ఎండకుర్తి కామేశ్వరి ప్రముఖ రంగస్థల నటీమణి.

ఈమె ఎండకుర్తి నరసయ్యమ్మ, అప్పలస్వామి దంపతులకు కాకినాడలో జన్మించారు. వీరి భర్త కీ.శే. వేదనభట్ల నరసింహమూర్తి కూడా ప్రముఖ రంగస్థల నటులు. ఈమె చిరుప్రాయమునందే ప్రఖ్యాత నాటకసంస్థ ‘ఆంధ్ర సేవా సంఘం’లో చేరి, పూజ్యశ్రీ కిళాంబి కృష్ణమాచార్యుల శిష్యరికంలో ‘ఆంధ్రశ్రీ’ అనే నాటకంలో ‘మాంచాలి’ పాత్రను ప్రతిభావంతంగా పోషించి, గురువుల ఆశీస్సులను, ప్రేక్షకుల అభినందనలను పొందారు. అది మొదలు ’చింతామణి‘ నాటకంలో ‘చింతామణి‘, ’బాలనాగమ్మ‘ నాటకంలో ’బాలనాగమ్మ‘, ’సతీసక్కుబాయి‘ నాటకంలో ’సక్కుబాయి‘ పాత్రలనే కాక ఇతర పద్య నాటకాలలో కూడా ప్రధాన పాత్రధారణతో పాల్గొని, వందలాది ప్రదర్శనలిచ్చి పండిత పామరుల ఆశీస్సులు, అభినందనలు, ప్రశంశలు అందుకున్నారు. స్త్రీ పాత్రలేకాక, ’శ్రీకృష్ణతులాభారం‘ నాటకంలో ’శ్రీకృష్ణ‘ పాత్ర పోషించి మెప్పిచారు. ఎస్.ఆర్.ఎల్.జి. కళాసమితి, రాజోలు వారి నిర్వాహణలో ప్రదర్శించిన ’సతీసక్కుబాయి‘, ’భర్తృహరి‘ నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించి తన నటనాపాటవాన్ని చాటుకున్నారు.

అంతేకాక, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల పథకాల ప్రచారం నిమిత్తం, ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ గ్రామ, గ్రామాన ఏర్పాటుచేసిన ’వెలుగొచ్చింది‘ సాంఘిక నాటకంలో ’సీతాలు‘గా నటించి ప్రభుత్వాధికారుల నుండి ప్రశంసాపత్రాలందుకున్నారు.

పాలకొల్లులో ప్రజానాట్యమండలి వారిచే ’గానకోకిల‘ బిరుదు, ఎస్.ఆర్.ఎల్.జి. కళాసమితి రాజోలు వారి సత్కారాలు. 1997 ఏప్రియల్ 19వ తేదిన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఎస్.ఆర్.ఎల్.జి. కళాసమితి రాజోలు వారి రజతోత్సవ సభలో - అప్పటి ప్రముఖ గజల్ గాయకుడు, ప్రభుత్వ అధికారి డి. మురళీకృష్ణ, ఐ.ఏ.ఎస్. గారి చేతుల మీదుగా ఘన సన్మానం, మరెన్నో సన్మానాలు అందుకున్నారు.

మూలాలుసవరించు

ఎండకుర్తి కామేశ్వరి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట.30.