ అన్నాడు నాయుడు. 1917లో మద్రాస్‌ ట్రాం బండిలో ప్రయాణిస్తున్న నండూరి వెంకటసుబ్బారావు గుండెల్లోంచి ఉద్భవించిన అద్భుత జంట- ఇప్పుడు శతవార్షికోత్సవ సంబరాల్లో మునిగి తేలుతోంది. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు’ అంటూ ప్రసవవేదనతో సతమతమైన నండూరి ఈ చిరంజీవులకు భద్రంగా జన్మనిచ్చారు. ‘రాసోరింటికైనా రంగు దెచ్చే పిల్ల’ నేరుగా నాయుడి గుండెల్లో కాపురం పెట్టింది. ‘వెన్నెలంతా మేసి ఏరు నెమరేసింది, ఎన్నెలలో సొగసంత ఏటి పాలేనటరా!’ అంటూ మర్మంగా రెచ్చగొట్టింది. ‘గాలికైనా తాను కవుగిలి ఈనన్నాడు’ అన్నంత నమ్మకాన్నిచ్చాడు నాయుడు. భాషలో భావంలో ముతకదనం, మనుషుల్లో మొరటుదనం ముదిరిపోని రోజుల్లో పుట్టారు కనుక- నూరేళ్లుగా రతీమన్మథుల్లా విహరిస్తున్నారు. ఈ మాట వేదం వెంకటరాయశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి వంటివారు అన్నారు. వారిద్దరి ముచ్చటైన దాంపత్య భోగాన్ని సినారె ‘మాంజిష్ఠారాగం’గా పేర్కొన్నారు. వారి అన్యోన్యం మనకు ఆనందాన్నిస్తోందో అసూయను కలిగిస్తోందో గుండెల్లోకి తొంగి చూసుకుంటే తెలుస్తుంది. మరో వెయ్యేళ్లు వారిని అలాగే ఉండమని మనసారా దీవించాలనిపిస్తోంది!" (ఈనాడు సంపాదకీయం యెర్రాప్రగడ రామకృష్ణ 22.10.2017)

ఆకాశవాణి ద్వారా ఈ పాటలు జనప్రియమైనాయి.

ఉదాహరణ గేయాలు

మార్చు

యెంకి ముచ్చట్లు

మార్చు
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు?
దొడ్డితోవ కళ్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్త నంటాది !!
యెన్నాని సెప్పేది. . . .
యెంకి రాలేదని యెటో సూత్తా వుంటె
యెనకాలగా వచ్చి 'యెవురునో' రంటాదీ ?
యెన్నాని సెప్పేది. . . .
'సిట్టి సేబా'సాని నిట్టూర మేత్తుంటే
మాటాయినబడనటు మరి యేటో సెపుతాదీ
యెన్నాని సెప్పేది. . . .
కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ
కోసరమె సెపుతాను కోపమొద్దంటాది!!
యెన్నాని సెప్పేది. . .
యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్లలో మనకు తలవంపులంటాదీ!!
యెన్నాని సెప్పేది. . .
యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది,
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు!
యెన్నాని సెప్పేది నా యెంకి ముచ్చట్లు?

గోవుమా లచ్చిమికి కోటి దండాలు

మార్చు
గోవుమా లచ్చిమికీ కోటి దండాలు
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు
యెంకితో కూకుండి యింత సెబుతుంటే
తనతోటి మనిసల్లె తలతిప్పుతాడే
యెంకి సరసాలాడ జంకుతా వుంటే
సూసి సూడక కన్ను మూసి తెరిసేడే

మరొకటి

మార్చు
యెనక జన్మములోన యెవరిమోనంటీ
సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
ముందు మనకే జల్మముందోలె యంటి
తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
కంట నీరెట్టింది జంట నా యెంకి

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  • రేడియో ప్రసంగం - కె.వి.ఎస్.ఆచార్య (బాపట్ల) - "శత వసంత సాహితీ మంజీరాలు" అనే సంకలనంలో ముద్రించబడింది. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురణ.